దేవ స్నపన విధి

సూతుడు ఋషులకు ఇట్లు చెప్పెను, దేవతాప్రతిష్ఠా విధానము నింతవరకును తెలిసి కొంటిరి కావున దానికి అంగభూతముగా తెలిసికొనవలసిన ఉత్తమమగు దేవ స్నపన విధానమును తెలిపెదను. దధి, అక్షతలు, కుశాగ్రములు, క్షీరము, దూర్వ, తేనె, యవలు, తెల్ల ఆవలు అనెడు ఎనిమిది అంగములతో కూడిన అర్ఘ్య సామగ్రియును ఫలములును సమకూర్చుకొన వలయును. గజములు అశ్వములు ఉండు ప్రదేశములు, రథ్య అనగా చతుష్పథము- నాలుగు బాటలు కలియుచోటు, వల్మీకము- వరాహములు త్రవ్విన ప్రదేశములు-అగ్ని గృహము- పుణ్యతీర్థము-గొల్లపల్లె-గోమండలము ఈ ప్రదేశములనుండి సంపాదించి తెచ్చిన మృత్తికను కుంభమునందు ‘ఉదృతాసి’అను మంత్రముతో వేయవలెను. అట్లే ‘శంనోదేవీః ‘అపోహిష్ఠా అను మంత్రములతో జలమును ‘సావిత్రి’తో (గాయత్రీ మంత్రముతో) గోమూత్రమును ‘గంధద్వారాం’ అను మంత్రముతో గోమయమును ‘ఆప్యాయస్వ’ అను మంత్రముతో క్షీరమును ‘దధిక్రావ్ణో’ అను మంత్రముతో పెరుగును ‘తేజోని’ అను మంత్రముతో ఘృతమును ‘దేవన్యత్వా’ అను మంత్రముతో కుశ మిత్రోదకమును కుంభమందు వేయవలెను. దీనితో పంచ గవ్యమగును. ఈ పంచ గవ్యముతో దేవుని స్నపనము చేయించవలయును. తరువాత దధిక్రావ్ణో’ అను మంత్రముతో అభిమంత్రించుచు శుద్ధ (కేవల) దధితో స్నానమాడించవలయును. ‘అప్యాయస్వ’ అను మంత్రముతో గోక్షీరముతో ‘తేజో అసి’ అను మంత్రముతో మృతముతోను ‘మధువాతా’ అను మంత్రముతో తేనెతోను ‘సర్వస్వత్యైభేషజ్యేన’ అను మంత్రముతో పుష్పోదకముతోను ‘హిరణ్యాక్ష’ అను మంత్రముతో రత్నజలముతోను ‘వేవన్యత్వా’ అను మంత్రముతో కుశోదకముతోను ‘అగ్ని ఆయాహి’ అను మంత్రముతోను ఫలోదకముతోను ‘సావిత్రీ’ మంత్రముతో గంధ జలముతో (పన్నీటితో)ను దేవుని అర్చామూర్తిని స్నానమాడించవలయును. తరువాత యథాశక్తిగ వేయి-ఐదు వందలు-నూట ఎనిమిది -అరువది నాల్గు -ముప్పది రెండు-పదునారు -ఎనిమిది- నాలుగు-సంఖ్యగల బంగరు-వెండి-రాగి-ఇత్తడి-కంచు-మట్టి కడవలలో వేనితోనైన స్నానమాడించవలయును.

ఈ మహాస్నాన విధానములో ఉపయోగింపవలసిన అష్టమహౌషధులు: 1. సహదేవి, 2. వచా, 3. వ్యాఘ్రీ, 4. బలా, 5. అతిబలా, 6. శంఖపుష్పీ, 7. సింహీ, 8. సువర్చలా: అష్ట ధాన్యములు: 1. యవలు, 2. గోధుమలు, 3. నీవారములు, 4. తిలలు, 5. శ్యామాకములు, 6. శాలిధాన్యము, 7. ప్రియంగువు, 8. వ్రీహి: ఇక మృద్గోమయ శుభాష్టకము: 1. స్వస్తికము, 2. పద్మకము, 3. శంఖము, 4. ఉత్పలము, 5. కమలము, 6. శ్రీవత్సము, 7. దర్పణము, 8. సంద్యావర్తము: పంచవర్ణములను పంచవర్ణములుకల తళుకు చూర్ణములను దూర్వలను నల్ల నూవులను అర్పించవలయును, సర్వపాపహరమును శుభమును అగు మందాకినీ (గంగా) జలముతో ఆచమనము నీయవలయును; తరువాత సువ్రతుడగు యజమానుడో స్థాపకుడో ఈ మంత్రముతో వస్త్ర మర్పించవలెను “వేదసూత్రములతో కూడినవియు యజ్ఞదాన సమన్వి తములును సర్వ వర్ణయుతములును శుభములును నీకై నిర్మింపబడినవియు నగు వస్త్రములు రెండు దేవా! ఇవిగో!” తరువాత దర్భపాణియై కర్పూర కుంకుమపుష్పములతో కూడ యత్నముతో గంధము నీయవలెను; మంత్రము: “దేవా! నీ శరీరము కాని, చేష్టకాని మరి ఏదియు నాకు తెలియదు; కనుక నేను నివేదించు ఈ గంధమును ప్రతిగ్రహించి నీవే విలేపన మొనరించుకొనుము.” తరువాత విచక్షణుడై ధూపము నీయవలయును. మంత్రము: “వనస్పతి రసరూపమయి ఉత్తమమును సుగంధాఢ్యమును చాల మనోహరమును అగు ధూపమును నీకు నివేదించు (అర్పించు)చున్నాను; స్వీకరించుము, తరువాత ప్రదక్షిణ క్రమమున నలువది దీపములను వెలిగించి అర్పించవలెను; మంత్రము “సూర్యచంద్రాగ్ని విద్యుద్రూప జ్యోతిస్సులును ఇతరములగు సర్వ జ్యోతిస్సులును అగు నీవు దేవా! ఈ దీపమును ప్రతిగ్రహించుము.” తరువాత “మహా భూషణుడవగు నీకు నమస్కారము” అనుచు ఆభరణములర్పించవలయును. ఈ విధానముతో ఏడహోరాత్రములు మహోత్సవము జరుపవలయును. తరువాత యజమానుడు ఐదు విధములగు రత్నములను వేసి పైని తెల్లని వస్త్రము చుట్టినటువంటి ఎనిమిదియో నాలుగో రెండో ఒకటియో ‘దేవస్యత్వా’ అను మంత్రముతోను సామాథర్వణ వేదమంత్రములతోను అభిషేకము నందును నవగ్రహ మఖమందును విహితములగు మంత్రములతోను ఈ దేవ కలశములతో అభిషేకము జరుపవలయును.

తరువాత యజమానుడు స్నానమాడి తెల్లని (శుద్ధ) వస్త్రములను ధరించి దేవులను స్థాపకుని వస్త్రాలంకార భూషణములతో భక్తితో పూజించవలయును. సర్వయజ్ఞ కాండ (ద్రవ్య)ములను మండపమును ఉపస్కరములను తన ఇంటియందలి ఇష్టమగు ద్రవ్యములను కూడ అతనికి ఈయవలయును. ఏలయన గురుడు సుప్రసన్నుడైనచో సర్వదేవతలును తృప్తులగుదురు. ఈ దేవతా ప్రతిష్టాపన కార్యము శీలరహితుడును దాంభికుడును వేషధారియును అగువారు చేయ రాదు. ఏయజమానుడు ఎరిగి యుండియు వైదిక ధర్మయుక్తులగు విప్రులను వదలి పాషండియగు వానిని ఆలయదేవతా ప్రతిష్ఠాది కార్యములందు ఆచార్యునిగా చేసికొనునో అట్టివానికడ వంశనాశము జరుగును. అచిర కాలమునందే అందలి దేవుడు అపూజ్యుడగును. ఆ దేవాలయము కూడ శీఘ్ర కాలమునందే పిశాచములచే స్వీకరించబడును. (పిశాచములకు ఆవాస మగును.) లేదా లోకమునందు అపూజ్యమగును. ఉత్తమ విప్రులచే ప్రతిష్టాకార్యము జరుపబడిన దేవాయతనము శుభకరమగును. అట్టి ఆలయమందలి దేవుడు చిరకాలము పూజ్యత నందును.