వహ్ని ప్రతిమా లక్షణము

సర్వకామ ఫలప్రదమగు వహ్ని ప్రతిమాలక్షణమును తెలిపెదను. వహ్ని కాచిన బంగారువలె ప్రకాశించు దేహముకలవాడు; అర్ధచంద్రాసనమందు ఉండును; అతని ముఖము బాల సూర్య సమాన తేజసము; అతడు లంబకూర్చమును (వ్రేలాడు గడ్డమును మీసలును) యజ్ఞోపవీతమును కలిగియుండును; ఎడమచేతి యందు కమండలువును కుడిచేతియందు అక్షమాలను ధరించి జ్వాలా సమూహముతోను స్వధా స్వాహా దేవులతోను ప్రకాశించుచుండును, మేష వాహనము పయినున్నట్లు కాని హోమకుండ మందున్నట్లు కాని అగ్ని మూర్తిని నిర్మించ వచ్చును. ఇతని శిరముపై సప్తజ్వాలలు మత్రమే వెలుగుచుండును.