మత్స్య మహా పురాణము
ఐరావతీనదీ (రావీనది) వర్ణనము
సూతుడు ఋషులకు ఇంకను ఇట్లు చెప్పెను: ఆ మద్ర దేశాధిపతియగు పురూరవసుడు చూచిన ఇరావతీ నది చూచుటకు మనోరమముగ నుండునది మాత్రమే కాక పుణ్యదముగా కూడ ఉండెను. హైమవతి-హిమవంతము నుండి పుట్టినది- పార్వతి-కావున శుభ స్వరూప. జలక్రీడాది విహారములకై చేరిన గంధర్వులు అందెల్లపుడు నిండి యుందురు. ఇంద్రుడందు విహరించుచు ఆనందించుచు ఆ నదిని నిషేవించుచుండును. దేవరాజ గజమగు ఐరావతమందు ఆనదీప్రవాహ మధ్యము ఇంద్ర ధనుర్వర్ణము లీనుచుండును. దాని తీర పరిసరములందు తపసులు ఆశ్రమములు నిర్మించుకొని తపమాచరించుచుందురు. మహా బ్రాహ్మణులు తమ స్నానానుష్టానాదికమునకై ఆనదిని సేవించుచుందురు. మహారాజా పురూరవుడు ఆనదిని ఇట్లు దూరమునుండి చూచుచు సమీపించిన కొలది ఆనది నీరు మిగుల తేటయై కానవచ్చెను. ఆతడా నదిని చేరెను. తెల్లని హంసావళులు అను శ్వేతచ్ఛత్రము పట్టుచు తన తీరములందలి రెల్లు అనెడి వింజామరలు కదల్చుచుండుటచే ఆనది తనయందా రాజును రాజలాంఛనముల- మర్యాదలతో స్నానమాడింపగోరుచున్నదో యనునట్లుండుట చూచి యాతడు మిగుల ప్రీతి ననుభవించెను. ఏలయన ఆనది (తన రాజ్ఞివలె) పుణ్యమును సంపాదించి ఇచ్చునది సుశీలవతి- హృదయమునకు హాయి గొల్పునది-మనస్సునకు ప్రీతిని వర్ధిల్ల జేయునది. రెండవ చంద్ర మూర్తియో యనునట్లు (ఆయా ఋతువులందు) క్షయవృద్ధులు కలదియైనను సౌమ్య రూప స్వభావములతో నొప్పారుచుండును. మిగుల చల్లనై వేగమున ప్రవహించు ఆనది నీటిని ద్విజ (పక్షి-బ్రాహ్మణాది త్రైవర్ణికుల) సంఘములు నిషేవించు (వినియోగించుకొని ఆనందించు) చుండును. ఆమె హిమవంతుని మేలయిన బిడ్డ; చక్కగా ఒప్పారు అలలతోను అమృతమువలె రుచిగల నీటితోను బెగ్గురు అనెడు జలపక్షులతోను ఆ నది ఉపశోభిల్లుచు సర్వకల్మష నాశనియై స్వర్గము నారోహించువారికి నిచ్చెనయో యనదగియుండెను. ఆమె సముద్రుని భార్యలలో అగ్రగణ్య, ఆమెను ఎల్లపుడును మహర్షి గణమాశ్రయించి యుండును. మిగుల మనోహర యగుటచే అనదిని సమీపించి సేవించి యుపయోగించు కొని ఇహపర సుఖానందముల నెపుడందుదుమాయని ఎల్లజనులు ఉత్సుకులగు చుందురు. రమ్యమగు ఆ నదిలో నాచు ఉండదు. అనది తీరమున గోవులమందలు తరచై యుండును. ఆమె యందెపుడును హంస సారసములు ధ్వని చేయుచుండును; ప్రవాహము జలజములతో ఉపశోభిల్లుచుండును. సుడులే గంభీర నాభియు ద్వీపములే విశాలజఘనస్థలియు నీలోత్పలములును పద్మములును సుందర నేత్రములును వికసిత కమలములే మొగమును, మంచువలె మెరయు నురుగే సూక్ష్మవస్త్రమును, శోభిల్లు చక్రవాక పక్షులే స్తనములును, కొంగల బారులు దంతపంక్తులును చలన్మత్స్యావశులే కనుబొమలును స్వజలమున క్రీడించి లేచుచుండు గజముల రమ్య కుంభస్థలములే స్తనములును, హంసలే కాలియందెలును తామరకాడలే కరకంకణములును కాగా ఆ ఇరావతీ (రావి) నది సుందరియగు యువతిగా తోచుచుండెను.
అప్సరసలు ధరించి జలక్రీడా కాలమున విడిచిన పూలమాలలును రాసులును నదియందు నీటివెంట కొట్టుకొనిపోవుచుండును. తన యొడ్డున మొలచిన వృక్షముల సుగంధములతో అనది గుబాళించుచుండును. నూరుల కొలది అలల యందు ప్రతిఫలముచే సంక్రమించిన రవి బింబము-కన్నుల నుపహత మొనర్చుచుండ ఆనది తేరిపార చూడ రాకుండును. దేవగజములు తమ దంతములతో ఒడ్డులయందు దెబ్బలు వేసిన గుర్తు లలంకారములయి యుండెను. దేవేంద్రుడానది నీటిని ననుభవించుచుండును; రూపమ దోన్మత్తులగు అప్సరసలు గుంపులై రూపమదోన్మత్తులగు గంధర్వులు తమ్మనుసరింప మధ్యాహ్న సమయములందా నది యందు జలవిహారము లొనర్చుచుందురు. ఇట్టి జలక్రీడా సక్తలగు దేవస్త్రీల హృదయము లందలి చందనములతో మిశ్రితములగు ఆపటినీటిని తేటులు ఉపసేవించు చుండును. సుగంధి కుసుమాన్వితములగు తత్తీర సంజాత వృక్షములు ఆ పుష్పములు మకరందపు ఆకర్షణమునకు వశవర్తులై సంబరమున గుమియై తిరుగు తుమ్మెదల రొదలతో నిండియుండును. తపోధనులే కాదు-మునులే కాదు-దేవతలే కాదు-అచ్చరలే కాదు. ఎల్లవారును అనది యొడ్డున శృంగార భావవర్తులై ఆనందమందుచుందురు. స్వర్గ వాసులగు దేవతలు మొదలగువారితో దట్టమైయుండి పద్మములను చంద్రుని పోలు మోములుకల దేవస్త్రీలు తన్నదీజలమున తడిసిన శరీరములు కలవారును దేవతల (తోడి క్రీడల) వలన ప్రీతినొందిన మానసములు కలవారునై ఆనందము అనుభవించుచుందురు. ఆ నదీజలమును సదా దేవతలనుభవింతురు; మృగబృందము లందు వ్యాధ సంఘముల పీడలనుండి తప్పించుకొనవచ్చి మునుకలతో దాగి యుండును. తామరలతో నొప్పారు అ ఏటి నీరు తారలతోడి అమలాకాశమువలె అందగించు చుండును. అనది తన తీరమున పూచి వెలయు చంద్రకిరణములపోలు ఱెల్లు పూలతోను గగనమునే తమ శాఖాగ్రములతో నిలిపి పట్టుకొను మహాద్రుమములతోను రాజిల్లుచుండును. వివిధ దేవ భూదేవు లా నది నెల్లవేళల నిషేవించుచుందురు. భక్తజనుల కచిర కాలముననే సకల కలుష నాశముసేయునది యానది. ఎన్నియో ఏళ్ళును హిమజలములును ఆ ఏట కలిసిపోవుచుండును. మంచుతో చల్లనైన ఆనది మానవులను మృగ సంఘములను సురాసుర సిద్ధమహర్షి సంఘములను కూడ ఆయా ప్రకారముల రక్షించుచుండును.
అ రావీనది సింహగణ యుక్తము-అయియును కరి బృందయాన (ఏనుగుల మందలచే అనుసరింపబడునది ఏనుగువలె ఠీవిగా నడచునది;) ఆనది నీరు సంతాన సహితము అయియు సువర్ణ ప్రకాశము కలది. (ఎడతెగని ప్రవాహముతో కూడినది యనియు, పచ్చని కల్పవృక్షములతో కూడినది యనియు రెండర్థములు) సూర్యకిరణ తాపముచే మిగుల వృద్ధి నొందుచుండియు ఆనది నీరు చంద్రునివలె చల్లనిది. ఇట్టి ఇరావతీ నదిని ఆ మద్ర దేశాధిపతి పురూరవసుడు కాంచెను.