క్షీరసాగరమథనమున చంద్రాదుల ఉత్పత్తి

సూతుడు ఋషులకిట్లు చెప్పెను, నారాయణుని వచనమును విని ఆ దేవదానవులు మహోదధిని ఇంకను మథించిరి; ఒక్కుమ్మడిగ తజ్జలమును మిగుల కల్లోలపరచిరి; అంతట సాగరము నుండి శతరవి సమానుడోయన గనవచ్చుచుండియు హాయిగొలుపు కాంతులు గల చల్లని కిరణముల సోముడుత్పన్నుడయ్యెను, తరువాత క్రమముగ ఘృతమునుండి తెల్లని వస్త్రము ధరించిన లక్ష్మియు సురాదేవియు శ్వేతాశ్వమును, అమృతసంభవమును కిరణ వికాసియు నారాయణ వక్షోవిభూషణమును అగు దివ్యకౌస్తుభమణియు వికసిత కుసుమస్తబక సమన్వితమగు పారిజాత వృక్షమును ఉత్పత్తినందెను; అనంతర మంబరసమానమును ఆపూరితదిశా భాగమును సర్వప్రాణులకును దుఃసహమును అగు ధూమము వారికి కనబడెను; దాని నాఘ్రాణించినంత సురులందరును మూర్ఛితులగుచు వ్రేలాడుచు చేతితో తలలు పట్టుకొని సముద్ర తటమున కూర్చుండిరి. అనంతరము అది క్రమముగ దుర్వారమును జ్వాలామాలాకులా ఆకారమును అగు అనలమయి కనబడెను; భయానక జ్వాలాయుతమై అన్నిదిశల క్రమ్మిన ఆ అగ్నిచే క్రమ్మబడి ఆ సురాసురులలో చాలమంది దగ్ధులో అరదగ్ధులో అయి అన్నిదిశలకు పరుగిడుచుండిరి. దేవదైత్య ప్రధానులును ఆవహ్నిచే భీషితులయిరి.

అనంతరము దానినుండి డుండుభ జాతులును మహాదంష్ట్రములగు కృష్ణ సర్పములును రక్తసర్పములును శ్వేత సర్పములును పీతసర్పములును గోననజాతి సర్పములును మశకభ్రమర దంశమక్షికా శలభ కర్ణశల్యకృకలానము (తొండ)లును కోరలుకల రౌద్ర ప్రాణులును విషజాతి సర్పములును శార్జ్గ-హాలాహల-ముస్తక-గుల్మవత్సక-నీలపత్రాదిశతవిధపదార్థములును బయటకువచ్చెను; వాటి గంధమాత్రమున గిరిశృంగములును నిశ్చయముగ దగ్ధములగును; అనంతరము నీలరసమువలె తుమ్మెదలవలె చీల్చిన కాటుక కొండవలె మెరయుచు విషమమై బుసలుకొట్టుచు లోకాంతర పూరకమగు దేహముతోను అగ్నులవలె జ్వలించు కేశములతోను కూడి బంగరుతో ముత్తెములతో భూషిత శరీరమయి, కిరీటమును పీత దుకూలమును దాల్చి నల్లకలువల వంటి కుసుమములు ధరించి కృతార్థమయి మేఘమువలె గర్జించుచు భయానక వేగవంతమయి ప్రాణుల భయమెల్ల రూపొందెనో యనునట్లు సముద్ర మధ్య మందుండిన యొక విషరాజము వారికి కనబడెను. భయంకరాకృతియు భయానక నేత్రములునుకల అద్దానిని చూచినంతనే సకల భూతములును సకల సురులును భయమందిరి; దర్శనమాత్రమున అందరు నశించిరి; మరికొందరు నిస్సంజ్ఞులయిరి; ఇంకను కొందరు నోళ్లనుండి నురుగులు క్రక్కిరి; ఇతరులు మహార్ణవమున పడిపోయిరి; దాని శ్వాసముతో నిర్దగ్ధులయి బ్రహ్మవిష్ణ్వంద్రాదులును దానవులును దివ్యరూపులు కూడ మాడిన బొగ్గులవలె అయిరి; అంతట సంభ్రమముతోనే నారాయణుడు దేవరూపుడగు ఆతనితో నిట్లనెను; యమ సముడవు నీవెవ్వడవు? నీ కోరికేమి? ఎటనుండి వచ్చితివి? ఏమిచేసినచో నీకు ప్రీతికలుగును? ఇదంతయు నాకు చెప్పుము; అనిన విష్ణుని వచనమునువిని కాలాగ్నిసమానమగు ఆ కాలకూటము మ్రోయించిన ఢంకాధ్వని సదృశ మగు గంభీరధ్వనితో ఇట్లనెను. నేను అంబుధి సముద్భూతమగు కాలకూటమను విషమను; పరస్పరవధ కాంక్షులు అగు దేవదానవులును ఒకటిగనై ఆదరమున క్షీర సాగరమును మధించు చుండ ఈ దేవదానవులనందర వధించనై నేను జనించితిని; సర్వ ప్రాణులను నేను క్షణ మాత్రమున వధింతును; ఇంద్రాదిదేవతలు మీరందరు నన్ను మ్రింగనైన మ్రింగుడు.

అతని ఈమాటవిని సురాసురులు భీతులై బ్రహ్మ విష్ణులను ముందుంచుకొని శంకరుని కడకుపోయిరి. ద్వారస్థులగు గణేశులచే తెలుపబడి శివునిచే వారనుజ్ఞాతులై హేమమయము ముక్తామణి విభూషితము నిర్మలమణి సోపానయుతము వైడూర్యమణి స్తంభాలంకృతమునగు మందర గుహయందు ప్రవేశించి శివుని సమీపించిరి; అట దేవాసురులందరును బ్రహ్మను ముందుంచుకొని ఈ స్తోత్రముతో మహాదేవుని స్తుతించిరి.

విరూపాక్షా! తీక్ష్ణనేత్రా! పినాకహస్తా! ధన్విన్! కామరూపిన్! శూలహస్తా! దండహస్తా! త్రైలోక్యనాధా! భూతసమూహమూర్తీ! సురారిహంతా! సోమసూర్యవహ్ని నేత్రా! బ్రహ్మవిష్ణురుద్ర రూపిన్! బ్రహ్మన్! వేదరూపా! విశ్వరూపిన్! సాంఖ్యయోగా! భూతశంభవా! మన్మథ దేహనాశకా! కాలక్షయకరా! రంహో(వేగ) రూపా! దేవదేవా; వసురేతోరూపా! ఏకవీరా! సర్వా! పింగజటా జూటా! హర్తా; కర్తా! త్రిపురఘాతిన్! శుద్ధబోధప్రబుద్ధా! ముక్తికైవల్యరూపా! లోకత్రయవిధాతా! వరుణేంద్రాగ్ని రూపా! ఋగ్యజుఃసామరూపా! పురుషా! ఈశ్వరా! అగ్ర్యా! (శ్రేష్ఠా! ) ఉగ్రా! విప్రా! వేదనేత్రా! సత్త్వరజస్తమోరూపా! అనిత్యనిత్యభాసా (ప్రకాశా!) నిత్యచరాత్మకా! వ్యక్తరూపా! అవ్యక్తరూపా! వ్యక్తావ్యక్తరూపా! భక్తార్తినాశకా! నారాయణప్రియా! ఉమాప్రియా! శర్వా! నంది ముఖాంచితా! ఋతుమన్వంతర కల్పపక్షమానదినాత్మక నానారూపా! ముండరూపా! వరూథ (కవచ)రూపా! పృథుదండిన్! కపాలహస్తా! దిగంబరా! శిఖండిన్! ధన్విన్! రథిన్! యతీ! బ్రహ్మ చారిన్! శివా! దేవదేవా! నమస్తుభ్యం - నమస్తుభ్యమ్ (నీకు నమస్కారము)

ఇట్లు సురాసురులచే స్తుతించబడి సంతుష్టుడై శంకరుడు భయ మందియున్న వారందరతో చిరునగవుతోను శుభాక్షరములతోను కూడిన ఈమాట పలికెను: మీరందరును భయముచే వాడిన ముఖపద్మములతో ఉన్నారేల? ఏలవచ్చితిరి? మీకేమి అభీష్టము నిత్తును? తడవుచేయక నిర్భయముగ మీకోరిక తెలుపుడు; అన వారిట్లనిరి: మహాదేవా! అమృతార్థమై మేము మహోదధిని మథించుచుండ లోకసంక్షయ కారకమగు అద్భుత విషము ఉద్భవిల్లినది; అది సర్వదేవ భయంకరమయి “నేనైన మిమ్మందర భక్షింతును; మీరయిన నన్ను భక్షించుడు;” అనినది; మహోద్ధతమగు అది మమ్ము మ్రింగగలదేకాని మేము దానిని మ్రింగజాలకున్నాము; దానిముఖనిశ్శ్వాస మాత్రముననే శతపత్త్రపద్మ సమానకాంతియగు విష్ణుడును కృష్ణుడయ్యెను - యముడు విమనస్కుడయ్యెను; కొందరు మూర్ఛితులై పడిరి; మరికొందరు పూర్తిగా నశించిరి; దురదృష్టవంతులకు అర్థమును అనర్థమగును; దుర్బలుల సంకల్పములు అపదలయందు మరియు వ్యర్థములగును; అట్లే అమృతము కోరి యత్నించు మాకీ విషముదాపురించినది; ఇపుడు నీవే మాకు గతియు పరమగమ్యమును ఆశ్రయమును; నీవు భక్తులను దయచూచువాడవు సర్వజ్ఞుడవు భువనాధీశ్వ రుడవు విభుడవు. యజ్ఞమున ప్రథమభాగ భోక్తవు సర్వహవిః సోమాది రూపుడవు సౌమ్యుడవు; మన్మథాంతకరుడవు, దేవగణ సుఖప్రదుడవుఅగు నీవే మాకు గతి; భక్తసంకల్పము నెరవేర్చుచుమమ్ము ఈ విషజ్వర (సంతాప)ము నుండి రక్షించుము.

ఇది విని భగుడను ఆదిత్యుని నేత్రములు పోగొట్టిన భవుడగు భగవానుడా శంకరుడు ఇట్లనెను. ఆ ఘోరకాలకూట మహావిషమును భక్షింతును; అట్లే క్లేశసాధ్యమగునది ఇంకేమి ఉన్నను సురా అసురులారా! అదిఎల్ల మీకై సాధింతును, విగతసంతాపులయి యుండుడు అని చెప్పగా అదివిని బ్రహ్మాదిసురులు గగుర్పాటు చెందిరి; బాష్పగద్గద కంఠులయిరి-ఆనందాశ్రు పూర్ణనేత్రులయిరి; తాము సనాధులు (రక్షకులు కలవారు) అయినట్లు భావించిరి. వారి మనస్సులు ఓదార్పు చెందెను.

అంతట జగత్పతియగు హరుడు నందిపైనెక్కి వెడలెను; అసురసురేంద్ర నాయకులు కదలియాడెడు నిర్మల చామరయుతములగు స్వవాహ నాశ్వములతో అతని ముందు పరుగెత్తుచుండిరి; నిర్మలహృదయులగు వారితోకూడి జ్వాలాయుక్తములగు పచ్చని నిట్టనిలువయిన జటా జూటములతో అలంకృతుడు జితేంద్రియుడునగు ఆ శివుడెంతగనో ప్రకాశించెను.

అంతట కాలకూట విషము ఉన్న క్షీరసాగరమును సమీపించి అమహాదేవదేవుడు విషమ విషమునుచూచి దాని నీడయున్నచోట (దానికి వెనుకగా) నిలచి తన ఎడమచేతితో దానిని త్రావెను. అపుడు ఇంద్రాది హిరణ్యాక్షాది దేవాసురు లెల్లరును పాడిరి, అడిరి పుష్కల సింహ నాదములు చేసిరి; ప్రసన్న హృదయులై దేవేశుని సంస్తుతించిరి, ఆ విషము హరుని కంఠదేశము చేరగానే బ్రహ్మాది దేవతలును బలి ప్రముఖ దానవులును ఆదేవునితో నిట్లనిరి: దేవా! నీ కంఠము ఇపుడు మొల్ల పూవువలె తెల్లని నీదేహమున తుమ్మెదల వరుసవలె శోభించుచున్నది: కావున అది అందే ఉండనిమ్ము. దేవతల ఈ మాటకు పురహరుడును సరేయనెను, విషప్రానాంతరము దేవగణములను అటనే విడిచి హరుడు మందర శైలమునకు పోయెను, తరువాత మరల దేవదానవులు క్షీరాబ్దిని వివిధ రీతుల మథించిరి.