సౌభాగ్య శయన వ్రతము

మత్స్య నారాయణుడు ఇట్లు చెప్పెను, ఇట్టిదే మరియొక వ్రతమును చెప్పెదను. వినుము. సౌభాగ్యశయన వ్రతమని దానిని పురాణవేత్తలందురు. అది సర్వ కామఫలదము.

పూర్వము ప్రళయకాలమున భూర్భువః సువరాది లోకములన్నియు దగ్ధములు కాగా సర్వభూతముల సౌభాగ్యమును ఒకచోచేరి ఒకటిగానై వైకుంఠమున కేగి విష్ణు వక్షమున నిలిచెను. మరల చాలకాలమునకు సృష్టి ఆరంభముకాసాగెను. ప్రధాన పురుషాత్మకమగు లోకమంతయు మాయాకృతమయిన అహంకారముతో ఆవృతమయి యుండెను. బ్రహ్మ విష్ణులకు (తమ తమ గొప్పతనము విషయములో) పోటీ ఏర్పడెను. అపుడు లింగాకృతితో మహాభయంకర వహ్ని జ్వాల ఉద్భవించెను. దాని వేడిమితో మిగుల కాగిన విష్ణు వక్షమునుండి అంతవర కచట నిలిచిన సౌభాగ్య ఘనము కరగి బయటికి వచ్చెను. అది అచటినుండి లేచి ఎగిరినది. అది భూమికి చేరులోపలనే అంతరిక్షము నందుండగనే బ్రహ్మ మానసపుత్రుడును బుద్ధిశాలియు నగు దక్షుడు దానిని త్రావెను. వెంటనే అతడు రూపలావణ్య బలతేజోవంతు డయ్యెను. దానిలో కొంత మిగిలినదై (చిందినదై) సర్వసౌభాగ్య దాయకములగు ఎనిమిది ఓషధులుగానయ్యెను. 1. చెరకు; 2. యవలు మొదలగువానినుండిచేసిన చక్కెర; 3. జాజికాయ; 4. ధనియాలు; 5. విరిగిన ఆవుపాలు; 6. కుంకుమ పూవు; 7. బొబ్బరలు; 8. ఉప్పు అను ఈ ఎనిమిదిటికిని సౌభాగ్యాష్టకము అని పేరు. ఇవియే ఆ ఓషధులు. వీటిని పానము చేసిన దక్షుని కూతురే సతీదేవి అతిలోక లావణ్యవతి; కనుకనే ఆమెకు లలిత అనిపేరు. ఆమెను శివుడు పెండ్లాడెను. ఆమె సౌభాగ్య మయియు భుక్తి ముక్తి ప్రదాయినియు; ఆమె నారాధించిన స్త్రీకి కాని పురుషునకు కాని ఏమి లభింపకుండును? అనగా విని మనువు ఆ జగద్ధాత్రిని ఆరాధించు విధానమును తెలుపుమని అడుగగా మత్స్య నారాయణుడు ఇట్లు చెప్పెను.

వసంత మాసారంభమున చైత్ర శుక్ల తృతీయా తిథియందు ఉదయమున నూవులతో (నూవుపిండితో నూవుల నూనెతో) స్నానము చేయవలెను. ఆనాడు ఆమె విశ్వాత్ముడగు పరమేశ్వరుని సమంత్రకముగా పెండ్లాడెను. కనుక ఆనాడు శ్రీలలితా పరమేశ్వరుల ప్రతిమలను గంధోద కముతోను పంచగవ్యములతోను స్నానముచేయించి వారిని నానావిధఫలపుష్పగంధ ధూపదీపము లతో అర్చించవలెను.

ఇట్లు పూజించి సౌభాగ్యాష్ట ద్రవ్యములను ఎనిమిదింటిని లలితా పరమేశ్వరుల ముందుంచి నివేదించి ఉత్తరపూజ జరుపవలెను. గోశృంగోదకమును మాత్రము త్రాగి ఉపవాస ముండి భూమియందే శయనించి రాత్రి గడుపవలెను.

తెల్లవారిన తరువాత (చవితినాడు) స్నాన జపములుచేసి శుచియై వస్త్రమాల్య విభూష ణములతో విప్రదంపతులను పూజించి లలితా పరమేశ్వరుల ప్రతిమలను ‘సౌభాగ్యాష్టకమును ‘లలితా ప్రీయతాం’ అని పఠించుచు వారికి దానమీయవలెను. ఇట్లు ప్రతిమాసమున సంవత్సరము పొడవున చేయవలెను. ఉపవాసమునాడు తీసికొనవలసిన ఆహారమునను దానమంత్రమునను భేదముండును. ఎట్లనగా చైత్రమాసమున గో శృంగోదక మాహారము-లలితా ప్రీయతాం’ మంత్రము. వైశాఖమున గోమయ మాహారము-’విజయా ప్రీయతాం’ మంత్రము; జ్యేష్ఠమున మందారపుష్ప మాహారము-’భద్రా ప్రీయతాం’ మంత్రము; ఆషాఢమున బిల్వపత్రము ఆహారము- ‘భవానీ ప్రీయతాం’ మంత్రము; శ్రావణమున పెరుగె ఆహారము-’కుముదా ప్రీయతాం’ మంత్రము; భాద్రపదమున కుశోదక మాహారము-’శివాప్రీయతాం’ మంత్రము; ఆశ్వయుజమున క్షీర మాహారము ‘వాసుదేవీ ప్రీయతాం’ మంత్రము; కార్తీకమున వృషదాజ్యము (మీగడ పెరుగు) ఆహారము - ‘గౌరీ ప్రీయతాం’ మంత్రము; మార్గశిరమున గోమూత్ర మాహారము ‘మంగళా ప్రీయతాం’ మంత్రము; పుష్యమున నేయి ఆహారము ‘కమలా ప్రీయతాం’ మంత్రము, మాఘ మున నల్ల నువ్వులు (నువ్వుల పొడి) ఆహారము; ‘సతీ ప్రీయతాం’ మంత్రము, ఫాల్గుణమున పంచగవ్యము ఆహారము-’ఉమా ప్రీయతాం’ మంత్రము; చైత్రాది మాసములందు వరుసగా మల్లె–అశోకము-తామర కడిమి-కలువ-మాలతి-కుబ్జకము (గొజ్జంగి) కరవీరము (ఎర్రగన్నేరు జాతి ఎర్రని తెల్లని పూలు) రెల్లు వాడగన్నేరు-కుంకుమ పూవు-ప్రేంకణము- ఈ పూవులతో పూజించవలెను. జపాపుష్పము-కుంకుమపూవు మాలతి-నూరు రేకుల తామర కరవీరము పూలు ఎప్పుడును ప్రశస్తములే.

ఇట్లు పండ్రెండు మాసములందును భక్తితో పూజించవలెను. వ్రతము ముగిసిన తరువాత ఉమామహేశ్వర ప్రతిమను సర్వసామగ్రీ యుక్తమయిన క్రొత్త మంచముపై నుంచి వానిని బ్రాహ్మణ దంపతులకు దానమీయవలెను. యథాశక్తిగ మరికొందరు బ్రాహ్మణ దంపతులకు వస్త్రములు ధాన్యము ఆభరణములు గోవులు మొదలైనవి దాన మీయవలెను. ధనమునకై లోభించరాదు. అహంకారముతో చేయరాదు.

ఇట్లు చేసిన స్త్రీకాని పురుషుడు కాని కుమారి కాని అన్ని కోరికలును తీరి అనంతఫల మందుదురు. కీర్తి సౌభాగ్యారోగ్య రూపాయుర్వస్త్రాలంకరణ భూషణములు లభించును. మూడువందల అర్బుదముల సంవత్సరములు రాజత్వమందును. ఇట్లీ వ్రతమున వరుసగా పండ్రెండేండ్లు కాని పదునెనిమిదేండ్లయినను చేసినవారు పదివేల కల్పముల పాటు దేవతల సేవల నందుకొనుచు కైలాసమున వసింతురు.

దీనిని వినినను వినిపించినను వారికి కూడ విద్యాధరత్వమును స్వర్గలోక చిరనివాస మును లభించును. దీనిని పూర్వము బ్రహ్మదేవుడు-కార్తవీర్యార్జునుడు - వరుణుడు-నంది-వీరు చేసిరి. మిగిలినవారి మాట చెప్పవలసిన పనియే లేదు.