(దీన్ని బ్రహ్మ ఆదిపర్వమని వ్రాయడం పొరబాటే. సంస్కృత వ్యాకరణంలో ఆదివృద్ధి - అపత్యార్ధకము అనే మర్యాద వుంది. దానిని బట్టి ఒక పదానికి సంబంధించిన లేదా సంతానమైన అనే అర్థంలో మొదటి అచ్చుకి కొన్ని మార్పులు వస్తాయి.
గంగ కొడుకు గాంగేయుడు
బ్రహ్మ సంబంధి బ్రాహ్మము.)
(సుమంతు శతానీక సంవాదము, భవిష్యపురాణ మహిమ, పరంపర, సృష్టివర్ణన, నాలుగువేదాల వర్ణాల ఉత్పత్తి, చతుర్విధ సృష్టి, కాలగణన, యుగాల సంఖ్య, యుగధర్మాలు, సంస్కారాలు.)
ప్రార్ధన: నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం
దేవీం సరస్వతీం వ్యాసం తతోజయముదీరయేత్.
శ్రీకృష్ణునికీ, నరోత్తముడైన నరమహర్షికీ, సరస్వతీదేవికీ, వ్యాసమహర్షికీ జయం కోసం నమస్కరించి దీనిని మొదలు పెట్టాలి. శ్రీమన్నారాయణుని నూటయెనిమిది అవతారాల్లోనూ ఇక్కడ శ్రీకృష్ణుని పేరే ఎందుకు చెప్పబడిందంటే నరోత్తమపదం ద్వారా నారాయణుని సామీప్య సంపదను పొందిన అర్జునుడు ధ్వనిస్తున్నాడు. అలాగే మహాభారతమూనూ. వ్యాసుడు భారతానికి పెట్టిన మొట్ట మొదటి పేరు జయము. వ్యాసునికి కూడ నమస్కరించి ఈ పురాణాన్ని వ్యాస శిష్యుడు ప్రారంభిస్తున్నాడనుకోవాలి.
ఒకనాడు వ్యాస శిష్యుడైన సుమంతుమహర్షి వశిష్ఠ, పరాశర, జైమిని, యాజ్ఞవల్క్య, గౌతమ, వైశంపాయన, శౌనక, ఆంగిర, భారద్వాజాది మహరులతో కలసి పాండవ వంశంలో జన్మించిన మహాబలశాలి శతానీక మహారాజుపై దయకలిగి ఆతని సభకు విజయం చేశాడు.
వీరిని చూడగానే భక్తి వినయసంభ్రమాలతో లేచి నిలచి శతానీకుడు వారందరికీ విధ్యుక్త ప్రకారం అతిథిసత్కారాలను చేసి వారిని సుఖాసీనులను కావించి, పేరు పేరునా పూజించి ఇలా ప్రార్థించాడు.
“ఓ మహాత్ములారా! మీ సాదర ఆగమనంతో నాజన్మ సఫలమైంది. మీ స్మరణ మాత్రముననే మనిషి ధన్యుడు కాగలడు. అలాటిది మీరే స్వయంగా వచ్చి నాకు దర్శన మిచ్చారంటే నా భాగ్యమెంతయని చెప్పగలను. నా అజ్ఞానాన్ని పటాపంచలు చేసి పరమ గతిని ప్రాప్తింపజేసే ధర్మశాస్త్రాలను, వాటిని సుబోధకం గావించే పవిత్ర పుణ్యమయ గాథలను నాకు వినిపించి నన్ననుగ్రహించండి.”
ఋషులందరూ ముక్తకంఠంతో “ఓ రాజా! ఈ విషయాన్ని మా అందరికీ పరమ గురువు, సాక్షాత్తూ నారాయణ స్వరూపుడునగు వేదవ్యాస మహర్షికి నివేదించు. ఆయన కృపాసింధువు. అన్ని ధర్మశాస్త్రాలూ, విద్యలూ తెలిసినవాడు. పంచమవేదమైన మహాభారత రచయిత”
అంటూ వుండగానే అక్కడ వేదవ్యాస భగవానుడు ప్రత్యక్షమయ్యాడు. (పురాణ ప్రారంభంలో సుమంతునితో వచ్చిన మహర్షుల పేర్లలో వ్యాసనామం లేదు. అందుకే అప్పుడే ప్రత్యక్షమైనట్టు అర్ధం చేసుకోవచ్చు. పైగా ఆయన విష్ణు స్వరూపుడు. సుమంతుని వెనుక రావలసినవాడు కాదు. తలచుకోగానే ప్రత్యక్షంకాగల శక్తిగలవాడు.) “ప్రభో! నాకు పవిత్ర, పుణ్య, ధర్మమయ గాథలను అనుగ్రహించండి. నేనూ పవిత్రుడనౌతాను. సంసార సాగరాన్ని దాటి ఉద్ధరింపబడతాను” అంటూ తన పాదాలంటిన మహారాజును కృపతో కటాక్షించి ఇలా అన్నాడు వ్యాసమహర్షి “ఓ రాజా! ఇక్కడ ఈ సుమంతుడున్నాడు చూడు. ఇతడు నాశిష్యులలోనే అసామాన్యుడు. మహాతేజస్వియైన ఈమహర్షి సమస్త శాస్త్రాలనూ అవుపోసన పట్టినవాడు. నీ జిజ్ఞాసను తీర్చగల సమర్థుడు”
ఆయన ఆజ్ఞకాగానే అక్కడి మహర్షులంతా ఆమోదముద్ర వేసారు.
“ఓ ద్విజ శ్రేష్ఠా! మీరు నాపై దయవుంచి పుణ్యమయమై, శ్రవణమాత్రంచే సర్వ పాపాలనూ పోగొట్టి, శుభఫలితాలివ్వగల సమర్థవంతమైన కథలను నా కనుగ్రహించండి” అని శతానీకమహారాజు సవినయంగా సుమంతుని కోరాడు.
“మహారాజా! ధర్మశాస్త్రాలు, మను, విష్ణు, యమ, అంగిర, వశిష్ఠ, దక్ష, సంవర్త, శాతాతప, పరాశర, ఆపస్తంబ, ఉశన, కాత్యాయన, బృహస్పతి, గౌతమ, శంఖ, లిఖిత, హారీత, అత్రి మొదలగు మహనీయులు కూర్చిన వెన్నో కథలతో సహా ఈ జాతిని ప్రకాశింపజేస్తూ వున్నాయి. నీవు దేనిని వినగోరుచున్నావు? అడిగాడు సుమంతుడు.
“ప్రభో! మీ వంటివారి కృపవల్ల నేను వాటినన్నిటినీ వినియున్నాను. బ్రహ్మచే నాలుగుగా విభజింపబడ్డ వర్ణాలు, వాటి ధర్మాలు ఆయా జనులకు శుభం కలిగించే విధంగా పాలించడానికి నాకు బోధించ ప్రార్థన.!!
“మహారాజా! సంసార సాగరాన్ని హాయిగా దాటడానికుపకరించే నావలు మన పదునెనిమిది పురాణాలు, శ్రీరామకథ, మహాభారతాది సద్గ్రంథాలు. పదునెనిమిది పురాణాలనూ, ఎనిమిది ప్రకారాల వ్యాకరణాలనూ బాగా మథించి, మనసులో పెట్టుకొని ఆజ్ఞానంతో వ్యాసమహర్షి మహాభారతాన్ని వెలయించాడు. ఆ సత్యవతీ నందనుని మహాభారత సంహిత నొక్కమారు శ్రద్ధగా వింటే చాలు, బ్రహ్మహత్యలాటి మహాపాపాలు సైతమూ నశిస్తాయి. వ్యాకరణాలు ఎనిమిది ప్రకారాలన్నాను కదా! అవేమిటంటే బ్రాహ్మ, ఐంద్ర, యామ్య, రౌద్ర, వాయవ్య, వారుణ, సావిత్ర్య, వైష్ణవ. పురాణాల పేర్లు - బ్రహ్మ, పద్మ, విష్ణు, శివ, భాగవత, నారదీయ, మార్కండేయ, అగ్ని, భవిష్య, బ్రహ్మవైవర్త, లింగ, వారాహ, స్కాంద, కూర్మ, మత్స్య, గరుడ, బ్రహ్మాండ, వామన ఇవన్నీ నాలుగు వర్ణాల జనులకు ఉపకారకాలే. ఇప్పుడు చెప్పు రాజా! నీవేమి వినగోరెదవు?”,
“విప్రోత్తమా! నేను శ్రీరామకథనీ, మహాభారతాన్నీ విన్నాను. అన్య పురాణాలునూ శ్రవణము చేశాను. కాని, భవిష్యపురాణాన్ని వినే భాగ్యాన్ని ప్రసాదించండి” (ఇక్కడ ఇప్పటి వాళ్ళకొక అనుమానం వస్తుంది ఇలా వీరిద్దరే ఎంతసేపూ మాట్లడేసుకుంటుంటే మిగతా మహర్షులూ మహామేధావులూ ఒక్కరైనా నోరు మెదపలేదా అని. వాళ్ళు అప్పటివాళ్ళు కాబట్టి అని జవాబు. అప్పటి వాళ్ళు అధికప్రసంగం చేసేవారు కాదు.)
‘మహారాజా! మీరు అత్యంత పుణ్యప్రదమైన పురాణాన్నే ఎన్నుకున్నారు. దీనిని వింటే బ్రహ్మహత్యాది మహాపాపాలు నశించడమే కాకుండా అశ్వమేధ మొదలైన యజ్ఞాలు చేసిన ఫలితం లభిస్తుంది. దేహాంతమున సూర్యలోక ప్రాప్తీ కలుగుతుంది.
ఇది మొట్టమొదటగా బ్రహ్మదేవుని వాక్కుగా వెలువడింది.
ఇప్పటికీ, ఇకపైనా కూడ ఈ పురాణం యొక్క అవసరం లోకులకు చాలావుంది. విద్వాంసులైన బ్రాహ్మణులు దీనిని కూలంకషంగా అధ్యయనంచేసి తమ శిష్యులకీ, నాలుగు వర్ణాలకీ చెందిన ప్రజలకు చెప్పాలి. శ్రౌత, స్మార్త అనే రెండు మార్గాలకి చెందిన ధర్మాలూ ఈ పురాణంలో నిండి దీనిని పరిపుష్టం చేశాయి. ఈ పురాణం పరమ మంగళప్రదము, సద్బుద్ధి (బుద్ధి వివర్ధనమ) ప్రదాయకము, కీర్తి ప్రదానకరము, మోక్షప్రాప్తిదము.
ఇదం స్వస్త్యయనం శ్రేష్ఠమిదం బుద్ధి వివర్ధనం
ఇదం యశస్యం సతతమిదం నిఃశ్రేయసం పరం!! (బ్రహ్మ - 1 - 79)
సమస్త ధర్మ, కర్మలూ వాటి సత్ఫలితాలూ, అలాగే సకల దుష్కర్మలూ, దోషాలూ వాటి దుష్ఫలితాలూ ఈ పురాణంలో సమగ్రంగా చర్చింపబడ్డాయి. నాలుగు వర్ణాశ్రమ ధర్మాలూ ఇందులో చెప్పబడ్డాయి.
సదాచారమే శ్రేష్ఠధర్మము. దీనిని కాపాడవలసిన బాధ్యత బ్రాహ్మణునిది. (మనవైదిక ధర్మంలో బ్రాహ్మణ శబ్దమేనాడూ కులవాచ్యముగా లేదు. హిందూ మతమనేది కూడా మనం పెట్టుకున్నపేరు కాదు. పర్షియా (అరబీ, ఉర్దూలకి మూలభాష) వారు మనను సింధువాసులనబోయి ‘స’ ని అసలు పలకలేక ‘ధు’ లోని వత్తునూ పలకలేక హిందువులు అనేశారు.
బ్రాహ్మణ శబ్దానికర్థం బ్రహ్మజ్ఞానం కలవారని. బ్రాహ్మణవర్ణ ధర్మాలు పౌరోహిత్యం, అధ్యయనం, అధ్యాపనం. ప్రజలచేత వారి క్షేమంకోసమే పూజలూ, వ్రతాలూ చేయించడం, యజ్ఞాలు చేయించి పర్యావరణాన్ని కాపాడడం పౌరోహిత్యం. అంతేగాని డబ్బులు దండుకోవడం కోసం ఏవేవో చేయించడం కాదు. వారికి ధనాన్ని రాజే ఇచ్చేవాడు. ఈరోజు ప్రభుత్వం ఇవ్వాలి. అధ్యయనం, అధ్యాపనం (చదవడం, ఆ చదువుని చెప్పడం), పౌరోహిత్యం చేసే మాదిగ వానిని కూడా ఆనాడు బ్రాహ్మణుడిగానే గౌరవించారు. అతని కూతురు అరుంధతి వేద మంత్రాలు కల్పించగలిగింది. కాబట్టి బ్రాహ్మణ వర్ణము వేరు, ఈనాటి ‘బ్రాహ్మిన్స్’ వేరు.) శ్రుతులలో సదాచార సంపన్నత అంటే ఏమిటో చెప్పబడింది. బ్రాహ్మణవర్ణానికి చెందినవాడు దానిని తప్పనిసరిగా పాటించాలి. అలా చేయని బ్రాహ్మణ వర్ణస్థుడు ఏ వైదికఫలాన్నీ పొందజాలడు.
సదాచారమే ధర్మమనీ, జపతపాల ఫలాన్ని సాధించిపెట్టే శక్తి గలదనీ మునులు వక్కాణించియున్నారు. అన్ని వర్ణాల మనుజులకూ వారి వారి వర్ణాశ్రమ ధర్మాలే సదాచారాలు. ఈ సదాచార వర్ణన భవిష్యపురాణంలో చక్కగా చేయబడింది.
ఇంతేకాక మూడులోకాల ఉత్పత్తి, వివాహాది సంస్కార విధి, స్త్రీల, పురుషుల లక్షణాలు, దేవపూజా విధానము, రాజ ధర్మము, రాజ కర్తవ్య నిర్ణయము, సూర్యనారాయణ, విష్ణు, రుద్ర, దుర్గా, సత్యనారాయణ దైవతాల మాహాత్మ్యము, వారిని ప్రసన్నం చేసుకొనే పూజా విధానము, వివిధ తీర్థాల వర్ణనము, ఆపద్ధర్మాలు, ప్రాయశ్చిత్త విధులు, సంధ్యా వందనము, స్నాన, తర్పణ, వైశ్వదేవము, భోజన విధి, జాతి, కుల, (ఇక్కడ కులమంటే వర్ణమే.) వేద ధర్మాలు, యజ్ఞ మండలంలో అనుష్ఠించబడే వివిధ యజ్ఞాల వర్ణనమూ భవిష్యపురాణంలో చక్కగా చేయబడింది.
ఓ కురువంశ శ్రేష్ఠా! శతానీక మహారాజా! ఈ మహాపురాణాన్ని బ్రహ్మదేవుడు శంకరునికి, శంకరుడు విష్ణువుకీ, విష్ణువు నారదునికీ, నారదుడు ఇంద్రునికీ, ఇంద్రుడు పరాశరునికీ, పరాశరుడు మా గురుదేవులైన వ్యాసమహర్షికీ, ఆయన నాకు వినిపించారు.
ఇందులో యాభైవేల శ్లోకాలున్నాయి. (ప్రస్తుతానికి పద్దెనిమిది వేలే లభిస్తున్నాయి.) భక్తి పూర్వకంగా ఈ పురాణాన్ని వినేవారికి తేజస్సు, బుద్ధి, సంపూర్ణంగా సర్వసంపదలూ ఒనగూడుతాయి.
బ్రహ్మప్రోక్తమైన ఈ పురాణంలో ముందు చెప్పబడిన వర్గీకరణ కాక మరోక వర్గీకరణ ఇలా చెప్పబడింది. ఇది పంచ పర్వపర్యంతము. అవి బ్రాహ్మ, వైష్ణవ, శైవ, త్వాష్ట్ర, ప్రతిసర్గ పర్వాలు. పురాణలక్షణాలూ ఐదే. (ఏ పురాణానికైనా అన్వయించవలసిన శ్లోకం ఇది.
సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశోమన్వంతరాణిచ
వంశానుచరితం చైవ పురాణం పంచలక్షణం)
సర్గ, ప్రతిసర్గ, వంశ, మన్వంతర వంశానుచరితములు పురాణలక్షణాలు. అలాగే పదునాలుగు విద్యలు కూడా వర్ణింపబడాలి - ప్రతి పురాణంలోనూ. (ఆ విద్యలేవనగా: ఋగ్యజుస్సామాథర్వ వేదాలు (అధర్వణ అనరాదు), శిక్ష, కల్ప, నిరుక్త, వ్యాకరణ, ఛంద, జ్యోతిష (వేదాంగాలు) మీమాంస, న్యాయ, పురాణ, ధర్మశాస్త్రాలు. కొంతమంది ఆయుర్వేద, ధనుర్వేద, గాంధర్వవేద, అర్థ శాస్త్రాలను కూడా కలిపి విద్యలు పదునెనిమిది అంటారు.)
ఓ రాజా! నేనిపుడు సమస్త ప్రాణుల ఉత్పత్తి ఎలాజరిగిందో చెప్పబోతున్నాను. దీనినే భూతసర్గ అని కూడా అంటారు. దీనిని శ్రద్ధగా విన్నవారికి సమస్త పాపాలూ నివృత్తి కావడమేకాక మనశ్శాంతి కూడా లభిస్తుంది.
(న్యాయంగా, పంక్చుయేషన్ నియమాలు ప్రకారమైతే ప్రతి పేరాకీముందు కొటేషన్ మార్కులు పెట్టాలి. కాని దానివల్ల లాభంకన్నా నష్టమేఎక్కువ చదివేవారు తికమక పడవచ్చు. అందుచే పెట్టకపోవడమైనది.) మొదట ఈ ప్రపంచమంతా అంధకారబంధురంగా వుండేది. పదార్థం కనబడకపోతే పదార్ధజ్ఞానం కూడా వుండదు. కదా! ఒక కాంతిదాత, జ్ఞానప్రదాత అప్పటి చారిత్రకావసరం. దేవుని సృష్టిని ప్రాణులకి కనిపించేలా చేయడం అత్యావశ్యకం కదా! కాబట్టి, భాస్కరోదయం జరిగింది. సూక్ష్మ, అతీంద్రియ, సర్వ భూతమయ పరబ్రహ్మ, పరమాత్మయే భాస్కర భగవానుడై తన శరీరంనుండి నానా విధమైన సృష్టికి ఉపక్రమించాడు(హోలి బైబిల్లో కనిపించే ‘Let there be light and light was overall’ కీ ‘God loved man so much that He created man in His shape and form’ అనేభావం వచ్చే అవతరణాలకీ ఇదేమూలము.) జగతి వెలిగింది.
మునుముందుగా ఆయన నీటిని సృష్టించి అందులో తన వీర్యశక్తిని ప్రవేశింప జేశాడు. దానితో జలము నుండి దేవతలు, అసురులు, మనుష్యులు, జగత్తూ పుట్టాయి (అపుడు సూర్యుడే బ్రహ్మగా మారదలచుకున్నాడు. వెంటనే ఆయన వీర్యము మరింత జలములో పడి మిక్కిలి కాంతివంతమైన ఒక బంగారు గుడ్డు నీటిలో రూపుదిద్దుకున్నది. అది నిలువుగా నాలుగుగా విచ్చుకోవడంతో దానిలో లోకపితామహుడు, సృష్టికర్తయైన చతుర్ముఖ బ్రహ్మ తనను తానే కనిపింపజేశాడు.
బ్రహ్మ తండ్రి నారాయణుడని చెప్పడానికి కారణమిక్కడే కనిపిస్తుంది. (సంస్కృత వ్యాకరణంలో ఋ,ర,ష లతో వచ్చు ‘న’ కారం ‘ణ’ కారంగా మారుతుంది. ఆ విధంగా నార + అయన=నారాయణ అవుతుంది ‘నార’ శబ్దానికి జ్ఞానమనే అర్ధం కూడా వుంది. దానికీ స్థానం నారాయణుడే.) నరుని తొలిరూపం ఆ భగవంతుడే కదా! ఆ విశ్వనరుని సృష్టి కాబట్టి జలం నరం. నరశబ్దానికి ఆదివృద్ధి వచ్చి ‘నార’ అయింది. దానికి తొలుదొల్తగా స్థానము లేదా ‘అయనము’ అయినవాడు నారాయణుడు2.
ఈ సత్, అసత్‌రూపి, అవ్యక్త, నిత్యకారణ వ్యాప్తి అగు నారాయణుని అండ ప్రకాశము నుండి ఏ పురుష విశేషమైతే బయటికి ప్రకటితమైందో ఆయనే ఈ విశ్వంలో బ్రహ్మయను పేరుతో ప్రసిద్ధి చెందాడు. ఆయన బహుకాలము తపస్సుచేసి తన పనికి కావలసిన శక్తిని సంపాదించుకొని తాను బయటికి వెలువడి, తనతో వచ్చిన బంగారు గుడ్డును దిశమార్చి, రెండు ముక్కలయ్యేలా చేశాడు. క్రింది భాగం భూమిగా, పైభాగం ఊర్ధ్వ లోకాలుగా మధ్యలో ఆకాశంగా విడివడ్డాయి. ముందుగా పైలోకాల్లో స్వర్గం ప్రకటితమైంది. తరువాత ఆయన భూమికి ఎనిమిది దిశల్లోనూ వరుణుని నివాసాన్ని అంటే సముద్రాన్ని సృష్టించాడు. అప్పుడాయన మహదాది (మహత్ + ఆది: జీవికి కావలసిన శారీరక, మానసిక, మనోవైజ్ఞానిక శక్తులు, బలము మహత్తనబడుతుంది. తపస్సు ద్వారా పూర్వికులు, విద్య - శిక్షణ - అనుభవం ద్వారానేడు మనమూ దానిని పొందుతున్నాం.) శక్తులనీ, సమస్త ప్రాణికోటినీ వెలయించాడు.
పరమాత్మ ఆకాశమునేర్పాటు చేసిన పిమ్మట వాయు, అగ్ని, జల, పృథ్వీ తత్త్వాలను రచించాడు. సృష్టియెక్క ఆరంభంలోనే వేదాలున్నాయి. కాబట్టి వాటి ఆధారంగా ఈ మహాభూతాల కర్మలను ఆయన నిర్దేశించాడు. అప్పుడాయన తుషిత దైవగణాలను, జ్యోతిష్టోమాది సనాతన యజ్ఞాలను, గ్రహ, నక్షత్ర, నదీ, సముద్ర, పర్వత, సమ - విషమ భూమీ ప్రాంతాలను ఉత్పత్తి చేశాడు.
దిన, మాస, సంవత్సరాదికముగాను, ఋతుపర్యంతంగాను కాలాన్ని పరమాత్మ సృజించాడు. కామక్రోధాలను, సదసద్వివేకం కోసం ధర్మాధర్మాలను రచించిన పరమాత్మ అప్పడు ప్రాణికోటిని ప్రారంభించాడు. దానిని సుఖ - దుఃఖ, హర్ష - శోకాది ద్వంద్వాలతో నింపాడు. ఇంద్ర చంద్ర, సూర్యాదులను వారివారి పదవులలో నిలిపాడు. విభిన్న ఋతువులలో కనిపించేలాగ వృక్షకోటినీ పుష్పజాతుల్నీ నియమించాడు. సమస్త జీవగణాల్లోనూ తానే ప్రాణమను జ్యోతిగా ప్రవేశించాడు.
ఈ లోకాన్ని అభివృద్ధి చేయడానికి బ్రహ్మ తన నోటి (ముఖ శబ్దానికి నోరు అని అర్ధము కూడా వుంది.) నుండి బ్రాహ్మణులనీ, బాహువుల నుండి క్షత్రియులనూ, తొడల నుండి వైశ్యులనూ, పాదాలనుండి శూద్రులనూ ఉద్భవింప జేశాడు. ఆయన నాలుగు ముఖాలనుండీ నాలుగు వేదాలు పుట్టుకొచ్చాయి.
తూర్పువైపునున్న ముఖం నుండి పుట్టిన ఋగ్వేదాన్ని వశిష్ఠుడూ, దక్షిణ ముఖం నుండి ప్రకటితమైన యజుర్వేదాన్ని యాజ్ఞవల్క్య మహర్షీ, పశ్చిమ వదనంనుండి ఆవిర్భవించిన సామవేదాన్ని గౌతముడూ, ఉత్తరముఖం నుండి జనించిన అథర్వవేదాన్ని శౌనకుడూ గ్రహించారు.
బ్రహ్మయొక్క పంచమముఖం(ఈ పంచమ ముఖమును గూర్చి ఇప్పట్లో చాలా మందికి తెలియదు గాని ప్రాచీన కాలంలో అది ప్రఖ్యాతమని ఈ పురాణంలోనే ఇలా చెప్పబడింది.
యత్తన్ముఖం మహాబహో పంచమం లోకవిశ్రుతం॥ బ్రా - 21 - 56
నుండి పురాణాలు, ఇతిహాసాలు, యమాది స్మృతి శాస్త్రాలూ ఉత్పన్నమైనాయి.
పిమ్మట బ్రహ్మ మానవ సృష్టికి పూనుకొన్నవాడై తన దేహమును రెండు భాగాలుగా విభజించుకున్నాడు. కుడివైపు విరాట్‌పురుషుడూ, ఎడమవైపు స్త్రీరూపమూ ఉద్భవించగా వారిలో విరాట్‌పురుషుడు - నారద, భృగు, (ఇంతకుముందే ఋగ్వేదంతో బాటు పుట్టి దానిని గ్రహించిన వశిష్ఠుని ప్రసక్తి వచ్చింది. ఈయన అలౌకిక స్వరూపుడు. కాలమున్నంత కాలమూ ఉండేవాడు. ఇప్పుడు పుట్టినాయన లౌకికస్వరూపుడు, ప్రజాపతి, మహాగురువు.) వశిష్ఠ, ప్రచేత, పులహ, క్రతు, పులస్త్య, అత్రి, అంగిర, మరీచి అను పదిమంది మహర్షులను సృష్టించాడు. వారే ప్రథమశ్రేణి ప్రజాపతులైనారు.
అన్య మహాతేజస్వులైన కొందరు ఋషులు కూడా అప్పుడే ఉద్భవించారు. ఇంకా దేవతలు, ఋషులు (దైత్యులనగా అనంతరకాలంలో దితికి జన్మించబోవువారు. తపస్సంపన్నులు. రాక్షసులనగా వారి అనుచరగణం.) దైత్య, రాక్షసగణాలు, పిశాచ బృందాలు, గంధర్వులు, అప్సరసలు, పితృగణాలు, మనుష్యులు, నాగులు, సర్పాలు - ఇలా ఎన్నిటినో సృజించిన పరమాత్మ, వాటికి తగిన స్థానాలను కూడా ఏర్పాటుచేసి పంపించాడు.
(భూమికీ ఆకాశానికీ మధ్యభాగము.) రోదసిలో మెరుపులు, మేఘాలు, పిడుగులు, ఇంద్రధనుస్సు, తోకచుక్కలు, ఉల్కలు, మేఘాల సంఘర్షణలో జన్మించే కాంతిప్రవాహాలు, విస్ఫోటనాలు కలిగించే నిర్ఘాతాలు, చిన్నా - పెద్దా నక్షత్రాలు బ్రహ్మచే సృష్టింపబడ్డాయి. కిన్నర, కింపురుషాది మానవ రూపధారులైన ఆకాశ విహారులు, చేపలనుండి ఏనుగుల వరకు అన్ని జంతువులు ఆ విరాట్ పురుషాధారమైన బ్రహ్మచే సృష్టింపబడ్డాయి. ఈ విధంగా బ్రహ్మకే, ఆధార భూతుడైన సూర్యభగవానునిచే మూడులోకాలు సృష్టింపబడి, నింపబడి, ప్రారంభింపబడినాయి.
వాటి జన్మకర్మక్రమము కూడా విధాతచే నిర్దేశింపబడింది. ఏనుగులు, పశువులు, జింకలు, పిశాచాలు, మానవులు, రాక్షసులు మున్నగునవి క్షేత్రబీజ సంయోగం ద్వారా గర్భంలోపడి పెరిగి ఈ లోకములోకి వస్తాయి. చేప, తాబేలు, పాము, పక్షులు గుడ్లనుండి ‘బయటికి వస్తాయి. దోమలు, పేలు, ఈగలు వంటివి స్వేదమునుండి పుడతాయి.
భగవంతుని మరొక అపూర్వ సృష్టి వృక్షాది కుటుంబము. వీటిని ఆయనే సృజించి, వాటి ఉత్పత్తిని విత్తనాల ద్వారా నిర్దేశించాడు. కొన్ని మొక్కలకు వాటి కొమ్మలనే ఉత్పత్తి స్థానాలుగా విధించాడు. మనుష్యులకు, జంతువులకు ఆహారము నుండి ఔషధులదాకా వాటిలో నిక్షేపించాడు. ఇవి జడములుకావు. చైతన్యభరితాలే. సుఖదుఃఖానుభూతులు వాటికీ వుంటాయి. ఎటొచ్చీ పూర్వకర్మానుసారం జనించుట వలన మాట్లాడే శక్తిగాని దూరాలకు కదిలే సౌలభ్యంగాని వుండవు.
ఈ విధంగా మొత్తం చరాచర జగత్తు భాస్కరభగవానునిచే సృష్టింపబడింది. పరమాత్మ నిద్రించి, మరల కల్పాంతంలో నిద్రలేచే వేళకి సృష్టి అంతా నాశనమై ఆయనలో కలిసిపోతుంది. అప్పుడాయన లేచి మరల సృష్టిస్తాడు. అప్పుడు జీవులన్నీ తమతమ పూర్వ కర్మలను అనుభవించడానికి జన్మిస్తాయి. ఈ విధంగా తన జాగృతి, శయనావస్థల ద్వారా భగవానుడు విశ్వాన్ని సృష్టిస్తుంటాడు, నశింపజేస్తుంటాడు.
కల్పారంభంలో సృష్టి, కల్పాంతంలో ప్రళయం అనుకున్నాము కదా! ఈ కల్పమే (పరమేశ్వరుడనేది పరమాత్మకి మరోపేరు. ఆయనే బ్రహ్మ. ఆయనే విష్ణువు. ఆయనే శివుడు. ఆయనే ఈ పురాణంలో సూర్యభగవానుడు.) పరమేశ్వరునికి ఒకదినము. అంటే ఆయన పగలులో సృష్టి, రాత్రిలో ప్రళయము!
ఓ రాజా! అన్నిటికన్న సమగ్రమైనది భారతీయ కాలగణన(కాలగణన: ప్రస్తుతం మనం అనుసరిస్తున్న కాలగణనలోనూ పన్నెండునెలలేవున్నా అందులో కొన్నిటికి 30రోజులు కొన్నిటికి 31 ఒకనెలకైతే మరీ 28. కొండొకచో 29. ఇది సమగ్రమైన కాలగణనకాదు.) రెప్పపాటు కాలాన్ని నిమేషమంటాముకదా! ఇలాటివి పదునెనిమిదైతే ఒక కాష్ఠ. ముప్పది కాష్ఠలొక కళ. ముప్పది కళలొక క్షణం. పన్నెండు క్షణాలొక ముహూర్తం. ముప్పది ముహూర్తాలొక రోజు. ముప్పది రోజులొక నెల. రెండు నెలలొక ఋతువు. మూడు ఋతువులొక అయనము. రెండు అయనాలొక సంవత్సరం.
పితృదేవతలకు మన నెల ఒకరోజు. అంటే వారికి మన శుక్లపక్షమొక రాత్రి. కృష్ణపక్షం పగలు. దేవతలకు మన సంవత్సరమొకరోజు అనగా మన ఉత్తరాయణమంతా కలిపి వారికొక పగలు, దక్షిణాయనమొక రాత్రి. మరి పరమాత్మకో, అనుకుంటున్నావు కదా, చెప్తాను విను.
మన యొక్క నాలుగువేల సంవత్సరాలొక సత్యయుగము. మూడువేల సంవత్సరాలొక త్రేతాయుగము. రెండు వేల సంవత్సరాలు ద్వాపరయుగము. వేయిసంవత్సరాలు కలియుగం. ఈ నాలుగు యుగాలు, సంధ్యాంశ, సంధ్య సంవత్సరాలను కలుపుకొని పన్నెండువేల సంవత్సరాలు ఒక మహాయుగం అవుతుంది. ఈ మహా యుగమే దేవతలకొక మామూలు యుగం. ఇలాటివి ఒక సహస్రమైతే బ్రహ్మకొక పగలు. అలాగే మరో వెయ్యి ఆయనకు రాత్రి.
ఆయన రాత్రి ముగిసి, నిద్ర తేరేసరికే ప్రళయము వచ్చి సృష్టి అంతా శూన్యమైపోయి వుంటుంది. ఆయన ముందు ఆ శూన్యంలోకి వాయువును, శబ్దాన్ని ముందుగా సృష్టించి పంపిస్తాడు. ఈ శబ్దసహిత వాయువునే మనం ఆకాశమంటున్నాం. తరువాత ఇతర పంచభూతములు సృష్టింపబడతాయి. ఇదివరకు చెప్పుకున్న క్రమంలో సృష్టి జరుగుతుంది.
పన్నెండువేల దివ్యసంవత్సరాలొక దివ్యయుగమవుతుందని అనుకున్నాం కదా! అలాటి డెబ్బది యొక్క యుగాలు ఒక మన్వంతరం. బ్రహ్మయెక్క ఒక్కదినంలో పదునాలుగు మన్వంతరాలు గడచిపోతాయన్నమాట.
సత్యయుగంలో ధర్మం సర్వాంగపూర్ణమై నిలబడుతుంది. అంటే నాలుగుపాదాలా నడుస్తుంది. త్రేతాయుగంలో మూడు పాదాలమీద, ద్వాపరంలో రెండు పాదాలమీద నడిచే ధర్మం, కలియుగంలో ఒకే పాదంతో కుంటుతూ పోతుంటే మూడు పాదాలతో నడిచే అధర్మం వికటాట్టహాసం చేస్తుంటుంది.
సత్యయుగంలో సామాన్య మానవులు ధర్మాత్ములై ఆరోగ్యంగా సత్యాన్నే పలుకుతూ నాలుగు వందల సంవత్సరాల వరకు జీవిస్తారు. త్రేతలో మూడొందలు, ద్వాపరలో రెండొందలు, కలియుగంలో ఒక వంద సంవత్సరాలు సగటు మనిషి ఆయుఃప్రమాణంగా చెప్పబడింది. సత్యయుగంలో తపస్సు, త్రేతలో జ్ఞానము, ద్వాపరంలో యజ్ఞం, కలియుగంలో దానం ప్రధానధర్మాలుగా విధింపబడ్డాయి.
పరమకాంతిమంతుడైన పరమేశ్వరుడు, తను కావించిన సృష్టిని రక్షించడానికి తననోటి నుండి, భుజాలనుండి, ఊరువులనుండి, పాదాలనుండి క్రమముగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాలను ఉత్పన్నం చేశాడు. ఈ వర్ణాలవారు చేయవలసిన ప్రధాన కర్మలను కూడా ఆయనే విధించాడు ఇలా
బ్రాహ్మణ: అధ్యయనము, అధ్యాపనము, యజ్ఞముచేయుట, చేయించుట, దానమిచ్చుట, గ్రహించుట.
క్షత్రియ: అధ్యయనము, యజ్ఞము చేయుట, దానమిచ్చుట, ప్రజాపాలన.
వైశ్య: అధ్యయనము, యజ్ఞముచేయుట, పశురక్షణ, వ్యవసాయ, వ్యాపారాల ద్వారా ధనార్జన.
శూద్ర: పై మూడు వర్ణాలవారు వారివారి ధర్మాలను నిర్వహించుటలో సాయపడుట (ఎక్కడచూసినా శూద్ర ధర్మము పై మూడు వర్ణాలను సేవించుటయే అని కనబడుతుంది అంటే వారికి నౌకరి, చాకిరీ చేస్తూ బ్రతకాలనికాదు.
శూద్రులు తపస్సు చేసి బ్రహ్మలగుట రాజ్యాలేలుట, వస్తువిక్రయము చేయుట పురాణాల్లో కనిపిస్తుంది. అనగా శూద్రులే ఆయా వర్ణాల పనులలో సాయపడి, ఆ పనిని బ్రహ్మాండంగా చేయడంతో వారిని ఆ వర్ణము వారినిగా గుర్తించి వుంటారు. కాబట్టి హిందూ మతంలో అప్పటికి కులాల్లేవు.
మహాపద్మ నందుడు శూద్రుడైనా తన భుజబలం వల్ల అధ్యయనశక్తి వల్ల క్షత్రియవర్ణుడై సామ్రాజ్యాధిపతి అయ్యాడు. తరువాత సమ్రాట్టయిన చంద్రగుప్తమౌర్యుడు కూడా ఇప్పటి “కులపు రాజకీయ లెక్కల”ను బట్టి సంపూర్ణ క్షత్రియుడు కాదు. కాబట్టి వర్ణాలు వర్ణాలే. కులాలు కులాలే.)
పురుషుని దేహంలో నాభినుండి పైభాగం పరమ పవిత్రంగా భావింపబడుతుంది. అందులోనూ తలభాగం అత్యున్నతం. అక్కడనుండి ఉత్పన్నమైన బ్రాహ్మణ వర్ణమందుకే ఉత్తమోత్తమము. వారి మాటే వేదమంత్రం. బ్రహ్మయే మిక్కిలి తపస్సు చేసిన తరువాత యజ్ఞాలను నిలబెట్టే ఈ వర్ణాన్ని సృజించాడు. అంటే ఈ ప్రపంచాన్ని అజ్ఞానాన్నుండి, కాలుష్యాన్నుండి రక్షించడం అనే బాధ్యతలో సింహభాగం ఈ వర్ణానిదే.
జంగమ స్థావరాత్మక జగతిలో కదలిక గల ప్రాణులు గొప్పవి. వాటిలో శరీరంతో కంటే బుద్ధితో జీవనం గడిపే మానవుడు అధికుడు. మానవులలో బ్రాహ్మణులు, వారిలో విద్వాంసులు, వారిలో కృతబుద్ధులు - అనగా మంత్రద్రష్టలు, స్రష్టలు - వారిలో బ్రహ్మవేత్తలు - అనగా బ్రహ్మజ్ఞానులు శ్రేష్టులు. బ్రాహ్మణజన్మ ధర్మ సంపాదన, ధర్మా చరణలను చేయడానికి, సమాజాన్ని ధర్మం ద్వారా కాపాడడానికే ఉద్దేశింపబడింది. బ్రహ్మ ఉద్దేశ్యాన్ని విజయవంతం చేసినవారు జన్మానంతరం బ్రహ్మలోకాన్ని పొందుతారు”.
శతానీకుడు ఇలా ప్రశ్నించాడు “ఓ మహామునీ! బ్రహ్మలోకము, బ్రహ్మత్వము అతి దుర్లభములు కదా! బ్రాహ్మణులలోని ఎటువంటి గుణాల వల్ల ఈ దుర్లభపదము వారికి ప్రాప్తిస్తున్నది?”
“మహారాజా! ఇది నిజంగా అధ్యయనం చేయవలసిన విషయమే. వేదాలలోనూ, శాస్త్రాలలోనూ ఈ బ్రాహ్మణ గర్భ, పుంసవనాదులు నలభైయెనిమిది సంస్కారాలున్నట్టు చెప్పబడింది. విధిపూర్వకంగా ఏ బ్రాహ్మణునికి ఈ సంస్కారాలు జరుపబడతాయో అతడే బ్రహ్మలోకాన్ని చేరడంగాని, స్వయం బ్రహ్మత్వం పొందడం గాని సంభవం”.
“మహాత్మా! నాకు చాలా కుతూహలంగా వుంది. దయచేసి ఆ సంస్కారాలను వివరించండి”
సుమంతుడు శతానీకుని అవసరాన్ని అర్థం చేసుకున్నవాడై ఇలా చెప్పసాగాడు.
“ఓ మహారాజా! గర్భాదానము, పుంసవనము, సీమంతము, జాతకర్మ, నామకరణ, అన్నప్రాశ్న, చూడాకర్మ, ఉపనయనము, వేదవ్రతము, వేదస్నానము, వివాహము, (దేవతలు, పితృదేవతలు, మనుష్యులు, భూతములు, బ్రహ్మ - తృప్తిపొందే సంస్కారాలు పంచ మహాయజ్ఞాలు.) పంచమహాయజ్ఞాలు, (సప్తపాకయజ్ఞాలు: పితృకర్మహవనము, బలి వైశ్వదేవం.) సప్తపాకయజ్ఞాలు అష్టకాద్వయాలు, మొదలగు నలుబది ఉన్నాయి. అవికాక ఎనిమిది ఆత్మగుణాలుంటాయి. మొత్తము నలభై ఎనిమిది.
బ్రహ్మప్రాప్తిని సాధించిపెట్టే ఈ ఎనిమిదిగుణాల శ్లోకానికి ప్రతి బ్రాహ్మణుడూ ఆదర్శోదాహరణ కావాలి.
అనసూయా దయాక్షాంతిరనాయాసంచ మంగళం
అకార్పణ్యం తథా శౌచమస్పృహాచ కురూద్వహ.
ఇతరుల మంచిగుణాల్లో కూడా చెడును వెతికి దాన్ని వృద్ధిచెయ్యడం అసూయ. దానికి వ్యతిరేకం అనసూయ. అంటే అందరిలోనూ అంతా మంచినే చూడడం. దయా(ఇతరుల దుఃఖాన్ని దూరంచేయడం - దయ), క్షమా(ఇతరుల తనకెంత మానసిక, శారీరక క్షోభను కలిగించినా వారిపై క్రోధంలేకుండా వుండడం - క్షమ.), అనాయాసం(ప్రతిచిన్న విషయానికీ ప్రాణాలొడ్డకుండా ప్రశాంతంగా ప్రవర్తించడం - అనాయాసం.), మంగళం(మంగళకర వస్తువులనే ధరించడం - మంగళం.), అకార్పణ్యం, శౌచం, అస్పృహ - ఈ ఎనిమిదీ ఆత్మ గుణాలనబడతాయి.
శౌచమనే గుణానికి పరిశుభ్రత అనేకాక తినకూడని వస్తువులను తినకుండా వుండడం, నిందిత జనులకు దూరంగా వుండడం, సదాచరణలోనే స్థిరంగా నిలబడి పోవడం అనే ఉద్దేశ్యాలు కూడా వున్నాయి.
ఏళ్ళతరబడి శమించి, ధర్మమార్గంలోనే సంపాదించిన ధనాన్ని ఉదారంగా దానం చెయ్యడం అకార్పణ్యంలోని అంతరార్ధం. సంతుష్టి, ఇతరుల ధనాన్ని ఆశించకుండా వుండడం అస్పృహ.
ఈ అష్టగుణాలనూ కలవానికి, ఇంతకు ముందు చెప్పిన సంస్కారాలనూ పొందియున్నవానికి బ్రహ్మలోకము, బ్రహ్మత్వమూ ప్రాప్తిస్తాయి.
అలాగే గర్భశుద్ధిని కలిగియుండి, అన్ని సంస్కారాలూ విధివిధాయకంగా సంపన్నమైయుండి, ఎవరైతే వర్ణాశ్రమధర్మాన్ని పాలిస్తారో వారికి, (ఏ వర్ణం వారైనా) ముక్తి ప్రాప్తిస్తుంది.
Summary of chapter 1 of the Bhavishya Purāṇa is as follows:
Sūta Mahāṛṣi opens the Bhaviṣya Mahāpurāṇa by recounting how the sage Sumanta narrated this Purāṇa to King Śatānīka, son of Janamejaya. The chapter establishes the unbroken transmission lineage — from Brahma to Sūrya, from Sūrya to Manu, from Manu through successive ācāryas to Vedavyāsa, who condensed the original hundred-crore ślokas into the eighteen Mahāpurāṇas. The Bhaviṣya Mahāpurāṇa's distinctive scope is announced: it reveals what has been, what is, and what shall be. The five-parva structure — Brahma Parva, Madhyama Parva, Pratisarga Parva, Bhāvī Parva, and Uttara Parva — is briefly enumerated, orienting the listener to the vast sacred narrative that follows.