ద్విభుజ మన్మథ ప్రతిమా లక్షణము

ఇక ఇపుడు మన్మథ ప్రతిమా లక్షణమును తెలిపెదను; ఇతడు ద్విభుజుడు, పూవులితని ఆయుధములు; అతని పార్శ్వమందు మకర (మొసలి రూపుకల) ధ్వజము ధరించిన అశ్వముఖుడు (కిన్నరుడు) ఉండును. దక్షిణహస్తమున పూబాణములు వామహస్తమునందు పుష్పమయ ధనువు నుండును. అతని దక్షిణ పార్శ్వ మందు భోజన పదార్థములతో కూడిన ప్రతీతి దేవియు వామపార్శ్వ మందు శయన పరికరములతో కూడిన రతీదేవియు నుందురు; ఈతనిని పరివారములో ఒక పటము(వస్త్రము) పటహము(తప్పెట) కామాతురమగు ఒక గాడిద ఉండును; దగ్గరలోనే నీటితోనిండిన దిగుడు బావియు నందన వనమునుండును. ఇట్లు కుసుమాయుధుని సుశోభనరూపముతోనున్న వానినిగా నిర్మించవలయును; అతనిఉనికి కొంచెము ప్రక్కకు వంపు తిరిగి ఉండవలయును, అతడు ఆశ్చర్యముతో చెమర్చిన కన్నులు కలిగియుండును. బ్రాహ్మణులారా! నేను ఈ ప్రతిమా లక్షణమును ఏద్దేశ (నామగ్రహణ) మాత్రమున (సంక్షేపమున) చెప్పితిని; విస్తరించి సమగ్రముగా చెప్పుట బృహస్పతికిని అశక్యము.