పిండికా లక్షణము

సూతుడు ఋషులకు ఇట్లుచెప్పెను. సంప్రదాయమందును శాస్త్రము నందును ఉన్నది ఉన్నట్లు పిండికా లక్షణమును దానియందలి అందముల క్రమపు అనుపూర్విని అనుసరించి వరుసగా చెప్పెదను.

దేవాలయద్వారపు ఎత్తును దృష్టియందు ఉంచుకొని పీఠపు ఎత్తును నిర్ణయించు కొనవలయునని లోగడ చెప్పబడినది కదా! దానిననుసరించి నిర్ణయించుకొనిన పీఠపు మొత్తము నిలువుటెత్తును పదునారు భాగములుగా చేసియుంచు కొనవలయును; 1/16 పరిమాణముగల పదహారు భాగములు = 1/16 × 16 = 1) వీనియందలి (1) ఒకభాగము = 1/16 భూమియందు ప్రవేశించును; (2)భూమికి పైగానుండు ‘జగతీ’ అనుభాగము నాలుగు షోడశాంశములు = 4/16; (3) దానికి పైగా ‘కంఠము’ అనుభాగము మూడుషోడశాంశములు=3/16; (4) దానికిపైగా ‘వృత్తపటలము’ అనునది ఒకషోడశాంశము =1/16; (5) దానికిపైగా ‘కంఠపట్టము’ అనునది మూడు షోడశాంశములు=3/16; (6) దానికిపైగా “ఊర్ధ్వపట్టము” అనునది రెండు షోడశాంశములు = 2/16; ఇట్లు పదునాలుగు షోడశాంశములు = 14/16 పోగా మిగిలిన రెండు షోడశాంశముల = 2/16తో “పిండికా” (“పట్టికా” అనియు కొందరందురు) అనుభాగము చేయవలయును; నీరు బయటకు పోవుటకుగాను ఈ భాగమునందు "ప్రణాళికా” (కాలువవంటి ‘గాడి’) చేయవలయును; ఇది పిండికల అన్నిటియందును ఉండవలసిన సామాన్య లక్షణము.

ద్విజోత్తములారా! ఆయా దేవతా భేదములకు తగినట్లుగా వేరువేరు రూపములను వేరువేరు అమరికలతో ఉంచెడు పిండికా విశేషములను తెలిపెదను వినుడు; ఇవి 1. స్థండిలా, 2. వాపీ, 3. యక్షీ, 4. వేదీ, 5. మండలా, 6. పూర్ణచంద్రా, 7. వజ్రా, 8. పద్మా, 9. అర్ధ చంద్రా, 10. త్రికోణా అని పది విధములుగానున్నవి. వీనిఉనికి వరుసగా  -  1. మేఖల మొదలగు అమరికలులేని చతురస్రాకృతిగా నుండును, 2. రెండు మేఖలలు కలది, 3. మూడు మేఖలలు కలది, 4. ఇది ఆయతము (దీర్ఘచతురస్రాకృతి) ఇది లింగప్రతిష్ఠకు వినియోగించ రాదు, 5. ఇది వర్తులముగా నుండును, దీనియందు మూడు మేఖలలుండును, ఇది ప్రథమ గణములు మొదలగువానికి ప్రియమయినది. 6. దీని యందు క్రిందనొకటియు పైనొకటియు మేఖలలుండును: ఒక మేఖలాస్థానము కాదగిన నడుమభాగము శూన్యముగా వదలివేయబడును, 7. ఇది మూడు మేఖలలు కలిగి షడ (అష్టా) ప్రాకారముతో నుండును, 8. ఇది షోడశాస్రాకృతితో నుండును; ఇది మూలభాగమున కొంచెము పొట్టిగాను లావుతక్కువగాను నున్నట్లు కనబడునదిగా నిర్మించబడును, 9. ఇది ధనురాకారముతో నుండును, 10. ఇది త్రికోణాకృతితోనుండును, లింగపు ఎత్తులో దాదాపు సగము ఎత్తువరకు నిలువుగా తానును ఉండి త్రిశూలాకృతితో కనబడవలయును.

ఈ పీఠికయందు (పై భాగమున) ఈశాన్యమునకు కొంచెము వంపుగాను వాలుగను ఉండునట్లు ప్రశస్తమును లక్షణాన్వితమునునై చూడముచ్చటగా నుండు జలనిర్గమన మార్గమును (చిరుకాలువను) ఏర్పరచవలయును; ఇది లింగమునకు (లేదా దేవతా ప్రతిమకు) చుట్టునుండు పరివేషపు వ్యాసపు పరిమాణములో (1/3) మూడవవంతు వెడల్పుగల శిలా భాగమునందుండ వలయును, ఈ జల నిర్గమ మార్గపు కొలతలు మూలమందు (అడుగువైపున) కాని నడుమకాని పైభాగము నందుకాని పరివేషపు కొలతలకు అనుగుణముగా అనులోమానుపాతములో నుండి వలయును; ఇదియుకాక లింగపుఎత్తులో సగము ఎత్తు మందముగా మేఖల యుండ వలయును; ఈ మేఖలకుగల మందములో మూడవవంతు తక్కువగా =(2/3 పాలు) ఈ జలనిర్గమ మార్గపు కాలువ వెడల్పుండవలయును; లేదా ఈ మందములో 1/4నైన తగ్గించ వచ్చును; (అనగా ఈ కాలువ వెడల్పు మేఖలమందములో 3/4 వంతు ఉండును;) ఈ నీరు బయటకు పోవుటకై ఈ పీఠపు ఉత్తరదిశగా బయటకు ఏర్పరచిన కాలువ దీనికంటె కొంచెము ఎక్కువ వెడల్పుతో ఉన్నను ఉండవచ్చును.

ఈ చెప్పిన పీఠికాభేదముల ఫలములు: 1. స్థండిల ఆరోగ్యమును, 2. వాపి పుష్కల ధనమును, 3. యక్షి గోవృద్ధిని, 4. మండల కీర్తిని, 5. యక్షి సంపదను, 6. పూర్ణచంద్ర వరములను, 7. వజ్ర ఆయువును, 8. పద్మ సౌభాగ్యమును, 9. అర్ధచంద్ర పుత్రులను, 10. త్రికోణ శత్రునాశమును కలుగజేయును; ఇట్లు దేవాలయము లందు దేవతార్చామూర్తులను పూజించుటకై వారిని ప్రతిష్ఠించుటకు నిర్మించవలసిన దశ పీఠముల లోణములను చెప్పుటయైనది; (దేవతా ప్రతిమకాని లింగము కాని) శిలతోనో మృత్తికతోనో దారువుతోనో మిశ్ర లోహములతోనో - దేనితో చేయుదుమో  - పీఠముకూడ దానితోనే చేయవలయును; అర్చామూర్తి -  పీఠములు రెండు భిన్న పదార్థములతో చేయరాదు; అర్చామూర్తి ఆయామము (పొడవు) ఎంత యుండునో పీఠపు ఎత్తు అంత యుండ వలయును; ఏ దేవునిపత్ని ఎవరో ఆదేవి రూపము ఆ దేవుని పీఠము నందు రూపొందించవలెను.