మత్స్య మహా పురాణము
అనంత తృతీయా వ్రతము
సౌభాగ్యారోగ్య ఫలప్రదమును పరలోకమున అక్షయఫల మిచ్చునదియు భుక్తిముక్తి ప్రదము మునగు వ్రతమును నాకు తెలుపుమని మనువు అడుగగా మత్స్యనారాయణుడిట్లు చెప్పెను. పూర్వము అంధకాసురహంతయగు పరమేశ్వరుని ఉమాదేవి యడుగ కైలాస శిఖర మందాసీనుడై యున్న ఈశ్వరుడు ధర్మమునకు అనుకూలములును లలితములునగు ప్రసంగముల నడుమ చెప్పిన వ్రతము ఒకటి కలదు. దానిని చెప్పెద వినుము.
ఈశ్వరుడు ఉమకు ఇట్లు చెప్పెను, నరులకుకాని నారులకుకాని అనంత పుణ్య ఫలమును ఇచ్చు అత్యుత్తమమగు వ్రతము ఒకటి కలదు; అవహితురాలవై వినుము. భాద్రపద వైశాఖ మాఘ మార్గశీర్ష మాసములలో దేనియందైన శుక్ల తృతీయనాడు తెల్లని ఆవాలతో (ఆవపిండితో అవనూనెతో) స్నానము చేయవలెను. గోరోచనము, గోమూత్రము, నల్లని ఆవు, గోమయము, పెరుగు, చందనము-ఇవన్నియు కలిపిన తిలకమును నుదుట ధరించవలయును. ఏలయన ఈ తిలకము సదా లలితా ప్రీతికరమును సౌభాగ్యారోగ్యకరమును. తరువాత పట్టు వస్త్రములు ధరించవలయును. ముత్తైదువలు ఎర్రని వస్త్రములను, విధవయైనచో ఎర్రనివి కాని వస్త్రములను కన్యలైనచో తెల్లని వస్త్రములను ధరించవలయును. దేవిని వరుసగా పంచగవ్యముతో కేవలము గోక్షీరములతో తేనెతో పన్నీటితో స్నానము చేయించవలెను. తెల్లని పూవులతో తెల్లని అక్షతలతో తెల్లని పూవులతో పూజించవలయును. నానావిధ ఫలములు జీలకర్ర ధనియాలు ఉప్పు, బెల్లము, పాలు, నేయి నివేదించవలయును. పూజకు ముందే ఆయా దేవతలను కూర్చుండ పెట్టవలసిన విధానమును స్థానములును ఏవి యనిన - మొదట కుంకుమతో పండ్రెండు రేకులును నడుమ దుద్దుకల పద్మము మ్రుగ్గుగా వేయవలెను. దానిపై తూర్పున గౌరిని అపర్ణను దక్షిణమున భవానిని రుద్రాణిని పడమట సౌమ్యను మదనవాసినిని - వాయవ్యమున పాటలను ఉగ్రను- ఉత్తరమున ఉమాసాధ్యా సత్యాశుభా సౌమ్యా మంగళాకుముదా సతీ-దేవులను నడుమ కర్ణికపై రుద్రుని స్థాపించవలయును. అట్లు నిలుపునపుడు వారిపై కుసుమములను అక్షతలను ఉంచి (ఆవాహయామి స్థాపయామి పూజ యామి అనుచు) నమస్కరించుచుండవలయును.
ఇట్లు మొదట ఆవాహనము తరువాత పైని చెప్పినట్లు పూజనము నివేదనము ఐన తరువాత మంగళవాద్యములు మ్రోగుచుండ ముత్తెదువులను రావించి ఎర్రని వస్త్రములతో ఎర్రని పూలతో ఎర్రని గంధద్రవ్యములతో వారిని పూజించవలెను. సింధూర కుంకుమ కుసుమ చూర్ణములతో స్నానము చేయించవలయునని శాస్త్రమున చెప్పబడియున్నది. కావున వారి శిరస్సుపై సింధూ రమును కుంకుమమును వేయవలయును. తనకు మంత్రోపదేశము చేసిన గురునికూడ యత్న పూర్వకముగా పూజించవలయును. గురువునకు అర్చన చేసిన సమస్త క్రియలు సఫలము అగును.
భాద్రపదాదిగా పండ్రెండు మాసములందును పూజకు పుష్పములు ఉపవాసమునాడు ఆహారముగా తీసికొనవలసిన ద్రవ్యము దాన సమయమున చెప్పు మంత్రము వేరువేరుగా ఉండును. ప్రతిమాస శుక్లపక్ష తృతీయాతిథినాడు బ్రాహ్మణ దంపతులను భక్తితో వస్త్ర పుష్ప గంధములతో అర్చించవలెను. పురుషులకు పచ్చని వస్త్రము లియవలెను. (పురుషులకు ధోవతి ఉత్తరీయము కాని రెండు దోవతులను కాని-స్త్రీలకు చీరను రవిక గుడ్డను ఇట్లెవరికైనను రెండు వస్త్రము లీయవలెను.) స్త్రీలకు బొబ్బరలు జాజికాయ లవణము చెరకుగడ బెల్లమును పురుషులకు ఈ పదార్థములతో పాటు బంగారు కలువపూవును కూడ ఈయవలెను. ఇవి ఇచ్చునపుడును శయనము మొదలగునవి ఇచ్చునపుడును దేవిని “దేవీ! పరమేశ్వరుడు ఎన్నడును నిన్ను విడువక సుఖింపజేయుచున్నట్లే నీవును నన్ను సంసార సాగరమునుండి తరింపజేసి సుఖింప జేయుము” అని ప్రార్థించవలెను.
వ్రతము ఇట్లు పండ్రెండు మాసములు జరిగి ముగిసిన తరువాత మంచము పరపు మొదలయినవి బంగారు కమలముతో కూడ విప్ర దంపతులకు ఈయవలెను. ఇదిగాక ప్రతి మాసమునను విప్ర దంపతులను యథాశక్తిగా ఇరువది నాలుగు మందిని కాని పండ్రెండు మందిని కాని ఎనిమిది మందిని కాని ఆరు మందిని కాని అర్చించవలెను. (వారికి పుష్పగంధ తాంబూల దక్షిణాదికము నీయవలెను.) ఇట్లు అర్చించునపుడు మొదట తన గురుని పిమ్మట మిగిలినవారిని అర్చించవలెను.
దేవీ! ఈ చెప్పిన అనంత తృతీయావ్రతము సదా అనంతఫలప్రదము సర్వపాపహరము; సౌభాగ్యారోగ్యవృద్ధికరము. దీనిని స్త్రీలుకాని పురుషులుకాని ఎవరైనను చేయవచ్చును. కాని తనకు శక్తి ఉన్నంతలో ధనమున లోభము చూపరాదు. చూపినచో అధఃపతితులగుదురు.
ఈ వ్రతమును చేయుట స్త్రీ, గర్భిణి, రోగిణి, కుమారి అయినను చేయవచ్చును. పగలే కాదు; రాత్రి (ప్రదోషకాలమున -రాత్రి ఎక్కువ గడువకుండ) చేయవచ్చును. ప్రసవించుట మొదలయిన కారణములచే అశుచిత్వము వచ్చినపుడు శుద్ధి అయిన తరువాత చేయవలెను.
అనంత ఫలప్రదమగు ఈ అనంత తృతీయావ్రతమును ఆచరించినవాడు కల్పకోటి శతములపాటు (పూర్తిగా) శివలోకమున సుఖించును. ధనము లేనివాడు మూడు సంవత్సరములు మాత్రమైనను ఆయా మాస శుక్ల తృతీయనాడు ఉపవాసము ఉండి పూవులతో మంత్రములతో యథాశక్తిగ దొరకిన ద్రవ్య నివేదనముతో ఈ వ్రతమును జరిపినచో సమగ్రఫలమును పొందును. దీనిని కన్య కాని విధవకాని చేసినను గౌరీకృపచే వ్రతము ఫలించును.
దీనిని చదివినను వినినను ఉత్తమ జ్ఞానము శివలోక ప్రాప్తి అచట కిన్నరాది దేవగణము లచే పూజలు లభించును.