అగ్ని మహా పురాణము

Table of Contents

235 - అథ రాజ్ఞో దినచర్యా

పుష్కర ఉవాచః

పుష్కరుడు చెప్పెను : పరశురామా! రాజు ప్రతిదినము చేయవలసిన పనులు చెప్పెదను. ఇంకను ఘడియ రాత్రి ఉన్నదనగా రాజు వివిధ మంగళ వాద్యధ్వనులు, వందిమాగధుల స్తుతులు, మంగళ గీతములు వినుచు మేల్కొనవలెను. పిదప గూఢచారులను చూడవలేను. వీరు రాజ సేవకులు అని గూఢచారులను గూర్చి ఎవ్వరికిని తెలియకూడదు. పిదప యథావిధిగ ఆయవ్యయముల లెక్కలు వివవలెను. శౌచాద్యనంతరము స్నాన గృహము ప్రవేశించి, ముందుగ దంత ధావనము చేసి పిదప స్నానము చేయవలెను. సంధ్యోపాసనానంతరము శ్రీ మహావిష్ణువును పూజించవలెను. పిదప పవితు డై అగ్ని హోత్రముచేసి పితృతర్పణములు చేయవలెను. పిదప బ్రాహ్మణాశీర్వాదములు గ్రహించి వారికి సువర్ణ సహితముగా పాలుఇచ్చుగోవును దానము చేయవలెను. చందనము, అలంకారము ధరించి ఆద్దమునందును, సువర్ణయుక్త మగు ఘృతము వందును తన ముఖము చూచుకొనవలెను. దైవిక కథాదులువిని, వైద్యుడు చెప్పిన ఔషధము సేవించి, మంగళవస్తువులు స్ప శించి, గురుదర్శనము చేసి, ఆతని ఆశీర్వాదములుపొంది రాజసభలో ప్రవేశించవలెను.

రాజసభలో బ్రాహ్మణులను, అమాత్యులను కలిసి తన దర్శనము నిమిత్తమై వచ్చియున్నట్లు ద్వారపాలకుడు చెప్పిన ప్రజలకు దర్శనమీయవలెను. ఇతిహాస శ్రవణానంతరము రాజ్య కార్యములను పర్యవేక్షించవలెను. వాటిలో దాల ఆవశ్యకములగు వాటిని గూర్చి నిర్ణయములు తీసికొని, ప్రజల వ్యవహారములు చూచి, ముత్రులతో గుప్త విషయ ములను చర్చించవలేను. ఒక్కనితో మాత్రముగాని, చాలమందితోగాని, మూర్తులతోగాని, విశ్వాసయోగ్యులు కానివారితో గాని మంత్రణము చేయగూడదు. సర్వదా గుప్తరూపముననే చేయవలెను. ప్రకటముగ చేయరాదు. రాజ్యమునందు ఎట్టిబాధలును రాని విధమున, మంత్రణములను రహస్యముగా ఉంచవలెను. మంత్రణము రహస్యముగా ఉంచుటకు ఉపాయము తన ఆకార చేష్టాదులందు ఎన్నడును, ఎట్టిమార్పులను లేకుండ చూచుకొనుటయే. ఏలనన బుద్ధిమంతులు ఆకార చేషాదుల ద్వారా గుప్తములగు మంత్రములను కూడ కని పెట్టివేయుదురు. జ్యోతిష్కులు, మంత్రులు, వైద్యులు చెప్పిన మాటలను రాజు వినవలెను. అట్లుచేయుటచే ఐశ్వర్యమును పొందును. ఏలనన వీరు రాజును అనుచిత కార్యములనుండి మరల్చి పాతకార్యములందు ప్రవర్తింప చేయుదురు. మంత్రణలు ముగిసిన పిదప రథాదులను నడపుట, శస్త్ర ప్రయోగము మొదలగు వాటితో కొంతసమయము వ్యాయామము చేయవలెను. యుద్ధాది సమయములందు రోజు స్నానమొనరించి, గాగుగా పూజచేసిన శ్రీమహావిష్ణువును, హోమానంతరము ప్రజ్వలించుచున్న అగ్నిని, దానమానాదులచే సత్కృతులగు బ్రాహ్మణులను చూడవలెను. దానాద్యనంతరము వస్త్రాలంకారాదులతో అలంకరించుకొని పరీక్షించిన అన్నము భుజించవలెను. తాంబూల సేవనము చేసి ఎడమప్రక్కగా కొంత సేపు శయనించవలెను. ప్రతిదినము శాస్త్రచింతనము, యోధ - అన్నభాండార - శస్త్రాగారముల పర్యవేక్షణము చేయవలెను. దినాంతమున సాయంసంధ్యను ఉపాసించి, ఇతర కార్యములను గూర్చి విచారించి, ఆవశ్యకములగు పనులపై గూఢచారులను పంపి, రాత్రి భోజనానంతరము అంతఃపురములోనికి వెళ్లవలెను. అచట సంగీతవాద్యాదులతో మనోరంజనము చేసుకొని ఆత్మరక్షణోపాయములను చక్కగా చేసికొని నిద్రించవలెను. రాజు ప్రతిదినము ఇట్లే చేయవలెను.

అగ్ని మహాపురాణమునందు ప్రాత్యహిక రాజకర్మ కథనమను రెండువందలముప్పదియైదవ అధ్యాయము సమాప్తము.