మత్స్యావతార కథనము

నైమిశారణ్యమున నివసించుచు ద్వాదశ వార్షిక బ్రహ్మసత్రము అను దీర్ఘసత్రయాగము జరుపుచుండిన మహామునులు ఆ సత్రయాగపు విరామకాలమున ఏకాగ్రమనస్సుతో ఉన్న సూతుడు అను కథకుని సన్నిధికి వెళ్లిరి. అంతవరకును ఆయన ఆ దీర్ఘసత్రయాగ విరామ సమయములందు ధర్మవంతములును, మనోహరములును అగు పురాణ కథలు వినిపించగా, మునులు ఆ కథలను ఆయన వాటిని తమకు చెప్పిన విధమును మెచ్చుకొనిరి. తరువాత వారు ఆయనను దివ్యమగు పురాణ సంహిత విషయమున ఇట్లు ప్రశ్నించిరి. “అనఘా! మీరు మాకు ఇంతవరకు కొన్ని పురాణములు ప్రవచించితిరి. అవి అమృతముతో సమానముగా ఉన్నవి. ఇంకను వినవలెనని మాకు వేడుకగ ఉన్నది. భగవానుడు ఏకారణమున, ఏవిధముగ మత్స్య రూపమును ధరించి సృష్టిచేసెను? శివునకు భైరవుడు అనియు, పురారి అనియును, కపాలి అనియు పేరులు కలవుకదా! వీటికి హేతువు ఏమి? ఇది అంతయు వివరముగా మాకు చెప్ప వేడుచున్నాము. మీ వాక్యములు సాక్షాత్ అమృతమే. ఇంత వరకును ఎంతగ వినినను మాకు తృప్తి కలుగుటలేదు” అని పలికిరి.

అది విని సూతుడు, మహామునులారా! సాక్షాత్ విష్ణువే చెప్పిన మత్స్య పురాణమును మీకు ఇప్పుడు చెప్పుచున్నాను వినుడు. అది పుణ్యకరము, పవిత్రము, ఆయువును వృద్ధి చేయునట్టిది. పూర్వము సూర్యుని కుమారుడు అయిన మనువు అను రాజు ఉండేవాడు. ఆయన ఆత్మ సంస్కారగుణములన్నీ కలవాడు, క్షమాగుణము కలవాడు. అతడు తన కుమారునకు రాజ్యము అప్పగించి మలయ పర్వతము మీద ఉత్తమ తపమాచరించెను. సుఖదుఃఖములయందు సమదృష్టి కలిగి ఉత్తమ యోగసాధనను అవలంబించెను. పదిలక్షల ఏండ్లు గడచిన తరువాత బ్రహ్మ వరమీము ఈయదలచి ఆయన ఎదుట ప్రత్యక్షమయ్యెను. వరము కోరుకొమ్మని మనువుతో పలికెను. మనువు బ్రహ్మకు నమస్కరించి “అన్నిటికంటె ఉత్తమమగు ఒకే ఒక వరము నేను మిమ్ము వేడుచున్నాను. ప్రళయము సంభవించినప్పుడు స్థిరములు, చరములు ఆగు ప్రాణులను రక్షించుటకు నేను శక్తిగలవాడను కావలయును” అని పలికెను. బ్రహ్మ అట్లే కానిమ్మని పలికి అంతర్ధానమయ్యెను. ఆ సమయమున దేవతలు ఆకాశము నుండి పూలవాన కురిపించిరి.

ఒకానొకనాడు మనువు తన ఆశ్రమమున పితృతర్పణము చేయుచుండగా, ఒక ఆడు చేప నీటితో కూడి అతని రెండుచేతులు కలసిన దోసిలి పై పడెను. ఆరాజు ఆచేపరూపమును చూచి దయకలిగి దానిని రక్షింపదలచి తన కమండల జలములలో వేసెను. ఆ మత్స్యము ఒక అహోరాత్రములో పండ్రెండంగుళముల పొడవు కలదై ముఖము ఎత్తి మనువును చూచి “రక్షించుము, రక్షించుము” అని పలికెను. మనువు ఆ చేపను తీసికొని వెడల్పైన మూతిగల మట్టి పాత్రలో వేసెను. అచ్చట అది ఒక అహోరాత్రములో మూడు మూరలంతగా పెరిగెను. మరల ఆ చేప ఆర్తనాదముచేయుచు మనువుతో నేను నిన్ను శరణు పొందితిని, రక్షించు, రక్షించుమనెను. మనువు దానిని బావిలో పడవైచెను. అదిబావిలోను ఇమడక ఆక్రందనము చేయగా మనువు దానిని సరోవరమున పడవైచెను. అది అచ్చట రెండు యోజనములంత పెద్దది అయ్యెను. అచ్చటను అది దీనముగా రక్షించు, రక్షించుము అని ఆ రాజుతో పలికెను. అంతట అతడు దానిని గంగలో వేయగా అది ఆ నది నిండి సరిపోవునంతగా పెరిగెను. అపుడు ఆ రాజు దానిని సముద్రమున వేసెను. అపుడది సముద్రమంతట వ్యాపించగా,మనువు భయపడి నీవు ఎవ్వరవు? రాక్షస రాజువా? లేక వాసుదేవుడవా? అటుకానిచో నీవు ఎటు పెరుగుదువు? రెండు లక్షల యోజనములంత శరీరము ఎవరికి ఉండును? కేశవా! నీవు మత్స్యరూపుడవై, నన్ను శ్రమపెట్టు చున్నావు. హృషీకేశా! జగన్నాథా! జగద్దామా! నీకు నమస్కారము అని మనువు పలుకగా మత్స్యరూపుడగు ఆ భగవానుడు, జనార్దనుడు అనఘా! నీవు సత్యము గ్రహించితివి. అచిర కాలముననే ఈ భూమీ, పర్వతములు, మహావనములు, సర్వము నీటమునుగును. ఇదిగో! ఈ నౌకను జీవసమూహములను రక్షించుటకై నేను దేవతలచేత నిర్మింపజేసితిని. స్వేదజములు-చెమటనుండి, ఉష్ణము నుండి పుట్టు దోమలు; అండజములు-గ్రుడ్ల నుండి పుట్టు, పక్ష్యాదులు; ఉద్భిజములు-నేలను చీల్చుకొని పుట్టు మొక్కలు, చెట్లు, జరాయుజములు-మావినుండి పుట్టునవి వాయువశమున కడలిపోవునెడల నీవు ఈ నౌకను నా కొమ్మునకు కట్టివేయుము. ప్రళయకాలము ముగిసిన తరువాత స్థిరచర రూపమయిన ఈ జగత్తునకంతటికి నీవు ప్రజాపతివగుదువు. ఇట్లు కృతయుగారంభమున సర్వజ్ఞుడు, భగవానుడు, ఋషి, మన్వంతరమునకు అధిపతి అయి నీవు దేవతలచేత పూజింపబడెదవు అని ఆజ్ఞ ఇచ్చెను.