కార్తికేయ ప్రతిమా లక్షణము

కార్తికేయుడు (కుమారస్వామి) బాల సూర్యునివలె కాంతికలవాడు; కమలాంతర్భాగము వలె సుకుమారచ్ఛాయ గలవాడు; సుకుమారుడగు కుమారుడు; భుజములందు కేయూరములును హస్తమునందు దండమునుండును, మయూర వాహనుడు; తన ఇచ్ఛానుసారము ఈ దేవుడే నగర (స్థాన)మందు ఉన్నట్లయిన చూపవచ్చును; అపుడతడు ద్వాదశభుజుడు; గూడెమునందు ఉన్నట్లు చూపినచో చతుర్భుజుడు; గ్రామమందో వనమందో ఉన్నట్లు చూపినచో ద్విబాహుడు; కుడివైపున శక్తి - పాశము ఖడ్గము శరము శూలము వరదహస్తముకాని అభయ హస్తము కాని ఉండును, ఎడమ చేతులందు ధనువు, పతాక, పిడికిలి, చాచిన చూపుడువ్రేలు - ఖేటకము, కోడిపుంజు ఇవి ద్వాదశ భుజునకు; ద్విభుజునకు దక్షిణ హస్తమునందు శక్తియు ఎడమచేతి యందు కోడిపుంజు నుండును, చతుర్భుజునకు ఎడమ చేతులందు శక్తియు పాశమును కుడిచేతులందు ఖడ్గమును వరదహస్తముకాని అభయ హస్తముకాని యుండును.