మత్స్య మహా పురాణము
ధరాదాన విధానము
శ్రీమత్స్యుడు మనువునకు ఇట్లు చెప్పెను. ఇపుడిక అను (అత్యు)త్తమమును మానవులకు అమంగల్య (అశుభ)మును నశింపజేయునదియు పాపక్షయకరమును అగు ధరాదాన విధానమును తెలిపెదను. బంగరుతో జంబూద్వీపమును అనుకరించు (పోలిన) పృథివీ ప్రతిమను చేయించవలెను. దానియందు మర్యాదా (నాలుగు దిక్కుల యందలి అవధి) పర్వతములును నడుమ మేరువును అష్టలోకపాలురును నవవర్షములును నదీ నదములును అంతమందు (చివరి హద్దుగా చుట్టును) సాగరమును నుండవలయును. ఈ పృథివీ ప్రతిమ మహారత్న సమాకీర్ణ (వ్యాప్త)మై అష్టవసు ద్వాదశాదిత్యై కాదశ రుద్ర సేవితమయి యుండవలెను. ఇది వేయియో ఐదువందలో మూడువందలో రెండువందలో ఒకవందయో పలముల బంగరుతోగాని ఐదు పలములకు పైగా ఎంత తూకపు బంగారుతోనైనను అశక్తుడయినను విచక్షణుడై చేయించవలయును, ఇదియెరిగి తులాపురుషదానమందువలెనే లోకపాల ఆవాహనమును ఋత్విజులను మండపమును సంభారములను భూషణములు వస్త్రములు మొదలగువానిని సమకూర్చు కొనవలయును, ఈ పృథ్వీప్రతిమను వేదియందు పరచిన కృష్ణాజినముపై తిలలయందుంచవలెను, దగ్గరలో అష్టాదశధాన్యములను లవణాది రస ద్రవ్యములను అష్టపూర్ణకలశములను పట్టు వితానకము (మేలుకట్టు)ను, వివిధ ఫలములను రమ్యములగు అంశుకము (సన్నని మేలగు వస్త్రము)లను శ్రీఖండ శకలము (మంచిగంధపు కర్రముక్క)లను ఉంచవలయును, ఇట్లన్నియు అమర్చి ఈ ప్రతిమకు అధివాసనమును జరిపి తెల్లని వస్త్రములను పూవులనుదాల్చి సర్వాభరణ భూషితుడై పుణ్యసమయము రాగానే దోసిటపూవులు తీసికొని ఈ ప్రతిమాదికమును ప్రదక్షిణించి ఈ మంత్రములను ఉచ్చరించవలయును:
“వసుంధరా! నమస్తే! సర్వదేవులకును నీవే భవనమవు. సర్వ భూతములకును ధాత్రి (ధరించునదియు, తల్లియు, పోషించునదియు)వి. కావున ఇట్టి నీవు మమ్ము రక్షించుము, వసువును, అనగా బంగారును, ధనమును, అందును, అతి నిర్మలమగు దానిని ధరింతువు గావున ‘వసుంధర’ అనబడుచున్నావు; కావున మమ్ము నీవు భయముల నుండి మిక్కిలిగా కాపాడుము, అచలా! (కదలనిదానవగు ఓ భూమీ!) చతుర్ముఖుడు కూడ నీ అంతమును అందుకొనజాలడు; కావున అనంత అనబడు నీకు నమః; ఇట్టి దానవు కావున నీవు దయతో మమ్ము సంసారపు బురద నుండి కాపాడుము, గోవిందుని యొద్ద లక్ష్మియు, శివునియొద్ద గౌరియు, బ్రహ్మ యొద్ద గాయత్రియు, చంద్రుని యందలి వెన్నెలయు, రవియందలి ప్రభయు, బృహస్పతియందలి బుద్ధియు, మునుల యందలి మేధయు నీవే అయియున్నావు; విశ్వమంతటిని వ్యాపించియున్నావు కావున నీవు ‘విశ్వంభర’ (విశ్వమంతట నిండి దానిని మోయునది - బిభర్తి) అనబడుచున్నావు; ధృతి, క్షాంతి, క్షమ, క్షోణి, పృథ్వి, వసుమతి, రస, ఈ మూర్తులతోనున్న దేవీ; సంసార సాగరమునుండి నన్ను కాపాడుము.”
అని ఇట్లు పలికి ఆదేవిని బ్రాహ్మణులకీయవలెను; ఎట్లన - అందుసగమో నాల్గవవంతో గురువునకును మిగిలిన దానిని ఋత్విజులకును (సమముగా పంచి) ఇచ్చి నమస్కరించి వీడ్కొన వలయును; ఈ విధముగా పుణ్యకాలము వచ్చినపుడు శుభయగు స్వర్ణ పృథివిని చేయించి దానము చేయువాడు విష్ణు స్థానమందును; రవి సమాన కాంతియు చిరుమువ్వల గములమాలలు కలదియు అగు విమానముపై నారాయణపురమేగి, అందు కల్పత్రయ కాలముండును; పితృ, పుత్ర, పౌత్రాధికులగు ఇరువదియొక్క తరముల వారిని తరింపజేయును.