ఫల సప్తమీ వ్రతము

ఈశ్వరుడు బ్రహ్మకిట్లు చెప్పెను: ఫల సప్తమియను సప్తమి విషయము తెలిపెదను. ఈనాడుపవసించినవాడు పాపముక్తుడై స్వర్గమందును.

మార్గశిర శుక్ల పంచమినాడు వ్రతనియమములు పాటించి గడపి షష్ఠినాడు ఉపవసించవలెను. (విశోక సప్తమివలెనే) సప్తమినాడు బంగారు పద్మమును శర్కరను బంగారుతో ఫలపు బొమ్మను కుటుంబియగు బ్రాహ్మణునకు రెండు పూటలందును ధర్మతత్త్వము నెరిగి ‘భానుర్మే ప్రీయతాం’ ‘భానుడు నాయందు ప్రీతుడగు గాక!’ అనుచు దానమీయవలెను. యథాశక్తిగా విప్రులను పరమాన్నముతో భుజింపజేసి తానునట్లే భుజించి ఫలత్యాగము చేయలేను. ఇట్లు కృష్ణపక్ష సప్తమివరకు చేయుచు మరల ఆ కృష్ణ(మార్గశిర) సప్తమినాడును ఉపవసించి హేమ ఫలమును సువర్ణపద్మమును శర్కరా పాత్రమును వస్త్ర మాల్యములను దానమీయవలెను. ఈ విధముగ సంవత్సరకాలము ఉభయ సప్తములందును (శుక్ల సప్తమితో ఆరంభించి కృష్ణ సప్తమివరకు) ఉపవాస పూర్వకముగా (రెండు సప్తములందును దానములు-నడుమ దినములలో నియమమును పాటించుట) క్రమముగా సూర్య దేవతాక మంత్రములు పఠించుచు చేయుచుండవలెను. ఫలత్యాగము చేయునపుడు మార్గసిరము మొదలు కార్తీకము వరకు ప్రతిమాసము నందును వరుసగా -భానుఃప్రీయతాం-ఇట్లే-అర్కః-రవిః-బ్రహ్మా-సూర్యః -శుక్రః-హరిః శివః- శ్రీమాన్-విభావసుః-త్వష్టా-అరుణః-అను నామములను ‘ప్రీయతాం’ అను పదముతో చేర్చి పలుకవలయును. ప్రతిపక్షమునను సప్తమినాడు ఇట్లు దానమును ఫలత్యాగమును చేయ వలయును.

వ్రతాంతమునందు విప్ర దంపతులను వస్త్ర భూషణములతో పూజించి శర్కరాపూర్ణ కలశమును సువర్ణఫల ప్రతిమను వారికి దానము ఈయవలెను. “రవీ! భక్తుల కోరికల సఫలము చేయు నీదయచేత నాకును జన్మజన్మము నందును అనంతఫలములు లభించుగాక!” అని ప్రార్థించుచు దాన మీయవలయును.

అనంత ఫలప్రదయగు ఈ ఫల సప్తమీ వ్రతము చేసినవాడు సర్వపాపముక్తుడై పవిత్రత నొంది సూర్యలోకమున పూజితుడగును. వానికి సూరాపానాది పాపములు ఏవైన ఎప్పటికైన ఉన్నను అవియునశించును. అతని వెనుక, ముందు ఇరువదియొక తరములవారును తరింతురు. దీనిని చదివిన-వినిన-వారికి కూడ ఈ ఫలము లభించును.