అగ్ని మహా పురాణము

Table of Contents

156 - అథ ద్రవ్యశుద్ధిః

పుష్కర ఉవాచః-

పుష్కరుడు చెప్పెను : ఇపుడు ద్రవ్యశద్ధిని గూర్చి చెప్పెదను. మట్టి పాత్ర మరల కాల్చుటచే శద్ధ మగును. మలమూత్రాదిస్పర్శచే ఆశుద్ధ మైన పాత్ర కాల్చినను శుద్దము కాదు. సువర్ణ పాత్రము ఆపవిత్రవస్తువుల స్పర్శ కలిగినచో కడిగివేసిన శద్ద మగును. తామ్రపాత్ర పులుపు తగిల్చి నీటితో కడిగిన శుద్ద మగును. కాంస్య-లోహపాత్రలు పరాగముతో రాచిన శద్ధము లగును. కేవలము జలముచే కడిగినంత మాత్రముననే ముత్యములు మొదలగునవి శుద్ద మగును. జలము నుండి పుట్టిన శంఖాదులతో తయారు చేసిన పాత్రలు, జాతి పాత్రలు, శాకము, త్రాడు, ఫలములు, పుష్పములు, మూలములు, వెదురు మొదలైనవాటితో తయారుచేసిన వస్తువులు జలముచే కడిగిన శుద్దము లగును. యజ్ఞమునందు, యజ్ఞ పాత్రలు కుడి చేతితో కుశ లతో మార్జనము చేసినచో శుద్ద మగును. ఘృతము, తైలము తగిలి జిడ్డుగా నున్న పాత్రలు వేడినీటితో శుద్ధము లగును. చీపురుతో తుడిచి, అలుకుటచే ఇల్లు శుద్ధి యగును. శోధన ప్రోక్షణములచే వస్త్రశుద్ధి యగును. మృత్తి కోదకముతో శోధనము చేయవలెను. చాలవస్త్రముల సముదాయము నీరుచల్లుటచే శుద్ధ మగును. దారుపాత్రములు చెక్కుటచే శుద్ధము అగును. శయ్యాదివస్తువులు, అనేక వస్తువులు కలియగా ఏర్పడినవి జలప్రోక్షణముచే శుద్దము లగును. రెండు కుశ పత్రములచే ఉత్తవనము చేయుటచే మృతతే లాదులకు శుద్ధి, శయ్య, ఆసనము, వాహనము, చేట, శకటము, పలా లేంధనములు జలసంప్రోక్షణముచే శుద్ద మగును. శృంగదంతాదులతో తయారు చేసిన వస్తువులు పచ్చఆవాలు ముద్ద చేసి పూసినచో శుద్ద మగును. వారి కేలము ఆనపకాయ మొదలగు వాటితో తయారు చేసిన పాత్రలు ఆవుతోకయందలి వెండ్రుకలతో రాయగా శుద్ద మగును. శంఖాద్యస్థి నిర్మితపాత్రల శుద్ది శృంగనిర్మితపాత్రల వలె ఆకాలముద్ద పూయుటచే అగును. జిగురు బెల్లము, ఉప్పు, కుసుంభ పుష్పము, ఉన్ని పత్తి ఎండలో ఎండ బెట్టుటచే శుద్ద మగును. నదీజలము సర్వదా శుద్ధము. ఆపణములో అమ్మ జూపిన వస్తువులు శుద్దములు.ముఖము తప్ప గోవు అవయవము లన్నియు శుద్దములు. గుఱ్ఱము, మేక...వీటి ముఖములు శుద్ధములు. స్త్రీల ముఖము సర్వదా శుద్ధము. పాల పితుకు నపుడు లేగదూడ ముఖము, చెట్టుపై పండ్లు కొట్టిన పనుల ముఖము, వేటాడు సమయమున కుక్కల ముఖము పవిత్రములు. భోజనము, ఉమ్మి వేయుట, నిద్రించుట, నీరు త్రాగుట, స్నానము, మార్గగమనము, వస్త్రధారణము, ఈ పనులు చేసిన పిమ్మట ఆచమనము చేయ వలెను. పిల్లి ఇటు అటు తిరుగుటచే శుద్దము. రజస్వల నాల్గవ దివసమున శుద్ధి యగును. ఋతుస్నాత మైన స్త్రీ ఐదవ రోజున దేవ పితృ కార్యములలో పాల్గొనవచ్చును. శౌచానంతరము ఐదు పర్యాయములు గుదమునందును, పదిమార్లు ఎడమ చేతియందును, మరల ఏడు సార్లు రెండు చేతులందును, ఒకమారు లింగమునందును, మరల రెండుమూడు సార్లు చేతులందును మట్టి రాసుకొని కడుగుకొనవలెను. ఇది గృహస్థులకు చెప్పిన శౌచవిధానము. బ్రహ్మ చారి వానప్రస్థసంన్యాసులకు ఇంతకు నాలుగు రెట్లు శౌచము విహితము. సిలుకు బట్టల శుద్ధి బిల్వఫలములోని గుంజుతోను, క్షేమముల శుద్ధి తెల్ల ఆవాలతోను, మృగచర్మ-రోమాదులతో నిర్మితము లగు వస్త్రముల శుద్ధి నీరు చల్లుట చేతను అగును. పుష్ప ఫలములు కూడ జలప్రోక్షణముచే శద్ధములగును.