మత్స్య మహా పురాణము
యజమానునకు చేయు అభిషేక ప్రక్రియ
హోమము ముగిసిన తరువాత అంగవైకల్యము లేకుండి, బంగారు ఆభరణములతో, పూలమాలలతో అలంకరించబడియున్న నలుగురు బ్రాహ్మణులు తూర్పునకో, ఉత్తరమునకో మొగమై అభిషేకమంత్రములు పఠించుచు మంగళ వాద్యముల మ్రోతల నడుమ లోగడ చెప్పిన పూర్ణ కుంభమందలి జలముతో యజమానునకు స్నానము చేయింతురు. (అభిషేక మంత్రముల అర్థము) బ్రహ్మ విష్ణు మహేశ్వరులు జగన్నాధుడగు వాసుదేవుడు, సంకర్షణుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు, ఇంద్రాగ్ని, యమ, నిరృతి, వరుణ, వాయు, కుబేరేశ్వరులు, బ్రహ్మ, కీర్తి, లక్ష్మీ, ధృతి, మేధాపుష్టి, శ్రద్ధా, క్రియా, మతి, బుద్ధి, లజ్జా వపుః శాంతి తుష్టి కాంతులు సప్తమాతృకలు ఆదిత్య సోమాంగారక బుధగురు శుక్రశని రాహు కేతువులు దేవదానవ గంధర్వ యక్ష రాక్షస పన్నగులు ఋషిముని గోదేవమాతలు దేవపత్నులు వృక్షనాగ దైత్యాప్సరసలు అస్త్రములు శస్త్రములు రాజులు వాహనములు ఔషధములు రత్నములు కాలావయవములు నదీ సాగర పుణ్యతీర్థములు మేఘములు నదములు-ఇవి అన్నియు నిన్నభిషేకించి జయమును సర్వ కామార్థ సిద్ధులును కలిగించుగాక!
యజమానుడు ఇట్లు సర్వ గంధ యుక్తములును సర్వౌషధీ సంస్కృతములునునగు జలములతో విప్రులు తననుస్నానము చేయించగా శుక్లవస్త్రములును శుక్ల మాల్యాను లేపనములను ధరించి తన భార్యతో కూడి శ్రద్ధాయుక్తుడై ఋత్విజులను ప్రయత్న పూర్వకముగాను అభిమాన రహితముగాను దక్షిణలతో గౌరవించవలెను. సూర్యునకు కపిల ధేనువును (ధేనువు అనగా పాడిఆవు) చంద్రునకు శంఖమును కుజునకు ఎర్రని వృషభమును బుధునకు బంగారును గురువునకు పసుపుపచ్చని వస్త్రములను, శుక్రునకు అశ్వమును, శనికి శుభ లక్షణములు కల నల్లని యావును, రాహువునకు ఇనుమును, కేతువునకు మంచి మేకపోతును ఈయవలెను. ఇదికాక ద్రవ్య రూపమున దక్షిణగా ఋత్విజులకందరకు సమాన పరిమాణములో బంగారమును కాని బంగారు (కొమ్మల)తో అలంకరించబడిన గోవును (ఒక్కొక్కరికి ఒక్కొక్కటి) కాని ఈయవలెను. గురునకు బంగారుగాని, ఆవులనుగాని అతనికి సంతోషకరమైనది మరేదైన దక్షిణకాని ఈయవలెను. ఏ దక్షిణనైనను వాటికి వేరువేరుగా విహితమయిన మంత్రముతో ఈయవలెను. 1. కపిల గోవునకు: కపిల గోవా! నీవు సర్వధేనువులలో పూజనీయవు; రోహిణివి (ఎర్రని వన్నెగల దానవు;) సర్వ తీర్థమయురాలవు; ఇట్టి నీవు మాకు శాంతి నిమ్ము, 2. శంఖమునకు: శంఖమా! పుణ్యకరములైన వానిలో పుణ్యకరమయిన దానవు; శుభకరమయిన వానిలో శుభకర మయిన దానవు; నిరతమును విష్ణునిచే ధరించబడుదానవు; ఇట్టి నీవు నాకు శాంతినిమ్ము, 3. వృషభమునకు: వృషభ రూపముననుండి జగదానంద కారకుడవగు ధర్మదేవా! నీవు అష్టమూర్తియగు శివునకు అధిష్ఠాన (వాహన)మవు, ఇట్టి నీవు మాకు శాంతి కలిగింపుము; 4. స్వర్ణమునకు: సువర్ణము బ్రహ్మదేవుని గర్భమునందుండునది; అగ్నికి బీజరూపమయినది; అనంతమగు పుణ్య ఫలమునిచ్చునది; ఇట్టి నీవు నాకు శాంతినిమ్ము. 5. పీతాంబరములకు: పీతాంబరముల జత వాసుదేవునకు ప్రియమైనది; విష్ణుదేవుని దానవగు నిన్ను ఇచ్చుటవలన నీవు నాకు శాంతినిమ్ము; 6.అశ్వమునకు: అమృతముతోపాటు జన్మించిన అశ్వరూపమగు విష్ణూ! నీవు సదా ఇంద్రునకును రవికిని వాహనమవు; ఇట్టి నీవు మాకు శాంతినిమ్ము; 7. శనికి దానము చేయు కృష్ణగోవునకు: నీవే భూమియంతయు అయియున్నావు; ధేను రూపమవు; విష్ణు సమానురాలవు; సర్వ పాప హరవు; ఇట్టి నీవుమాకు శాంతినిమ్ము; 8. ఇనుమునకు: ఆయసమా! అన్ని పనులును నాగళ్ళు ఆయుధములు మొదలగునవన్నియును నీయధీనములై యున్నవి. ఇట్టి నీవు మాకు శాంతినిమ్ము; 9. ఛాగము (మేకపోతు)నకు: నీవు అన్ని యజ్ఞములకును అంగమయియున్నావు; అగ్నికి వాహనమవు; ఇట్టి నీవు మాకు శాంతినిమ్ము; 10. శయ్యా దానమునకు: శివకేశవుల శయనము ఎన్నడును అశూన్యమై యుండును. కావున వారి దయచే అట్లే జన్మజన్మముల నా శయనముకూడ అశూన్యమయి యుండుగాక; 11. రత్న దానమునకు: సర్వ రత్నములయందును సర్వదేవతలును సన్నిహితులై యుందురు; కావున వారందరును నేచేయు రత్న దానముచే నాకు శాంతినిత్తురు గాక!; 12. భూదానమునకు: ఇతరదానము లేవియు భూదానములోని పదునారవ వంతునకు సరిపోలవు; కావున భూదానముచే నాకు శాంతి లభించుగాక!
యజమానుడు మాత్సర్యము (పోటీభావము) లేక భక్తితో విప్రులను వస్త్రాలంకార రత్న గంధ మాల్యాను లేపనములతో సంపూజించవలయును.
ఈవిధానమున గ్రహయజ్ఞము నాచరించువాడు ఇహమున సర్వకామములను పూర్ణముల నొనరించుకొని పరమున స్వర్గమున పూజితుడై సుఖింతును. ఎంత అల్పధనుడైనను తను ఎడతెగక పీడించుచుండు గ్రహమును యథాశక్తిగా పూజించి ఇతర గ్రహములను కూడ అర్చించవలయును.
గ్రామములును, గోవులును, ప్రభువులును విశేషించి బ్రాహ్మణులును పూజితులయినచో తమ్ము పూజించినవారిని తామును పూజింతురు. (ప్రీతితో చూచెదరు.) అవమానింపబడినపుడు తమ్మవమానించిన వానిని తామును అవమానింతురు. (సుఖింపజేయవలెనని తలచరు.) కావున (ఏ కర్మమునగాని) క్షేమము కలుగవలెనను కొనినవాడెవ్వడు దక్షిణాహీనముగ కార్యము నాచరించరాదు. ఏలయన సంపూర్ణమగు దక్షిణతో ఒక్కడైనను తృప్తినొందినను దానిచే యజమానునకు క్షేమము కలుగును.
నవగ్రహ మఖమను పేరుతో ప్రసిద్ధమయియున్న ఈ అయుత హోమము వివాహములు ఉత్సవములు యజ్ఞములు ప్రతిష్ఠలు విఘ్నములు ఉద్వేగము అద్భుత దర్శనములు మొదలగు సందర్భములందు క్షేమమును శుభమును కలిగించును.