మత్స్య మహా పురాణము
కర్ణుడు సూతపుత్రుడైనందుకు కారణము
అనగా ఋషులు సూతునిట్లడిగిరి, “కర్ణుడు సూతుని కుమారుడని విందుము. ఇతడు అంగుని కుమారు డెట్లయ్యెను? నీవు ఇవి బాగుగ ఎరిగినవాడవు. చెప్పగలవాడవు. కావున నీనుండి వినగోరుచున్నాము.”
సూతుడు ఋషులకు ఇట్లు చెప్పెను, లోగడ చెప్పిన బృహద్భానునకు బృహన్మనసుడు కుమారుడంటిని కదా! అతనికి చైద్యుని కూతురు యశోదాదేవి-సత్య-అనువారు ఇద్దరు భార్యలు. యశోదాదేవికి జయద్రథుడును సత్యకు విజయుడును కుమారులయిరి. విజయునకు బృహత్ అనునతడు అతనికి బృహద్రథుడు అతనికి సత్యకర్మన్ అతనికి అతి(ధి)రథ సూతుడు కుమారులయిరి. ఈతడు కర్ణుని తన కుమారునిగా గ్రహించెను. అందుచే కర్ణునకు సూతపుత్రుడను ప్రసిద్ధి వచ్చెను.