మత్స్య మహా పురాణము
ద్వాపర యుగధర్మము
సూతుడు ఋషులకు ఇట్లు చెప్పసాగెను. ఇక మీదట ద్వాపర యుగధర్మ స్వరూపమును తెలిపెదను. త్రేతాయుగము ముగిసిన మీదట ద్వాపరయుగ మారంభమగును. త్రేతాయుగమున ప్రజలకు ఏఏ విధములగు లౌకిక ప్రవృత్తులును వాటి ఫలములును ఉండెనో అవియే ద్వాపర యుగాదియందుండును. ఆ యుగము మారిపోగానే క్రమముగా తత్పూర్వయుగ కార్యఫలసిద్ధులు నశించును. తరువాత ద్వాపర యుగమున ప్రజలలో లోభము భృతి (వేతనముతో పనిచేయుట) వాణిజ్యము యుద్ధము తత్త్వ నిశ్చయము చేయలేకపోవుట వర్ణవ్యవస్థ ధ్వంసమగుట కర్మ విపర్యయము (విహిత కర్మములు చేయకపోవుట నిషిద్ధ కర్మములను ఆచరించుట) బాట సారులను చంపుట తీవ్రమగు దండనము (దురభి)మానము దర్పము ఓర్పు లేకుండుట బలమునకు ప్రాముఖ్యము-అధికమగును. ద్వాపరయుగ మారంభము కాగానే రజస్తమోగుణ ప్రవృత్తులధిక మగును. మొట్టమొదటిదగు కృతయుగమున అధర్మము ఏ మాత్రమును లేకుండెను. త్రేతా యుగమునందు అది ప్రవర్తింపజేయబడెను. ద్వాపరమున వ్యాకులత నొందును. కలి యుగమున ధర్మము పూర్తిగా నశించును. ఈ ద్వాపర యుగమున వర్ణ ధర్మములును బ్రహ్మ చర్యాద్యాశ్రమ ధర్మములును సంకీర్ణములు (ఒక దాని ధర్మమునందు మరియొకటి కలిసినవి-విహితమును చేయుటతోపాటు అవిహితమునుకూడ చేయుట అవిహితమును విహితమని వాదించుట ఆచరించుట మొదలగు పాండిత్య దుర్విలసితములును) అగును. శ్రుతి స్మృతుల అర్థ నిర్ణయము విషయమున ద్వైధము (భిన్నాభిప్రాయ చిత్తవృత్తి) ఏర్పడును. శ్రుతి స్మృతులును తామై రెండు అభిప్రాయముల నిచ్చుచుండును. దాని మూలమున ధర్మతత్త్వము ఇదియని తెలి యకపోవును. దానివలన ప్రజలలో అభిప్రాయభేదములు పెరుగును. దృష్టి భేదముచే ఐకమత్యము లోపించును. దానిచే లోకము ఆకులత నందును. త్రేతాయుగమున నాలుగు పాదములతో ఒకటిగానే యున్న వేదము మరల మరల సమకూర్చబడుటచేతను ఆయువు తక్కువ యగుట చేతను ద్వాపర యుగమున అది ఋషి పుత్రులచే నాలుగుగా విభజింపబడును. ఐనను అపుడు కూడ దృష్టి విభ్రాంతి చేత వేదములు ఏవిఏవి అను విషయమునను అర్థముల విషయమునను భేదము ఏర్పడును. ఆనాటి మహర్షులు వేదములను బ్రాహ్మణ (వేదములకు ఆర్ష వ్యాఖ్యానములు (బ్రాహ్మణములు) విన్యాసము (అమరిక) స్వరక్రమ విపర్యములతోను ఋగ్యజుః సామ సంహితలుగా వ్యస్తములు (విభక్తములు)గా చేయబడును. వాటిలో ఆయా శాఖలయందు కొంత సమానత యున్నను వాటిలో కొంత వైకృతము (ఆకృతి భేదము) కలిగి అచ్చటచ్చట దృష్టిభేదమును కలుగును. బ్రాహ్మణములు కల్పసూత్రములు వాటిపై భాష్యములనెడు విద్యాస్థాన భేదములు వానిలో ప్రస్థాన భేదములు (మార్గ-సంప్రదాయ-విచారణా పద్ధతి భేదములు) ఏర్పడును. కొందరొక విషయమున ఒక ప్రస్థానము ననుసరించుచుండ మరికొందరు వారితో ప్రత్యవస్థితులు (ఎదురు వాదము చేయువారు) అగుదురు. ఇట్లు ద్వాపరయుగమున ఋషులు స్వస్వదర్శన (దృష్టి భేద)ముల ననుసరించి వేద తత్సంప్రదాయముల విషయమున భిన్నార్థ ప్రకాశనము చేయుదురు. ఆధ్వర్యవ (యజుర్వేద) శాఖయు అతఃపూర్వము ఒకే రూపమున నుండినది ద్వాపరమున ద్విధాభావమును (రెండుగా అగుటను) పొంది కొన్ని అర్థములు సమానాకారముతో ఉండియు కొన్నిటికీ విపరీత (శాస్త్ర సంప్రదాయ విరుద్ధ)ములగు అర్థములు ప్రతిపాదింపబడుటచే శాస్త్రములు ఆకులము లగును.
ఆధ్వర్యవ(యజుర్)వేదము కూడ వేరువేరు ప్రస్తాన (మార్గ-సంప్రదాయ)ములతో బహు భేదముల నొంది వ్యాకులమగును. వాటి అర్థములకు ఆయా ఋషులును మునులును భిన్న దర్శనులయి సాంకర్యము కలిగింతురు. (ఉచితానుచితార్థ సంమిశ్రణము కలిగింతురు.) ద్వాపరయుగమున నడచి నడచి వ్యాకులత నొందిన ఆ వేదవేదార్థములును కలియుగమున నాశము నందును; దీనిచే ద్వాపరమున అజ్ఞానము (అకాల) మరణము వ్యాధ్యుపద్రవములు కలుగును. వాఙ్మనః కాయికరములగు దుఃఖము లనుభవించుట కలుగును. దానిచే నిర్వేదము (ప్రాపంచిక జీవనముపై విసుగు) కలుగును. తత్ఫలముగా ప్రజలలో ఈ దుఃఖముల నుండి ముక్తి ఎట్లను విచారణ కలుగును. విచారణచే వైరాగ్యమును దానిచే సంసార దోష దర్శనమును దానిచే జ్ఞానోత్పత్తియు కలుగును.
ఈ ద్వాపరమున స్వాయంభువ మన్వంతరము నాటి మేధావులకు శత్రువులు (అలనాటి మేధావుల ఉదారాభి ప్రాయములను కాదనువారు) జన్మింతురు. ఈ ద్వాపరమున ఆయుర్వేదము జ్యోతిషము ఇతర వేదాంగములు - వీని విషయమునను శాస్త్ర విరోధులు జన్మింతురు. ఈ శాస్త్రములలో వికల్పములును (సంప్రదాయ-తదభిప్రాయ భేదములును) ఏర్పడును. అర్థ శాస్త్రమున హేతు (న్యాయ వైశేషిక) శాస్త్రమునందు కల్పసూత్రములందు భాష్య రూపమగు విద్యాస్థానములందు స్మృతిశాస్త్రము లందు ప్రస్థానము లందు వికల్పము లేర్పడి దానిచే ప్రజ అందును మతి భేదములు ఏర్పడును. మనో వాక్కాయిక కర్మములతో ఎంతో శ్రమపడిన మీదటగాని లోకయాత్ర జరుగకపోవును ఇట్లు ద్వాపరయుగము సర్వభూతములకును కాయ క్లేశము కలిగించునది యని పెద్దలు తలచుచున్నారు. లాభము-భృతి-వాణిజ్యము-యుద్ధము-శాస్త్రతత్త్వ నిశ్చయము లేకపోవుట-వేదశాస్త్రములను (విభిన్నరీతుల) నిర్మించుట ధర్మ సంకరము వర్ణాశ్రమ ధర్మ పరిధ్వంసము కామము ద్వేషము రెండువేల సంవత్సరముల పరమాయువు ఇవి ద్వాపరయుగ లక్షణములు. ద్వాపర సంధ్యా కాలమున యుగ కాలధర్మములో చతుర్థాంశ మును సంధ్యాంశ కాలమున దానిలో చతుర్థాంశమును ధర్మము ప్రవర్తిల్లును. ఇట్లు ద్వాపరము గడచిన తరువాత వచ్చు కలియుగ స్వరూపమును తెలిపెదను వినుడు: