అగ్ని మహా పురాణము

Table of Contents

183 - అథ అష్టమీవ్రతాని

అగ్ని రువాచః-

ఆగ్ని దేవుడు పలికెను - ఇపుడు అష్టమి తిథియందు జరుపబడు వ్రతములను వర్ణింతును. వాటిలో మొదటిది రోహిణి యుర్దాష్టమీవ్రతమ భాద్రపద కృష్ణ పక్షమున రోహిణీయుర్దాష్టమి తిథియందు అర్ధరాత్రి శ్రీకృష్ణుడవతరించెను. అందుచే ఈ అష్టమి జయంతీగా చెప్పబడుచున్నది. ఆ దినమున ఉపవాసము చేయువాడు సప్త జన్మకృతపాపములనుండి విముక్తుడగును. భాద్రపదమున, రోహిణీ యుక్తాష్టమి తిథియందు ఉపవాస ముండి శ్రీకృష్ణుని పూజించవలెను. ఇది భుక్తి ముక్తి ప్రదము.  “నేను శ్రీకృష్ణ - బలరామ - దేవకి - వసుదేవ - యశోదా - గోవులను ఆవాహన చేసి పూజించు చున్నాను. మీ అందరికిని నమస్కారము. యోగస్వరూపుడు యోగపతి, యోగీశ్వరుడు, అగు శ్రీకృష్ణునకు నమస్కారము. యోగమునకు ఆదికారణ భూతుడును, ఉత్పత్తి స్థానమును అగు గోవిందునకు అనేక పర్యాయములు నమస్కరించుచున్నాను. ఇట్లు ఆవాహనము చేసి శ్రీకృష్ణునకు స్నానము చేయించి – “యజైశ్వరా! యజ్ఞరూపా! యజ్ఞాధిపతి!  యజ్ఞాది కారణభూతుడా! గోవిందా! నీకు మాటిమాటికిని నమస్కారము” అని అర్ఘ్యదానము చేయవలెను. దేవా! నీకు ప్రియమైన సుంగధయుక్తములగు ఈ పుష్పములను స్వీకరింపుము. దేవతలచే పూజింపబడినవాడా! నా కోరికల నన్నింటిని తీర్పుము. నీవు సదా ధూపముచే ధూపితుడవు, నేను సమర్పించిన ఈ ధూపముచే నీవు ధూప సుగంధమును గ్రహింపుము. నన్ను సర్వదా ధూపసుగంధ సంపన్నుని చేయుము.” అని చెప్పుచు పుష్ప ధూపములు సమర్పించవలేను. “ఓ ప్రభూ! నీవు సర్వదా దీపమువలె దీపించుచుందువు. దీపమునకు కాంతి నిచ్చువాడవు. శే నిచ్చిన ఈ మహాదీపమును స్వీకరించి నన్ను కూడ దీపము వలే ఊర్ధ్వగతి కలవానిని చేయుము, విశ్వరూ, విశ్వపతీ, విశ్వేశ్వరా! శ్రీకృష్ణా! నీకు నమస్కారము; నమస్కారము, విశ్వమునకు- ఆదికారణభూతుడైన శ్రీ గోవిందును నేను ఈ దీపము నిచ్చుచున్నాను” అని చెప్పుచు దీపము సమర్పించవలెను. “ధర్మ స్వరూపుడును, ధర్మాధిపతియు, ధర్మమునకు ఆదిస్థాన భూతుడును అగు - వాసుదేపునకు నమస్కారము, గోవిందా! నీ విపుడు శయనింపుము.  సర్వరూపుడు, సర్వాధిపతి, సర్వేశ్వరుడు,  సర్వాధికారణ భూతుడు అగు గోవిందునకు మాటి మాటికిని నమస్కారము,” అని చెప్పుచు శయనింప చేయవలెను. “క్షీర సముద్రము నుండి పుట్టినవాడవును, ఆత్రినేత్ర సముద్భూతు డవును, తేజఃస్వరూపుడవును ఆగు ఓ శశాంకా! రోహిణీ సహితుడవై నే నిచ్చు ఆర్ఘ్యము గ్రహించుము” అని చెప్పుచు చంద్రునకు అర్ఘ్య ప్రదానము చేయవలెను. పిదప థగ వడ్విగ్రహముమ వేదిక పై స్థాపించి, చంద్ర సహిత రోహిణి పూజ చేయవలెను.  అర్ధరాత్రియందు గుడ - ఘృతమిశ్ర క్షీర ధారలతో వసు దేవ - దేవకీ - వంద - యశోదా - బలరాములకు అభి షేకము చేయవలెను. పిదప బ్రాహ్మణులకు భోజనము  పెట్టి వారికి, దక్షిణగా వస్త్రసువర్ణాదుల నీయవలెను. జన్మాష్టమీవ్రతము చేయువాడు పుటౌనండము పొంది విష్ణులోక నివాసి యగును. పుత్రప్రాప్తిని కోరి ప్రతిసంవత్సరము  ఈ వ్రతము చేయువాడు పున్నా మనరక విముక్తుడగును. “హే ప్రభూ! నాకు పుత్రులను, ధనమును, ఆయుస్సును, ఆరోగ్యమును సంతతిని ఇమ్ము, గోవిందా! నాకు ధర్మ - కామ - సౌభాగ్య - స్వర్గ మోక్షముల నిమ్ము “ అని ప్రార్థించవలెను.

అగ్ని మహాపురాణము నందు అష్టమీవ్రతవర్ణన మను నూటఎనుబదిమూడవ అధ్యాయము సమాప్తము.