నారద మహా పురాణము
పతివ్రతోపాఖ్యానము,
వసిష్ట మహర్షి పలికెను: ధర్మాంగదుని మాటలను విని సంతోషించిన రుక్మాంగద మహారాజు ఇట్లు పలికెను. ఓ పుత్రా! ఇది నిజమే, ఈ మోహిని నీతల్లియే. నాకు మందర పర్వతమున లభించినది. ఈమె బ్రహ్మ పుత్రిక. నన్ను భర్తగా పొందవలెనని దృఢనిశ్చయము చేసుకొని మందర పర్వతమున దారుణమగు తపమును చేయుచున్నది. నేను ఇటనుండి అశ్వముపై బయలుదేరి పదునైదు దినములలో బహుధాతు సమన్వితమగు మందర పర్వతమును చేరితిని. ఆ పర్వత శిఖరమున ఈ బాలతన గానముచే మహేశ్వరుని సంతోషింప చేయుచున్నది. చూడముచ్చటగా ఉన్న ఈ గానము చేయుచుండగా నేను చూచితిని. ఈమె సౌందర్యమును చూచి నేను మూర్ఛిల్లి భూమిపై పడితిని, వ్యాధునిచే కొట్టబడిన మృగమువలె మన్మథ బాణములచే కొట్టబడితిని. తరువాత చారునేత్రయగు ఈదేవి వచ్చి నన్ను కదిలించినది. నేను కొంచెము ప్రార్థించగా నన్ను భర్తగా వరించినది. నేను కూడా నా దక్షిణ హస్తమును చాచి ప్రతిజ్ఞ చేసితిని. అపుడు మందర పర్వత శిఖరమున ఈమెను వివాహము చేసుకొంటిని. పర్వతము నుండి దిగి అశ్వమును అధిరోహించి మూడు దినములలో వేగముగా నీదగ్గరికి చేరితిని. దారిలో పర్వతములను, ప్రదేశములను, సరస్సులను, నదులను చూచుచు వచ్చితిని. ఇట్లు ఈమె నీకు తల్లి. నీకు ప్రీతిని పెంచును. నీవు ఈ సుందరాంగిని నీ తల్లికి నమస్కరించినట్లు నమస్కరించుము. అని పలికిన తండ్రి మాటలను వినిన ధర్మాంగదుడు అశ్వము మీద ఉన్న మోహినికి భూమి మీదపడి సాష్టాంగ ప్రణామమును ఆచరించి ఇట్లు పలికెను. ఓ తల్లీ! నాయెడ ప్రసన్నురాలవు కమ్ము. నీవు నాకు తల్లివి. నేను నీకు పుత్రుడను. భృత్యుడను, దాసుడను, చాలామంది రాజులతో కలిసి నీకు నమస్కరించుచుంటిని. ఇట్లు భూమి మీద పడియున్న పుత్రుని మోహినీదేవి చూచి, భర్త ప్రేమను అనుసరించి అశ్వమునుండి దిగి, పడియున్న ధర్మాంగదుని లేపి, బాహువులచే ఆలింగనము చేసుకొనెను. అట్లు తల్లి అలింగనము చేసుకొనగా మరల అభివాదము చేసెను. తరువాత మోహినికి చక్కని వస్త్రాభరణములను సమర్పించి అలంకరింపచేసి మరల తన వీపుపై ఆమె పాదము నుంచి అశ్వముపై అధిరోహింపచేసెను. అదే విధముగా తండ్రిని కూడా అశ్వారోహణమును చేయించెను. ధర్మాంగదుడు మాత్రము రాజులతో కలిసి కాలినడకన సాగెను తల్లియగు మోహినిని చూచి సంతోషముచే పులకించెను. తాను స్వయముగా మేఘగంభీర వాదముచే స్తోత్రము చేయుచుండెను. ఎక్కువ మంది తల్లులున్న పుత్రుడు ఈలోకమున ధన్యుడు. తండ్రికి కొత్త భార్యలు, కొంక్రొత్త భార్యలు ఎక్కువ ప్రీతి పాత్రులుకదా? ఒకే తల్లి ఉన్న పుత్రుడు, ఒకే భార్య ఉన్న తండ్రికూడా దుఃఖభాజనులు అగుదురు. తండ్రి దుఃఖితుడైనచో పుత్రుని హృదయమున సౌఖ్యమెట్లు కలుగును? ఒక తల్లికి నమస్కరించిననే పృధివీఫలము లభించును. చాలా మంది తల్లులకు నమస్కరించినచో ఎంతో పుణ్యము లభించును కదా. కావున ప్రతిదినము చాలామంది తల్లులకు నమస్కరించుచుండు వానికి కలుగు పుణ్యము అనంతముకదా? ధర్మాంగదుడు రాజులతో కలిసి ఇట్లు స్తుతించుచు సుందరము, అభివృద్ధి సహితము అగు విదిశానగరమును చేరెను. రుక్మాంగద మహారాజు కూడా మోహినితో కలిసి అశ్వముపై నగరమును చేరెను.
అపుడు ప్రజలచే పూజింపబడుచు, తన భవనమును చేరి అశ్వమును దిగి మోహినితో ఇట్లు పలికెను. ఓ సుందరీ పుత్రుడగు ధర్మాంగదుని ఇంటికి వెళ్ళుము. ఈ ధర్మాంగదుడు యథోచితముగా నీకు సేవలను చేయును. ధర్మాంగదుడుచేయు సేవలను నీకు నీ చెలి, నీదాసి కూడా చేయజాలరు. ఇట్లు భర్తమాటతో తన గృహమునకు వెళ్లుచున్న మోహినిని చూచి, రాజులతో మీరు ఇచటనే ఉండుడు, తండ్రి ఆజ్ఞచే నే నీ తల్లిని సేవించెదను అని పలికి, ఆమెను చేతులతో తీసుకొని పదునైదవ మందిరమునకు తీసుకొని వెళ్ళి, బంగారముచే నిర్మించబడి, పట్టసూత్రము చుట్టబడి, కోమలము దృఢము అయిన, మెత్తని అస్తరణముగల, మణి రత్న విభూషితము, రత్నదీపఖచితము, సూర్యసమానకాంతియుతము అగుపర్యంకమున కూర్చుండబెట్టెను. అంతట ధర్మాంగదుడు మోహినీ దేవికి పాద ప్రక్షాళనము గావించెను. సంధ్యావళీ దేవికంటే పూజ్యురాలుగా భావించెను. మోహినిని చూచిన ధర్మాంగదుని మనసు కలుషితము కాకపోయెను. ధర్మాంగదుడు సుకుమారుడు, సుందరుడు, యువకుడు అయిననూ తన్వంగి పీనోరు జఘనస్తని అగు మోహినిని పదివేల సంవత్సరములు దానినిగా బాలునిగా భావించెను. ఆమె తనను మూడు సంవత్సరముల పాదములను కడిగి ఆ జలమును తలపై దాల్చెను. వినయముతో వంగి తల్లీ! నేను ధన్యుడనైతిని అని పలికెను. ఇట్లు పలికి ఇతర నరులతో నారీమణులతో పాటు తానుకూడా ఆమెకు అలసటను తొలగించు ఉపచారములను చేసెను. సంతోషముతో ఆమెకు అన్ని భోగములను కూర్చెను. క్షీర సాగర మధన సమయమున సముద్రము నుండి ఉత్పన్నములై అమృతమును స్రవించుచున్న పాతాళ లోకమున దానవులను గెల్చి పొందిన కుండలములను మోహినీ దేవి కర్ణములకు అలంకరించెను. ధాత్రీ ఫలములవలె స్వచ్ఛమగు నూటఎనిమిది ముత్యములచే రచితమగు హారమును మోహినీదేవి హృదయమున అలంకరించెను. నిష్కము పలశతమితము, అనేక వజ్రఖచితములు అగు లఘాత్తరహారమును ఆమె కంఠసీమలో నలంకరించెను. రెండు చేతులకు ఎనిమిది కంకణముల చొప్పున పదహారింటిని ఒక్కొక్కటి కోటి నిష్కములు కలది, విలువ తెలిసినవారిచే చేయబడిన వాటిని తొడిగెను. వెలకట్టలేని కేయూరములను, నూపురములను అలంకరించుకొనుటకు ఇచ్చెను. తారకాసుర యుద్ధమున భయముచే పార్వతీదేవి నడుమునుండి జారిపడిన కాలనేమి రాజ్యము అనునది. దానిని లోకమయియగు మయాసురుడు తీసుకొనెను. కోటిమంది దైత్యులచే కూడియున్న మయుని ధర్మాంగదుడు తండ్రి ఆజ్ఞచే సంవత్సరము యుద్ధముచేసి సంహరించెను. అతని ప్రియురాలి నడుమున కున్న కటిసూత్రమును హరించెను. ఆ కటిసూత్రమును సంతోష పులకితుడగు ధర్మాంగదుడు తండ్రికి ఇష్టురాలగు మోహినికి సమర్పించెను. పూర్వకాలమున లోకసుందరి అగు హిరణ్యకశ్యపుని భార్యకు సౌదామిని సమప్రభమగు సీమంతకము ఉండెను. ఆమె భర్త మరణించినపుడు ఆ సీమంతకమును సముద్రమున పడవేసి భర్తతో అగ్నిలో దగ్ధమాయెను. సముద్రుడు రెండు శ్రేష్ఠ రత్నములతో కూడి ఉన్న ఆ సీమంతకమును తీసికొని ధర్మాంగదుని పరాక్రమమునకు మెచ్చి, ధర్మాంగదునికు ఇచ్చెను. ఆ సీమంతకమును ఇప్పుడు ధర్మాంగదుడు మోహినికి సమర్పించెను. అగ్నివలె పరిశుద్ధములు అగు శుభకరములగు వస్త్రయుగ్మమును, మనోహరములు సహస్రకోటి మూల్యములు అగు కంచుంములను మోహినికి సమర్పించెను. దివ్యమాల్యములను, సుగంధాఢ్యములగు దివ్య విలేపనమును, సర్వదేవ విభునకు ఉపయోగించునది సుదుర్లభము, పూర్వము ధర్మాంగదుడు ద్వీపముల విజయ సమయమున సిద్ధుల హస్తము నుండి స్వీకరించినది, కామ వర్ధకమగు గంధమును మోహినీదేవికి అర్పించెను. ఇట్లు చక్కగా మోహినీ దేవిని అలంకరించి తరువాత తల్లిచే తేబడిన షడ్రసోపేతమగు భోజనమును భుజింపచేసెను. మోహిని ఎదుటనే తన తల్లిని చక్కని మాటలతో బోధించెను. ఓ తల్లీ! నేను నీవు తండ్రిగారి మాటను పాటించవలెను. అట్టి రాజుకు ఇష్టురాలు అగు ప్రియురాలు మనకు చాలా పూజ్యురాలు. భర్తకు ఇష్టురాలగు యువతిని సవతిగా చూచిన స్త్రీ పదునలుగురు ఇంద్రుల కాలము నరకమున నివసించును. అట్టి ఇష్టురాలిపై భర్తకు ద్వేషము కలిగించు స్త్రీ రాగి పెనముపై కాల్చబడును. కావున భర్తకు ఆనందము కలుగు విధానమునే భార్య అనుసరించవలెను. భర్తకు ఇష్టురాలగు యువతికి అనుకూలమును హితమును ఆచరించవలెను. భర్తను చూచినట్లు భర్త ప్రియురాలిని కూడా చూడవలెను. భర్త ప్రియురాలు హీనురాలైనను ఆమెను సేవించిన భార్య స్వర్గమును పొందును. తరువాత జన్మలో ఆమె కూడా భర్తకు ప్రియురాలుగా పుట్టును. భర్తకు ఇష్టమగు దానిని ఆచరించిన స్త్రీ సకల భోగ ములను అనుభవించగలుగును.
ఈర్ష్యా భావమును వదిలినచో సర్వేశ్వర లోకము లభించును. సవతి సేవచేయు స్త్రీ భర్త ప్రియమును చూచునదగును. కావున అక్షయ లోకములు లభించును. పూర్వ కాలమున ఒక పురుషుడు శూద్రజాతివాడు పరమదుష్టుడు, కర్మాచరణ హీనుడు ఉండెను. అతనికి ఒక వేశ్యపై ఇష్టము కలిగి వేశ్యను ఇంటికి తీసుకొని వచ్చెను. అపుడు భార్య వేశ్యను సంతోషపరిచెను. వేశ్య వారించుచున్ననూ ఇద్దరి ఉచ్ఛిష్టమును భుజించి, ఇద్దరి కన్నా క్రింద పరుండి ఆ ఇద్దరికి హితమును ఆచరించుచుండెను. ఇట్లు వేశ్యతో పాటు భర్తను సేవించుచుండగా చాలాకాలము గడిచెను. ఒకనాడు భర్త మూలకములచే చేయబడినది తైలమిశ్రితమగు మాహిష నిష్పాదమును (గేదె జున్నును) దుష్టబుద్ధి కలవాడై భుజించెను. ఇట్లు పతివ్రతను అవమానించి అపథ్యమును భుజించిన అతనికి గుదమున ఘోరమగు భగంధరమను రోగము పుట్టెను. ఆరోగముతో అతను రాత్రింబవళ్లు దహించ బడుచుండెను. అంతట ఆవేశ్య అతనింటిలో ఉన్న ధనమును అంతటిని అపహరించుకొని వెళ్ళి కామ పరాయణురాలు కావున మరియొక యువకునికి ఇచ్చెను. అంతట అతను దీనమగు ముఖముచే సిగ్గుపడుచు వ్యాకులమగు మనస్సుచే రోదించుచు, భార్యతో ఇట్లు పలికెను. ఓ దేవీ! పరమ కఠినుడను, వేశ్యాసక్త చిత్తుడను అగు నన్ను కాపాడుము. నేను పరమపాపినై నీకు ఏ మాత్రము ఉపకారమును చేయలేకపోతిని. నేను చాలా సంవత్సరములు వేశ్యతో గడిపితిని. వినయశీలురాలు పతివ్రత అగు భార్యను ఆదరించనివాడనైన నేను పదునైదు జన్మలు అశుభములను పొందుదును. తరువాత హీనజాతిలో పుట్టెదను. గాననీవుమాత్రము నన్ను ఆదరించుచు నీ మనసు స్వచ్ఛమైనదని తెలిపితివి. ఇట్లు భర్త మాటలను విని అతనితో ఇట్లు పలికెను. పూర్వ జన్మలలో చేసిన పాపములే దుఃఖములగును. జ్ఞాని ఆ దుఃఖములను సహించగలుగును. అట్లు సహించగలవాడే ఉత్తమ మానవుడు. కావున నేను పూర్వజన్మలో పాపములను చేసి యుంటిని. ఆపాపములనే దుఃఖములనుగా అనుభవించు నాకు ఎట్టి పరితాపము లేదు అని ఇట్లు పలికి భర్తను ఓదార్చి, తండ్రి నుండి బంధువుల నుండి ధనమును తెచ్చి, భర్తను శ్రీమన్నారాయణునిగా భావించి పగలు మూడు మార్లు గుహ్యమును శుద్ధి చేయుచు, చండ్ర వృక్ష రసమును తీసి నఖముతో వ్రణములో వేయుచు, మెల్ల మెల్లగా వ్రణములోని క్రిములను తీసివేయుచు, నెమిలి పింఛముతో వీచుచుండెను. ఆమె పగలు, రాత్రి నిదురించలేదు. భర్తదుఃఖముతో పరితపించుచు జగత్తును దహించుచున్నట్లు తలచుచుండెను. ఈ భూదేవి, పితృదేవతలు, దేవతలున్నచో నా భర్తను రోగహీనునిగా చేయుడు. అట్లు చేసినచో చండికాదేవికి మేక యొక్క మహిషము యొక్క మాంసమునుండి వచ్చు రక్తమును తర్పణ చేసెదను. ఆదరముతో పది ఉపవాసములను చేయింతును. నేను నా శరీరమును చిన్నముళ్ళ పడకపై ఉంచెదను. మధురమును ఘృతమును భుజించను. చాలా దినములు బాహ్యాభ్యంగ రహితముగా ఉందును. నా భర్త రోగ రహితుడై నూరేండ్లు చల్లగా బ్రతుకనిమ్ము. అని ఇట్లు ప్రతిదినమూ పలుకుచు ఆమె గడిపెను. ఇంతలో కొద్దికాలమునకే అతనికి త్రిదోషము సంక్రమించెను. అపుడామె భర్తకు చాలా ప్రయత్నించి త్రికటువును ఇచ్చెను. శీతబాధచే వణకుచు అతను భార్య వేలును కొరికెను. రెండుపలువరుసలు ఒకటిగా కలిసి పోయెను. భార్యాంగుళీ ఖండము. అతని నోటిలోనే ఉండిపోయెను అట్లే అతను పంచత్వమును పొందెను. అంతట ఆమె కంకణమును అమ్మి కట్టెలను కొని, చితిని పేర్చి నేయి పోసి భర్తను చేతులలో ధరించి చితిపై కూర్చొని, పాదముతో అగ్నిని ఆకర్షించి, అతని ముఖమున ముఖమును, హృదయమున హృదయము నుంచి, జఘనమున జఘనము నుంచి బాధాపీడితమగు భర్తృదేహమును తనతోపాటు కాల్చెను. అట్లు ఆమె దేహమును విడిచి భర్తను తీసికొని చాలా పాపరాశులను శుద్ధిచేసి దుష్కర సాధనమగు తన కర్మలచే దేవ లోకమును చేరెను. (II/16)