మత్స్య మహా పురాణము
ఘృత పర్వత దానము
ఈశ్వరుడు నారదునకు ఇట్లు చెప్పెను, ఇకమీదట ఘృతాచల దాన విషయము తెలిపెదను. ఇది సర్వోత్తమము. ఘృతము (నేయి) దివ్యమయిన పదార్ధము; తేజోమయము; మహాపాతక నాశనము. దీనికై శక్తిననుసరించి ఇరువదికాని, పదికాని, ఐదుకాని కడవలనేయి కావలెను. శక్తి హీనులు రెండు కడవల నేతితోనైన చేయవచ్చును. మొత్తము నేతిలో నాలుగవ వంతుతో విష్కంభ పర్వతములను చేయవలెను. కుంభములపై మంచి తెల్లని బియ్యపు కడవల నుంచవలెను. వాటిని దగ్గరగాచేర్చి ఎత్తుగానుండునట్లు చక్కగా అందముగా యథావిధానముగా అమర్చి తెల్లనివస్త్రములతో చెరకు గడలతో పండ్లతో కప్పుటయు చుట్టుటయు చేయవలెను. ధాన్యపర్వత విషయమునందువలెనే అధివాసమును దేవతా పూజను జరిపి ఉదయమున ఆచార్యు నకు (పురోహితునకు) అవి సమర్పించవలెను. పైవలెనే విష్కంభ పర్వతములను ఋత్విక్కుల కీయవలెను. (మంత్రము) “అమృతపు తేజపు సంయోగముచే ఘృతము (నేయి) ఉత్పన్నమయి నది. కావున అమృత రూపుడును మృతతేజస్సే కిరణములుగా గలవాడును విశ్వరూపుడు నగు శంకరుడు ఈ వ్రతముచే ప్రీతుడగుగాక! తేజోమయమగు బ్రహ్మతత్త్వము ఘృతమునందే నిలిచి యున్నది. అట్టిఘృతపుపర్వతమా! నన్ను నీవెల్లప్పుడును రక్షించుము” అని ఈవిధానముతో ఘృత పర్వత దానము చేసినవారెంతటి మహాపాతకులైనను పాపములు నశించి శంకరలోకము నందుదురు. హంసలు బెగ్గురులు(తెల్లని కొంగ జాతి నీటి పక్షులు) మ్రోయుచుండ చిరు గజ్జెల గుంపుల మాలలతో శోభించు విమానముపై అప్సరలు సిద్ధులు విద్యాధరులు తను కొలుచు చుండ పితృదేవతలతోకూడి కల్పాంతము వరకు విహరింతురు.