అగ్ని మహా పురాణము

Table of Contents

36 - అథ విష్ణుపవిత్రారోపణ విధిః

అగ్ని దేవుడు చెప్పేను :- ప్రాతఃకాలమున స్నానాదికము చేసి, ద్వారపాలుల పూజ చేసిన పిదప గుప్తస్థానము నందు ప్రవేశించి, వెనుక అధివాసితము లైన పవిత్రకములనుండి ఒక దానిని ప్రసాదముగా గ్రహింపవలేను. మిగిలిన వస్త్రములును, అలంకారములను, గంధమును, నిర్మాల్యమును తొలగించి భగవంతునకు స్నానము చేయించి పూజ చేయవలయును. పంచామృత-కషాయ-గంధోదకములచే స్నానము చేయించి ముందుగనే సిద్దము చేసికొని ఉంచుకొనిన వస్త్ర-గంధ-పుష్పములను దేవునకు సమర్పింపవలెను. నిత్యహోమము చేసిన విధముగ ఆగ్నిలో హోమము చేసి, భగవంతుని స్తుతించి, ప్రార్థించి భగవచ్చరణముల పై శిరస్సు ఉంచవలెను. తన సమ స్తకర్మలను భగవంతునకు సమర్పించి పిదప నైమిత్తకపూజ చేయవలెను. ద్వారపాల-విష్ణు-కుంభ-వర్ధనులను ప్రార్థింపవలెను. “అతో దేవాః” ఇత్యాదిమంత్రముచే గాని, మూలమంత్రము గాని కలశము పై శ్రీహరిని ఈ విధముం ప్రార్థింపవలెను. “ఓ కృష్ణా! కృష్ణా! నీకు నమస్కారము. ఈ పవిత్రమును గ్రహింపుము. ఇది ఉపాసకుని పవిత్రునిగ చేసి సంవత్సరముపాటు చేయు పూజయొక్క సంపూర్ణ ఫలమును ఇచ్చును. పరమేశ్వరా! నేను చేసిన పాపములను నశింపచేసి నన్ను పరమపవిత్రుని చేయుము. సురేశ్వరా! నీ కృపచే నేను పరిశుద్దుడ నగుదును”. హృదయశిరోమంత్రములచే పవిత్రమునకును, తనకును అభిషేకము చేసి విష్ణుకలశమును ప్రోషించిన పిమ్మట దేవుని దగ్గరకు వెళ్ళవలెను. దేవుని రక్షాబంధమును తొలగించి, పవిత్రమును సమర్పించి - “ప్రభో! నేను నిర్మించిన ఈ బ్రహ్మసూత్రమును స్వీకరింపుము. ఇది కర్మపరిపూర్తిసాధనము. సాయం దేవిధ మైన దోషములను ఉండని విధమున ఈ పవిత్రారోపణకర్మను సంపన్నము చేయుము” అని ప్రార్థిం-వలెను.

ద్వారపాలులకును, యోగపీఠాసనమునకును, ముఖ్యగురువులకును పవిత్రకము సమర్పింపవలెను. వీటిలో కనిష్ట పవిత్రకమును (నాభివరకు వచ్చుదానిని) ద్వారపాలులకును, మధ్యనుపవిత్రక మును (తొడలవరకు వచ్చుదానిని) యోగ పీఠాసనమునకును, ఉత్తమపవిత్రకమును మోకాళ్ళ వరకు వచ్చుదానిని. గురువులకును ఇవ్వవలెను. వనమాలా పవితకమును (పాదములవరకు వచ్చుదానిని) మూలమంత్రముతో భగవంతునకు సమర్పింపవలెను. “నమో విష్వక్సేనాయ” అను మంత్రము చదువుచు విష్వక్సేనునకు కూడ పవిత్రకము సమర్పింపవలెను. అగ్నిలో హోమము చేసి అగ్నిలో నున్న విశ్వాదిదేవతలకు పవిత్రకము ఆర్పింపవలెను. పూజానంతరము ప్రాయశ్చితార్థమే మూలమంత్రముతో పూర్ణాహుతి చేయవలెను. అష్టోత్తర శతముతో గాని, ఐదు ఉపనిషన్మంత్రములతో గాని పూర్ణాహుతి ఇవ్యవలెను. అష్టోత్తరశతము లెక్క పెట్టుటకు, మణిమాల గాని, మందార పుష్పాదులు కాని ఉపయోగింపవలేను. చివర - “ఓ గరుడధ్వజా! నేను చేసిన ఈ వార్షికపూజ సఫల మగుగాక. వనమాల నీ వక్షస్థలమును ప్రకాశింపచేయుచున్నట్లే ఈ పవిత్రకతంతువులును, వీటి ద్వారా నేను చేసిన పూజలో తెలిసి గాని తెలియక గాని కలిగిన లోపములను, విధినిర్వహణములో విఘ్న ముం వలన కలిగిన లోపములను, కర్మలోపములను, తొలగించి, పూజ పూర్ణముగ సఫల మగునట్లు చేయుము” అని ప్రార్థించవలెను.

ఈ విధముగ ప్రార్థనానమస్కరములు, ఆపరాధక్షమాపణము చేసి, పవిత్రకమును శిరస్సుపై ఉంచవలెను. తగు విధముగ బలి ఇచ్చి, వైష్ణవగురువును దక్షిణలచే సంతోషపెట్టవలెను. ఒక దినమునగాని, ఒక పక్షముపాటు గాని భోజనవస్త్రాదుల నిచ్చి బ్రాహ్మణులను సంతోషపెట్టవలెను. స్నానసమయమున పవిత్రమును తీసివేసి పూజించవలెను. ఉత్సవదివసమునందు వచ్చువారి నెవరిని కాదనక ఆందరికిని తప్పక అన్న దానము చేసి తాను కూడా భోజనము చేయవలెను. విసర్దనంతసమున పవిత్రకమును పూజించి. “ఓ పవిత్రకమా! నేను చేసిన ఈ వార్షికపూజ సుసంపన్న మగునట్లు చేసితివి. ఇప్పుడు నిన్ను విసర్జించుచున్నాను. నీవు విష్ణులోకమునకు పొమ్ము” అని ప్రార్థింపవలెను. ఉత్తర-ఈశాన్యముల మధ్య విష్వక్సేనపూజ చేసి, ఆతని పవిత్రకమును పూజించి వాటిని బ్రాహ్మణులకు ఇచ్చివేయవలెను. ఆ పవిత్రక ములో ఎన్ని తంతువు లున్నవో అన్ని వేల యుగముల కాలము ఉపాసకుడు విష్ణులోకములో నివసించును. పవిత్రారోపణము చేసిన సాధకుడు తన వెనుక నూరు తరములను ఉద్దరించి, తనకు పూర్వము పది తరములవారిని తరువాతిపది తరముల వారిని విష్ణులోకమునకు చేర్చును. తాను కూడ ముక్తుడగును.

అగ్ని మహాపురాణమునందు విష్ణుపవిత్రారోపణవిధినిరూపణ మను ముప్పదియారవ అధ్యాయము సంపూర్ణము.