రాజ యాత్రా విధానము

'సర్వధర్మజ్ఞ! సర్వశాస్త్ర విశారదా! నాకిపుడు మహీపతులు యాత్రా కాలమందు ఆచరించవలసిన విధానమును తెలుపుమని అడిగిన మనువుతో మత్స్యుడిట్లనెను: నా శత్రువు ఇప్పుడు వ్యాసహాయుల చేతిలోనే కొంతదెబ్బతిని ఉన్నాడు; నాయోధులు, దృష్టులు (చాల నేర్పదులు) నా కృత్యులను చక్కగా పోషించి నా అధీనమునందు ఉంచుకొన్నాను. నా బలమును (సేనయును) ప్రభూతముగా చాలఅధికముగా ఉన్నది; నాదుర్గాది మూలస్థానమును కూడ నేనిప్పుడు రక్షించుకొన గలను; ఇపుడు నేను బలీయమగు యుద్ధము జరిపినచో శత్రువు తప్పక ఓడిపోవును అన్ని తనకు తోచినపుడు రాజు యుద్ధయాత్ర చేయవలెను; పార్ష్ణిశుద్ధి (తన ఇరుగు పొరుగు శత్రువులను అదుపులో నుంచుకొనుట) జరుగనిదే రాజు యుద్ధయాత్ర ఆరంభించరాదు; పార్ష్ణిగ్రాహుల (పొరుగుశత్రువుల) సేవకంటే ద్విగుణాధిక సేనను తన మూలస్థాన మందు (దుర్గమందు) ఉంచి యాత్రకు బయలుదేరవలయును; యాత్రకు చైత్రపూర్ణిమకాని మార్గశిర పూర్ణిమకాని తగినది; చైత్రపూర్ణిమ యందు బయలుదేరినచో యుద్ధయాత్రా కాలమున రవితాపమును ఎదు ర్కొనవలసియుండును; అదియుగాక దీనిచే శరదృతువునందు లభించు సస్యాది పుష్టి ఈకాలమున లభ్యము కాదు; మార్గశీర్ష పూర్ణిమ యందైనచో ఇది వ్యతిరిక్తముగ నుండును; (తాపము నెదు ర్కొన నక్కరలేదు; శరత్తులో పండిన పంటలు మొదలగు వాని ఉపయోగము లభించును, శత్రువు వ్యసన పీడితుడైయుండగా యాత్రచేయుట మంచిది; అట్టికాలము చిక్కుట దుర్లభము; శత్రువు దివ్యాంతరిక్ష భౌమోత్పాతములతోను ఆరు ఈతిబాధలతోను గ్రహములతోను పీడితుడై యుండగాను శత్రుని దెసకు ప్రజ్వలించు ఉల్క పోయినచో భూకంపములు ఉల్కా పాతములు ఆ రాజ్యమున జరుగుచో ధూమకేతువు కనబడుచో పిడుగులు పడుచో, అట్టి శత్రురాజ్యము మీదకు రాజు యుద్ధయాత్రకు పోవలెను; శత్రురాజు స్వబలము వ్యసన పీడితమయి రాజ్యము దుర్భిక్ష పీడితమయి అంతరకోపము (రాజ్యము లోపలి ఆప్తులు ద్వేషించుట-కలతలు) అధికమయి నల్లులు, పేలు, దోమలు, ఈగలు అధికమయి రాజ్యము బురదతో మలినమై రాజు నాస్తికుడై, పెద్దలును శాస్త్రములును చెప్పు మర్యాదలు మీరి, అధికారులు ప్రజలు తన యందనురక్తులుకాక, ధనాది సారహీనుడై అతని సేనానాయకులను సైనికులు ద్వేషించుచు, వారిలో వారు కలహించు కొనుచు వ్యసనాసక్తుడై యున్న రాజు మీదకు దండయాత్ర చేయవలెను; సైనికులకు శస్త్రములు లేక వారిఅవయవములు శుభసూచకముగా స్పందించక వారు చెడుకలలు కనుచున్న సమయ మున యుద్ధయాత్ర మంచిది. ఇట్టి సమయమునందు రాజు చతురంగబల సంపన్నుడై హృష్టపుష్ట సైన్యముతో శత్రువుల నెదిరించుటకు పోవలెను.

దుఃస్వప్నములు కలుగని సమయమున శరీరములు శుభ సూచకములై అదరుచుండ ధన్యములగు శుభశకునములు అగునపుడు దైవబల పురుషకార బలయుతుడై దేశ కాలాను కూలత గమనించి, యుద్ధయాత్ర చేయవలయును. స్థలమందు మొసలి ఏనుగునకును నీటిలో ఏనుగు మొసలికిని, రాత్రివేళ కాకి గ్రుడ్లగూబకును, పగటివేళ కాకికి గ్రుడ్లగూబయును లోబడును, దేశ, కాల, జ్ఞానమనగా ఇట్టిదే; వర్షాకాలమందు గజసేనా పదాతి సేనలును హేమంత శిశిరములందు, అశ్వరథ సేనలును గ్రీష్మమందు, ఖరోష్ట్రయుత అనగా గాడిదలు, ఒంటెలతో కూడిన సేనలును అధికముగ నుండుట జయప్రదము. వసంత శరదృతువులందు చతురంగ బలోపేత సేనతో యుద్ధయాత్ర చేయవలసి వచ్చును; మిట్ట పల్లము అధికముగాగల దేశమందుండు రాజును జయించుటకు పదాతిసేన అధికముగా నుండవలెను; సులభముగా చొరుటకు వీలగు చెట్లతో ఆవరింపబడి నదియై కొలదిగ మాత్రము బురదకల దేశ మందుండు శత్రు నెదుర్కొనుటకు గజసేన అధికముగా నుండవలయును; రథసేనయు అశ్వసేనయు అధికముగాగల చతురంగ సేనగల రాజు తాను విషమ భూభాగము నందుండియు సమతల మందుండు శత్రురాజును జయించగలుగును; శత్రురాజు ఇతరులతో ఒడంబడిక చేసికొన్నచో దానిచే అతనిని ఆశ్రయించిన వారిని కూడ ఈరాజు ఎదిరించి ఓడించవలెను; కంచెలు మొదలగు నవి రక్షణగా చేసికొనియున్న శత్రురాజును జయించుటకు కంచర గాడిదలును, ఒంటెలును అధికముగాగల సేనయుండ వలెను; ఇట్టి ఆవరణమందున్న రాజును వర్షాకాలమందు ఎదిరించవలెను; హిమపాతముతో నిండిన దేశమునందున్న శత్రుని గ్రీష్మమందు ఎదిరించవలెను; ఎండు గడ్డియు కట్టెలును బాగుగాకల శత్రు రాజును హేమంత ఋతువు నందు ఎదిరించవలెను; శరద్వసంత ఋతువులు మాత్రము యుద్ధయాత్రకు అనుకూలములగు సాధారణ కాలములు; రాజు దేశకాల స్థితులను ఎరిగి దైవజ్ఞుల సాయమున భూత భవిష్యద్వర్తమాన గతులనెరిగి వారి అభిప్రాయానుసారముగా ఆలోచించి, మంత్రాలోచన వేత్తలతో సంప్రతించి వారితోకూడి యుద్ధ యాత్రకు బయలుదేరవలెను.