శర్మిష్ఠా యయాతి సంవాదము

శౌనకుడు శతానీకునితో ఇంకను ఇట్లు చెప్పెను, యయాతి తన రాజధాని చేరెను. అది మహేంద్రుని అమరావతితో సమానమయినది. అతడు అంతఃపురమున ప్రవేశించి అందు దేవయానికి నివాసము ఏర్పరచెను. ఆమె అనుమతితో అతడు వృషపర్వుని కుమార్తెయగు శర్మిష్ఠకు అశోకోద్యానపు సమీపమున గృహమును నిర్మింపజేసి దానియందామెను వసింపజేసెను. ఆమెకు పరివారముగా ఆమె నాశ్రయించియుండు దానీ సహస్రము కూడ అచ్చటనే ఆ అశోకోద్యానము నందే ఆమెతో పాటు వసించుచుండ రాజు వారికి వస్త్రములు అన్న పానములు వేరువేరుగా ఏర్పాటు చేయించి కనిపెట్టి యుండెను. నహుషాత్మజుడగు ఆ యయాతి రాజు దేవయానితో కూడి చాలా ఏండ్లు దేవునివలె విహరించుచు మిగుల సంతోషించుచుండెను.

ఋతుకాలమురాగా ఉత్తమాంగనయగు దేవయాని మొదటిసారిగా గర్భవతి యయ్యెను. కుమారుని కనెను. కమలనయనయగు వృషపర్వుని కూతురు శర్మిష్ఠయు వేయి సంవత్సరముల తరువాత యౌవనవతియై ఋతుదర్శనమును పొందెను. లోకధర్మమును ఎరిగిన ఆశర్మిష్ఠ “నాకు ఋతుకాలము సంప్రాప్తమయినది. కాని నేను ఎవరిని పతిగా వరించి పొంది యుండలేదు కదా! ఇపుడు ఏది తగినది? ఏమి చేయవచ్చును? ఎట్లు చేసిన ఈఋతువు సఫలమగును?” అని ఆలోచించి ఆమె తన మనసున యయాతినే తనకు ప్రాప్తించిన యౌవనమునకు తగిన పతినిగా వరించుకొనెను. “ఆమె (దేవయాని) తానై యయాతిని తన భర్తనుగా వరించినట్లే నేనును అతనినే నా భర్తనుగా వరింతును. రాజే నాకును పుత్త్ర ఫలమును ఈయదగినవాడు అని నామదికి నిశ్చయముగా దోచుచున్నది. ఆరాజు ధర్మము నెరిగినవాడు. అతడు ఈ సమయమున ఏకాంతమున నాకు కనబడిన ఎంత బాగుగానుండును!” అని ఆమె తలచెను.

ఇంతలో అదే సమయమున రాజు కూడ దైవికముగా బయటికి వచ్చి అశోకోద్యాన సమీపమున శర్మిష్ఠ యున్నచోటికి దగ్గరలో వచ్చియుండెను. సహజముగనే చూచువారికి ఇంపు గొలిపెడి చిరునవ్వుమోము గల శర్మిష్ఠ రాజట్లు ఏకాంతమందు ఉండుట గమనించెను. అతడు ఉన్న వైపునకు పోయెను.

అతనిని సమీపించెను. దోసిలిచేసి ఇట్లు పలికెను. “నహుష పుత్త్రా! సోముడు -ఇంద్రుడు-విష్ణువు-యముడు-వరుణుడు-నీవు-ఈ వీరి ఇండ్లయందలి స్త్రీని పరపురుషుడు ఎవ్వడు చూడనైన చూడగలడు? నేను గొప్ప వంశమున పుట్టినదాననని సౌందర్యవతినని నీకు మొదటి నుండియు తెలియును. ఇట్టి నేను కామార్తనై నిన్ను అభియాచించుచున్నాను. రాజా! నాకు ఋతుఫలము ఇమ్ము.” యయాతి: “నీవు శీలసంపన్నవు. ఉత్తమ దైత్య వంశమున పుట్టితివి. నీలో దోషమేమియు లేదు. నీ రూపమునందును సూదిమొనయంత కూడ దోషము లేదు. ఇది యంతయు నాకు తెలియును. కాని నేనానాడు దేవయానిని వివాహమాడినప్పుడు శుక్రుడు “నీవు ఈశర్మిష్ఠను శయనముమీదకు పిలువరాదు” అని నాతో చెప్పెను.” శర్మిష్ఠ: “పరిహాసమున-స్త్రీ విషయమున, పెండిండ్లు, ప్రాణహాని, సర్వధననాశము-ఈ సందర్భములందు ఆడెడి అసత్యము పాతకము కాదందురు. సాక్ష్యము చెప్పుమనినప్పుడు అన్యధాగా చెప్పినవారు అసత్యము చెప్పిన పాపము పొందుదురు. ఏకార్థత అనగా ఆ కార్యము వలన కలుగవలసిన ప్రధాన ప్రయోజనము దెబ్బ తినినపుడు మాత్రమే అసత్యము అసత్యమై అది చెప్పిన వానిని హింసించును.” యయాతి: “అన్ని ప్రాణులకును రాజు ప్రమాణము. (అతడు నడచినట్లు అందరును నడతురు.) అట్టివాడు అసత్యము పలికినచో తానే నశించును. కావున ఎట్టి ప్రయోజనము కాని ధనముకాని నశించు పరిస్థితి వచ్చినను నేనుఅసత్య మాడజాలను.” శర్మిష్ఠ: “రాజా! తన పతియు తన సఖిపతియు స్త్రీకి సములే. ఈ ఇద్దరిలో ఏ ఒక్కరు ఒకనిని పతిగా చేసికొనినను రెండవ వారును అతనినే పతిగా చేసికొనినట్లే అని పెద్దలు చెప్పుచున్నారు. నీవు నాసఖికిపతివికదా!” యయాతి: “అడిగినవారికి అడిగినది ఈయవలయునని నా వ్రతము-నీవు కామఫలమును కోరుచున్నావు. నేను నీకేమి ఉపకారము చేయవలెను?” శర్మిష్ఠ: “రాజా! నన్ను అధర్మము అంటకుండ కాపాడుము. ధర్మ ఫలము నాకు ఇమ్ము. నీవలన సంతానవతినై నేను లోకమున ఉత్తమ ధర్మము నాచరించగలుగ వలయును. రాజా! భార్య-దాసుడు-సుతుడు- ఈ ముగ్గురును తమకు తమ ధనము మీదగాని తమమీదగాని స్వత్వమును స్వాతంత్య్రమును లేనివారు. వీరుఎవరిని ఆశ్రయించినచో-అనగా వీరుఎవరి ధనమైనచో -వీరును వీరి ధనమును-ఆ భార్య-దాసుడు-సుతుడు-అను ముగ్గురు స్వామికి చెందియుండును. ఇక్కడనో-దేవయాని నీ భార్యకదా! ఆమెకు తనపై స్వత్వములేదు. ఆమె నీ యధీనమునందలిది. నేనామెకు దాసిని. కనుక నేనును నీ స్వాధీనమునందుండి నీవనుభవింపదగినదాననే. ఈ హేతువులచే నన్ను నీవన్ని విధముల భరించవలసిన వాడవే. నేను భరింపబడవలసిన దానను. భరింపబడునది భార్య. కావున నేనును నీకు భార్యనే. కనుక నన్ను పొందుము.”

యయాతి రాజు శర్మిష్ఠ చెప్పినది నిజమే యనెను. ఆమె ధర్మజ్ఞతను అతడు మెచ్చుకొనెను. ఆమెకు ధర్మమును దానముగా ఇచ్చుటకు అంగీకరించెను. అతడామెతో సంగమించెను. తమతమ కోరికలను ఇరువురును తీర్చుకొనిరి. ఒకరినొకరు మెచ్చుకొనిరి. ఎవరి త్రోవను వారు పోయిరి. ఈ సమాగమముతో వృషపర్వ పుత్రి శర్మిష్ఠ ఆ రాజశ్రేష్ఠుని వలన ప్రథమముగా గర్భవతియయ్యెను. యథాకాలమున ఆపద్మలోచనకు కుమారుడు కలిగెను. వాడు దేవ కుమారుడు వలె నుండెను. అతని వర్చస్సు ఆదిత్యుని వర్చస్సువలె నుండెను.