మత్స్య మహా పురాణము
యయాతికి శుక్రశాపము
ఎప్పుడును పవిత్రమగు చిరునవ్వుతో ఉండెడి దేవయాని శర్మిష్ఠకు కుమారుడు కలిగెనని విని దుఃఖముతో ఆర్తురాలయి శర్మిష్ఠ విషయమున ఏమేమో ఆలోచించెను. తరువాత ఆమె శర్మిష్ఠ ఉన్నచోటికిపోయి ఆమెతో ఇట్లు పలికెను. “చక్కని కనుబొమలుకల సుందరీ! నీవు కామ సుఖమునకుఆసపడి ఎటువంటి పాపముచేసితివి!” శర్మిష్ఠ: “ధర్మాత్ముడును వేద పారంగతుడును కోరిన వరము లేవయిన ఈయగలవాడును అగు ఋషియొకడు ఇక్కడకు వచ్చెను. నేనతనిని ధర్మమునకు విరుద్ధము కాని కోరికను వేడితిని. శుచిస్మితా! నేను న్యాయ విరుద్ధమగు ఎట్టి కామపరమగు పనిని చేయుదానను కాను. ఆ ఋషివలననే నాకీ సంతానము కలిగినది. నేను నీకు సత్యమునే చెప్పుచున్నాను. (నీవు నా ఈ మాటలు నమ్మి నిర్మలమగు చిరునవ్వు నవ్వుము.) దేవయాని: “చాల మంచిదే. నీవు భయపడకుము! ఇదే నిజమయినచో ఆ బ్రాహ్మణుని విషయము నీకుబాగుగ తెలిసియున్నచో అతని గోత్రము నామము వంశము అంతయు వినగోరుచున్నాను.” శర్మిష్ఠ, “సూర్యునివలె ఓజస్సు-తేజస్సు కలిగి ప్రకాశించు చుండుటచే ఆతనిని చూడగానే నేనతని నవి ఏవియు అడుగజాలకపోయితిని.” దేవయాని, ఇది ఇంతేయైనచో శర్మిష్ఠా! నీ మొదటి సంతానము వర్ణమున శ్రేష్ఠుడగు బ్రాహ్మణుని వలననే కలిగినది అనుచున్నావు కనుక నాకు కోపము ఉండదు.”
శర్మిష్ఠా దేవయానులు ఇట్లు మాటలాడుకొని ఒకరిని చూచి మరొకరు నవ్వుకొనిరి. శర్మిష్ఠ మాటలు నిజమేయను నమ్మికతో దేవయానియును తన గృహమునకు పోయెను.
ఇట్లు యయాతికి దేవయాని యందు ఇంద్రుడు విష్ణువువంటి యదుతుర్వసులను ఇరువురు కుమారులు కలిగిరి. శర్మిష్ఠకు యయాతివలన ద్రుహ్యువు అనువు పూరుడు అను ముగ్గురు కుమారులు కలిగిరి.
తరువాత ఒకానొక కాలమున శుచిస్మిత యగు దేవయాని యయాతితో కలిసి ఏకాంతో ద్యానమునకు పోయెను. ఆమెకు అచ్చట దేవరూపులుగు కుమారులు(ముగ్గురు) కనబడిరి. వారు శుచులును శుద్ధులునై యుండిరి. ఆడుకొనుచుండిరి. వారినిచూచి ఆశ్చర్యపడుచు దేవయాని యయాతితో ఇట్లనెను. “రాజా! ఈ కుమారు లెవ్వరివారు? వీరు దేవకుమారులవలె చక్కగా ప్రకాశించుచున్నారు. వర్చస్సులోను రూపమునందును నిన్ను పోలియున్నారు.” ఇట్లు రాజు నడిగిన పిమ్మట దేవయాని ఆ కుమారులనే ఇట్లడిగెను: “మీ పేరులేమి? గోత్రము ఏమి? ఎవరి కుమారులు? మీరుపండితులు అన్నివిషయములు బాగుగా ఎరిగినవారు. నేనిది యంతయు వినగోరుచున్నాను. ఉన్నది ఉన్నట్లు వివరించి చెప్పుడు.”
ఆబాలురు తమచూపుడు వ్రేలితో ఆ రాజసత్తమునే చూపిరి, శర్మిష్ఠ మా అమ్మ అనియు వారా దేవయానితో చెప్పిరి. ఇట్లు పలికి వారందరును రాజుకడకుపోయిరి. కాని తాను దేవయాని ఎదుట ఉండుటచే అతడు వారిని ప్రీతితో అభినందించలేదు. (ముద్దు చేయలేదు.) అందుచే అపుడా బాలురు ఏడ్చుచు శర్మిష్ఠ కడకు పోయిరి. బాలుర మాటలు విని ఏడుపు విని రాజు సిగ్గుపడిన వానివలె అయ్యెను. ఆ బాలురకు రాజు విషయమునగల ప్రత్యయము (విశ్వాసము-ప్రీతి) చూచి వాస్తవ స్థితిని గుర్తించి దేవయాని శర్మిష్ఠతో ఇట్లు పలికెను: “నీవు నా అధీనమందుండు దానవయి కూడ నాకు ప్రీతికరము కాని పనిని చేసితి వేల? నీవు నీ స్వాభావికమగు అసురధర్మమునే ఆశ్రయించియున్నావు. కాని నాకు భయపడుచున్నావు కావు.’ శర్మిష్ఠ: “చారుహాసినీ! “ఋషి” అని నీతో నేను చెప్పినది నిజమే. న్యాయమును ధర్మమును అనుసరించి నడుచుచున్నాను కావున నేను నీకు భయపడుటలేదు. నీవు భర్తను వరించినపుడే నేనును వరించితిని. స్త్రీకి తన సఖీ భర్త తనకును భర్తయగును. నీవు నాకు పూజ్యవు-మాన్యవు-జ్యేష్ఠురాలవు-బ్రాహ్మణివి. ఈ రాజర్షి నీకంటెను నాకు పూజ్యతముడు. నీకీ మాత్రము తెలియదా?”
శర్మిష్ఠ చెప్పినది విని దేవయాని ఇట్లు పలికెను: “రాజా! నీవు నాకు ప్రీతికరము కాని పనిచేసితివి. నేను ఇక ఇక్కడ ఉండను” అనిచట్టునలేచి అసుందరి కన్నీరు కార్చుచు శుక్రుని దగ్గరకు పోవుటకై బయలుదేరెను. అది చూచి యయాతి మనస్సులో వ్యథనొందెను. వెంటనే అతడును కళవళ పడుచు ఆమెను బ్రతిమాలుచు ఆమెవెంటనే పోవసాగెను. దేవయాని వెనుకకు మరలలేదు. క్రోధముతో ఎర్రనైనకన్నులతో కన్నీరుకార్చుచు త్రోవలో రాజుతో ఏమియు మారు పలుకక త్వరితముగా కావ్యుడగు ఉశనసుని (శుక్రుని) కడకు చేరెను. ఆమె తండ్రిని దర్శించుచునే అతనికి అభివాదనము చేసి అతని ఎదుట నిలువబడెను. తరువాత వెంటనే యయాతియును భార్గవునికి నమస్కరించెను. దేవయాని: “అధర్మము ధర్మమును జయించినది. క్రిందు మీదు- మీదు క్రిందు ఐనది. వృషపర్వుని కూతురు శర్మిష్ఠ నన్ను వెనుకకు నెట్టివేసినది. ఈ యయాతి రాజువలన ఆమెకు ముగ్గురు కుమారులు కలిగినారు. దుర్భగను (పెనిమిటి అనురాగమునకు నోచుకొనని దానను) అగు నాకు ఇద్దరు కొడుకులు మాత్రమే కలిగినారు. తండ్రీ! నా మాట నిజము. భృగు వంశ శ్రేష్ఠుడవు నీవు. ఈ రాజు కూడ ధర్మజ్ఞుడు అని ప్రసిద్ధి పొందినవాడేకదా! తాను అట్టివాడయ్యు ఇంతటి నీకు అల్లుడయ్యును-ఇతడు మర్యాదను అతిక్రమించినాడు అని నీకు చెప్పవలసి వచ్చుచున్నది.”
శుక్రుడు, “మహారాజా! నీవు ధర్మజ్ఞుడవు అయిఉండియు అధర్మముపై ప్రీతి చూపినావు. కావున త్వరలో నిన్ను ముసలితనము బాధించును. నీవు అభిమానవంతుడవు కదా! దీనికిదే దండనము.” యయాతి: “భగవన్! నేను సత్యమునందే మనస్సునిలిపి యుండువాడను. నిజమునే చెప్పుచున్నాను. దానవేంద్రుని కూతురు ఋతుఫలమును కోరగా నేను చేసిన ఈ పని ధర్మమే కాని అధర్మము కాదు. “ఋతు ఫలము ఇమ్మని కోరుచు తానైవచ్చి వరించగా దానిని ఈయని పురుషునకు భ్రూణహత్యా దోషము అంటును” అని వేదతత్త్వ వేత్తలు (మీవంటి వారే) చెప్పుదురు కదా! (భ్రూణుడు=షడంగములతో కూడ వేదమును అధ్యయనము చేసిన వాడు) ‘ఋతుఫలమును కోరినదియును ప్రీతికరముగ ప్రవర్తించునదియు పొందదగినదియు అగు స్త్రీ ఏకాంతమున తను కోరగా ఆమెను పొందనివాడు భ్రూణహత్యా దోషము పొందునని ధర్మ శాస్త్రములలో పండితులు చెప్పియున్నారు. భృగువంశశ్రేష్ఠా! ఈ మొదలగు హేతువులను బాగుగా పరిశీలించి ఆలోచించి ఆ ధర్మమునకు భయపడి నేను శర్మిష్ఠతో కూడితిని.” శుక్రుడు: “రాజా! నీవు నా అధీనములోని వాడవు కదా! నా విషయము నీవు ఆలోచించనక్కరలేదా? ధర్మలోపము చేసినవాడు పతితుడగును అనుమాట నిజమే. కాని నీవు మిథ్యా ధర్మమును అనుష్ఠించువాడవు. (నీకు ప్రియమయిన పనిచేసి దానిని ధర్మమని పైకి చూపుచున్నావు) మనస్సులో ఒకటి పెట్టుకొని చేసిన పనిని పైకి మరి ఒకటిగా చూపుచున్నావు. కనుక నీవు దొంగతనము చేసినవాడవైనావు.” నహుష పుత్రుడు యయాతి క్రుద్ధుడైన శుక్రుని వలన ఈ విధముగా శాపము పొందినాడు. వెంటనే అతనికి మొదటి వయస్సుపోయి ముసలితనము క్రమ్మినది. యయాతి! “భృగూద్వహా! నేను ఈ దేవయాని విషయములో యౌవన సుఖములను పొందుటలో నాకు ఇంకను తృప్తి కలుగలేదు. నన్ను అనుగ్రహించుడు. ఈ ముసలితనము నన్ను క్రమ్మకుండునట్లు దయ చూపుడు.” శుక్రుడు: “నేను పలికిన మాట వ్యర్థము కాదు. రాజా! ఈ జర నిన్ను క్రమ్మనే క్రమ్మినది. ఇష్టపడిన మరొకనికి ఇది నీవు సంక్రమింపచేయవచ్చును.” యయాతి: “బ్రాహ్మణోత్తమా! నాకు తన యౌవనమును ఇచ్చిన కుమారుడు నా రాజ్యమునకును పుణ్యము నకును కీర్తికిని పాత్రుడు అగునట్లు తాము అనుమతించ వేడుచున్నాను.” శుక్రుడు: “నహుషాత్మజా! నీ ఇష్టము వచ్చినవానికి ఎవ్వనికైనను నీవార్ధకమును సంక్రమింపజేయవచ్చును. భావములో నన్నునిలుపుకొని నీవు ఈపని చేసినచో నీకు ఏపాపమును అంటదు. నీకు యౌవనము ఇచ్చిన కుమారుడే రాజ్యమునకు అధికారియు ఆయుష్మంతుడును కీర్తిమంతుడును బహుసంతతి మంతుడును అగును.”