అగ్ని మహా పురాణము

Table of Contents

65 - అథ సభాది స్థాపన కథనమ్

హయగ్రీవుడు చెప్పెను; ఇపుడు సభాదులను స్థాపించు విధానము చెప్పెదను. భూమి పరీక్ష చేసి అచట వాస్తుపరీక్ష చేయవలెను. ఇచ్చానుసారముగ దేవసభా నిర్మాణము చేసి, ఇచ్ఛానుసారముగ దేవతా స్థాపన చేయపలెను. సభా నిర్మాణము నగర చతుష్పథమునందు గాని, గ్రామాదులలో గాని చేయవలెను. జనశూన్య ప్రదేశ ములందు చేయరాదు. దేవసభా నిర్మాణము చేసినవాడు పాపరహితుడై తన వంశము నంతను ఉద్దరించి స్వర్గమునందు ఆనందమనుభవించును. రాజసౌధము నిర్మించిన విధముగ శ్రీహరికి ఏడు అంతస్తుల దేవాలయమును నిర్మింపవలెను. ఇతర దేవతలకు కూడ అట్లే పూర్వాది దిక్కులందు ఏర్పడు ధ్వజాధ్యాయములలో వాటిలో విదిక్కుల ఆయమును విడువలేను. నాలుగు, మూడు, రెండు లేదా ఒకటి కాల లుండు గృహము నిర్మింపవలెను. వ్యయము ఆధికముగ నుండు పదముపై గృహము నిర్మింపరాదు. అచట నిర్మించిన గృహమునందు వ్యయ మధికముగ నుండును. ఆయ మధికముగ నున్న పీడ కలుగదు. అందుచే ఆయవ్యయములు సమభావములో నుండు నట్లు చూచు కొనవలెను. ఇంకి పొడవు వెడల్పులు ఎన్ని హస్తములుండునో వాటిని ఒక దానితో ఒకటి గుణింపగా వచ్చిన సంఖ్యకు ‘కరరాశి' అని పేరు. గర్గాచార్యుని జ్యోతిశ్శాస్త్రమునందు నిపుణు డగు ఆచార్యుడు దానిని ఎనిమిది రెట్లు చేయవలెను. దానిని ఏడు చేతభాగించగా వచ్చిన శేషము ‘వ్యయము'. లేదా కరరాశిని ఏడుచేత గుణించి దానిని మరల ఎనిమిదిచేత భాగించగా వచ్చిన శేషమును బట్టి ధ్వజాద్యాయములను కల్పించవలేను. ధ్వజము, ధూమము, సింహము, శ్వానము, వృషభము, ఖరము, గజము, ధ్వాంక్షము అను ఎనిమిది ఆయములు పూర్వాది దిక్కులందు ఏర్పడును.

            త్రిశాలాగృహమున కున్న అనేక భేదములలో మొదటి మూడును ఉత్తమ మైనవి. వీటిని ఈశాన్యమునందు నిర్మింపరాదు. దక్షిణమున అన్యగృహములతో గూడిన ద్విశాలాగృహము సర్వదా శ్రేష్టము. దక్షిణమున అనేక శాలా గృహము, ఏకకాలాగృహము గూడ ఉత్తమము. నైరృతిదిక్కునందు ఏక శాలాగృహము శ్రేష్టము. ఏక శాలాగృహములో మొదటి రెండు భేదములును (ధ్రువము, ధాన్యము అనునవి) ఉత్తమములు. మిగిలినవి, అనగా పంచమ-నవమ-దశమ-ఏకాదశ-త్రయోదశ-చతుర్దశ భేదములు భయ హేతువులు, చతుఃఖాలాగృహము సర్వదా ఉత్తమము; సర్వదోషరహితము, దేవతలకు ఒక అంతస్తు మొదలు, ఏడు అంతస్తు లుండునట్లు ఏర్పరుపవలెను. దానికి ద్వారవేధాది దోషములుగాని, ప్రాచీన వస్తువులు గాని ఉండకూడదు. దానిని మానవులకు చెప్పిన కర్మలు, ప్రతిష్ణా విధానము, అనుసరించి స్థాపించవలెను. గృహప్రవేశము చేయ నున్న గృహస్థుడు, సోమరితనము లేనివాడై, ఉదయముననే లేచి, సర్వౌషధులు కలిపిన జలముతో స్నానము చేసి, పవిత్రుడై, దైవజ్ఞులైన బ్రాహ్మణులకు నమస్కరించి, వారికి మధుర పదార్థములు భుజింప చేసి, వారిచే స్వస్తివాచనాదికము చేయించి, నడ్డిపై చేతులు పెట్టుకొని, పూర్ణకలశాదులతో సుశోభిత మగు తోరణములు గల గృహము ప్రవేశించవలెను. పిమ్మట ఏకాగ్రచిత్తుడై గోవు ఎదుట చేతులు జోడించి, ఈ పుష్టికారక మంత్రములు పఠింపవలెను. “ఓం వసిష్ఠునిచే పాలింపబడిన ఓ నందా! ధనసంతానాదుల నొసగి నా ఆనందమును వృద్ధిపొందింపుము. ప్రజలకు విజయము నిచ్చు భార్గవనందిని యైన జయా! నన్ను ధనసంపదలతో ఆనందింపచేయుము. అంగిరసుని పుత్రి యైన ఓ పూర్ణా! నా మనోరథములను ఈడేర్పుము. నన్ను పరిపూర్ణకాముని చేయుము. కాశ్యపకుమారి యైన భద్రా! నా బుద్దిని కల్యాణమయము చేయుము. అందరికిని ఆనందము నిచ్చు వసిష్ఠనందిని యైన నందా! నీవు సమస్త బీజములతో, ఓషధులతో కూడి, సకలరత్నాషధి పూర్ణురాలవై ఈ సుందర భవనమునందు ఆనలదపూర్వకముగ నివసింపుము. కశ్యప ప్రజాపతిపుత్రి వేన ఓ భద్రా! నీవు సర్వవిధముల సుందర మైనదానవు, మహత్వము కలదానవు. సౌభాగ్యశాలినివి. ఉత్తమ వ్రతమును పాలించుదానవు. నా ఇంటిలో ఆనందపూర్వకముగ నివసింపుము. దేవీ ! భార్గవీ! జయా! సర్వశ్రేష్టు లైన ఆచార్యులు నిన్ను పూజించిరి. చందనపుష్పమాలాలంకృతురాల వైన నీవు ప్రపంచమునందలి సకలైశ్వర్యములను ఇచ్చుదానవు. నా గృహమునందు ఆనందపూర్వకముగ విహరింపుము. అంగిరసుని పుత్రి పైన పూర్ణా! నీవు ఆవ్యక్త రూపిణివి. ఓ ఇష్టకాదేవీ! నీవు నాకు ఆభీష్టవస్తువుల నిమ్ము నా ఇంటిలో ఉండు మని కోరుచున్నాను. నీవు దేశ ప్రభువును గ్రామనగర ప్రభువులను, గృహప్రభువును అనుగ్రహించుదానవు. నా గృహమునందు జన - ధన - గజ-అశ్వ – గో-మహిష్యాదివృద్ధి కలుగు నట్లు చేయుము.

శ్రీ అగ్ని మహాపురాణమునందు సభాగృహస్థాపన మను అరువదియైదవ అధ్యాయము సమాప్తము.