మత్స్య మహా పురాణము
వ్యాసుడు కాశిని శపింపబూనుట
మహాపుణ్య ప్రదమగు అవిముక్త క్షేత్రమునందు స్కందుని (సనత్కుమారుని) వలన ఆ క్షేత్ర మాహాత్మ్యమును వినుచున్నవారును ప్రియదర్శనులు అనగా ప్రీతి కలిగించు శుభరూపము కలవారును అగు ఆస్తికులెల్లరును హర్షముచే గద్గద కంఠులయిరి; మహాశ్చర్యమందిరి, మనము నందలి హర్షముతో వారు బ్రహ్మవేత్తలలో ఉత్తముడగు ఆ స్కందునితో ఇట్లనిరి: నీవు బ్రహ్మదేవుని పుత్రుడవు, బ్రహ్మణ్యుడవు బ్రాహ్మణ ప్రియుడవు బ్రహ్మిష్ఠుడవు బ్రహ్మవిదుడవు (పర) బ్రహ్మ రూపుడవు బ్రహ్మ (బ్రహ్మతత్త్వ వేత్త)లలో ఇంద్రునంతటివాడవు; బ్రహ్మలోక కర్తవు బ్రహ్మ విదుడవగుటకై బ్రహ్మచర్య వ్రతమనుష్ఠించిన(చు) వాడవు; బ్రహ్మ (వేద)మునకును ఆదిభూతుడవు; బ్రహ్మ (వేద)మునందు వత్సలుడవు (ప్రీతి కలవాడవు;) బ్రహ్మదేవునితో సమముగా సృష్టి చేయగల వాడవు; బ్రహ్మతో సముడవు; ఇట్టి నీకు నమస్కారము; పరమము పావనము గొప్పదియగు దీనిని విని మా ఆత్మ(మనస్సు) భావితము(ఉత్తమ సంస్కారవంతము) అయినది: ఏది ఎరిగినచో అమృతత్వము సిద్దించునో అట్టి పరమతత్త్వమెరిగితిమి; నీకు శుభమగుగాక! మేమిపుడు శంకరుని నివాసమగు భూర్లోకమునకు పోవుదుము; అచ్చటి సర్వభూతములకు ఆత్మరూపుడు (అంతర్యామి) అగు ప్రభువు స్థాణురూపుడై సర్వలోక హితార్థమయి ఉగ్రమగు తపస్సునందునిలిచి తన ఆత్మను యోగముతో సంయోజనపరచి రౌద్ర తత్త్వ ప్రధానమగు దేహముదాల్చి పరమాత్మ రూపు డతడు తనతో సమానగుణములు కలవారగు గుహ్యకులును బ్రహ్మాది దేవతలును సిద్ధులును పరమ ఋషులును తను పరివారించి యుండగా ఉన్నాడు గదా! ప్రమథ గణేశ్వరా! మేమచటికేగి వచ్చిన తరువాత పరమభక్తితో క్షేత్ర మాహాత్మ్యము నెరిగిన మేమందరమును సునిశ్చయముతో నియతముగా అవి ముక్తమునందే వసింపగోరుచున్నాము అని స్కందునితో ఋషులు పలికిరి.
అని ఇంత చెప్పి పరమేశ్వరుడు పార్వతితో ఇట్లనెను, దేవీ! అవిముక్తమందు ఈ చెప్పబోవు విధములగు గుణములు గలవారు; వారు ధర్మశీలురు; క్రోధమును మమకారమును ఇంద్రియ ములను జయించినవారు, ధ్యానయోగపరులు; యోగసిద్ధిని అవ్యయ (నాశరహిత) స్థానమును పొందువారు; యోగజ్ఞులు యోగసిద్ధులు; వారు భక్తియుక్తులయి భోగయోగ మోక్ష ప్రదుడును విభుడును గుహ్య (రహస్య) రూపుడును సనాతనుడును అగు మహాదేవుని ఉపాసించు చుందురు; వారు అవిముక్తమందుండి మహేశ్వరుని వలన యోగమెరిగి సాధనచేసి పరబ్రహ్మము నందు చిత్తలయమంది తుదకు శివ సాయుజ్యమందుదురు, ఈ అవిముక్తము పరమ (ఉత్తమ) క్షేత్రమని పండితులందురు; శివునిమాయచే విమోహితులగు అప్రబుద్ధులు (అవివేకులు) దీనిని చూడ జాలరు, శివునిచే అభ్యనుజ్ఞనంది అతని యందు శ్రద్ధ కలిగి అతనిని పరమ గమ్యముగా నెంచి అవిముక్తము నొనర్చి శాంతులయి యోగ (సిద్ధిచే గలుగు ఉత్తమ) గతిని పొందుదురు;
ఇది లోకమందలి శ్మశానము లన్నింటిలోను గుహ్యమగు (రహస్య తత్త్వముగల స్థానము;) అని పెద్దలందురు; ఏలయన భూలోకవాసులగు మానవులకు యోగము లేనిదే ముక్తి లభించదు; కాని అవిముక్తవాసులకు మాత్రము యోగ మోక్షములు రెండును సిద్ధించును; ఈజన్మ మందే వారికి ఉత్తమగతి లభించును; దేవీ! ఏక జన్మముతోనే అనుత్తమమగు మోక్ష మందుదు రనున దొక్కటియే పరమేశ్వరీ! ఈ క్షేత్ర మహాప్రభావము.
పూర్వము కారణాంతరమున అవిముక్తముపై కోపించి దానిని శపింపబూనిన వ్యాసుడును దానిని విడువజాలకపోయెము. ఆ కథ తెలిపెద వినుము. అమిత తేజస్కుడగు వ్యాసుడొకప్పు డిందువసించుచుండగా అతడు తన శక్తి ఉన్నంత వరకు సంచరించియు ఎటను భిక్ష పొందజాలక పోయెను. అతని తనువున క్షుధాక్లేశ మధికమయ్యెను, అతడు క్రుద్ధుడయ్యెను, నేను దినదిన క్రమమున ఇట ఆరుమాసము లుంటిని; ఇది ఎట్లు? ఈ నగరము నాకు భిక్ష నీయకున్నది, ఈ దోషముతో ఇది హతమైనది; (చెడినది;) ఇచటి బ్రాహ్మణుడో క్షత్రియుడో బ్రాహ్మణ విధవయో ఎవరేకాని నాకు సంస్కరించినదో సంస్కరించనిదో ఏదో యొక పరిపక్వాన్న మీయకున్నారే! ఏమి బ్రాహ్మణులు-ఏమి జనులు వీరు? ఆశ్చర్యకరముగ నున్నదే! వీరికిని ఈ తీర్థమునకును ఈ నగరమునకును శాపము పెట్టుదును, దానితో తీర్థము అతీర్థమగుగాక! అవిముక్తమునందు ఎంత పుణ్యకర్ముల కైనను నాశాప ప్రభావమున వరుసగా మూడుతరములపాటు విద్యకాని ధనముకాని సఖ్యము (మోక్షము) కాని కలుగకుండుగాక! ఇట్లు శపించి ఇచటివారికి కలుగు సిద్ధియందు విఘ్నము కలిగింతును అని అతడు శపింప సంకల్పించెను. ఇది ఎరిగి దేవదేవుడగు ఉమాపతి భయమందుచు తన ప్రియదేవియగు గౌరితో ఇట్లనెను. దేవీ! నామాట వినుము, ఎట్టి స్థితి వచ్చినదో చూడుము, కృష్ణ దైపాయనుడు కోపించి శపింపబూనినాడు అనగా దేవి “దేవా, ఎందుచే అతడు క్రుద్ధుడై శపించుచున్నాడు? అతనికి భగవానుడవగు నీవేమి కీడు చేసితివి? అనగా దేవదేవుడిట్లు పలికెను.
ప్రియా! వరాననా! ఇతడు మౌనియై ధ్యానయుక్తుడై పండ్రెండేసి సంవత్సరము లొక్కొక్క కాలావధిగా ఏర్పరచుకొని బహువర్షములపాటు మహా తపమాచరించెను. అది ముగించిన తరువాత అతడు ఆకలివేసి భిక్షాటనమునకు రాగా అతనికి ఇట ఎవ్వరును అరముద్దయైనను భిక్షవేయలేదు; ఈ భగవానుడగు మునికి ఆరు మాసములపాటు గడచినది; అందుచే క్రోధ విపరీత మనస్కుడై ఇపుడు శాపము ఈయనున్నాడు. ఈతడు శపించులోపుగానే కోప నివారణము నకు ఉపాయ మాలోచించ వలయును, ప్రియా! ఇతడు కృష్ణదైపాయన వ్యాసుడన సాక్షాత్ నారాయణుడే అని ఎరుగుము, సాక్షాత్పితామహుడే యయినను ఇతనిశాపమునకు ఏల భయపడ కుండును? ఇతడు అదైవతమును దైవతమునుగా దైవతమును అదైవతముగా చేయగలవాడు; వరాననా! మనము మానవులుగా ఇచట వసించు గృహస్థులుగా అయి ఇతనికి తృప్తికలిగించు భిక్షపెట్టుదము. అని శంభుడనిన వెంటనే దేవి మానుషీ రూపము దాల్చి అతనికి దర్శన మిచ్చెను. సత్తమా! భగవన్! మహామునీ! ఇంతవర కెన్నడు మా ఇంటికి రాకపోతిరి, రారండు, వెంటనే వచ్చి భిక్ష గ్రహించుడు అనెను. అది విని ప్రీతమనస్కుడై అతడు భిక్ష అందుకొనవచ్చెను; ఆమె వ్యాసునకు షడ్రసయుక్తమయి అమృతోపమము అగు భిక్ష ఇచ్చెను; అంతట ఆ ఋషియు అదివర కెన్నడును ఎరుగని రుచిగల ఆ భిక్ష భుజించెను, అతడు హర్షమందిన మనస్సుతో, ఆ వరదులగు దేవదేవులకు మనస్సునందే నమస్కరించి కమల పత్రనేత్రుడగు ఆ వ్యాసుడు ఇట్లనెను.
ఈ దేవుడును ఈ దేవియు గంగానదియు మృష్టాన్నమును శుభగతియు లభించు ఈ వారాణసి యందు నివాసము ఓ విశాలాక్షీ! ఎవరికి ఇష్టము కాదు! అని పలికి వ్యాసుడు ఆ నగరిని పరికించి చూచుచు తన హృదయానందకారమగు భిక్షను గూర్చి యాలోచించుచుండగా అతనికి ఎట్టఎదుట మహాదేవుడును శుభయగు గిరిజాదేవియు సాక్షాత్కరించిరి; ఇంటి ముంగిట నున్న వ్యాసునితో దేవదేవు డిట్లనెను: మహామునీ! నీవు కోపివి; ఈ క్షేత్రమున నీవు వసింపదగదు; అన ఆశ్చర్యపడి అతడు మహాదేవునితో ఇట్లనెను, నా కిందు అష్టమీ చతుర్దశులందు ప్రవేశ మీయ వేడుచున్నాను అన సరేయని అనుమతించి మహాదేవుడటనే యంతర్ధాన మందెను. ఆ ఇల్లుగాని ఆ దేవుడుగాని ఆ దేవి కాని ఏదియు ఎచ్చట నుండెనో కనబడకుండ అదృశ్యమయ్యెను.
భద్రా! దేవీ, ఇట్లు త్రైలోక్య విఖ్యాతుడును మహాతపస్కుడును నగు వ్యాసుడు ఈ క్షేత్ర గుణముల నెరిగి దాని సమీప మందే యుండెను. ఇట్లు అచట వ్యాసుడు ఉండుటను బట్టియే ఈ క్షేత్ర ప్రాశస్త్యమును పండితులు నిర్ణయించినారు; ఈ అవిముక్త క్షేత్రగుణముల నన్నిటిని చెప్పగల వాడెవ్వడు; దేవ బ్రాహ్మణ ద్వేషులు దేవభక్తిని నటించువారు వెక్కిరించువారు బ్రహ్మ ఘ్నులు కృతఘ్నులు వంచకులు జనద్వేషులు గురుద్వేషులు తీర్థక్షేత్రములు నిందించువారు అపవిత్రమొనరించువారు పాపాసక్తులు కుత్సితులు దీనియందు ప్రవేశించరాదని వసించరాదని దండనాయకుడు కాపుదలగా ఉంచబడినాడు; కావున యథోచితమంత్రముల నెరిగి వానితో ఈ దండనాయకోత్తముని గంధపుష్పదీప ధూపాదికముతో పూజించి నమస్కరించి సర్వవర్ణముల వారును సర్వవిధ సరీసృపములును ఆవరించియుండు ఈ క్షేత్రమున ప్రవేశించి వసించువారు ఈశ్వరానుగ్రహము నంది గణేశ్వరులు అందుగతినందిరి. నానారూపధరులును దివ్యులును నానావేషధరులును అయి గణాధినాధ రూపులయిరి, సర్వదేవతలుకూడ అవిముక్తమందు పరమే శ్వరుని యందు శ్రద్ధకలిగి అతనినే పరమగతిగా నెంచి ఏగతినంద గోరుదురో అట్టి పరమాక్షయ స్థానమునందిరి.
ఈ అవిముక్తపురము పరమ పదము దేవస్థానమగు స్వర్గముకంటే విశిష్టతరమయినది, బ్రహ్మపురముకంటే పైగా నున్నది; అంతకంటే గొప్పది; ఈశ్వరుడు తన తపోబలముచే దీనిని నిర్మించెను. బ్రహ్మలోక స్వర్గలోకములును దీనితో సమములుకావు; ఇది మనోరమము; కోరినట్లు పోగలది, ఏ బాధలును లేనిది, సకలతేజస్సులను తపశ్శక్తులను మించిన యోగశక్తి కలది; ఈ స్థానము నధిష్టించి దేవదేవుడు విరాజిల్లుచున్నాడు, తపస్సులచే వ్రతములచే నియమములచే సర్వతీర్థాభిషేక (స్నాన) ములచే సర్వదానములచే లభించు ఫలములును సర్వయజ్ఞ ఫలములను అవిముక్త క్షేత్రవాసముచేతనే లభించును; తెలిసికాని, తెలియకకాని, ఇదివరకు చేసినది, ఇప్పుడు చేయుచున్నదియగు పాపమంతయును ఈ క్షేత్ర దర్శనమున నశించును, శాంతులు దాంతులునగు మునులు తపస్సులుచేసి సంపాదించు ధర్మముచే కలుగు ఫలమిచట జితేంద్రియుడై వసించుట చేతనే కలుగును.
అవిముక్తమందుండి లింగము నర్చించు నరుడు నూరుకోట్ల కల్పముల తరువాత కూడ మరల జన్మించడు; రుద్రసన్నిధియందు అమరుడు నక్షయుడునై విహరించును, ఈ క్షేత్రము సర్వతీర్థోపనిషద్, రహస్య రూపమయినది; ఇది నిస్సంశయము; ఇచట మహాదేవుని అర్చించు వారును స్తుతించువారును సర్వపాపముక్తులు జరామరణరహితులై యుందురు; సర్వకామఫల ప్రదములగు యజ్ఞములు కూడ పునరావృత్తి ప్రదములు; కాని అవిముక్తమున మృతినందువారికి మాత్రము పునరావృత్తి లేదు; గ్రహనక్షత్ర తారాదికమయిన తమ కాలము వచ్చినపుడు పతన మందవచ్చును; అవిముక్తమున మృతినందినవారికి పతనములేదు; వారు వందల, వేల కోట్ల సంవత్సరముల తరువాతనైన పునర్జన్మ వృత్తినందరు, ఘోర సంసారసాగర మందు పరిభ్రమించు వారుకూడ కాలవశమున ఆవిముక్తమునకు వచ్చి ఆటవసించి మృతినందినచో పరమగతి నందుదురు, ఈ కలియుగము ఘోరమయినది హాహాకారజనకము; చైతన్య నాశకము అని ఎరిగి అవిముక్తమునకు వచ్చి అటవిడువక నివసించువారు కృతార్థులగుదురు; దీనియందు ప్రవేశించియు ఇట వసింపక విడిచిపోవు వానిని చూచి సకల భూతములును చప్పట్లు చరచుచు నవ్వును; కామ క్రోధ లోభ మోహగ్రస్తులగు మానవులు మాత్రము ఇటకు వచ్చియు దండ నాయకునకు భయపడి బయటకు పోవుదురు; జపధ్యానాది కములు లేక జ్ఞానరహిత చిత్తులగు వారికి తామసులకు ఈ వారాణసి పరమగతి యగును; తీర్థములందు సారభూతమగునవి ఐదు; 1. విశ్వేశుడు, 2. దశాశ్వమేధము; 3. లోలార్కుడు, 4. బిందుమాధవుడను విష్ణువు; 5. మణికర్ణిక; ఈ ఐదుతీర్థములతో కూడి ఏర్పడినదియే అవిముక్త క్షేత్రము అని పెద్దలు వర్ణించు చున్నారు, ఇదియంతయు ఆవిముక్తమును గూర్చి మహాదేవుడు దేవికి చెప్పినది; ద్విజులారా! ఇది అంతయు నేను మీకు తెలిపితిని.