అతివృష్టి మొదలైన ఉత్పాతములు, వానికి శాంతి

గర్గుడిట్లు చెప్పెను. అతివృష్టియు అనావృష్టియు ఈ రెండును కరవునకు నిమిత్తములు. ఋతువుకాని కాలము నందు మూడు దినములకుమించి ఎడతెగని వాన కురియుట భయ హేతువు; మేఘములు లేకయే మెరయుట - ఉరుముట పిడుగులు పడుట వంటి వైకృతములు. జరిగినచో రాజు మరణించును. శీతోష్ణ వ్యత్యాసమయినచో రాజులకు శత్రు భయము. రక్తపువాన కురిసినచో శస్త్ర భయమేర్పడును. బొగ్గులు నిప్పుకణికలు ధూళి వర్షించినచో నగర నాశమగును, మజ్జ ఎముకలు నూనె మాంసము వర్షించినచో జనమృత్యు భయము; ఫలపుష్ప ధాన్యములు కురిసినచో శత్రుభయము; ధూళి ప్రాణులు పండ్లు వర్షించినచో రోగభయము, అన్నవర్ష మయినచో దేశమున ఛిద్రములును, సస్యములకు భీతియు కలుగును; ఆకసమున ధూళిలేకయు మేఘములు లేకయు రవి ప్రకాశించుచున్నను, నీడ కనబడకపోయినను ఎదురు రూపుతో అనగా తలక్రిందుగా కనబడినను దేశ భయమగును; ఆకసమున మేఘములు లేనపుడు కాని రాత్రివేళ కాని దక్షిణపు కొనలోగాని ఉత్తరపు కొనయందుగాని తెల్లని ఇంధ్రధనుస్సు కనబడినను, ఉల్కాపాతమును దిగ్భ్రాహమును పరివేషమును ఏర్పడినను, గంధర్వ నగరము కనబడినను, శత్రు సేనవలన భయమును దేశోపద్రవమును కలుగును. ఈ నిమిత్తముల శాంతికై సూర్య చంద్ర పర్జన్యదేవతలను ఉద్దేశించి ద్విజశ్రేష్టులచే యధావిధి యాగము జరిపించవలెను. ధనము: గోవులు సువర్ణము దక్షిణలుగా బ్రాహ్మణులు దీయవలెను. అందుచేత దోషశాంతి అగును.