పురాణ శ్రవణాది ఫల నిరూపణము

ఋషులు పలికిరి: సాధుమహాశయా! సూత మహర్షీ! మీరు శ్రీకృష్ణ చరితామృతమును చెప్పితిరి. మేము వింటిమి. మీ అనుగ్రహమువలన కృతార్థులమైతిమి. వసువు బ్రహ్మలోకమునకు వెళ్లిన తరువాత బ్రహ్మ పుత్రికయగు మోహిని ఏమి చేసెనో మాకు తెలుపుడు.

సూతమహర్షి పలికెను: ఓ మహర్షులారా! మీరందరూ శుభ ప్రదమగు మోహినీ చరితమును వినుడు. పసుపు రోహితులు బ్రహ్మ లోకమునకు వెళ్ళిన పిదప మోహినీదేవి పుణ్యతీర్థములను సేవించెను. బ్రహ్మ పుత్రికయగు మోహిని వసువు చెప్పినవిధముగా యథావిధిగా తీర్థయాత్ర కొరకు గంగా తీరమునకు వెడలెను. అచట గంగాది తీర్థములలో స్నానమాడి యధావిధిగా దర్శించి, బ్రాహ్మణులతో కలిసి పురోహితుడగు వసువు ఆయా తీర్థములకు చెప్పిన ఆయా విధులను అనుసరించి తీర్థములను సేవించుచు పర్యటించెను. ఆ తీర్థములందు విష్ణ్వాది దేవతలను పూజించుచు, బ్రాహ్మణులకు బహువిధ దానముల నిచ్చుచు, గయా తీర్థమున యథావిధిగా భర్తయగు రుక్మాంగదునకు పిండ ప్రదానమును గావించెను. కాశీ నగరమున విశ్వేశ్వరుని పూజించి పురుషోత్తముని చేరెను. అచట జగన్నాథుని నైవేద్యమును భుజించి పరిశుద్ధ దేహులై లక్ష్మణాచలమును చేరెను. అచట లక్ష్మణుని యథావిధిగా పూజించి సేతు తీర్థమునకు వెడలి రామేశ్వరుని పూజించి, మలిహాద్రిని చేరి పరశురాముని నమస్కరించెను. శివక్షేత్రమగు గోకర్ణమునకు వెడలి ఈశ్వరుని పూజించి, బ్రాహ్మణులతో కలిసి ప్రభాసతీర్థమునకు వెళ్ళెను. అచట స్నానమాడి, దేవాదులకు తర్పణములనిచ్చి ప్రభాసయాత్రను జరిపి, ద్వారకయందు శ్రీహరిని చూచి కురుక్షేత్రమునకు వెడలెను. అచట కూడా యధావిధిగా యాత్రను జరిపి గంగాద్వారమును చేరి అచట స్నానమును ఆచరించెను. తరువాత కామోదాదేవిని దర్శించి సంతోషముచే నమస్కరించి, బదరిక అశ్రమమును చేరి నరనారాయణ ఋషులను చక్కగా పూజించి కామాక్షీదేవిని దర్శించుటకు త్వరగా వెళ్ళెను. అచట సిద్ధనాథునికి నమస్కరించి అయోధ్యకు చేరెను. సరయూనదిలో యధావిధిగా స్నానమాడి సీతాపతిని పూజించి మధ్యయాత్రానుసారముగా అమర కంటకమును చేరెను. అచట మహేశుని పూజించి ప్రతిస్రోతస్వి యనగల నర్మదా తీర్థమును సేవించి ఓంకారేశుని దర్శించి మహిష్మతీ పురమునకు వెడలెను. అచట త్ర్యంబకేశుని పూజించి త్రిపుష్కరమును చేరెను. పుష్కరములందు యధావిధిగా దానములను ఒసంగి సర్వ తీర్థోత్తమమగు మధురా తీర్థమును చేరెను. వింశతి యోజనముల అభ్యంర యాత్రను ఆచరించి, మధురానగరమునకు ప్రదక్షిణము ఆచరించి, చతుర్వ్యూహములను దర్శించెను. వింశతి తీర్థములలో స్నానము ఆచరించి యాత్రను ముగించి బహు దక్షిణలతో మధురానగరవాసులకు పదివేల గోవులను దానము ఒసంగెను. భక్తి పూర్ణ మానసముతో వారిని పరమాన్నముచే భుజింపచేసి, నమస్కరించి వారిని విడిచిపుచ్చి యమునా నదికి చేరెను. అంత పాపనాశిని అగు కాళిందీ నదిలో ప్రవేశించిన మోహిని నేటికి బయటికి రాలేదు. అటనుండి దశమీ తిథిని చేరియున్నది. సూర్యోదయ కాలమున స్మార్తులను, అరుణోదయ కాలమున శ్రౌతులను, నిశీధ కాలమున వైష్ణవులను చేరి దూషింపచేయును. మోహినీ వేద రహితయగు ఏకాదశిని ఉపవసించి, ద్వాదశినాడు శ్రీహరిని పూజించినచో వైకుంఠమును పొందెదరు. మోహిని బ్రహ్మ పుత్రిక. ఏకాదశి విష్ణుపుత్రిక. విష్ణుపుత్రికతో పోటీ చేయుటకు బ్రహ్మ మోహినిని సృజించెను. రుక్మాంగద రాజర్షి విష్ణుభక్తి పరాయణుడు కావున అతనిని ఏకాదశీ వ్రతమునుండి వారించజాలక పోయెను. భార్యాపుత్ర సహితముగా రుక్మాంగదుడు విష్ణులోకమును చేరిన తరువాత ఏకాదశిని ద్వేషించుచు దశమీతిధిలో మోహిని నివసించుచున్నది. ఇట్లు మీకు మోహినీ చరితమును తెలిపితిని. మోహిని ఏ కార్యమునకు సృజించబడి ఇచట ఎట్లు నివసించుచున్నదో మీకు వివరముగా తెలిపియున్నాను.

ఓ బ్రాహ్మణోత్తములారా? మీకు భక్తి ముక్తి ప్రదమగు నారదీద పురాణము ఉత్తర భాగమును చెప్పితిని. ఈ భాగమున ప్రతిక్షణము ప్రతిపదము శ్రీహరియందు భక్తిని పెంపొందించును. పదిలక్షణములతో కూడియున్న నారదీయ మహాపురాణమును భక్తితో వినినవారు శ్రీ విష్ణు పదమును చేరెదరు. ఈ నారదీయ పురాణము ధర్మార్ధకామమోక్షములను నాలుగు పురుషార్థములకు కారణము. సర్వ పురాణములకు ఇదియే బీజము. ఈ పురాణమున ప్రవృత్తి మార్గమును నివృత్తి మార్గమును శ్రీ వేదవ్యాస భగవానులు విస్తరముగా వర్ణించిరి. నారదీయ మహాపురాణము అలౌకిక చరిత్రచే శోభితము. నాకు వ్యాసభగవానులు తెలిపిరి. ఈ పురాణమును అందరికీ ఉపదేశించరాదు. వ్యాస భగవానుడు స్వశిష్యులకు పైలాదులను విడిచి నాకు మాత్రమే వ్యాఖ్యానము గావించెను. అట్టి వేదవ్యాస భగవానుడగు శ్రీ మహావిష్ణువునకు నమస్కారము. ఈ నారదీయ మహాసంహితను పండితోత్తముడగు నారదమహర్షికి మహానుభావులకు సనకాది మహర్షులు ప్రకాశింపచేసిరి. పరమహంస స్వరూపియగు శాశ్వత బ్రహ్మరూపుడగు భగవానుడు విజ్ఞాన విజృంభితమగు నారదీయ మహాపురాణమును సనకాదులకు ఉపదేశించెను. సాక్షాద్భగవత్స్వరూపుడు అధ్యాత్మ జ్ఞానముకల నారదమహర్షి వేదవ్యాస మహర్షికి రహస్యముగా ఉపదేశించెను. వేదవ్యాస మహర్షి నాకు ఉపదేశించెను. చదువువారికి, వినువారికి చతుర్వర్గ ఫలప్రదము పరమ రహస్యము, భూలోక దుర్లభము అగు ఈ నారదీయ మహాపురాణమును నేను మీకు ఉపదేశించితిని ఈ నారదీయ మహాపురాణమును చదివినవారు, వినినవారు బ్రాహ్మణు లైనచో వేదవిదులగుదురు. క్షత్రియుడు భూమండలమును జయించును. వైశ్యుడు ధనసమృద్ధిని పొందును. శూద్రుడు దుఃఖ నివృత్తిని పొందును. ఈ నారదీయ మహాపురాణము ఇరువది అయిదువేల శ్లోకములు గలదని చెప్పబడినది. అయిదు పాదములు కలది అని వేదవ్యాస భగవానులు చెప్పిరి. నారదీయ మహాపురాణమును వినినచో సర్వ సందేహములు తొలగిపోవును. కోరికలు కలవారికి కోరికలు తీరును. నిష్కాములకు మోక్షము లభించును. నైమిశారణ్యమును, గయను, పుష్కరమును, మధురానగరమును, ద్వారకా నగరమును, నరనారాయణ ఆశ్రమమును, కురుక్షేత్రమును, నర్మదా తీర్థమును, శ్రీ పురుషోత్తమ క్షేత్రమును ఇంకా ఇతర పుణ్య తీర్థములను దర్శించువారు. ఆయా తీర్థములలో హవిష్యమును భుజించుచు, ధరపై పడుకొనుచు, నిస్సంగులై, జితేంద్రియులై ఈ నారదీయ మహాపురాణమును చదివినచో భవసాగరమునుండి విముక్తులగుదురు. వ్రతములలో ఏకాదశి, నదులలో గంగ, అరణ్యములలో బృందావనము, క్షేత్రములలో కురుక్షేత్రము, పురములలో కాశీపురి, తీర్థములలో మధురా తీర్థము, సరస్సులలో పుష్కర సరస్సు, పురాణములలో నారదీయ మహాపురాణము సర్వ శ్రేష్ఠములు. గణేశ భక్తులు, సూర్యభక్తులు, శ్రీవిష్ణుభక్తులు, శక్తిభుక్తులు, శివభక్తులు అందరూ సకాములు నిష్కాములు ఈ మహాపురాణమునకు అధికారులు. ఏ కోరికను సంకల్పించుకొనినవారు పురుషులు కాని స్త్రీలు కాని ఆదరముతో ఈ నారదీయ మహాపురాణమును వినిననూ వినిపించిననూ ఆయా కోరికలు తీరును. రోగార్తులు రోగ విముక్తులగుదురు. భయార్తులు భయముక్తులు అగుదురు. నారదీయపురాణ పఠన శ్రవణమువలన జయమును కోరువారు జయమును పొందెదరు. సృష్ట్యాదిలో రజోగుణముచే, మధ్య కాలమున సత్త్వగుణముచే జగత్పాలనను, అంతమున తమోగుణముచే సంహారమునుచేయు సర్వాత్మయగు పరమాత్మకు నమస్కారము. ఋషులు, మనువులు, సిద్ధులు, లోకపాలకులు, ప్రజాపతులు, బ్రహ్మాదులను సృజించి పరమాత్మకు నమస్కారము. వేదము కూడా అచటి నుండి మరలివచ్చును. మనసు వెళ్ళజాలదు. అట్టి రూపరహితుడు, చిత్స్వరూపుడగు పరమాత్మ స్వరూపమును తెలియవలెను. అతని సత్యముచేతనే ఈ జగత్తు సత్యముగా విచిత్ర రూపముగా ప్రకాశించును. అట్టి తమోతీతుని నిర్గుణునికి నమస్కరించు చున్నాను. అది మధ్యలలో పుట్టుక లేనివాడు, అంతమున ఏకాక్షర స్వరూపుడు, నానారూపములచే ప్రకాశించువాడు అగు ఆ పరమాత్మకు నమస్కారము. చరాచర రూపమగు ఈ జగత్తంతయూ నిరంజనుని వలననే పుట్టినది. అతని లోనే నిలుచును. లీనమగును. అదియే సత్యము. ఏకరూపమగు జ్ఞానము. శైవులు శివుడని, సాంఖ్యులు ప్రధానమని, యోగులు పురుషుడని, మీమాంసకులు కర్మయని, వైశేషికాదులు విభువని, శక్తి చింతకులు శక్తి అని, చెప్పబడు అద్వితీయ నానారూప క్రియాస్పదమగు పరబ్రహ్మకు నమస్కరించుచున్నాను. మానవులకు భగవద్భక్తియే భగవత్స్వరూపమును ప్రసాదించునును. అట్టి భక్తిని పొందిన తరువాత ఇతర లాభములనుకోరు పశువెవడు? భగవద్విముఖులై సంసారమున సంచరించు మానవులకు సత్సంగమములేనిదే సంసారారణ్యముండి విముక్తి లభించదు. సాధువులు సదాచార పరాయణులు సర్వలోక హితానుషంగులు, దీనులయెడ దయాపరులు, భగవంతుని ఆశ్రయించిన మహానుభావులు లోకులను తరింపజేతురు. ఓ మహర్షులారా! ఈ లోకమున మీరు ధన్యతములు, సాధుసమ్మతులు. మీరు ఎప్పుడూ నిత్యనూతనమగు వాసుదేవుని కీర్తిని గానము చేయుచుంటిరి. లోక కళ్యాణమును కాంక్షించి మీరు సర్వకారణ కారణమగు శ్రీమన్నారాయణుని స్మరింపచేసితిరి. మీ వలన నేను ధన్యుడనైతిని. అనుగ్రహించబడితిని. (II/82)

ఇది శ్రీబృహన్నారదీయ మహాపురాణమున బృహదుపాఖ్యానమున ఉత్తర భాగమున ఈ పురాణ శ్రవణాది ఫల నిరూపణమను ఎనుబదిరెండవ అధ్యాయము సమాప్తము.

మహాపురాణములలో ఏడవదైన నారదీయ మహాపురాణము సమాప్తము.

ఓం శాన్తిః శాంతిః శాంతిః

శ్రీకృష్ణార్పణమ్.