విశ్వామిత్ర గోత్ర ప్రవరాసు కీర్తనము

మత్స్యుడు మనువునకు ఇట్లు చెప్పెను. అత్రి నుండియే ఏర్పడిన మరియొక వంశమును తెలిపెదను. అత్రి పుత్రుడగు సోముని వంశము నందలి విశ్వామిత్రుడు తపస్సుచే బ్రాహ్మణత్వము పొందెను. అతని వంశమున జనించిన గోత్రకారులను వారి ప్రవర ఋషులను తెలిపెదను.

మొదటి వర్గమువారు: విశ్వామిత్రుడు, దేవరాతుడు, వైకృతి, గాలవుడు, వతండుడు, నలంకుడు, అభయుడు, చాయతాయనుడు, శ్యామాయనులు, యాజ్ఞవల్క్యులు ఆ బాలులు, బాభ్రవ్యులు, కరీషులు, సంశ్రుత్యులు, ఉలూపులు, ఔపగ హయులు పయోదులు, జనులు, పాదపులు, ఖరవాచులు, హలయములు, సాధితులు, వాస్తు కౌశికులు - ఈ ఋషుల (గోత్రముల వారల)కు విశ్వామిత్రుడు దేవరాతుడు, ఉద్దాలుడు ప్రవర ఋషులు; ఈ గోత్రములవారు పరస్పర వివాహ సంబంధములు చేసికొనరాదు.

రెండవ వర్గమువారు: దేవశ్రవులు, సుజాతీయులు, సౌనుకులు, కారుకాయనులు, వైదేహరాతులు, కుశికులు - ఈ ఋషుల (గోత్రముల వారల)కు దేవశ్రవుడు, విశ్వామిత్రుడు, దేవరాతుడు అనువారు ప్రవరఋషులు; ఈ గోత్రములవారు పరస్పరము వివాహ సంబంధములు చేసికొనరాదు.

మూడవ వర్గమువారు: ధనంజయుడు, కపర్దేయుడు, పరికూటుడు, పాణిని- ఈ ఋషుల (గోత్రముల వారల)కు విశ్వామిత్రుడు, మధుచ్ఛందసుడు, అఘమర్షణుడు అనువారు కాని విశ్వామిత్రుడు, ధనంజయుడు, మధుచ్ఛందసుడు అనువారు కాని ప్రవర ఋషులు; ధనంజయుడు ఈ వర్గములో ఆద్యుడు-మొదటివాడు-ఈ గోత్రములవారు పరస్పర వివాహ సంబంధములు చేసికొనరాదు.

నాలుగవ వర్గమువారు: విశ్వామిత్రుడు- పూరణుడు అను ఋషుల (గోత్రముల వారల)కు విశ్వామిత్ర పూరణులే ప్రవర ఋషులు - ఈ గోత్రముల వారు పరస్పర వివాహ సంబంధము చేసికొనరాదు.

ఐదవ వర్గమువారు: కమలాయజినుడు, ఆశ్మరథ్యుడు, వంజులి - ఈ ఋషుల (గోత్రముల వారల)కు విశ్వామిత్రుడు, అశ్మరథ్యుడు, వంజులి- అను మువ్వురు ప్రవర ఋషులు; ఈ గోత్రముల వారికి పరస్పర వివాహ సంబంధములు పనికిరావు.

ఆరవ వర్గమువారు: విశ్వామిత్రుడు, లోహితుడు, అష్టకుడు, పూరణుడు అను ఈ ఋషుల (గోత్రముల వారల)కు విశ్వామిత్రుడు, పూరణుడు అను ఇద్దరు ప్రవర ఋషులు; వీరికి పరస్పర వివాహ సంబంధములు పనికిరావు; పూరణ గోత్రములవారు తమలో తాము వివాహ సంబంధములు చేసికొనరాదు.

ఏడవ వర్గమువారు: లోహితులు, అష్టకులు, ఈ ఇద్దర ఋషుల (గోత్రముల వారలకు) విశ్వామిత్రుడు, లోహితుడు, అష్టకుడు అను మువ్వురు ఋషులు; అష్టకులు -లోహితులు- వీరు పరస్పర వివాహ సంబంధము చేసికొనరాదు.

ఎనిమిదవ వర్గమువారు: ఉదరేణుడు, కథకుడు, ఉదావహి, శాట్యాయని, కరీరాశి, శాలంకాయనుడు, లావకి, మౌంజాయని ఈ ఋషుల (గోత్రముల వారల)కు ఖిలిఖిలి విశ్వామిత్రుడు, విద్యుడు అను మువ్వురును ప్రవరఋషులు; ఈ గోత్రములవారు పరస్పరము ఇచ్చిపుచ్చుకొనరాదు.