వామన జననము

శౌనకుడు అర్జునునకు ఇట్లు చెప్పెను. అసురులు అందరును నిస్తేజస్కులగుట చూచి అసురేశ్వరుడు అగు బలి పితామహుడగు ప్రహ్లాదుని ఇట్లడిగెను. తండ్రి! దైత్యులందరును ఇట్లు అకస్మాత్తుగా వహ్నితో దగ్ధులయిరేమో బ్రహ్మాండముచే దెబ్బతినిరేమో యనునట్లు నిస్తేజస్కు లైరి ఏల? దైత్యులేమైన దుర్యజ్ఞము లాచరించిరా? వైరులేదయిన అకృత్యమును ఆచరించగా అది వీరి నాశమునకై సముద్భూత యయినదా! అని పౌత్రుడడుగ వీరుడగు దైత్యపతి ప్రహ్లాదుడు చాలతడవు ధ్యానించి ఇట్లు పలికెను: ఆకస్మికముగా గిరులు చలించుచున్నవి; భూమి నిబ్బరము కోల్పోవుచున్నది, సముద్రములు క్షోభిల్లుచున్నవి; దైత్యులు నిస్తేజస్కులుగా చేయబడిరి; సూర్యాది గ్రహములు ఎప్పటివలె నడుచుటలేదు; ఈ హేతువులను బట్టి దేవతలకు పరమలక్ష్మి కలుగ నున్నదని ఊహించవచ్చును; మహాబాహూ! ఇది మహాకారణమే; సురవైరీ! ఇది అల్ప కార్యమని తలచకుము; అని దానవపతితో పలికి అసురోత్తముడును అత్యంతహరి భక్తుడును అగు ప్రహ్లాదుడు మనసా హరిని ధ్యానించెను; ప్రహ్లాదుడును మనోహరమగు ధ్యానయోగ మనుష్ఠించి దేవదేవుడగు జనార్దనుని తనచిత్తమున విచారణచేసికొనెను; ఆ ప్రహ్లాదునకు ఆ దితి ఉదరము నందు వామన రూపుడై తన ఉదరమందు సప్త లోకములను ధరించిన ఆదిప్రజాపతియగు నారాయణుడు కనబడెను; అతని లోపల వసువులు, రుద్రులు, అశ్వినులు, మరుత్తులు, సాధ్యులు, విశ్వేదేవులు, ఆదిత్యులు, గంధర్వులు, నాగులు, రక్షస్సులు, విరోచన తనయుడు అసుర నాయకుడునగు బలి, జంభకుజంభ నరక బాణాది మహాసురులు, తానును (ప్రహ్లాదుడు), భూమి, ఆకాశము, వాయువు, జలము, అగ్ని, సముద్ర, వృక్ష, పర్వత, నదీ సరస్సులు, పశువులు దేవ, మానవ, సరీ సృపములు, సర్వలోక స్రష్టయగు బ్రహ్మ, రుద్రుడు, గ్రహనక్షత్ర విశేషములు దక్షాది ప్రజాపతులు కనబడిరి. ఇవి అన్నియు చూచి విస్మయావిష్ణుడై ప్రహ్లాదుడు క్షణములో మరల తేరుకొని దైత్యేంద్రుడును విరోచన పుత్రుడునగు బలితో ఇట్లనెను. నాయనా! నేనంతయు నెరిగితిని; మీకందరకును తేజోహాని కలిగిన హేతువు యాథార్థ్య ముతో తెలిపెదను. వినుము, దేవదేవుడును జగత్కారణుడును తనజన్మకు కారణమగునది లేనివాడును జగదాదికర్తయు, అనాదియు విశ్వ మున కాదియు, వరేణ్యుడు (శ్రేష్ఠుడు - ప్రార్థ నీయుడు)ను వరదుడును హరియు (పాపములను హరించువాడును) గొప్పవాని అన్నింటిలో గొప్పవాడును గొప్పవారికిని గొప్పవాడును ప్రమాణ ములకును ప్రమాణభూతుడును సప్తలోక గురుడు (తండ్రి) అగు బ్రహ్మకును తండ్రియు ప్రభువు లకును పరమ ప్రభువును మహాత్ముడును ఆదిమధ్యాంతరహితుడును భగవానుడును అగు మహాత్ముడు ఈ విష్ణువు త్రైలోక్యమును అనాధము (రక్షణకలది)గా చేయుటకై అంశముతో అదితి గర్భమునందు అవతరించినాడు; రుద్రబ్రహ్మేంద్ర రవీందులకును మరీచ్యాది ప్రజాపతు లకును ఆతని స్వరూపమెరుగరానిది; తన కలాంశముతో నృసింహరూపుడై మునుపు మాతండ్రిని చంపిన ఈశుడు సర్వయోగీశ మనోనివాసుడునగు వాసుదేవుడీతడు; వేదతత్త్వవిదులీ అక్షరు నెరిగి జ్ఞానబలమున తమ పాపములు పోద్రోలి అతని యందే లయమందుదురు; వారు మరల జన్మించరు; అట్టివాసుదేవుని నమస్కరింతును; సముద్రము నుండి అలలువలె అతని నుండియే సమస్త భూతములు జనించి ప్రళయమున నతని యందే లయమందును, రుద్ర, బ్రహ్మాదులును ఆ పరమ పురుషుని రూప బల ప్రభావ భావముల నెరుగజాలరు; రూపస్పర్శ రస శబ్ద గంధ గ్రాహులగు చక్షుస్త్వక్ జిహ్వాశ్రోత్ర ఘ్రాణములును అతనిని గ్రహింపజాలవు; అట్టి స్తవనీయుడును మనోమాత్ర గ్రాహ్యుడును ఈశ్వరుడును అగు హరికి వాసుదేవునికి నమస్కరింతును, తన ఏకదంష్ట్రాగ్రముతో అతడు భూమిని ధరించినందునే ఆ దేవియు ఈ సర్వభూతములను ధరించగలుగుచున్నది; ఈ సకల జగము అతనియందే శయనించియున్నది; అట్టి హరి అంశావ తారమెత్తి దైత్యతేజములకు హాని కలిగించినాడు. సంసారవృక్ష కుఠారుడగు ఆదేవునికి నేను అజస్రమును నమస్కరించు చుందును. మహాత్ముడగు ఆ దేవుడు జగత్కారణుడు. మహా- సురేంద్రా! అతడు తన పదునారవ అంశముతో దేవమాతృ గర్భమున ప్రవేశించినందున అతని బలముచే దైత్య శరీర తేజస్సులు హరింపబడినవి.

ఇటువంటి దుర్బుద్ధియు అవివేకియునగు నీవు రాజుగానున్న ఈ దైతేయదానవులు వినాశమందుదురని నాకు తోచుచున్నది; దేవదేవుడు మహాభాగుడు అజుడు విభుడగు వాసు దేవుని పాపసంకల్పుడవగు నీవుతప్ప ఇతరుడెవ్వడు ఇట్లు అనును? నీవు పేర్కొన్న ఈ సమస్త దైత్యదానవులును బ్రహ్మాది దేవతలును స్థావర పదార్థములన్నియు అనంతరూపములగు సకల తత్త్వములును నీవును, నేనును పర్వత వృక్ష నదీనద సముద్రద్వీప సహిత సకల జగమును కేశవునకు సరిపోలవు, అతివంద్యులకును వంద్యుడును, వ్యాపియును పరమాత్ముడునునగు ఎవని ఏకాంశములో సర్వజగము రూపొందినదో అట్టి హరిని అవివేకివి వినాశాభిముఖుడవు అగు నీవుతప్ప మరెవ్వరిట్లనగలరు? నీవు దుర్భుద్ధివి; సంస్కార రహిత చిత్తుడవు, పెద్దల అదుపు మీరి నడుచువాడవు; దురాత్ముడు కృష్ణనిందకుడునగు నిన్ను కనిన అధముడగు నీతండ్రి నా ఇంట జన్మించినందున నేను శోచనీయుడనైతిని, కృష్ణుని యందు నిలిపిన భక్తి సంసార మందంతటను సర్వపాపనాశనియై యున్నది, నీవు నన్నైన గమనించవలదా? మహాత్ముడగు కృష్ణుని కంటెమించి నాకు నా దేహము కూడ ప్రియతరము కాదని లోకము ఎరుగును; నాకు ప్రాణముల కంటెను హరిప్రియక(త)రుడని నీవెరుగకున్నావే! నీవు నన్ను కూడ గౌరవింపక ఆతని నిందించుచున్నావే! బలీ! నీ గురుడగు విరోచనునకును గురుడనగు నాకును శ్రీహరి గురుడు; ఇట్లు గురు గురు గురుడగు కృష్ణుని నిందించుచున్నందున అచిరకాలముననే నీవు ఐశ్వర్య భ్రంశమందుదువు; బలీ! జనార్దనుడు అగు జగన్నాధుడు నాకు దేవుడుగదా! నీకు నేను అనాదరణీయుడను ఉపేక్షణీయుడను ఐనను ఆకారుడగు అతడు నీయందు ప్రీతికలవాడు కావలయును కదా! నీవింత మాత్రముకూడ ఆలోచింపక జగద్గురుని నిందచేసితివి కావున నిన్ను శపించుచున్నాను; నీవు నాతో అచ్యుతుని నిందించి పలుకుట నా శిరశ్ఛేదము కంటె బాధా కరము గావున నీవు రాజ్యభ్రష్టుడవు అయి పతనమందుము, ఈ సంసారసాగరమునకు రక్షకుడు హరితప్ప మరిలేడు కావున అట్టి హరిని నిందించిన నీవు త్వరలోనే రాజ్యభ్రష్టుడవగుట చూతును.

దైత్య పతియగు బలి అప్రీతి కరమగు తన గురు(పితామహు)ని వచనమును విని అతనిని మరల మరల నమస్కరించుచు అతనిని ప్రసన్ను నొనర్చుకొనుటకై బ్రతిమాలసాగెను; తండ్రీ! ప్రసన్నుడవు కమ్ము; అజ్ఞానహతుడనగు నాపై కోపింపకుము, బలగర్వ మత్తుడనయి నేనీమాట అంటిని, దైత్యోత్తమా! నేను మోహముచే నా విజ్ఞానమును కోల్పోయితిని, పాపుడను; దురాచారుడనగు నన్ను శపించి నీవు మంచిపనియే చేసితివి, తండ్రీ! నీ శాపమున నాకు రాజ్యధనములు పోవునని, నీవిషయమున అవినయము చూపితినన్నందులకు కలిగినంత దుఃఖము కలుగుటలేదు, త్రైలోక్య రాజ్యము కాని, ఐశ్వర్యము కాని ఇట్టి మరేదికాని లోకమున దుర్లభముకాదు, ఈ సంసారమున నీవంటి గురువులే దుర్లభులు; కావున దైత్యపతీ! అనుగ్ర హించుము, కోపింపకుము, తండ్రీ! నేను నీకోప దృష్టికి పరితాప పడుచున్నాను కాని శాపమునకు కాదు; అన ప్రహ్లాదు డిట్లనెను: నాయనా! కోపముచే నాకు మోహము జనించినది; దానిచే వివేక మపహరింపబడినందున శపించితిని, అంతేకానిచో సర్వగుడగు హరి నెరిగిన నేనెట్లు శపించియుందును. అసురపుంగవా! నేను నీకిచ్చిన శాపమవశ్యము జరుగవలసియే యున్నది; కావున నీవు దుఃఖింపకుము, ఇది మొదలుకొని దేవేశుడు భగవానుడు అచ్యుతుడు ఈశుడునగు హరి యందు భక్తి కలిగియుండుము, అతడే నిన్ను రక్షించును, శాపఫలము కలిగిన తరువాతను కూడ నాయనా! నన్ను స్మరించుచుండుము, దానిచే నేనును నీకు శ్రేయము కలిగించ యత్నింతును అని పలికి మహాద్యుతియగు బలి విరమించెను.