అగ్ని మహా పురాణము

Table of Contents

35 - అథ పవిత్రాధివాసనాది విధిః

ఆగ్ని దేవుడు చెప్పెను :- సంపాతాహుతి చేత పవిత్రలను తడిపి వాటి ఆధివాసనము చేయవలెను, నృసింహ మంత్రమును జపించి, వాటిని ఆభిమంత్రించి, అస్త్రమంత్రముచే (ఆస్త్రాయ ఫట్) వాటిని సురక్షితములు చేయవలెను. పవిత్రలకు వస్త్రములు చుట్టి ఉండగనే పాత్రములో ఉంచి వాటిని ఆభిమంత్రించవలెను. బిల్వాడిసంసృష్ట మైన జలముతో, మంత్రోచ్చారణపూర్వకముగ వాటిని ఒకటి రెండు సార్లు ప్రోక్షించవలెను. కుంభపాత్రమునందు పవిత్రలను ఉంచి, గురువు, వాటి రక్షణనిమిత్తము, ఆ పాత్రను తూర్పున సంకర్షణమంత్రముతో దంతచాషమును, ఉసరికాయను, దక్షిణమున ప్రద్యుమ్న మంత్రముతో భస్మమును, తిలలను, పశ్చిమమున నారాయణమంత్రముతో కుశోదకమును ఉంచవలెను. పిమ్మట ఆగ్నేయమునందు హృదయమంత్రముతో కుంకుమమును, గోరోచనమును, ఈశాన్యదిక్కునందు శిరోమంత్రముతో ధూపమును, నైరృతి చెక్కునుందు శిఖామంత్రముతో దివ్యమూ పుష్పములను, వాయవ్యదిక్కునందు కవచమంత్రముతో చందన-జల-ఆక్షత-దధి-దూర్వలను దొన్నెలో ఉంచవలెను. ముడపమును త్రిసూత్రముతో చుట్టి మరల అన్ని ప్రక్కల ఆవాలు చల్లవలెను.

ఏ క్రమమున దేవతల పూజ జరిగినదో ఆ క్రమముగనే ఆ దేవతలకు, వారి వారి మంత్రముల నుచ్చరించుచు గంధపవిత్రము లర్పింపవలెను. ద్వారపాలాదులకు గూడ నామమంత్రములతో గంధపవితము లర్పింపవలేను. ఈ క్రమమునే పాటించుచు కుంభమున మహామ్లపును ఉద్దేశించి. “ఓ దేవా! ఇది నీ తేజస్సునుండియే పుట్టినది. సుందరమైనది. సర్వపాపవినాశకము. ఇది అన్ని మనోరథములను ఇచ్చునది. దీనిని నీకు సమర్పించుచున్నాను” అని పలుకుచు పవిత్రకమును సమర్పింపవలెను. ధూపదీపాదుల ద్వారా బాగుగా పూజ చేసి మండపద్వార సమీపమునకు వెళ్ళి, గంధపుష్పాక్షి తలతో గూడిన ఆ పవిత్రకమును తాను కూడ “ఇది విష్ణుతేజోరూప మైనది. మహాపాతకములను నశింప చేయునది. ధర్మార్ధకామము సిద్ధికై దీనిని ధరించుచున్నాను” అని చెప్పుచు ధరింపపలెను. ఆసనముపై శ్రీహరిపరివారమునకును గురువునకును, పవిత్రకము నీయవలెను. గంధపుహ్పాక్షతాదులచే శ్రీహరిని పూజించి, గంధపుష్పాదులతో పూజించిన పవిత్రమును శ్రీహరికి సమర్పింపవలెను. ఆ సమయమున “విష్ణుతేజో భవమ్” ఇత్యాది మూలమంత్రమును పఠించవలేను. పిమ్మట ఆగ్న్యధిష్ఠాతగా నున్న మహావిష్ణువు నకు పవిత్రకము సమర్పించి ఇట్లు ప్రార్థింపవలెను.

కేశవా! నీవు, క్షీరసాగర మున శేషశయ్యపై శయనించి యున్నావు, నేను ప్రాతఃకాలమున నీ పూజ చేసెదను. నీవు ఇచట ఉపస్థితుడవు కమ్ము! పిమ్మట ఇంద్రాది దిక్పాలకులను, శ్రీవిష్ణుపార్షదులకును బలి సమర్పింపవలెను. పిమ్మట రోచనా - కర్పూర - కేసర - గంధాదులచే అలంకృతమై రెండు. వస్త్రములుంచిన జలపూర్ణకలశమునకు మహామంత్రముతో పూజ చేయవలెను. మండపమునుండి బైటకు వచ్చి తూర్పున ఆలికిన మండలత్రయమునందు వరుసగా పంచగవ్యములను, చదువును, దంతకాష్ఠమును ఉంచవలెను. రాత్రి పురాణశ్రవణ - స్తోత్రపాధాదులతో జాగరణము చేయవలెను. పరులకు భృత్యులుగా ఉండువారు, బాలులు, స్త్రీలు, భోగిజనులు మొదలగు వారి గంధపవిత్రములు తప్ప మిగిలిన వాటికి అప్పుడే ఆధీవాసనము చేయవలెను.

అగ్ని మహాపురాణమునందు పవిత్రాదివాసనమను ముప్పదియైదవ అధ్యాయము సమాప్తము.