అగ్ని మహా పురాణము

Table of Contents

90 - అథ అభిషేకాది.

పరమేశ్వరుడు చెప్పెను:- శివపూజానంతరము గురువు శ్రీప్రాప్తికై శిష్యాదులకు స్నానము చేయించవలెను. ఈశాన్యాది దిక్కులందు ఎనిమిది కలశములను, మధ్య ఒక కలశమును స్థాపించవలెను. ఆ ఎనిమిది కలశములలో వరుసగ క్షారోదక-క్షీరోదక-దధ్యుదక-మృతోదక-ఇక్షుకసోదక-సురోదక-స్వాదూదక- గర్బోదకసముద్రముల ఆవాహనము చేసి, క్రమముగ శిఖండి-శ్రీకంఠ-త్రిమూర్తి-ఏకరుద్ర–ఏకనేత్ర-శివోత్తమ-సూక్ష్మ-ఆనంతరుద్రు లను ఎనమండుగురు విద్వేశ్వ రులను స్థాపించవలెను. మధ్యనున్న కలశములో శివ-సముద్ర-శివముత్రములను స్థాపించవలెను యాగమండప దిక్కునందు స్వామికొరకై ఏర్పరచిన స్నానమండపమునందు రెండు బెత్తుల పొడవు, ఎనిమిది అంగుళముల ఎత్తు గల ఒక వేది నిర్మించవలెను. దానిపై కమలాద్యాసనములు కప్పి, దానిపై ఆసనస్వరూపుడైన ఆవంతుని న్యాసము చేసి శిష్యుని పూర్వాభిముఖముగ కూర్చుండ బెట్టి సకలీకరణపూర్వకముగ పూజ చేయవలెను. అతని శరీరమునకు గంజి, అన్నము, మట్టి, భస్మము, దూర్వలు, గోమయగోళములు, ఆవాలు, పెరుగు, ఉదకము వ్రాసి క్షారోదకాదిక్రమమున, నమస్కార సహితము అగ విద్వేశ్వరనామ మంత్రములతో, కలశ జలములో శిష్యునికి స్నానము చేయించవలెను. శిష్యుడు మనస్సులో తాను అమృతము చే స్నానము చేయించబడుచున్నట్లు భావన చేయవలెను. పిదప ఆతనికి రెండు శ్వేతవస్త్రములు కట్టించి శివుని కుడి వైపున కూర్చుండబెట్టవలెను. పైన చెప్పిన ఆసనమునందు శిష్యునకు, వెనుకటి వలెనే, మరల పూజ చేయవలెను. పిమ్మట ఆతనికి తలబాగ, కిరీటము, యోగపట్టిక, కర్తరి, చిన్న పాత్ర. అక్షమాల, పుస్తకము, పల్లకి మొదలగునవి ఇచ్చి ఆతనికి అధికారము నీయవలెను. నేటినుండి నీవు బాగుగ తెలిసికొని పరీక్షించి, ఎవని కైనను దీక్షా-వ్యాఖ్యా-ప్రతిష్టాదుల ఉపదేశము నిచ్చు చుండుము. అని ఆజ్ఞను వినిపింపవలెను. శిష్యుని అభివాచనము స్వీకరించి, మహేశ్వరునకు ప్రణామము చేసి, విఘ్న సమూహనివారణార్థమై “పరమేశ్వరా! నీవు గురుస్వరూపుడవు. ఈ శిష్యునకు అభిషేకము చేయుటకై నాకు ఆజ్ఞ ఇచ్చితివి. తదనుసారము నేను అభిషేకము చేసితిని. ఇతడు సంహితాపారంగతుడైనాడు” అని పలుకుచు ప్రార్థించవలెను. మంత్రచక్రతృప్తికొరకై ఐదేసి ఆహుతు లిచ్చి మరల పూర్ణాహుతి చేయవలెను. పిమ్మట శిష్యుని తన కుడి ప్రక్క కూర్చుండబెట్టుకొని, ఆతని కుడి చేతి బొటనవ్రేలు మొద లగు వ్రేళ్ల కు, దర్భాగ్రములు కాల్చిన మసి పూయవలెను. వాని చేతిలో పుష్పము లుంచి ఆతనిచే కలశ-అగ్ని - శివులకు - నమస్కరింపచేయవలెను. “నీవు శాస్త్రానుసారముగ బాగుగా పరీ క్షించి శిష్యులను అనుగ్రహించవలెను” అని ఆతనికి ఉపదేశించవలెను. మానవాదులకు అభిషేకము రాజాభిషేకము వలె చేయుటచే అభీష్టసిద్ధి కలుగును. “ ఓం శ్రాం శ్రౌం పళు హూం ఫట్” అనునది ఆస్త్రరాజమైన పాశుపతమంత్రము. దీనితో అస్త్రరాజమును పూజించి, అభిషేకము చేయవలెను.

అగ్ని మహాపురాణమునందు అభిషేకాదివిధివర్ణన మను తొంబదవ అధ్యాయము సమాప్తము.