ద్వాదశ మాస తృతీయావ్రత కథనము

సనాతన మహర్షి పలికెను: ఓ నారదా ? ఇప్పుడు నేను తృతీయావ్రతములను చెప్పెదను వినుము. ఈ వ్రతములను ఆచరించిన స్త్రీ సౌభాగ్యమును పొందును. చైత్ర శుక్ల తృతీయనాడు సువర్ణముతో కాని, రజతముతోకాని, తామ్రముతోకాని, మృత్తుతోకాని భర్తతో కూడియుండు గౌరీ ప్రతిమనుచేసి గంధ పుష్ప వస్త్రా భరణములతో దూర్వాకాండములో యథావిధిగా ఉపవసించి, పూజించవలెను. వరునికోరు కన్యకాని, సౌభాగ్యమును, పుత్రులను కోరు స్త్రీ కాని, మంచిభర్తను కోరు యువతి కాని ముత్తైదువలగు బ్రాహ్మణ భార్యలను కాని మంచి లక్షణములు కల బ్రాహ్మణ కన్యకలను కాని సంతోషముతో సింధూరాంజన వస్త్రాదులను అర్చించి సంతోషపరచి వ్రతమును పూర్తిచేయకోరినచో రాత్రి పూట జాగరణమును చేయవలెను. తరువాత ఆ పార్వతీ పరమేశ్వరుల ప్రతిమను బ్రాహ్మణ గురువునకు దానము ఈయవలయును. ధాతువులతో చేసిన దానిని, మట్టితో చేసిన దానిని జలాశయమున పడవేయవలెను. ఇట్లు శుభకరమగు గౌరీ వ్రతమును పన్నెండు సంవత్సరములుచేసి ఉత్సర్గసిద్ధికొరకు పన్నెండు గోవులను సంకల్ప పూర్వకముగా దానము చేయవలెయును. ఇట్లు చేసినచో గౌరీదేవీ స్త్రీలకు తమతమ అభీష్టములను నెరవేర్చును. గౌరీదేవి స్త్రీలకు సౌభాగ్యమిచ్చునట్లు మరే ఇతర దేవత ఈయజాలదు. ధనమును, పుత్రులను, పతిని, విద్యను, అజ్ఞా సిద్ధిని, కీర్తిని, సుఖమును, అన్నిటిని గౌరీ దేవిని పూజించి పొందవచ్చును. వైశాఖ శుక్ల ద్వితీయ అక్షయా అని పిలువబడును. ఈ తిధి త్రేతాయుగాది. కృతయుగమునకు అక్షయకారిణి. రెండు శుద్ధ పక్షమున రెండు బహుళ పక్షమున యుగాదులు కలవు. శుక్లపక్షమున కృత త్రేతా యుగాది. కృత యుగమునకు అక్షయకారిణి. రెండు శుద్ధ పక్షమున రెండు బహుళ పక్షమున యుగాదులు కలవు. శుక్ల పక్షమున కృత త్రేతా యుగములు, కృష్ణ పక్షమున ద్వాపర కలియుగములు ప్రారంభమగును. భాద్రపద మాసమున కలియుగము ఆరంభమైనది. ఇట్లు వైశాఖ శుద్ధ ద్వితీయనాడు జగద్గురువు శ్రీసమేతుడగు నారాయణుని ధూపదీప చందనాదులతో పూజించవలయును. లేదా గంగా జలమున స్నానముచేసి సర్వపాపముల నుండి విముక్తుడగును. అక్షతలతో విష్ణువును పూజించవలెను. అక్షతలతో స్నానము చేయవలెను. బ్రాహ్మణులకు అటుకులను తినిపించవలెను. తాను కూడా తినవలెను. ఇట్లు యధావిధిగా ఆచరించినచో విష్ణువుయందు భక్తి కలిగి, దేవతలందరిచే నమస్కరించబడును. విష్ణు లోకమును పొందును. ఇక జ్యేష్ఠ శుద్ధ తృతీయ రంభాయని పిలువబడును. ఈనాడు భార్యా సహితుడగు బ్రాహ్మణోత్తముని యధావిధిగా పూజించవలెను. సౌభాగ్యమును కోరు స్త్రీ గంధపుష్ప వస్త్రాదులచే బ్రాహ్మణోత్తముని పూజించవలెను. ఇట్లు యధావిధిగా ఈ రంభా వ్రతము ఆచరించినచో ధనమును, పుత్రులను, మంచి బుద్ధిని, ధర్మము యందు రుచిని ప్రసాదించును. ఇక ఆషాఢ శుద్ధ తృతీయనాడు భార్యా సహితుడగు బ్రాహ్మణుని యందు శుక్ల వస్త్రములను ధరించి లక్ష్మీ సహితుడగు  నారాయణుని భోజనముతో, గోదానముతో వస్త్ర భూషణాదులతో చక్కగా పూజించవలెను. సౌభాగ్యమును కోరు స్త్రీ సంతోషముతో ప్రియముగా మాటలాడవలెను. ఈవ్రతము నాచరించి దేవదేవుని అనుగ్రహముచే ధన ధాన్య సమన్వితమగును. అంతమున విష్ణు లోకమును పొందును. వ్రావణ శుద్ధ తృతీయనాడు స్వర్ణ గౌరీ వ్రతము ఆచరించవలెయును. షోడశోపచారములతో భవానిని పూజించవలెను. ఓ సువ్రతురాలా ? నాకు పుత్రుల నిమ్ము. ధనము నిమ్ము. సౌభాగ్యము నిమ్ము. ఇతరములగు అన్ని కోరికల నిమ్ము. నీకు నమస్కారము. ఇట్లు దేవేశిని ప్రార్థించి పరమేశ్వర సహితముగా పార్వతిని స్తుతించి వ్రత సంపూర్తి కొరకు వాయనము ఇప్పించవలెను. ఇట్లు పదునారు సంవత్సరములు భవానీ వ్రతము నాచరించి, విత్త లోభమును వదిలి ఉద్వాసన చేయవలెను. శుద్ధమగు మండలమున మండపమును ఏర్పరచి గణేశుడు మొదలగు దేవతలను పూజించవలెను. తామ్ర పాత్రను చేసి కలశము మీద నుంచవలెను. ఆ కలశముపైనున్న తామ్రపాత్రలో స్వర్ణము చేయబడిన గౌరీప్రతిమ నుంచవలెను. చక్కగా గంధ పుష్పాదులచే భవానీ ప్రతిమను పూజించి తరువాత హోమము నాచరించవలెను. పదునారు వెదురు పాత్రలలో పక్వాన్నమును నింపి, దేవికి నైవేద్యమును సమర్పించి బ్రాహ్మణులకు నివేదన చేయవలెను. తరువాత సంబంధులకు బంధువులకు వాయనము నీయవలెను. ఆ ప్రతిమను గురువునకిచ్చి, బ్రాహ్మణులకు దక్షిణను ఈయవలెను. ఇట్లు శ్రద్ధగా వ్రతము నాచరించిన స్త్రీ సంపూర్ణ ఫలమును పొందును. భాద్రపద శుక్ల తదియనాడు వైహారితాలకమను వ్రతమునాచరింపవలెయును. ఈ వ్రతమును భక్తితో యధావిధిగా పాద్యార్ఘ్యార్చన పూర్వకముగా చేయవలెను. తరువాత బంగారు పాత్రలోకాని, వెండి పాత్రలోకాని, రాగిపాత్రలోకాని, వెదురుపాత్రలోకాని, మట్టిపాత్రలోకాని, అన్నమును దక్షిణతో నుంచి, ఫలములతో వస్త్రములతో బ్రాహ్మణునకు దానము గావించవలెను. తరువాత ఇష్ట జనులతో బంధుజనులతో కలిసి పారణ చేయవలెను. ఇట్లు వ్రతమును ఆచరించిన స్త్రీ ఇహలోకమున అన్ని భోగములను అనుభవించి ఈ వ్రతప్రభావమున అంతమున గౌరీదేవితో కలిసియుండును. సౌభాగ్య ద్రవ్యములను, వస్త్రములను, పదునారు వెదురు పాత్రలను యధావిధిగా బ్రాహ్మణులకు దానము గావించవలెను. ఇతర బ్రాహ్మణులకు భూరి దక్షిణ నీయవలెను. ఇట్లు సౌభాగ్య వర్థకమగు వ్రతము నాచరించిన స్త్రీ దేవీ ప్రసాదమున అఖండ సౌభాగ్యమును పొందును. భాద్రపద శుద్ధ తదియ హస్తా నక్షత్ర యుక్తమగుచో హస్త గౌరీ వ్రతమును సాక్షాత్తు శ్రీహరి చెప్పెను. అట్లే శంకరుడు కోటీశ్వరీ వ్రతమును చెప్పెను. లక్షేశ్వరీ వ్రతమును కూడా చెప్పెను. ఇపుడు ఆ విధానమును చెప్పెదను. ఈ హస్తా నక్షత్రయుక్త తదియనాడు చేయు వ్రతమును నాలుగు సంవత్సరములు చేయవలెను. ప్రతి సంవత్సరమున ఉపవసించవలెను. అఖండములగు లక్ష బియ్యపు గింజలను కాని, నువ్వుల గింజలను కాని శుద్ధిగావించి సంస్కరించబడిన పాలలో పడవేసి చక్కగా ఉడికించి, ఆ పక్వాన్నముతో దేవీమూర్తిని సిద్ధముచేసి గంధపుష్ప పుష్పమాలలచే అలంకరించి, అచటను పార్వతీదేవిని స్థాపించి భక్తి భావముతో పూజించవలెను. గంధపుష్ప ధూపదీప నైవేద్యాదులను, బహువిధ ఫలములను సమర్పించి, నమస్కరించి క్షమాపణ వేడవలెను. తరువాత దేవిని దక్షిణా సహితముగా జలమధ్యమమున విడువవలెను. దక్షిణను విధిజ్ఞులగు బ్రాహ్మణులకిచ్చి, మరుసటి దినమున భుజించవలెను. ఇట్లు నీకు కోటి లక్ష్మేశ్వరీ వ్రతమును చెప్పితిని. ఈ వ్రతము ప్రభావము వలన అంత కాలమున గౌరీ లోకమును చేరును. అశ్వయుజ శుద్ధ తదియనాడు బృహద్గౌరీ వ్రతము ఆచరించవలెను. అయిదుగురు ముత్తైదువులను వస్త్రాలంకార చందనములచే పూజించవలెను. కంచుకములను, తాటంకములను, కంఠ సూత్రములను దారము చుట్టిన అయిదు వెదురు పాత్రలను, సౌభాగ్య ద్రవ్య సంయుతముగా సింధూరమును, జీరకమును, గోధుమ పిండిని, నవాపూపములను, ఫలాదికముల నుంచి అయిదు వాయనములను వారికిచ్చి భోజనము పెట్టవలెను. అర్ఘ్యములను ఇచ్చి వాయనములను ఇచ్చిన తరువాత భోజనము చేయవలెను. సర్వకామ సమృద్ధి కొరకు ఆ ఫలమును కంఠమున ధరించవలయును. తరువాత ప్రొద్దుననే లేచి, అలంకారములను ధరించి సఖీజనముతో గీతవాద్య నృత్యములతో గౌరీదేవి ప్రతిమను నదిలో విడువవలెను. ఓ శుభప్రదులారా ? నేను ఆహ్వానించితిని. యధావిధిగా పూజించబడితివి. నాకు సౌభాగ్యమునిచ్చి యధేచ్ఛముగా వెళ్ళుము అని ఇట్లు భక్తితో వ్రతముచేసిన యెడల బ్రాహ్మణానుగ్రహముతో దేవీ అనుగ్రహముతో ఇహలోకమున సకల భోగములను అనుభవించి దేహాంతమున గౌరీ లోకమును పొందును. కార్తీక శుక్ల తదియనాడు విష్ణు గౌరీ వ్రతమును ఆచరించవలెను. జగద్వంద్యయగు దేవిని వేరువేరు ఉపచారములతో పూజించి, ముత్తైదువకు భోజనముపెట్టి, మంగళ ద్రవ్యములతో పూజించి నమస్కరించి విష్ణుగౌరీ సంతోషము కొరకు విడువవలెను. మార్గశుక్ల తృతీయ నాడు శుభకరమగు హరగౌరీవ్రతమును ఆచరించవలెను. పూర్వ విధానమును అనుసరించి జగదంబికను పూజించవలెను. ఈ వ్రత ప్రభావము వలన ఇహలోకమున నచ్చిన భోగములను అనుభవించి అంతమున దేవీలోకమును చేరి దేవితో ఆనందించును. పుష్య శుక్ల తదియనాడు బ్రహ్మగౌరీ వ్రతమును ఆచరించవలెను. పూర్వోక్త విధానముతో పూజించినచో బ్రహ్మగౌరీ అనుగ్రహమువలన బ్రహ్మగౌరీ లోకమున ఆమెతో కలిసి ఆనందించును. మాఘ శుక్ల తృతీయనాడు సౌభాగ్య సుందరిని పూర్వోక్త విధానముచే నాళికేర జలమే అనర్ఘ్యముగా ఇచ్చి పూజించవలెను. ఈ వ్రతముచే సంతోషించి ప్రసన్నురాలై తన లోకమును అనుగ్రహించును. ఫాల్గుణ శుక్ల తృతీయనాడు కులసౌఖ్యదా దేవిని గంధ పుష్పాదులచే పూజించినచో సర్వమంగళ ప్రదమగును. ఇట్లు అన్ని తృతీయా తిధులలో పూజావిధానము సాధారణముగానే ఉండును. దేవీ పూజ, విప్రపూజ, దానము, హోమము, విసర్జనము, ఇవియన్నియు సాధారణములు. ఇట్లు నీకు తృతీయా వ్రతములను చెప్పితిని. ఈ వ్రతములను భక్తితో ఆచరించినచో మనోభిలాషలను ప్రసాదించును. (4/112)