మత్స్య మహా పురాణము
బాణాసుర త్రిపుర దాహకథ
మార్కండేయుడిట్లనెను, పాండవా! నదీశ్రేష్ఠయగు నర్మద పుణ్యమగు వానిలో పుణ్యతమ మయినది; దానిని ధర్మకాంక్షులు మహాభాగులునగు మునులు యజ్ఞోపవీతములంత సన్నని ప్రవాహములుగాను తీర్థములుగాను విభజించిరి. వాటియందు స్నానమొనర్చినవారు సర్వపాప ముక్తులగుదురు, జ్వాలేశ్వరము త్రిలోక విశ్రుతమగు పరమ తీర్థము; దాని ఉత్పత్తిని తెలిపెదను వినుము; పూర్వము సర్వమునులును ఇంద్రాది మరుత్(దేవ) గణములును మహాత్ముడు దేవ దేవుడునగు మహేశ్వరుని స్తుతింపసాగిరి. వారు స్తుతించు నంతలో మహేశ్వరుడటకు వచ్చెను. ఇంద్రాది దేవతలు భయోద్వేగములతో దేవేశుడగు విరూపాక్షునకు ప్రభూ! మమ్ముల రక్షించుమని మనవిచేసిరి. ఈశ్వరుడు వారితో “మునిశ్రేష్ఠులారా! మీకు స్వాగతము. మీరేల ఇటకు వచ్చితిరి? దుఃఖమేమి? సంతాపమేమి? దేనివలన మీకు భయమగుచున్నది. మహాభాగులారా! నేనది తెలియగోరుచున్నాను చెప్పుడు;” అనగా రుద్రవచనమును విని ప్రశస్త నియమవంతులగు ఆ మునులు ఇట్లనిరి: అతిఘోరుడు మహాధీరుడు బలదర్పితుడునగు బాణుడను దానవుడు విఖ్యాతుడు కలడు, త్రిపురమను ఈ పురము వానిది; ఇది వాని తేజముచే సతతము గగనమున తిరుగుచుండును, వానివలన భయపడి విరూపాక్షా! నిన్ను శరణందితిమి, మాకు పరమ గతివి నీవే కావున మమ్మీ మహాదుఃఖమునుండి రక్షించుము, ఈ విధముగానే దేవేశా! నీవందరను అనుగ్రహింప వేడుచున్నాము, దేనిచే దేవతలును గంధర్వులును సుఖముగ వర్ధిల్లుదురో- శంకరా! ప్రభూ! పరమ సుఖమందుదురో అట్టి అనుగ్రహమును తాము చూపవలయును” అనెను.
ధర్మజా! ఇట్లు వారినందర నోదార్చి దేవేశుడు నర్మదాతీరమందు కూర్చుండి వానిని వాని త్రిపురములను నేను ఎట్లు వధించి నశింపజేయవలయునాయని ఉపాయమాలోచించెను. అంత వృషభధ్వజుడగు మహాదేవుడు బ్రహ్మర్షియగు నారదుని స్మరించెను. స్మరించినంతటనే వచ్చి ఆముని ప్రణతుడై “మహాదేవా! ఆజ్ఞనిమ్ము; నన్నేల స్మరించితిరి? మహాదేవా! నేచేయవలసిన పనిఏమి? నాకు సెలవిండు” అనెను. ఈశ్వరుడిట్లనెను, నారదా! నీవీ మహాత్రిపురములున్నచోటికి పొమ్ము. దానవేంద్రుడగు బాణుని ఈ పురములకు పోయి నేజెప్పినట్లు చేయుము; అందలి స్త్రీ లందరు పతిని దేవతగా భావించు ఉత్తములును సౌందర్యము నందప్సరసలవంటివారును; వారి తేజముననే త్రిపురము గగనమున తిరుగుచున్నది, విప్రేంద్రా! నీవటకుపోయి వారికి మతిభేదమును ప్రబోధించుము; అనగా విని నారదుడు అచటి స్త్రీలకు బుద్ధిభ్రంశము కలిగిం చుటకై బయలుదేరి త్వరితగతతో ఆపురమునకు పోయెను; ఆ దివ్యపురము నానా రత్నములతో శోభిల్లుచుండెను. అంతట అతని కచట బలదర్పితుడగు బాణుడు కనబడెను. వాడు మణి కుండలములతో భుజ కీర్తులతో కిరీటముతో వందలకొలది బంగరు హారములతో చంద్రుని మనోహరములగు రత్నములతో రత్నసమృద్ధిగల మొలనూలుతో కనకా భరభములుగల బాహు వులతో ప్రకాశించుచుండెను. చంద్రకాంతములతో, మహావజ్రముతో, మణులతో, పగడములతో అలంకృతమయి పండ్రెండు గురు ఆదిత్యులతో సమమయి వెలుగు ఉత్తమాననమున వాడు కూర్చుడియుండెను. మహా బలుడగు ఆ దానవేంద్రుడు నారదుని చూచి లేచి దేవర్షీ! నీవు స్వయముగా వచ్చితివి; అర్ఘ్య పాద్యముల సమర్పింతును; అనుచు అవి అర్పించెను. ద్విజోత్తమా! నేనేమి చేయవలయును? చాల కాలమునకు వచ్చితిరి, విప్రా! కూర్చుండుడు; ఇదిగో ఆసనము” అని ఇట్లు పలుకరించెను; తరువాత ఋషి సత్తముడగు నారదునితో అతని భార్యయును మహాదేవియు, పట్టపురాణి అగు 'అనౌపమ్య' అనునామె “నారదా! ఏ ధర్మముచే, వ్రతముచే, నియమముచే, దానముచే, తపముచే, దేవతలు సంతుష్టులగుదురు” అని అడిగెను.