అవయవముల వెడల్పులు, చుట్టుకొలతలు

మౌళి (శిరము) (రెండు మూపుల నడుమనుండి తలపై వరకు) 14 అం. లలాటపు నిలువుటెత్తు నాల్లంగుళములు ముక్కు నిలువుటెత్తు నాలుగంగుళములు హనువు ఒక్కొక్కటియు పెదవులును రెండేసి అంగుళముల వెడల్పు (అడ్డపు కొలత); లలాటపు అడ్డపు కొలతలు ఎనిమిదంగుళములు; కనుబొమలు రెండును కలిసి ఎనిమిది అంగుళములు; కనుబొమరేఖ నడుమ ధనువువలె వంగియుండుచోట దాని వంపుటెత్తు అర్ధాంగుళము; కనుబొమ పార్శ్వమునందు కొన ఉన్నతమయి నునుపుగనువాడిగను నుండవలయును; ఇట్టి నిర్మాణము ప్రశస్తము; కన్నులు రెండును వేరువేరుగ రెండేసి అంగుళముల అడ్డు పొడవును అంగుళము వెడలుపును (ఎత్తును) ఉండవలయును. కనుగ్రుడ్లు నడుమ ఉబ్బుగను, కనుకొనలు (కుడికంటి కుడికొనయు ఎడమ కంటి ఎడమకొనయు) ఎరుపుగను ఉండవలయును; ఇట్టివి శుభలక్షణ నేత్రములు; మొత్తము కంటి పొడవులో ఐదవ (1/5) వంతు కొలతతో కంటి గ్రుడ్డులోని అర్ధభాగము ఉండవలయును; (కనుగ్రుడ్డు: కంటి మొత్తము పొడవు = 2: 5); రెండు కనుబొమల నడిమి కొలత రెండు అంగుళములు; నాసా మూలము (ముక్కు మొదలు-ముక్కు కనుబొమలతో కలియుచోలు) ఒక అంగుళము; నాసాగ్రము కూడ ఇంతే (ఒక అంగుళము) వెడల్పుండ వలయును; రెండు ముక్కు పుటములును కుడి ఎడమలకు వంగి ఉండవలయును; నాసాపుట బిలము అర్ధాంగుళము; కర్ణమూలమునుండి వెలికి వచ్చునంత వరకు కపోలములు రెండంగుళములు; హనువు (దౌడ) కొన ఒక అంగుళము; హనువు వెడల్పు రెండంగుళములు; కనుబొమల వెంట్రుకల వరుస మందము ప్రణాళీ (నీరు పారు గొట్టముతో) సదృశ్యమై, సమమయి అర్ధాంగుళము వెడల్పుతో నుండవలయును; పై పెదవి వెడలుపుకూడ అర్ధాంగుళము: ముకుడిప్పల బ్రద్ధ ఒక్కొక్కటియు అనుపగింజల పప్పు బ్రద్దవలె ఉండవలయును; సెలవులు జ్యోతిస్సుల (దీపజ్వాల) వలెనుండవలెను; అవి కరణ మూలము నుండి ఆరంగుళముల దూరమందు ఉండవలెను; కను బొమలపై అంచునకు తిన్నగా చెవులపై అంచులు ఉండవలెను; వాటి నిలువుటెత్తు నాలుగంగుళ ములు; చెవుల అడ్డపు నిడివి రెండంగుళములకు కొంచెము చిల్లర ఎక్కువగ ఉండవలెను; (మాత్రా=ఒక ప్రధాన పరిమాణమందలి అల్పాంశము. దీనిని వాడుకలో పైచిల్లర అందురు;) చెవులపై అంచునుండి మస్తకపు (తల) పై కొనవరకు (నిట్టనిలువుగా లంబరేఖలో కొలిచినపుడు) ఎత్తుసరి పండ్రెండంగుళములు; లలాటపు (కుడి ఎడమలలో) ఏ అంచు నుండియైనను తల వెనుక వైపు నడిమి ప్రదేశమునకు పదునెనిమిది అంగుళములు; అనగా లలాటమునకు తిన్నగానుండు తల చుట్టుకొలత ముప్పది యారంగుళములు; కేశనిచయము (రాశి) ఉండు శిరోభాగము (అలాటపు పై అంచునుండి తల వెనుకవైపున వెంట్రుకలుఉండు భాగపు చివరకు) నలువది రెండంగుళములు; తల వెనుక వైపునకు నడిమి భాగములో వెంట్రుకలు మొలచుట ఆగిపోవు చోటినుండి దౌడల ఆరంభము వరకు ఉండు దూరము పదునారంగుళములు.

మెడ నిలువుటెత్తులోని నడిమి భాగమున దాని చుట్టుకొలత ఇరువది నాలుగంగుళములు; మెడ ముందువైపు వెడల్పు ఎనిమిదంగుళములు; స్తవముల నడిమి బిందువునుండి మెడ క్రింది నడిమి బిందువు వరకు ఒక తాళ ప్రమాణము; రెండు స్తనముల నడిమి బిందువుల నడిమి దూరము పండ్రెండంగుళములు; ఒక్కొక్క స్తనపు చుట్టుకొలత రెండంగుళములు; ఈ స్తనమండల (వృత్త)మునకు నడుమ చూచుకములు (స్తనాగ్రములు అనగా చనుమొనలు-ఉబ్బెత్తు భాగములు- యవ పరిమాణము) 1/8 భారతీయాంగుళము; వక్షఃస్థలపు రెండు తాళములు; బాహు మూలపు క్రింది అంచునుండి స్తనపు నడుమ వరకుగల నిడిమి దూరము (కక్ష-చంక) ఆరంగుళములు; పాదముల నిడివి పదునాలుగు అంగుళములు; బొటనవ్రేళ్ళ నిడివి మూడంగుళములు; పాదాంగుష్టము ఉన్నత భాగమున ఐదంగుళముల నిలువు చుట్టుకొలతతో నుండవలయును, పాదపు రెండవ వ్రేలుకూడ బొటనవ్రేలి యంత పొడవే; పాదపు నడిమివేలి పొడవు దీని కంటె షోడశాంశము (1/16) తగ్గును; పాదపు అనామిక పాదపు నడిమి వ్రేలి పొడవు (1/8) అష్టాంశమును పాదపు చిటికెన వ్రేలి పొడవు అనామిక పొడవులో అష్టాంశమును తగ్గును: కాలి బొటనవ్రేలికి తప్ప మిగిలిన వ్రేళ్ళకు అన్నిటికిని మూడేసి కణుపులు ఉండవలయును; చీలమండ నిడివి (వ్యాసము) రెండంగుళములు; ఇవి క్రమముగ కనిష్ఠిక వరకు ఒకదానికంటే ఒకటి అష్టమాంశము (1/8) తగ్గును. పాదాంగుష్ఠమును ముందునుండి చూచినప్పుడు దాని నిలువుటెత్తు ఒక అంగుళము; మిగిలిన నాలుగు వ్రేళ్ళకును ఈ ముందు ఎత్తు అర్ధాంగుళము; పిక్కలపై భాగపు చుట్టుకొలత పదునాలుగంగుళములు; పిక్కల నడుమ (ఎక్కువ లావుగ ఉండుచోట) చుట్టుకొలత పదునెనిమిది అంగుళములు,

మోకాళ్ళకు నిర్దేశించిన మొత్తము పొడవులో నడిమి భాగమున ఒక్కొక్క మోకాలి చుట్టుకొలత ఇరువది యొక్క అంగుళములు; మోకాటి చిప్ప ఎత్తుసరి ఒక అంగుళము; అచట దాని (ఒక్కొక్క మోకాటి చిప్ప) చుట్టుకొలత మూడు అంగుళములు; తొడల మొత్తము దైర్ఘ్యములో నడిమి భాగమున వానిలో ఒక్కొక్క దాని చుట్టుకొలత ఇరువది ఎనిమిదంగుళములు; తొడ ఒక్కొక్కటియు పై భాగమున ముప్పదియొక్క అంగుళముల చుట్టుకొలతతో ఉండును; వృషణముల రెంటి ప్రమాణము మూడంగుళములు; మేడ్రము (రహస్యాంగము) రెండంగుళములు; దాని నిలువుచుట్టుకొలత ఆరంగుళములు; మణి బంధమునకు దిగువలో కేశరేఖలను చూపవలయును; మణిబంధపు (సగపు?) చుట్టుకొలత నాలుగంగుళములు; కటి ప్రదేశపు (ముందు భాగపు) విస్తారము (వెడలుపు) పదునెనిమి దంగుళములు; స్త్రీల కటి విస్తారము ఇరువది రెండంగళములు; (స్త్రీలకు) స్తనముల చుట్టుకొలత పండ్రెండంగుళములు; (స్త్రీలకే) నాభికి తిన్నగా నుండు నడుము చుట్టుకొలత నలువది రెండంగుళములు; పురుషునకయినచో కటి ప్రదేశపు చుట్టుకొలత ఏబదియైదంగుళములు; కక్ష (చంక)లకు పై భాగమందు స్కన్ద (భుజమూల)ములు ఆరంగుళములు; మెడ వెడల్పు (వీపు వైపునకు ఉండు భాగమును వదలగా) ఎనిమిదంగుళములు; గ్రీవ (మెడ) చుట్టుకొలత పండ్రెండు కలలు (తాళ ప్రమాణమును పదునారు భాగములు చేసి వానిలో నుండి పండ్రెండు భాగములు గ్రహించవలెనని అర్థము; అనగా 12/16 = 3/4 తాళము భుజముల పొడవు నలువది రెండు అంగుళములు; భుజ శిర మొక్కొక్కటి పదునా రంగుళములు; బాహుపర్యంతము గల పైనిడివి పదునెనిమిది అంగుళములు; (మోచేతి సంధి నుండి పై భాగము); రెండవ పర్వభాగము (మోచేతినుండి దిగువ భాగము) ఒక అంగుళము తక్కువ (పదునేడు అంగుళములు), బాహువులలో ఒక్కొక్కటియు దాని నడిమి భాగమునగల చుట్టుకొలత పదునెనిమిది అంగుళములు; మోచేతికి సరిగి దిగువ భాగపు చుట్టుకొలత పదునారంగుళములు; అగ్రకరపు (ముంజేతి) చుట్టు కొలత ఆరు కలలు (6/16=3/8 తాళము)

అరచేతి పొడవు ఏడంగుళములు; చేతి నడిమివ్రేలు ఐదంగుళములు; అనామిక పొడవు దానిలో (1/7) ఏడవ వంతు తగ్గును; కనిష్ఠిక పొడవు దానిలో ఏడవవంతు తగ్గును; నడిమి వ్రేలి పొడవులో ఐదవవంతు తగ్గి తర్జని పొడవు వుండును, తర్జనీ మూలమునుండి దిగువ భాగమునకు వచ్చిన అంగుష్ఠ (భాగ)ము దానితో (ఊర్ధ్వ భాగమున ఉండిపోయిన అంగుష్ఠాంశముతో) సమముగా నుండును; అంగుష్టపు రెండుకణుపుల మొత్తము పరిమాణము నాలుగంగుళములు; మిగిలిన వ్రేళ్ళ కణుపులు ఒక్కొక్కటియు బొటనవ్రేలి ఒక్కొక్క కణుపుకంటే కొంచెము తగ్గుచుపోవును. మధ్యమాపర్వపు(కణుపు) కొలత రెండంగుళములు; మిగిలిన వ్రేళ్ళ కణుపుల పొడవులు ఒకదానికంటె మరియొక దాని కణుపు యవ- యవ-పరిమాణము తగ్గుచు పోవును, అంగుష్ట పర్వ మధ్యము మాత్రము తర్జనితో సమానముగా నుండును. అంగుష్ఠపు మొదటి పర్వము (కణుపు) మాత్రము తర్జనీపర్వ పరిమాణము కంటె రెండుయవలు ఎక్కువ, ప్రతియొక వ్రేలియందును ఆవ్రేలి చివరి సగములో ఆవ్రేలి గోరుండును; అవి నునుపుగా సొగసుగా చివరలో కొంచెము ఎరుపుగా నుండునట్లు చేయవలయును; అందును పై భాగము కొంచెము పల్లముగా నుండును; ప్రక్కల కంటె నడుమ భాగము కొంచెమెత్తుగ నుండవలయును, కేశవల్లిక భుజ మూలములకు పైగా పది యంగుళములవరకు వ్యాపించియుండవలయును.

స్త్రీల మూర్తులు- స్తనములు తొడలు కటి ప్రదేశము- ఈ భాగములందు ఎత్తుగా నుండునట్లు నిర్మించవలయును, స్త్రీల శరీరములు అంత స్థూలము కాకుండ ఉండవలయును; వారి ఉదరము పదునాలుగంగుళముల పొడవున ఉండును; వారు నానాభరణ సంపన్నలైనున్నని ఇంపైన ముఖములతో నుండవలయును, వారి మొగము కొంచెము పొడవుగా ఉండవలయును, అలకావళి (ముంగురుల వరుస) చాల ఉత్తమముగా ఉండవలయును, నాసిక, గ్రీవ, లలాటము ఇవి మూడున్నరేసి అంగుళములుండవలయును, క్రింది పెదవి చిగురాకువలెను ఒకటిన్నర అంగుళము వెడల్పుతోను (స్త్రీలకు) ఉండుట మంచిది; వారి కన్నులను పురుషులనేత్ర దైర్ఘ్యము కంటె అందులో నాల్గవపాలు ఎక్కువగ ఉండవలయును; (వారికి) గ్రీవయును పురుషులు గ్రీవకంటె ఇంచుమించుగ అర్ధాంగుళ మధికముగను నుండుట ప్రశస్తము.

(ఈ చెప్పినదంతయు దేవతా ప్రతిమలయందును, అందును స్త్రీమూర్తులయందును ఉండవలసిన ఆయా అవయవముల లక్షణములును పరిమాణములును. ఇవి నవతాళ లక్షణము. అనగా పీఠభాగము కాక కేవలమూర్తి భాగము తొమ్మిది తాళము లుండునట్లు చేయునపుడు ఉండవలసిన కొలతలు; మూర్తి మొత్తపు పరిమాణమునుబట్టి అదే అనుపాతములో ఆయా అవయవముల కొలతల మార్పులను ఎరుగవలయును.)