అగ్ని మహా పురాణము

Table of Contents

278 - అథ పురువంశవర్ణనమ్

ఆగ్ని రువాచః

అగ్ని దేవుడు పలికెను. పురపునకు జనమేజయుడు, వానికి ప్రాచీవంతుడు, వానికి మనస్యుడు వానికి వీతమయుడు, వానికి శంధుడు, వానికి బహువిధుడు, వానికి సంయాతి, దానికి రహోవాది, వానికి భద్రాశ్వుడు పుట్టెను. భద్రాశ్వునకు ఋచేయు-కృషేయు-సంనతేయు-ఘృతేయు-చితేయు-స్థండిలేయు-ధర్మేయు-సంనతేయు-కృతేయు మతినారులను పదిమంది పుత్రులు పుట్టిరి. మతినారునకు తంసురోధ-ప్రతిరథ-పురస్తులను ముగ్గురు పుత్రులు పుట్టిరి. ప్రతిరథునకు-దుష్యంత-ప్రవీరక-సుమంత-వీరవరులను నలుగురు పుత్రులుపుట్టిరి. దుష్యంతునకు భరతుడుపుట్టెను. భరతుడ శకుంతలా పుత్రుడు; మహాబలశాలి. ఇతని వంశమున పుట్టిన వారికి భారతులను పేరు వచ్చినది. భరతుని పుత్రులు మాతృక్రోధముచే నశించగా, రాజుయజ్ఞముచేసెను. అపుడు మరుద్గణములు బృహస్పతి పుత్రుడగుభరద్వాజుని తీసుకొనివచ్చి ఆతనిని ఆరాజునకు పుత్రునిగాయిచ్చిరి. ఇతడు వితధుడనే పేరుతో ప్రసిద్ధుడయ్యెను వితథునకు సుహోత్ర సుహోత్రు గయ-గర్భ కపిలులు అను ఐదుగురుపుత్రులు పుట్టిరి. వీరుకాక మహాత్ముడు సుకేతువు అను ఇరువురు పుత్రులు పుట్టిరి పిదప కౌశికుడు గృత్సపతి అను పుత్రులు కూడ బుట్టిరి గ్నత్సపతికి బుట్టిన అనేక కుమారులలో బ్రాహ్మణులు క్షత్రియులు, వైశ్యులు అందరును వుండిరి. కాశ-దీర్ఘతములుగృత్సపతి కుమారులే, దీర్ఘతమునకు ధన్వంతరి వానికి కేతుమంతుడు, వానికి కేతుమంతుడు వానికి దివోదాసుడను ప్రసిద్దిగల హిమరథుడు, వానికి ప్రతర్దనుడు వానికి భర్గ-వతులు. వత్సునకు అనర్కుడు-వానికి క్షేమకుడు-వానికి వర్షకేతువు-వానికి విభుడు, వానికి అనర్త-సుకుమారులు, సుకుమారనకు సత్యకేతువు పుట్టెను, వత్సరాజునకు వత్సభూమియను పుత్రుడు పుట్టెను. వితథుని కుమారుడగు సుహోత్రునకు బృహత్ అనుపుత్రుడు పుట్టెను. బృహత్తునకు అజమీడ ఎద్విమీడ పురుమీడులను ముగ్గురు పుత్రులు పుట్టిరి. ఆజ మిథునకు కేశినియను భార్యయందు జహ్ను పుపుట్టెను ఆతనికి ఆజకాశ్వుడు ఆతనికిబలాకాశ్వుడు ఆతనికి కుళికుడు, ఆతనికి ఇంద్రత్వమును సంపాదించినగాధి ఆతనికి సత్యవతి యను కుమార్తె యు, విశ్వామిత్రుడను కుమారుడును పుట్టెను దేవ రాతక తిముఖాదులు విశ్వామిత్రుడి పుత్రులు. ఆజమీడునకు శువ శ్శేపుడు, అష్టకులను పేరుగల ఇతర పుత్రులును పిట్టిరి. ఆతనికి నీలినీయను భార్యయందు శాంతియను మరొక పుత్రుడు కూడ పుట్టెను. శాంతికి పురుజాతి-వానికి బాహ్యశ్వుడు, వానికి ముకుల-సృంజయ-బృహదిమ-యమీనర-కృమిలులను ఐదుగురుకుమారులును పుట్టిరి. వీరికి పాంచాలులని ప్రసిద్ధి. ముకుల వంశీయులకు కుల్యులని పేరు. వీరు క్షాత్రధర్మమును అనుసరించు బ్రాహ్మణులు. ముకులునకు చంచాశ్వుడు వానికి ఒక పుత్రుడు పుతి కవలలు పుట్టిరి. పుత్రుని పేరు దివోదాసుకు పుత్రిక పేరు అహల్య, ఆహల్యకు శరద్వంతుని (గౌతముని) వలన శతానందుడు పుట్టెను శకానందునకు సత్యధృక్ అను పుత్రుడు పుట్టెను. వానికి కృపుడు ఆను పుత్రుడు, కృపియను పుత్రిక కవలగా పుట్టిరి. దివోదాసునకు మేతీయుడు దానికి సోమకుడు, పట్టెను. సుబుంజయునకు పంచహనుష్కడు ఆతనికి సోమదత్తుడు, ఆతనికి సహదేవుడు ఆతనికి సోమకుడు, ఆతనికి జంతువు, ఆతనికి పృషత్, వానికి ద్రుపదుడు, వానిధృష్టద్యుమ్నుడు, వానికి దృష్టకేతువు పుట్టెను. అజమీడునునకు ధూమినీయను భార్యయందు ఋక్షుడను పుత్రుడు పుట్టెను ఆతనికి సంవర సుపు, ఆతనికి కురవుపుట్టెను అతడు ప్రయాగ నుంచి కురుక్షేత్ర తీర్థమును స్థాపించెను.

కురువునకు సుధన్వుడు సుధనుడు, పరీక్షిత్తు, రిపుంజయుడు ఆను నలుగురు పప్రులు పుట్టిరి సుధన్వునకు సుహో తుడు వానికి చ్యవనుడు పుట్టెను. చ్యవనుని భార్యయైన గిరికయందు ఉపరిచరవసువు ఆంశచే-బృహద్రథ-కుశ-వీర-యదు-ప్రతిగ్రహ-బల-మత్స్యకాళి-ఆను ఏడుగురు పుత్రుజపుట్టిరి. బృహద్రథునకు కుళాగ్రుడు వానికి వృషభుడు, వానికి సుధన్వుడు, జానికి ఊర్ణుడు, వానికి సంభవుడు వానికి జరాసంధుడు, వానికి సహదేవుడు వానికి ఉదాపి వానికి శతకర్మ పుట్టెను. కురుసంచనుడైన పరీక్షిత్తువకు జనమేజయుడను పుత్రుడు పుట్టెను ఇతడు పరమధార్మికుడు. ఇతనికి త్రసద్దస్యువు అను పుతడుపుట్టెను. ఆజు మీడుని కుమారుడగు జుహ్న నకు సురథ-శ్రుతసేన-ఉగ్రసేన-భీమ సేనులను నలుగురు పుత్రులు పుట్టిరి. పరీక్షిత్ కుమారుడగు జనమేజయునకు సురథుడు మహిమంతుడు. అను పుతులు పుట్టిరి. సురథునకు విదూరథుడు, వానికి ఋషుడు, పుట్టెను. ఈవంశములో ఇతడు ఋషుడను పేరుతో ప్రసిద్దుడగు రెండవరాజు. ఇతనికి భీమసేనుడు, వీనికి ప్రతీపుడు వీనికి శంతనుడు, వీనికి దేవాపి-బాహ్లిక-సోమ దత్తులను ముగ్గురు కుమారులు జన్మించెను. బాహ్లికునకు సోమదత్తుడు, వానికి భూరి-భూరిశ్రవస్-శలులు పుట్టిరి. శంతనునకు గంగయందు భీష్ముడు పుట్టెను. కాల్య (సత్యవతి) యను భార్యయందు విచిత్రవీర్యుడు పుట్టెను. విచిత్ర వీర్యుని భార్యయందు శ్రీకృష్ణద్వైపాయనునకు-ధృతరాష్ట్ర పాండు విదురులు పుట్టిరి. పాండువు భార్యయగు కుంతికి యుధిష్ఠిర, భీమ, అర్జునులు, మాడ్రికి నకుల సహదేవులు పుట్టిరి. ఈ ఐదుగురు పాండవులును దేవాంశ సంభూతులు. అర్జునుని పుత్రుని పేరు ఆభిమన్యుడు. సుభద్రక పట్టినవాడు ఆభిమన్యునకు పరీక్షిత్తు అను పుత్రుడు పుట్టెను. ద్రౌపది పంచ పాండవుల భార్య, ఆమెయందు యుధిష్ఠిరువకు ప్రతి వింద్యుడు. భీమసేనునకు శ్రుతసోముడు, అర్జునునకు శ్రుతకీర్తి, సహదేవునకు శతకర్మ, నకులునకు శతానీకుడు పుట్టెను. భీమసేనునకు హిడింబయందు పుట్టిన ఘటోత్కచుడను మరియొక పుత్రుడుండెను. వీరందరును భూతకాలమునకు చెందిన రాజులు - భవిష్యత్తులో రాబోవు రాజుల సంఖ్యను ఎవరు చెప్పజాలరు, వీరందరును కాలగ్రస్తులై గడచిపోయిరి. ఓ వశిష్ఠా ! కాలము విష్ణు స్వరూపము, అందుచేత ఆవిష్ణువునే పూజించవలెను. ఆ విష్ణువునే ఉద్దేశించి అగ్నిలో హోమము చేయుము. ఆతడే సర్వమును ఇచ్చువాడు.

ఆగ్ని మహాపురాణమున కురువంశవర్ణనమను రెండువందల డెబ్బది ఎనిమిదవ ఆధ్యాయము సమాప్తము.