భారత వర్ష వర్ణనము

ఋషులు సూతునిట్లడిగిరి:  పరమాత్మనుండి జనించిన స్వాయంభువాది చతుర్దశ మనువులును ప్రజలను సృజించుటకు ఆశ్రయమగు భారతవర్ష స్వరూపము తాము ప్రతిపాదించగా వినవలెనని మాకు కుతూహలముగా ఉన్నది. అని చెప్పగా రౌమహర్షణుడగు సూత పౌరాణికుడు భావితాత్ములగు ఋషుల వచనము విని తన బుద్ధితో బహు విధముల విచారణముచేసి మరల మరల విమర్శము చేసికొని వారందరును కూడి అడిగిన విషయమునందు సంతోషము కలిగి ఇట్లు పలికెను: మీకు ఇకమీదట భారత వర్షమునందలి ప్రజల విషయమును తెలిపెదను; స్వర్గ పాతాళములకు నడుమ నుండుటచే మధ్యమ మనబడుచున్న ఈ భూలోకమందును ఈ భారతవర్షము మానవులు చేసిన కర్మల ననుసరించి శుభాశుభ ఫలోదయమునకు హేతువయినది. దక్షిణ మహా సముద్రమునకు ఉత్తరమునను హిమాలయమునకు దక్షిణమునను కల ఈ దేశమే భారత వర్షమనునది, దీనియందలి ప్రజలకు భారతులని వ్యవహారము. ప్రజలను భరించు- పోషించు-నది కావుననే దీనికి భారతము అని పేరు. ఈ దేశమునందలి వారికి మాత్రమే తాము చేసిన కర్మల ఫలానుసారము స్వర్గము కలుగును. సాధనానుసారము మోక్షము గలుగును. దీనికే మధ్యమ (లోక) మను వ్యవహారము సార్థకము. ఈ భూమియందు కాక మరి ఎచ్చటి వారికిని (వైదిక స్మార్త పౌరాణిక) కర్మ విధులు ఇచట వలె విధింపబడి యుండలేదు. ఈ భారత వర్షము మరల నవద్వీప (ఖండ)ములుగా విభక్తమయి ఉన్నది. అవి తెలిపెదను వినుడు. 1. ఇంద్ర ద్వీపము; 2. కశేరు ద్వీపము; 3. తామ్రపర్ణ ద్వీపము; 4. గభస్తి (మాన్) మత్ ద్వీపము, 5. నాగ ద్వీపము; 6. సౌమ్య ద్వీపము; 7. గంధర్వ ద్వీపము; 8. వారుణ ద్వీపము; 9. భారత ద్వీపము

ఈ భారతవర్షము మూడు వైపులందు సముద్రముచే చుట్టబడియున్నది. దీని దక్షిణోత్తర దైర్ఘ్యము వేయియోజనములు; ఈవర్షపు దక్షిణావధి కుమారీ స్థానము-ఉత్తరావధి-గంగా నదీ జన్మస్థానము. పొడవు వెడల్పులు పరస్పరము గుణించగా ఆగు వైశాల్యము తొమ్మిదివేల చదరపు యోజనములు. దేశపు పూర్వ పశ్చిమోత్తర దిశల అంతములయందు అంతటను మ్లేచ్ఛులగు యవనులును కిరాతులును ఉపనివేశముల నేర్పరచుకొని వసించుచున్నారు. ఇక నడుమయందు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర వర్ణములవారు ఆయా తావులయందు యజనము ఆయుధవృత్తి వాణిజ్యము జీవనోపాధులుగా వర్తిల్లుచు వ్యవహరించుచు నివసించుచున్నారు. వారియందు పరస్పర భేదముందని ఏకరూపసమాన వ్యవహారమునుకలదు. ఆయా వర్ణములకును ఆశ్రమములకును విహితములగు కర్మల ననుష్ఠించుచు ధర్మార్థ కామ మోక్షములపై సంకల్ప పూర్వకముగా యత్నము చేయుటలో వీరందర వ్యవహారమును సమముగా నుండును. ఇచటి మానవుల ప్రవృత్తి యంతయు ఇహలోక జీవనము విషయమున గాక పరమున స్వర్గమునో అపవర్గము (మోక్షము)నో సాధించుటకు అభిముఖమైయుండును. ఈ చెప్పిన తొమ్మిదింటిలో తొమ్మిదవది యగు భారత ద్వీప (భరతఖండ)మునకు తిర్యగ్గ్రామమని (తూర్పు పడమరలుగా వ్యాపించిన వీథి నిర్మాణముగల గ్రామములు గలదియని) వ్యవహారము కలదు. ఈ లోకము నంతటిని సృష్టించు సృష్టికర్తకు ‘సమ్రాట్’ అని వ్యవహారము; ఇంతియకాక-భూర్-భువర్-సువర్ అను మూడు వ్యాహృతులలో మొదటిదానికి అర్థమగు ఈ మధ్యమ లోకమునకు సమ్రాట్ అనియు భువర్ అను వ్యాహృతికర్థమగు అంతరిక్ష లోకమునకు విరాట్ అనియు సువర్ అను వ్యాహృతి కర్థమగు ద్యులోకమునకు స్వరాట్ అనియు వ్యవహారము. వీనిలో మొదటిదియు సమ్రాట్ అనబడు నదియునగు ఈ లోకపు-భరత వర్షపు-విస్తరమును ఇంకను చెప్పెదను.

ఏడు (తొమ్మిద)వదగు ఈ మహావర్షము నందు ఏడు విశాల కులపర్వతములు-మహేంద్రము-మలయము-సహ్యము-శుక్తిమాన్-ఋక్షవాన్-వింధ్యము-పారియాత్రము-అనునవి కలవు. వీటికి సమీపములందు ఈ కులపర్వతములకు సంబంధించినవి ఇవి అని గుర్తింపవీలగు లక్షణములు కలవి - పర్వములు (బుడిపెలు-ఉబ్బు-ఎత్తులు) కలవి విశాలములై చిత్రములై వివిధ లక్షణములు కలిగి అచ్చెరువు గొల్పు నెత్తములు (ఉన్నత సమతలములు) కలవి అగు శాఖాపర్వతములు వేలకొలదిగ కలవు. ఈ శాఖా పర్వతములకు అనుబద్ధములై వీనికి పిలకలవలె పుట్టినవి-పొట్టివి-స్వల్పమగు ఉపజీవనము (వృద్ధియు శిలాదార్ఢ్యమును) కలవియగు చిన్నగుట్టలు మరి వేలకొలది గలవు. ఈ పర్వతములతో శాఖోపశాఖా పర్వతములతో విమిశ్రములగు (వీనికి చుట్టు పట్టులనో వీని నడుమనో ఉన్న) జనపదములు (పల్లెలు)న్నవి. వానియందు ఆర్యులును మ్లేచ్ఛులును అంతట నివసించుచున్నారు. వారు ఆయా ప్రదేశములందు గంగా సింధు సరస్వతీ శతద్రూ చంద్రభాగా యమునా సరయూ శరావతీ వితస్తా విసా పా(శా) దేవికా కుహూ గోమతీ ధూతపాపా బాహుదా దృషద్వతీ కౌశికీ తృతీయా నిశ్చారీ గండకీ బహు లోహితా నదులనెడు హిమవత్పాదములనుండి జనించిన నదుల (జలము)ను వేదస్మృతి వేత్రవతీ వితస్తా సింధు పర్ణాసా నర్మదా కౌబేరీ మహతీ వారా చంద్రవతీ యూపా విదుషా వేణు జీవికా శిప్రావంతీ కౌంతీ నదులనెడు పారియాత్రగిరి పరిసరములనుండి జనించిన నదుల (జలము)ను శోణ మహానద నందినీ సుకృశా కృశా మందాకినీ (ఇది గంగానది కాదు) దేవ పర్ణా చిత్రకూటా తమసా పిప్పలా శోణా కరతోయాంఽబికా చిత్రోపలా విశాలా మధురా బహు వాహినీ ముక్తి మందాకినీ (ఇది మరియొకటి) లజ్జా మకుటోద్భేదికా నదులనెడు అమల జలయుతములగు ఋక్షవత్పర్వత సంజాత నదుల (జలము)ను తాపీపయోష్టీ నిర్వింధ్యా శ్రీప్రావృషభా వేణీ వైతరణీ విశ్వమాలా కుముద్వతీ తోయా మహాగౌరీ దుర్గమా శిలానదులనెడు వింధ్య పాదమునుండి ప్రభవించిన మరికొన్ని నదుల (జలము)ను శుభ శీతజలములగు గోదావరీ భీమరథీ కృష్ణవేణీ వంజుళా తుంగభద్రా సుప్రయోగా బాహ్యా కావేరీ నదులనెడు సహ్య పర్వత పాద సంజాత దక్షిణాపథ నదుల (జలము)ను కృతమాలా తామ్రపర్జీ పుష్ప జోత్పలా నదులనెడు శుభ శీత జలములగు మలయ పర్వత పాద సంజాత నదుల (జలమును)ను విషమా సర్వకుల్యేక్షు జాత్రిదివాచలా; తామ్రపర్ణీ మూలీ శరారీ విమలా నదులనెడు శుభ ప్రవాహయుతములగు మహేంద్ర పర్వత సంజాత నదుల (జలము)ను కౌశికా సుకుమారీ మందగా మందవాహినీ కృపా పలాశినీ నదులనెడు శుక్తిమత్పర్వత సంజాతములును పుణ్య జలయుతములును పుణ్య కరములును సమగ్రములును సముద్రము గామినులునునగు నదుల (జలము)ను త్రావుచు జీవించుచుందురు. ఈచెప్పిన నదులన్నియును పుణ్యజలవంతములు-మహాద్రి సంజాతములు-విశ్వమునకు తల్లుల వంటివి-సర్వ పాపహరములు-శుభకరములునైనవి. ఈ నదులలో కలిసెడి చిన్న నదులును ఉపనదులును నూరుల కొలదిగా వేలకొలదిగా గలవు.

ఆ నదుల నడుమ ఈ చెప్పబోవు దేశము అనేకములు గలవు. (అవి మధ్యదేశములు- ఉదీచ్య దేశములు-ప్రాచ్య దేశములు - దక్షిణాపథ దేశములు-ఆపరాంత దేశములు-వింధ్య పృష్ఠస్థ దేశములు - పార్వతీయ దేశములు అని ఆరు విధములుగా విభజింపబడినవి. వానిలో మొదట మధ్య దేశ జనపదములు (పంటకు అంతగా పనికిరాని భూములుకల జనపదములు), శూరసేనములు కాంభోజములు ఆంధ్రములు బర్బరములు మత్స్యములు కిరాతములు కుల్యములు కాశిజనపదములు కుంతలములు కోసలములు ఆవంతములు అనులింగములు మూకములు అంబకములు- ఇవి మధ్యదేశ్య జనపదములలో చాలవరకు అయినవి. (మధ్యదేశము అనగా హిమాలయపు దక్షిణపు అంచున కును వింధ్యకు ఉత్తరపు అంచునకును నడుమ కురుక్షేత్రమునకు తూర్పున ప్రయాగకు పడమట గల దేశము.)

గోదావరినది ప్రవహించు దేశము ధన్యము; పృథివియంతటిలోను అది మనోరమము. ఈ నదీతీరమునందే శ్రీరామ ప్రీతికై సుగ్రీవాది వానరులును ఋక్షులు (జాంబవజ్జాతీయులు)ను ‘గోవర్ధన’ అను నగరిని నిర్మించిరి. భరద్వాజ మునియు ఆ శ్రీరామ ప్రీతికే దివ్యౌషధులను భూమి కవతరింపజేసెను. కావుననే ఆ దేశశ్రేష్ఠము మనోరమమయ్యెను.

ఇక ఉదీచ్య దేశములు ఏవనగా బాహ్లికములు - రాజధాన్యములు ఆభీరములు ఆకాల ములు తోయకములు పరాంధములు శూద్రములు (ధవనామము) వప్లవములు ఉపఖండితములు గాంధారములు యవనములు సింధువులు సౌవీరములు మద్రకములు శశ(క)ములు హూణములు కళింగములు పారదములు హారములు మూర్తికములు రామఠములు కర్ణికారములు కేకయములు దశనములు అసికములు క్షత్రియ వైశ్య శూద్రుల ఉపనివేశములు ఆత్రేయములు భరద్వాజములు ప్రస్థలములు రమేరకములు లంబకములు స్థల బాణములు సైనికములు జాంగలములు అను ఈ జనపదములు ఉదీచ్యములు.

ఇక ప్రాచ్యజనపదములు, అంగములు వంగములు మండుకములు అంతర్గిరములు బహిర్గిరములు (పర్వతములకు లోపల-వెలుపల ఉండునవియని అర్థము) ప్లవంగములు మాతంగములు యమకములు అమలవర్ణకములు సహ్యోత్తరములు ప్రవిజయములు భార్గవములు గేయములు మాళవములు ప్రాగ్జ్యోతిషములు పుండ్రములు విదేహములు తామ్రలిప్తకములు సాళ్వములు మాగధములు గోనర్క్షములు అనునవి ప్రాచ్యజనపదములు.

ఇక దక్షిణాపథ జనపదములు:  పాండ్యములు కేరళములు చోళములు కుల్యములు సేతుకములు మూషికములు కుపథములు చారవాసికములు నవరాష్ట్రములు మాహిషకములు కళింగములు కావేర్యములు మహాశ్రీకములు కేరములు సృవరములు-ఇవి దక్షిణాపథమునందలి జనపదములు.

ఇక అపరాంత (పశ్చిమ దిశయందలి) జనపదములు: పుళిందములు (నేటి బుందేల్ ఖండ్) వింధ్యభూతములు మూషకములు దండకములు కులపములు నిరాభములు రూపనములు తారసములు సదనములు తరుణికములు సర్వాకరములు నాసిక్యములు అంతర నర్మదములు భరుకచ్ఛములు మాహేయములు సారస్వతములు కాశ్మీరములు సౌరాష్ట్రములు అర్బుదములు. ఇవి అపరాంత జనపదములు (భారతదేశపు పడమటిదిశలో పశ్చిమ సముద్రము వరకు వ్యాపించిన ప్రదేశమందలి జనపదములు.)

ఇంక వింధ్య పర్వతముతో సంబంధముగల జనపదములు:  మలదములు కరూశములు మేలకములు చేలకములు ఆర్ధ్రములు షోడశార్ణములు భోజములు కిష్కింధకములు గోసహ్యములు కోసలములు త్రైపురములు వైదికములు తుసురములు తుంబురములు పడుమములు నైరథములు ఉత్తరములు దశములు కాంభోజములు మాగధములు కౌసలములు కోసలములు కైపురములు వేదికములు మర్మరములు ఘూర్జరములు గృహ బలములు అంతపములు తుండికా (కే)రములు వీతిహోత్రములు అవంతులు-ఇవి వింధ్యమును ఆశ్రయించియుండు జనపదములు.

ఇక ఇతర పర్వత ప్రాంతములందును పర్వతములందును ఉండు జనపదములు:  నీహారములు హిమవర్గములు కుంతోదములు కుశలావహములు కర్ణప్రావరణములు ఊర్ణములు దార్వములు మద్రకములు త్రిగర్తములు (తిర్ హుత్) మండలములు కిరాతములు చామరములు (చమరీపశువు లుండు జనపదములు)-ఇవి పర్వతాశ్రయి జనపదములు.

ఈ భారతవర్షమునందు కృత త్రేతా ద్వాపరకలులు అను నాలుగు యుగములు వ్యవహారమునందుండునని మునులు వచించిరి. ఈ చతుర్యుగ స్వరూప లక్షణములను ఇకమీదట ఏమియు విడువక అంతయు చెప్పెదను. అనగా ఋషులు ఇంతవరకు అతడు చెప్పినదే మరి కొంత వినగోరి సంతోషముతో కూడిన కుతూహలముతో నిట్లనిరి. ద్విజోత్తమా! జంబూద్వీప తదితర ద్వీప విస్తరమును వానియందు వసించు మానవులయు ఉండు వృక్షములయు వివరణమును మాకు తెలుపుడు. మీరు భారతవర్షమును యథాతత్త్వముగ మాకు తెలిపితిరి. హరి కింపురుష వర్షములను కూడ తెలుప వేడెదము. అనగా సూతుడిట్లనెను, విప్రులారా: మీకు వినగోరిక కలదేని సావధానులై వినుడు. కింపురుష వర్షమున నందనవనము వంటి జంబూ (నేరెడు) వనము కలదు. అచట వారి ఆయువు పదివేలేండ్లు. వారి దేహకాంతి మెరుగుపెట్టిన బంగారుకాంతి. ఆ ద్వీపమున తేనెలు ప్రవహించు జువ్విచెట్టు కలదు. అచటి వారు దాని ఉత్తమరసము త్రావి రోగ శోకరహితులై సదా ముదిత మానసులై ఉందురు. అచటి స్త్రీలు అప్సరసలవంటి సుందరులు. దాని కవతలిది హరివర్షము. అచటి జనులు వెండి కాంతిబోలు దేహచ్ఛాయ కలవారు. దేవలోక పరిభ్రష్టులు అచట జనింతురు. వారు దేవతలను పోలి యుందురు. వారు చెరకు రసమును త్రావి జరాబాధలు లేక పదునొకండు వేలేండ్లు జీవింతురు.

భారత కేతుమాల భద్రాశ్వ కురువర్షముల నడుమ నున్నదని నేను లోగా చెప్పిన ఇలావృత వర్షమున సూర్యుడు తపింపడు. అచటి వారికి శైథిల్యము కాని వార్ధకము గాని లేదు. అచట చంద్ర రవి నక్షత్ర పవనాగ్నులతో పనిలేదు. అచటివారు పద్మకాంతి పద్మవర్ణము పద్మపత్ర నేత్రములు పద్మ గంధ సదృశగంధము కలిగి అచటి జంబూ ఫలరసపానముచే పదునైదు వేల ఏండ్లు జీవింతురు. వారికి వార్ధకము అకలి బడలికలు మృత్యువు లేవు. ఇదంతయు వారు త్రావు జంబూ ఫలరస మహిమమే. ఆ రసము నదియై మేరువును ప్రదక్షిణించి మరల జంబూ వృక్ష మూలమును చేరును. అచటి దేవులకును మానవులకును సహజ కనకమయ భూషణములే. అవి ఇంద్ర గోపకీటముల (ఆర్ద్ర పురుగుల) వన్నెతో నుండును. ఏలయన అన్ని వర్షములందలి ఆయా ఫలరసములను ప్రవహించి నిర్మలమగు బంగారయి దేవభూషణమగును. ఈశ్వర సంకల్ప రూపాను గ్రహమున వారిలో కొందరిని అచటి భూమి మ్రింగివేయును. అదియే వారికి మృతి. అచట వసించు రక్షః పిశాచయక్షులును సువర్ణవంతులే.

హేమకూట పర్వతమున గంధర్వాప్సరసలు శేషవాసుకి తక్షకాది మహానాగులు వసింతురు. మహామేరుపర్వతమున ముప్పదిముగ్గురు దేవతలును (ఏకాదశ రుద్రులు -ద్వాదశా దిత్యులు-అష్టవసువులు-ఇద్దరు అశ్వినులు) సదా వసింతురు. నీల వైఢూర్యమణియుతమగు దీనియందు సదా బ్రహ్మర్షులు నివసింతురు. శ్వేత పర్వతమునందు దైత్యులు దానవులు నివసింతురు. శృంగవత్పర్వతము శ్రేష్ఠమయినదియు పితృదేవతలకు లయాత్మకమయినదియు; అనగా పితృ దేవతలు దీనియందు లయమునొంది అదృశ్యరూపులై యుందురు.

ఈ విధముగ నేను మీకు భరతవర్షము మొదలుగా నవవర్షముల విషయము తెలిపితిని. వీనియందు ఆయా స్థిర చర భూతములు నివసించుచున్నవి. దేవమాన మానుషమానముల ననుసరించి వాని పరిమాణాదికమును జనన వృద్ధులు ఆయువు మొదలగు పరిమాణములును బహు విధములుగా పెద్దలు చెప్పుచున్నారు. దానిని స్పష్ట రూపమున ఇది ఇట్లని చెప్పుట శక్యము కాదు. కావున నేను చెప్పిన ఈ విషయములన్నియు ఆస్తికతా ప్రామాణికతా భావములతో విశ్వసింపవలసినది.