దేవతా ప్రతిష్ఠా విధాన కథనము

సూతుడు ఋషులకు ఇట్లు చెప్పెను. ప్రాసాద పరిమాణమునుగాని లింగ పరిమాణమును గాని అనుసరించి జ్యేష్ఠ, మధ్యమ, కనిష్ఠ పరిమాణములను దృష్టియందుంచుకొని ఋత్విక్ సంఖ్యయును ఇతర ప్రక్రియలును పాటించుచు లోగడ చెప్పినట్లు దేవతా ప్రతిమలకు అధివాస ప్రక్రియను ముగించిన తరువాత యజమానుడు స్థాపక సహాయుడై శుభమును (పుణ్యాహ కర్మను) సమాహిత చిత్తతతో నెరవేర్చవలయును; పుణ్యాహమంత్రముతో (మంత్రమును పఠించుచు) పుష్పోదకముతో ప్రాసాద (దేవాయతన)మును ప్రోక్షించవలయును; తరువాత సంప్రదాయమును శాస్త్రమును ఎరిగి పక్ష సూత్రమును ఎరిగి పక్ష సూత్రమును ద్వారసూత్రమును ప్రసారించ వలయును; (దేవాగార ప్రధానద్వారపు నడిమినుండి తిన్నగ గర్భగృహపు పడమటి గోడలోపలి అంచువరకును ప్రాక్పశ్చిమములుగా ప్రసారించు సూత్రము ద్వార సూత్రము, గర్భగృహపు ప్రాక్ పశ్చియామముల నడిమి బిందువునకు తిన్నగా దక్షిణ ఉత్తరములుగా ప్రసారించినది పక్షసూత్రము; ఈరెండును కలియుచోటు గర్భగృహపు మధ్యస్థాన మగును; ఇచట దేవతార్చా మూర్తి మధ్యస్థానము రావలయును.) ఇట్లు మూర్తిని ప్రతిష్ఠించదగిన గర్భగృహపు మధ్య స్థానమును గురుతించిన తరువాత దానిని వాస్తవ స్థానము నుండి కొంచెము ఈశాన్యదిశగా నుండునట్లు చూచి అది దేవతామూర్తి మధ్యస్థాన మగునట్లు ప్రతిష్ట జరుప వలయును. ఏలయన -  ఈశాన్య దిశను కాని ఉత్తర దిశను కాని, ఆశ్రయించియుండు దేవతా మూర్తినే దేవతలును పూజింతురు; ఇట్లు ప్రతిష్ఠించుట ఆయురారోగ్య ఫలప్రదమును  -  శుభకరమును; మరియొక విధముగ ప్రతిష్ఠించుట అశుభకరమని తెలిసినవారు అందురు.

దేవతామూర్తిని ప్రతిష్ఠించు స్థానమందు మొదట ‘కూర్మశిల’ అనుశిల యుండవలెను. దానిపైనుంచు శిలను ‘బ్రహ్మశిల’ యందురు, ఇది కూర్మశిలకంటె అధిక పరిమాణములో నుండును, దానికిని పై భాగమునందు పూర్వోక్తమగు మానము (కొలత)లతోను లక్షణములతోను ‘పిండికా’ పీఠికా’ శిలను ప్రతిష్ఠించ వలయును; పుణ్యాహవాచనమును ప్రోక్షణమును గర్భాలయ మధ్యస్థాన - తదీశాన్యస్థానముల నిర్ణయమును అయిన తరువాత ఈ ‘పిండిక’ ‘పీఠిక’ను పంచ గవ్యముతోను కషాయ(వగరు)జలముతోను మంత్రపఠన పూర్వకముగా ప్రక్షాళనము చేయ వలయును. దేవతార్చామూర్తి విషయమున వినియోగించు మంత్రమునే ఆ మూర్తి ప్రతిష్ఠకగు పీఠికా ప్రక్షాళనమందును వినియోగించవలెను, తరువాత దేవతార్చామూర్తిని ‘ఉత్తిష్ఠ బ్రహ్మణస్పతే’ అను మంత్రముతో లేవదీసి గర్భాలయములోనికి తీసికొనివచ్చి పీఠికాంతమునందు విచక్షణుడై ఉంచవలయును; అచ్చట ఆమూర్తికి అర్ఘ్యపాద్యాదులను మధుపర్కమును ఈయవలెను, తరువాత ఒకముహూర్తకాలము విశ్రమించి రత్నన్యాసమును (అష్ట దిశలయందును ఆయారత్నముల నుంచుట)జరుపవలెను. వజ్రము, మౌక్తికము, వైఢూర్యము, శంఖము, స్పటికము, పుష్యరాగము, ఇంద్రనీలము, నీలము అను రత్నములను తాలకము, శిలావజ్రము, గంధకము, శ్యామాంజనము, కాక్షీ - కాసీనము - మాక్షీకము (తేనెమైనము) గైరికము, అను అలంకారోపయుక్త రసద్రవ్యములను గోధూమ యవతిలముద్ద నీవార శ్యామాక సర్షప (ఆవాలు) వ్రీహుల (వరిధాన్యము) ను ధాన్య విశేషములను చందనము రక్తచందనము అగురు అంజనము ఉశీరము (వట్టివేళ్లు) వైష్ణవి, సహదేవి, లక్ష్మణ అను మూలికౌషధీ ద్రవ్యములను పూర్వాది దిశలందు వరుసగా ఆయాలోక (దిక్) పాలుర నామములతో తత్తన్మంత్రములతో ప్రణవ పూర్వకముగా ఉంచవలెను, ఇదియే రత్న (రత్నాది) న్యాసము.

తరువాత బ్రహ్మస్థానము నందు 1. సర్వబీజములను ధాతువులను రత్నములను ఓషధులను తూర్పు నందును ఆగ్నేయ మందు మొదలుగా, 2. కాంచనము, 3. పద్మరాగము, 4. పారదము (పాదరసము), 5. పద్మము, 6. కూర్మము, 7. ధర, 8. వృషము అను ఓషధ్యాదికమును అన్ని దిక్కులందు నుంచవలెను, అట్లే ప్రాగాదిగా 1. కనకము, 2. విద్రుమము (పగడము), 3. తామ్రము, 4. కాంస్యము, 5. ఆరకూటము (ఇత్తడి), 6. రజతము, 7. విమల పుష్పము, 8. లోహము (ఇనుము) లను ఉంచవలయును. ఇవియన్నియును బ్రహ్మస్థానమందు పరస్పరము కలిసిపోవును, ఇవి వేరువేరుగా దొరుకనపుడు రత్నాదికమునకు మారుగా కాంచనమును ధాతువులకన్నిటికి మారుగా హరితాళమును బీజములకన్నిటికి మారుగా యవలను ఓషధులన్నిటి స్థానమున సహదేవిని ఉంచవచ్చును; లోకపాలాత్మకములగు మంత్రముల (అర్థముల)ను ఇపుడు చెప్పెదను; ఇంద్రునకు: ఇంద్రుని విశేషము ఏమనిన, అతడు దృఢముగా ప్రజ్వలించువాడు, సర్వదేవాధిపుడు, గొప్పవాడు, వజ్రహస్తుడు మహాసత్త్వుడు, అతనికి సదా నమస్సు, నమస్సు; అగ్నికి: అగ్నిపురుషుడు (శూరుడు) రక్తవర్ణుడు, సర్వదేవమయుడు, జ్వాలలు కలవాడు, ధూమము అతని ధ్వజము (జెండా), అతడు అనాదృష్యుడు (ఎవరికిని ఎదిరించనలవి కానివాడు), అతనికి ఎల్లప్పుడును నమస్సు, నమస్సు, యమునకు యముడు నల్లకలువ పూచాయవాడు, కిరీటి, దండధరుడు, ధర్మసాక్షి, విశుద్ధాత్ముడు, అతనికి నిత్యమును నమస్సు, నమస్సు; నిరృతి కృష్ణ పురుషుడు, సర్వరక్ష అధిపతి, గొప్పవాడు, ఖడ్గహస్తుడు, మహాసత్త్వుడు, అతనికి సదా నమస్సు -  నమస్సు, వరుణునకు: వరుణుడు తెల్లనివాడు విష్ణురూప పురుషుడు, నదీపతి, పాశహస్తుడు, మహాబాహుడు, అతనికి సదా నమస్సు - నమస్సు, వాయువునకు వాయువు అన్ని వన్నెలును గలవాడు, అన్ని వాసనలను మోయువాడు, అయినను శుభుడు ధ్వజహస్తుడగు పురుషుడు, అతనికి సదా నమస్సు  - నమస్సు; సోమునకు: సోముడు గౌరవవర్ణ పురుషుడు, సరౌషధీయుక్తుడు, నక్షత్రాధిపతి, సౌమ్యుడు, అతనికి ఎల్లప్పుడును నమస్సు - నమస్సు, ఈశానునకు: ఈశానుడు శుక్ల(తెల్లని) పురుషుడు, సర్వవిద్యాధిపతి, గొప్పవాడు, శూలహస్తుడు, విరూపాక్షుడు, అతనికి నిత్యమును నమస్సు - నమస్సు; బ్రహ్మకు పద్మము ఈతని జన్మస్థానము, ఇతడు చతుర్మూర్తి, వేదములకు ఆశ్రయుడు, ఎల్లరకును తాత, యజ్ఞాధిపతి, చతుర్ముఖుడు, అతనికి సదా నమస్సు -  నమస్సు; అనంతు (ఆదిశేషునకు: ఎవడు సదా ‘అనంత’ అనబడు రూపముతో ఉండుచు సచరాచర బ్రహ్మాండమును పూవునువలె తన తలపై నిలుపుకొనునో అతనికి నిత్యమును నమస్సు  -  నమస్సు; ఈ మంత్రములు దేవతార్చా సర్వకార్యములందును వ్యాసములకును బలి నివేదనము నకును ప్రణవ పూర్వకముగా వినియోగించవలసిన మంత్రములు; ఇవి వృద్ధిని పుత్రులను ఇతరములగు సత్ఫలములను ఇచ్చును; ఇట్లు మంత్రపఠన పూర్వకముగా న్యాసము జరిపి మూర్తిని ప్రతిష్ఠించవలసిన పీఠిక యందలి గోతిని పాయసముతో పూసి దానిపై యథాశక్తిగ తెల్లని వస్త్రముతో కప్పవలయును.

తరువాత దేవేశుని (దేవతార్చామూర్తిని) లేవదీసి కొంతసేపు తనకు ఇష్టమగు శోభన దేశమునందు ఉంచి ‘ధ్రువాద్యౌః’ అను మంత్రముతో ఆ మూర్తిని దేవుని ప్రతిష్ఠించవలసిన పీఠపు గుంటయందు ఉంచి ప్రతిష్ఠించ వలెను; తరువాత ఆ మూర్తినందు స్థిరీకరించి అతని తలపై యజమానాచార్యులు తమ హస్తముంచి పరమ సద్ (శ్రద్ధా) భావముతో నిష్కలరూపుడగు దేవదేవుని ధ్యానించవలయును, దేవవ్రతసామమును రుద్ర సూక్తమును పఠించవలయును, యజమానుడు తన్నే నానాభరణ భూషితుడగు ఈశ్వరునిగా (ప్రతిష్ఠించవలసిన దేవునిగా) భావనచేసి ఏయే దేవతలకు ఏయే రూపము కలదో ఆయా రూపములను ఆయా దేవతాప్రతిష్ఠార్థమై మనసాస్మరించి ధ్యానించవలయును. ఎట్లనగా - నల్ల అవిసిపూవన్నె వాడును శంఖచక్ర గదాధరుడును దేవేశుడును నగు జనార్దనుని (విష్ణుని) నేనే ఆ దేవుడునుగానై ప్రతిష్ఠించుచున్నాను; త్రినేత్రుడును దశభుజుడును చంద్రార్ధశేఖరుడును ప్రమథగణాధిపతియు వృషభస్థుడునునగు త్రిలోచనుని శివుని ప్రతిష్ఠింతును. ఋషులచే స్తుతింపబడు దేవుడును చతుర్ముఖుడును జటాధరుడును ఎల్లరకును పితామహుడును మహాబాహుడును అంబుజ సంభవుడునగు బ్రహ్మను ప్రతిష్ఠింతును. సహస్ర కిరణుడును శాంతుడును అప్సరోగణయుతుడును పద్మహస్తుడును మహాబాహుడు అగు రవిని ప్రతిష్ఠింతును. ఇవియేకాక రుద్రప్రతిష్ఠకై రౌద్రములును విష్ణుప్రతిష్ఠకై వైష్ణవములును బ్రహ్మకై బ్రాహ్మణములు (బ్రహ్మ సంబంధులు)ను రవికై సౌరములును నగు వైదిక మంత్రములను మరి ఇతర దేవతలకు ఆయా దేవతా సంబద్ధ వైదిక మంత్రములను జపించ (పఠించ)వలయును; ఏలయన వేదమంత్రపూర్వకమగు ప్రతిష్ఠ ఆనందదాయిని; గర్భ గృహపీఠమందు ప్రధాన దేవతామూర్తిని ప్రతిష్ఠించి అతనికి పార్శ్వస్థులగు గణనంది మహాకాళ వృష భృంగిరిటి గుహ పార్వతీ వినాయక విష్ణు బ్రహ్మ రుద్ర శక్ర (ఇంద్ర) జయంత లోకపాలాప్సరో గంధర్వగణ గుహ్యకాదులను అతని పరివార దేవతలుగా గ్రహించి (తన ఇచ్ఛానుసారము వారిలో కొందరును) వారివారి స్థానములందు వారివారి వైదిక మంత్రములతో ప్రతిష్ఠించ వలయును, అందు రుద్రునకై ఆవాహన మంత్రపు అర్థము ఇది.

ఎవని రథమున సింహములు వ్యాఘ్రములు భూతములు సర్పములు పూంచబడి యుండునో, ఋషులు లోకపాలురు స్కందదేవుడు నందివృషము ప్రియ ప్రమథగణము మాతృకలు సోముడు విష్ణుడు బ్రహ్మ నాగ యక్షగంధర్వాది దివ్యఖేచరులు ఎవనిని పరివారించియుందురో అట్టి త్రినేత్రుడు ఈశానుడు శివుడు రుద్రుడు ఉమాపతియగు మహాదేవుని వృషభధ్వజుని ఆతని పత్నితో ప్రమథగణముతో కూడ ఆవాహన మొనర్చుచున్నాను; సర్వమును ప్రణవమయము; రుద్రా! భగవన్! నన్ను అనుగ్రహింప రమ్ము. శివ (శుభరూపు) కరుడవు కమ్ము. భగవన్! నీవు ఇందు శాశ్వతుడవయి నా పూజను గ్రహించుము, నమోనమః. మరికొన్ని వాక్యములు. ప్రణవ రూపునకు ప్రణవపూర్వక నమస్సు. భగవానునకు నమః పూర్వక స్వాగతము. ఉమతో ప్రమథగణముతో ఇతర పరివారముతో కూడిన రుద్రునకు ప్రణవ పూర్వక నమస్కారము. భగవానుడు బ్రహ్మచే వేదమంత్ర పూర్వకముగా ఈయబడిన మంత్ర పవిత్రమగు ఈ అర్ఘ్యపాద్యాచమ నీయాననాదిక మంతయు గ్రహించవలయునని ప్రార్థన; నమోనమః  -  స్వాహా.

ఇట్లు ఆవహించిన తరువాత పుష్కలమగు పుణ్యాహధ్వనులతో వేదమంత్ర ధ్వనులతో దధిక్షీర ఘృతములతో మధుశర్కరా పుష్ప  -  గంధ జలములతో దేవుని స్నపనము చేయించవలయును; ఆ సమయమున శివధ్యానైక చిత్తుడై ఈ మంత్రముల నుచ్చరించవలయును; 1. యజ్ఞాగ్రతో దూముదేతి, 2. తతో విరాడజాయత, 3. సహస్రశీర్షాపురుషః, 4. అభిత్వాశూర నోనుమః, 5. పురుష ఏవేదం సర్వమ్, 6. త్రిపాదూర్ధ్వం, 7. యేనేదం భూతమ్, 8. నత్వాహం అన్యో: ఈ మంత్రముల నన్నిటిని ప్రతిష్ఠాకార్యములందు మరల మరల జపించుచు జలముతో నాలుగుమూర్తులు అర్చామూర్తి పాదనాభిశిరః ప్రదేశములను స్పృశించవలయును. దీనితో ప్రతిష్ఠా ప్రక్రియ ముగిసినట్లే, అనంతరము యజమానుడు ఆచార్యు (ప్రధాన ఋత్విక్-స్థాపకు)ని మూర్తిపులను (ఇతర ఋత్విక్లను) భక్తి పూర్వకముగా వస్త్రాలంకార భూషణములతో పూజించ (ఆదరించ) వలెను; అచటకు వచ్చియున్న ఇతర జనులను దీనులను అంధులు మొదలగు దయనీయ జనులను కూడ యధోచితముగా ఆదరించవలయును.

అనంతరము మొదటిదినమున తేనెతోను రెండవ దినమున పసపుతోను తెల్ల అవల (పిండి) తోను మూడవ దినమున చందనములతోను యవల (పిండి) తోను నాలుగవ దినమున ప్రియంగు (ప్రేంకణపుపూవు) చూర్ణముతోను మనః శిలాధాతువుతోను దేవుని అర్చామూర్తికి పూత పూయవలయును; ఏలయన ఇట్లు పూతపెట్టుట నరులకు సౌభాగ్యమును శుభమును వ్యాధి నాశమును పరమప్రీతి సుఖములను కలిగించునని వేదతత్త్వ విదులు చెప్పుచున్నారు, ఐదవ దినమున కృష్ణాంజనముతోను, తిలల (పిండి) తోను అరవనాడు నేతితో చందనముతో పద్మ కేసరముతోను ఏడవ దినమున గోరోచనముతో అగురుతోను పూవులతోను పూతపూయ వలెను; (ఇది యంతయు లోగడ తెలిపిన అధివాస ప్రక్రియ జరిపిన దినములు ఎన్నియో, అన్ని దినములపాటు ఈ లేపన ప్రక్రియ జరుపవలెనని సూచించుచున్నది; ఇట్లుకాక) సద్యో అధివాసముతో ప్రతిష్ఠ జరిపిన సందర్భములలో ఈ పూతలన్నియు ప్రతిష్ఠానంతరము ఒకేసారి వరుసగా చేయవలెను.

ప్రతిష్ఠ అనంతరము దేవుని మూర్తిని మరల ఎన్నడును కదలించరాదు; కదలించినచో దోషభాక్కు అగును. కూర్మశిలా, బ్రహ్మశిలా, పీఠికా స్థానముల గోతిని ఇసుకతో నీరంధ్రముగా నింపవలయును. అట్లు అవికాని వానిమూలమున దేవతామూర్తి కాని కదలకుండునట్లు చూడవలయును. మూర్తిని ప్రతిష్ఠించిన పీఠభాగ శ్వభ్రమును కూడ ఇసుక సున్నములతో గట్టిగ పూడ్చవలయును.

ఇంతచేసినను ఒకవేళ మూర్తి చలించినచో మరల అచట కదలిక లేకుండునట్లు భద్రపరచుటయే కాక ఈ కదలిక ఏదిశగా జరిగినదో ఆ దిక్పాలకుడు శాంతించుటకై ఇంద్రునకై సువర్ణా భరణములను అల్ప ధనవంతుడు యథాశక్తిగ బంగారమునైనను, 2. అగ్నికై బంగారమును, యమునకై మహిషమును, 4. నిరృతికై అన్నమును, సువర్ణమును, 5. వరుణునకై ముత్తెములను, ముత్తెపు చిప్పలను, 6. వాయువునకై ఇత్తడిని, వస్త్రయుగమును, 7. సోమునకై ధేనువును, 8. శివునకై వృషభమును వెండిని దానము చేయవలయును; దీనిచే ఆయా దిక్కులందు కలిగిన చలనపు దోషము శాంతించును; లేనిచో కులనాశకరమగు ఘోరభయము కలుగును, అందును ఇట్టి చలనము కనబడగానే ఇసుకతో (కలిపి నూరిన సున్నము మొదలగు వానితో) సురేశుని మూర్తిని కదలకుండ చేయవలెను; అన్న వస్త్రాది దానము జరిపి పుణ్యాహవాచనము జరుపవలయును, ఈదినక్రమమున నాలుగవ దినమున మహాస్నానమును చతుర్థీకర్మ ప్రక్రియను (ప్రతిష్ఠవంటి ప్రక్రియను) జరుపవలయును; అపుడుకూడ ఋత్విగాదులకు మరల దక్షిణాదికము భక్తితో నీయవలెను, పాపవినాశ హేతువగు దేవప్రతిష్ఠావిధి నీకు తెలిపితిని. ఈ విద్యాధరులును దేవతలును విని ఆనందించెడు అనంత ప్రకారమగు ఈ విధానము ఇంతకు మునుపు కూడ పండితులు అనేకులు చాలమారులు బోధించిరి. వినిరి.