అగ్ని మహా పురాణము

Table of Contents

251 - పునః ధనుర్వేదః

 అగ్ని రువాచః

అగ్ని దేవుడు పలికెను : వసిష్ఠా! హస్తమును, మనస్సును, దృష్టిని జయించిన లక్ష్యసాధకుడు తప్పక సిద్ధిని పొంది యుద్ధము కొరకై వాహనారూఢుడు కావలెను. పాశము పదిహస్తముల పొడవై, గోలాకారమై చేతికి సుఖప్రదముగ నుండవలెను. దీని కొరకై మంచి ముంజగడ్డి గాని, హరిణముల పేగులు గాని, ఆరవల్కల రజ్జువుగాని ఏర్పరచు కొనవలెను. ఇతర దృఢసూత్రములలో గూడ సుందరమగు పాశము ఏర్పరుప వచ్చును. ఆ సూత్రములను చాల ఆవృత్తులు చుట్టి బాగుగా పేనవలెను. ముప్పది అవృత్తులు చేసి పేనిన త్రాడుతో పాశము నిర్మింపవలెను. పాశ ప్రయోగ శిక్షణమున కై శిక్షకులు కక్షలందు స్థానము ఏర్పాటు చేయవలెను. పాశమును ఎడమ చేతిలో ఉంచుకొని కుడి చేతితో విప్పవలేను. దానిని కుండలాకారము చేసి అన్ని వైపుల త్రిపి , శత్రువు శిరస్సు పై విసరవలెను. ముందుగ తృణచర్మాడి నిర్మితమగు పురుషసూక్తీ పై ప్రయోగించి పిదప గంతులువేయుచున్న మనుష్యుల పై ప్రయోగించి, సాఫల్యము లభించిన పిమ్మటనే పాశ ప్రయోగము చేయవలెను. సుశిక్షితుడగు యోధుడు పాశముతో యథోచితముగ జయించిన పిమ్మటనే శత్రువు విషయమున పాత బంధన క్రియ చేయవలెను.

ఒరతో కూడిన ఖడ్గమును నడుమునందకట్టి దానిని ఎడమవైపు వ్రేలాడదీయవలెను. దాని ఒరను ఎడమచేతితో గట్టిగ పట్టుకొని కుడి చేతితో ఖడ్గమును వెలుపలకు తీయవలెను. ఆ ఖడ్గము వెడల్పు ఆరు అంగుళములు, పొడవు ఏడు హస్తములు ఉండవలెను. ఆనేకములైన లోహమయశ లాకను. కవచములను తన సగము హస్తమునందు గాని ధరించవలెను. ప్రక్క లందును, పైనను, కిందను, శరీరరక్ష కోరకై ఈ వస్తువులన్నింటిని యథాశాస్త్రముగ ధరించవలెను. యుద్ధము తందు విజయము సంపాదించుటకై ఎట్టిఏర్పాట్లు చేయవలెనో చెప్పెదను; వినుము. తూణీరము యొక్క చర్మము చుట్టిన ఒక క్రొత్త దృఢమైన కడ్డను తన దగ్గర ఉంచుకోనవలేము. దానిని కుడి చేతి వేళ్ళతో పైకి ఎత్తి ఎవనినెత్తిపై గట్టిగా కొట్టు ఆ శత్రువు తప్పక మరణించును. ఈ పనిలో సిద్ధలభించిన పిమ్మట రెండు హస్తములతో ఆకర్రతో శత్రువు తల పై కొట్టవలెను. దీనితో అనాయాసంగ వానిని చంపగల్గును. ఈ విధముగ యుద్ధమునందు సిద్ధి ఎట్లుకలుగునో చెప్పబడినది. యుద్దభూమియందు చక్కగా సంచరించుటకై తన వాహనములచే శ్రమ చేయించుచుండవలెనను విషయము ముందుగ నే చెప్పియున్నాను.

ఆగ్ని మహాపురాణమునందు ధనుర్వేదకథనమను రెండువందలఏబదియొకటవ అధ్యాయము సమాప్తము.