శుభాశుభ శకున విచారము

రాజయాత్రాగమన సమయమున ఏవి ఎదురుగ వచ్చినచో శుభమగునో ప్రశస్తము లగునవి ఏవో చెప్పుకొనదగనివి ఏవో చెప్పుకొన దగినవి ఏవో ఇవి అన్నియు పేర్కొనుము. అని ప్రార్థించిన మనువునకు మత్స్యుడిట్లు చెప్పెను. అయుక్తములగు ఔషధములు నల్లని ధాన్యములు దూది ఎండుగడ్డి, ఎండు పేడ, కట్టెలు, బొగ్గులు, నూనె, బెల్లము, నూనె అంటుకొనినది మలినము అగు బోడితల-నగ్నుడు, ముక్తకేశుడు, రోగార్తుడు, కాషాయ వస్త్రధారి, ఉన్మత్తుడు, బలహీనుడు, దీనుడు, నపుంసకుడు, ఇనుము, బురద, చర్మముల మోపు, కేశములు కట్ట తెలిక పిండి మొదలగు సారము తీసివేసిన పదార్థములు చండాలురు, శ్వపచులు, కారాగార రక్షకులు, కసాయివాండ్రు, పాపకారులు, గర్భిణలు, ధాన్యపుపొట్టు, భస్మము, కపాలములు, ఎముకలు, పగిలిన పాత్రలు, కండలు, ఎర్రని పాత్రలు, కుండలు, మృతమయిన కొమ్ములుగల ప్రాణులు, అప్రశస్త వాద్యధ్వనులు, చెవులు బ్రద్దలుచేయు భయంకర ధ్వనులు అశుభశకునములు; ‘రమ్ము’ అనుమాట ముందునుండియు ‘పొమ్ము’ అను మాట వెనుకనుండియు వినబడుట మంచిది, ఎక్కడకు పోవుచున్నావు? నిలుపుము, పోవలదు, అక్కడకు పోవుటచే నీకేమి ప్రయోజనము? ఈమొదలగు శబ్దములు విపత్తికరములు; ధ్వజాదులపై మాంసాహార పక్షులు వాలుట, వాహనములు తడబడుట, వస్త్రములు జారుట, వెలికిపోవునపుడు ద్వారాదులు తలకు ఢీకొనుట, కాళ్ళకు ఎదురు దెబ్బలు తగులుట, ఛత్ర ధ్వజ వస్త్రాదుల పతనము ఇట్టివి అశుభములు; ఇట్టివి మొదటిసారి జరిగినపుడు కేశవురి అర్చించుటయు, స్తుతించుటయు చేయవలెను. రెండవమారు కూడ జరిగినచో ప్రయాణముమాని ఇంటిలో ప్రవేశించవలెను. ఇపుడిక శుభశకునములు తెలిపెదను వినుము.

తెల్లని పూవులు, పూర్ణకుంభములు, జలపక్షులు, మాంసము, మత్స్యములు, గోవులు, అశ్వములు, గజములు, ఒంటి బౌద్ధ సన్యాసి, సాధు ప్రాణి, మేక, దేవతలు, మిత్రులు, విప్రులు, మండుచున్న అగ్ని, వేశ్య, దూర్వ, పచ్చి గోమయము, వెండి, బంగారము, రాగి, సర్వరత్నములు, ప్రశస్తాషధములు, యవలు, తెల్ల అవలు, మనుష్యులు మోయు యానము (పాలకీ-మేనా), శుభపీఠము ఖడ్గచ్ఛత్ర పతాకలు, మృత్తిక ఆయుధములు, ఇంకను సర్వరాజ లాంఛనములు, ఏడుపులవారు వెంటలేని శవములు, నేయి పెరుగు పాలు వివిధ ఫలములు, స్వస్తిక, వర్ధమాన నంద్యావర్త, కౌస్తుభ గృహభేదములు, సుఖకరము, గంభీరము మనోహరమునగు వాద్యధ్వని, గాంధార షడ్జఋషభాది ప్రశస్త సంగీత స్వరములు ఇట్టివి శుభకరములు.

ఇసుకతో కూడి అంతటను చెలరేగిన పెనుగాలి, ఎదురుగాలి, నీచమగు వాయువు భయ కారణములు; అనుకూల వాయువు అనగా వాలునకు వీచుగాలి, మృదువై నునుపై సుఖ స్పర్శమయి హాయి గొలుపుగాలి రూక్షములు, రూక్షస్పర్శములు ఐనను భద్ర శుభకరములు అగు మాంసాహారప్రాణులు కనబడుట, దట్టములయి, నున్ననయి గజ బృంహితమువలె ధ్వనించు మేఘములు మెరుపులతో నిండినవిమంచివి; ఇంద్రధనువును మంచిది, పరివేషములును, పెనువానలును మంచివికావు; గ్రహములును-అందును విశేషించి బృహస్పతి రాజు తానుపోవు దిక్కునకు ఎదురుగాకాక వెనుకవైపున నుండుటమంచిది; ఆస్తిక్య శ్రద్ధలు పూజ్యులను పూజించుట- ఇట్టివే; మనస్సునకు హాయిగొలుపున వన్నియు ప్రయాణ కాలములో శుభావహములు; మన స్తుష్టియే ప్రయాణకాలమున ప్రథమ జయలక్షణము; సర్వశకునములును ఒక ఎత్తు, మనస్సంతోషము ఒక ఎత్తు; యాత్రకు పోవలయునను ఉత్సుకత మనఃప్రహర్షము శుభ శకునలాభము విజయకర వచనములు.