అగ్ని మహా పురాణము

Table of Contents

39 - అథ భూపరిగ్రహ వర్ణనమ్

            హయగ్రీవుడు చెప్పెను : బ్రహ్మ! ఇపుడు నేను విష్ణ్వాదిదేవతాప్రతిష్టను గూర్చి చెప్పెదను; సావధానముగ వినుము. ఈ విషయము నేను చెప్పిన పంచరాత్రస పరాత్రములను ఋషులు మానవలోకమునందు ప్రచారము చేసిరి. అవి మొత్తము ఆదిహయశీర్షతంత్రము, త్రైలోక్యమోహనతంత్రము, వైభవతంత్రము, పుష్పరతంత్రము, ప్రహ్లాద తంత్రము, గార్గ్యతంత్రము, గాలవతంత్రము, నారదీయతంత్రము, శ్రీ ప్రశ్నతంత్రము, శాండిల్యతంత్రము, ఈశ్వర తంత్రము, సత్యతంత్రము, శౌనక తంత్రము, వసిష్ణోక్త జ్ఞానసాగరతంత్రము, స్వాయంభువతంత్రము, కాపిలతంత్రము: తార్ఘ్య (గారుడ) తంత్రము, నారాయణీయతంత్రము, ఆత్రేయతంత్రము, నార సింహ తంత్రము, ఆనంద తంత్రము, బౌధాయన తంత్రము, అష్టాంగ తంత్రము, విశ్వతంత్రము అని ఇరువది యైదు తంత్రములు.

ఈ తంత్రముల ప్రకారము - మధ్యదేశాదులలో జనించిన ద్విజుడు దేవతావిగ్రహముల ప్రతిష్ఠ చేయవలెను. కచ్చదేశము, కావేరీతటవర్తిదేశము, కొంకణదేశము, కామరూప - కలింగ-కాంచీ - కాశ్మీరదేశములు - వీటియందుపుట్టిన బ్రాహ్మనుడు దేవ ప్రతిష్టాదికము చేయరాదు. ఆకాశము, వాయువు, తేజస్సు, జలము, పృథివి అను మహాభూతములే పంచరాత్రములు. చేతనాశూన్యములై, ఆజ్ఞానాంధకారముచే కప్పబడినవి పంచరాత్రరహితములు, “నేను పాపవిముక్తుడ నైన పర బ్రహ్మను, విష్ణువును” అను భావన కలవాడే దేశికుడు ఆగును. అతడు బాహ్య లక్షణములు వేషాదికము ఏవియు లేకున్నను తంత్రవేత్త యైన ఆచార్యుడుగా చెప్పబడినాడు.

దేవతావిగ్రహమును నగరాభిముఖముగ స్థాపింపవలెను; దేవతల పృష్టభాగము నగరము వైపు ఉండగూడదు. దేవాలయనిర్మాణమును కురుక్షేత్రగయాదితీర్థస్థానములందు గాని, నదీసమీపమునందు గాని చేయవలెను. బ్రహ్మాలయమును నగరమధ్యమునందును, ఇంద్రాలయమును నగరమునకు తూర్పునను నిర్మించిన ఉత్తమ మని చెప్పబడినది. అగ్ని దేవునకు, మాతృకలకునుఆగ్నేయదిక్కునందును, భూతగణములకు, యమధర్మరాజునకును దక్షిణమునను, చండికా-పితృగణ-దైత్యాదులకు నైరృతిదిక్కునందును, వరుణునకు వశ్చిమమునందును, వాయుదేవునకు, నాగులకు వాయవ్యదిక్కునందును, యములకులేదాకుబేరునకు ఉత్తరమునందును చండీశమహేశునకు ఈశాన్యమునందును, ఆలయమును నిర్మింపవలెను. విష్ణ్వాలయము అన్ని దిక్కులందును నిర్మింపవచ్చును. బుద్ధిమంతు డెన్నడును, పూర్వమునుంచియు ఉన్న దేవాలయమును చిన్నది చేసి చిన్న దేవాలయమును గాని, సమానమైనదానిని గాని, వికామిలమైనదానిని గాని నిర్మింపరాదు. ఏదైన ఒక దేవాలయమునకు సమీపమున దేవాలయము నిర్మించునపుడు రెండు దేవాలయముల మొత్తము ఎత్తుకు రెట్టింపు సీమాప్రదేశము విడచి నూతనదేవాలయమును విర్మింపవలెను. విద్వాంసుడు రెండు దేవాలయములకును పీడ కలుగకుండు నట్లు చూడవలెను.

భూమిశోధనానంతరము భూపరిగ్రహము చేయవలెను. పిమ్మట ప్రాకారము సరిహద్దువరకు మినుములు, పసుపు, పేలాలు, పెరుగు, సత్తువులు వీటితో భూతబలి ఇవ్వవలెను. (అష్టాక్షరమంత్రము చదువుచు) “ఈ ప్రదేశమునందు నివసించు రాక్షసపీచాదులు ఇచటినుండి తొలగిపోవుగాక. నేనిచట మహావిష్ణ్వాలయమును నిర్మింపనున్నాను” అని చెప్పుచు, ఎనిమిది దిక్కులందును సక్తువులు చల్లవలెను. భూమిని నాగలిచే దున్నించి ఆవులను దానిపై నడిపింపవలెను. ఎనిమిది పరమాణువులు ఒక రథరేణువు. ఎనిమిది రథరేణువులు ఒక త్రసరేణువు. ఎనిమిది త్రసరేణువులు ఒక పాలాగ్రము. ఎనిమిది వాలాగ్రమటు ఒక లిక్ష. ఎనిమిదీ లిక్షలు ఒక మూర. ఎనిమిది మూరలు ఒక యవమధ్యము. ఎనిమిది యవలు ఒక అంగుళము. ఇరువదినాలుగు అంగుళములు ఒక కరము. ఇరువది యెనిమిది అంగుళములు ఒక పద్మహస్తము.

శ్రీ అగ్ని మహాపురాణమునందు విష్ణ్వాదిదేవతాప్రతిష్టకే భూపరిగ్రహము ఆను ముప్పదితొమ్మిదవ అధ్యాయము సమాప్తము.