అగ్ని మహా పురాణము

Table of Contents

268 - అథ నీరాజనవిధిః

పుష్కర ఉవాచః

పుష్కరుడు చెప్పెను. రాజుకు చేయదగిన సాంవత్సర కర్మచెప్పెదను. రాజుజన్మ నక్షత్రమున ఆనక్షత్ర మును పూజించవలెను. ప్రతిమాసమునందును, సంక్రాంతి యందు సూర్య హోమాది దేవతలను ఆగస్త్యోదయ సమయ మున అగస్త్యుని, చాతుర్మాస్యము నందు హరిని పూజించవలెను. శయన ఉత్థాన ఏకాదశులందు ఐదుదినములు ఉత్స వము చేయవలెను. భాద్రపద శుక్ల ప్రతిపత్తున శిబిరమునకు తూర్పున ఇంద్రపూజ కె భవనము నిర్మించవలెను. ఆచట శక్రధ్వజము స్థాపించి శచీదేవుని ఇంద్రుని ప్రతిపత్తు మొదలు అష్టమి వరకు పూజించవలెను. అష్టమినాడు వాద్య ఘోషము లతో ఆ ఇంద్రధ్వజమనకు దండము తొడుగవలెను. ఏకాదశినాడు ఉపవాసముండి ద్వాదశినాడు ఆధ్వజము ఎత్త వలెను. ఒక కలశ ముపై వస్త్రాదులచే చుట్టబడిన ఇంద్రుని శచీదేవిని స్థాపించి “శత్రువులను జయించు వృత్రనాశ కుడవగు ఓ పాక శాసనా ! ఓ మహాభాగా ఓదేవ దేవా ! నీకు అభ్యుదయమగు గాక. నీవు ఈ భూమి పైకి వచ్చితివి. నీవు శాశ్వతుడ పైన ప్రభువు. సర్వభూతముల హితమునందు ఆసక్తుడవు. అనంతతేజముకలవాడవు. విరాట్ పురుషుడవు. యశోజయములను వృద్ధి చేయువాడవు. నీవు ఉత్తమ వర్షమును కల్గించు ఇంద్రుడవు. సమస్త దేవతలు, నీతేజస్సును వృద్ధి పొందించెదరు గాక. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, కార్తికేయుడు వినాయకుడు ఆదిత్యులు, వస్తువులు, రుద్రులు, సాధ్యులు, భృగువులు, దిక్కులు, మరుద్గణములు, లోకపాలకులు, గ్రహములు, యక్షులు, పర్వతములు, నదులు, సముద్రములు, లక్ష్మి, భూమి, గౌరి, చండికా, సరస్వతీ, వీరందరును నీతేజస్సును వృద్ధి పొందించేదరు గాక! శచీపతి వైన ఓయిం ద్రా! నీవు జయించెదవుగాక ! నీ విజయముచే నాకు కూడ సర్వదా శుభము కలుగుగాక ! రోజులు బ్రాహ్మణులు, ప్రజలు, వీరందరిని అనుగ్రహించుము. నీయనుగ్రహమంచే భూమి నిత్యము సస్యసంపన్న అగుగాక : అందరికి విఘ్న విహీన మగు కల్యాణమగు గాక ! ఈతిబాధలు పూర్తి గ నశించుగాక!"యని ప్రార్థించుచు పూజించవలెను. ఈమంత్రముతో యింద్రుని పూజించిన వాడు భూమిని జయించి స్వర్గ మును పొందును.

ఆశ్వీయుజ శుక్ల అష్టమినాడు వస్త్రము పై భద్రకాళిని చిత్రించి, విజయము కోరువాడు ఆదేవతను పూజించ వలేను. ఆయుధమాలు, ధనస్సు, ధ్వజము, ఛత్రము, రాతి చిహ్నములు శస్త్రాదులు వీటిని కూడ పుష్పాదులతో పూజింపవలెను. రాత్రి జాగరణ చేసి బలియిచ్చి, మరునాడు మరల పూజించవలెను. "భద్రకాళి, మహాకాళి, దుర్గా, దుర్గ బాధనుహరించుదానా, త్రైలోక్య విజయా, చండీ నాకు శాంతివిజయమును ఇమ్ము" ఇపుడు నీరాజనావిధిని చేప్పె దను. ఈశాన్యమున దేవతామందిరము నిర్మించి మూడు ద్వారములు ఏర్పరచి యచట సర్వదా దేవతా పూజ చేయ వలయును. సూర్యుడు చిత్తానక్షత్రమును విడిచి స్వాతిలో ప్రవేశించునపుడు ప్రారంభించి, ఆ నక్షత్రములో ఉండు వరకును దేవతా పూజ చేయవలయును. బృహ . విష్ణువు - శంభు - శక్ర - అగ్ని - వాయు . వినాయక . కుమార - వరుణ - కుబేర విశ్వేదేవ - వైశ్రవసులను కుముద, ఐరావణ, పద్మ, పుష్పదంత వానున, సుప్రతీక - ఆంజననీలు లను దిగ్గ జములను గృహాదులందు పూజించవలెను. పిదప పురోహితుడు ఆజ్య, సమిత్, సిద్దార తిలలతో హోమము చేయవలయును. ఎనిమిది కలశములు పూజించి వాటితో ఉత్తమమైన ఆశ్వములను గజములను స్నానము చేయించి ముందు గజములకు గ్రాసము ఇవ్వవలెను. తోరణ ద్వారమునుండి బయటకు తీసుకుని రావలేను. గోపురాదులను దాట కూడదు. పిదప ఆందరును బయటకు వచ్చిన పిమ్మట ఇంటియందే రాజ చిహ్నములను పూజించవలెను. శతభిషా నక్షత్ర మున వరుణిని పూజించి భూతములకు బలేయివ్వవలెను. సూర్యుడు విశాఖలో ప్రవేశించిన పిమ్మట రాజ ఆశ్రమములో నివసించవలేను. ఆ దీవమున వాహనములను అధికముగ అంక రించవలెను. రాజ చిహ్నములను పూజించి వాటి వాటి రక్షకుల చేతికి ఇవ్వవలెను కాలజ్ఞుడగు జ్యోతిషుడు గజములు అశ్వములు, ఛత్రము, ఖడ్గము. ధనస్సు, దుందుభి.. ధ్వజము, పతాక, వీటిని అభిమంత్రించవలెను. వాటిని, ఏనుగుల పైకి ఎక్కించవలెను. జ్యోతిష్కుడు పురోహితుడు. కూడ ఏనుగును ఎక్కవలెను ఆభిమంత్రితములగు వాటిని ఎక్కి ద్వార మునుంచి, నిష్క్రమింప చేయవలయును. ఈ విధ ముగ నిష్క్రమించి ఏనుగును ఎక్కిరాజు రాజ ద్వారమునుండి బయటకు శచ్చి విధి పూర్వకముగ బలి ఇవ్వవలేను. పిదప అతడు, సుస్థిర చిత్తుడై చతురంగ సైన్యములతో కూడి వారి అందరి చేత జయ ఘోషములు పలికించుచు, దిగంతములను ప్రకాశింపచేయుచున్న కాగడాల సముదాయములకు మూడు పర్యాయములు ప్రదక్షిణములు చేసి, జలాంజలి యిచ్చి ఇంటికి మరలి రావలయును. నీరాజనమను ఈ పేరుగల శాంతి వృద్ధి నిచ్చును. శత్రువులను నశింపచేయును.

అగ్ని మహాపురాణమున నీరాజనా విధియను రెండువందల ఆరువది యెనిమిదవ అధ్యాయము సమాప్తము.