నారద మహా పురాణము
మహావిష్ణు మంత్ర విధానము
సనత్కుమార మహర్షి పలికెను: ఈ లోకములలో లభించ శక్యము కాని మహావిష్ణు మంత్రములను ఇపుడు చెప్పెదను. ఈ మంత్రములను తెలుసుకొని మానవులు త్వరగా తమతమ అభీష్టములను పొందగలరు. ఈ మంత్రములను ఉచ్చరించుట వలననే పాపరాశులు నశించును. బ్రహ్మాదులు కూడా ఈ మంత్రములను తెలుసుకొని జగత్కార్యములందు సమర్ధులగుచున్నారు. నారాయణ పదము తారహృత్పూరకము ఙేన్తమగును. ఈ మంత్రమునకు ఎనిమిది అక్షరములుండును. ఈ మంత్రమునకు సాధ్యుడు నారాయణ ముని. గాయత్రీ ఛందస్సు, విష్ణువు దేవత, ఓం అనునది బీజము. యం శక్తి, అఖిల ప్రాప్తికి వినియోగము. క్రుద్ధోల్కునికి హృదయము, మహోల్కునికి శిరస్సు, వీరోల్కునికి శిఖ, ద్యుల్కునికి కవచము, మహోల్కునికి అస్త్రము. ఇట్లు పంచాంగ కల్పన చేయవలెను. తరువాత షడంగన్యాసము మంత్రమునందుగల షడ్వర్ణములచే ఆచరించవలెను. మిగిలిన రెండు వర్ణములను కుక్షి పృష్ఠములలో న్యాసము చేయవలయును. సుదర్శన మంత్రముచే దిగ్బంధమును చేయవలెను. చతుర్ధీ విభక్త్యంతమైన సుదర్శన పదము తరువాత నమః అను పదమును తారముగా చేర్చవలెను. తరువాత ‘అస్త్రాయ ఫట్’ అని చెప్పినచో ద్వాదశాక్షరమంత్ర మగును. దశావృత్తిమయమగు విభూతి పంజరమను న్యాసమును చెప్పెదను. మూలమంత్రాక్షరములను స్వశరీరమునందు ఉంచుకొనవలెను. ఆధారమున, హృదయమున ముఖమున, బాహువులందు, పాదములందు, నాసికయందు చేయు న్యాసము ప్రధమావృత్తి అనబడును. గళమున, నాభియందు, హృదయమునందు, కుచములందు, పార్శ్వములందు పృష్ఠములందు ద్వితీయా వృత్తి. శిరస్సు, ఆస్యము, నేత్రము శ్రవణములు, నాసికలయందు తృతీయావృత్తి, బాహువులందు, పాదములందు, సంధులందు, అంగుళులయందు చతుర్ధావృత్తి న్యాసము చేయవలయును. ఘ్రాణ ప్రాణ హృదయములందు పంచమావృత్తి చేయవలెను. ‘శిరో నేత్ర ఆస్య హృత్కుక్షి ఊరుజంఘ పదద్వయములందు ఒక్కొక్క మంత్రాక్షరమును వ్యాసము చేయవలెను. మంత్రము యొక్క నాలుగక్షరములను హృదయ భుజ ఊరు పాదములందు ఉంచవలెను. చక్ర శంఖ గదా పద్మ పదములందు అయాముద్రలచే వ్యాసము చేయవలెను. ఈ న్యాసమును విభూతి పంజరమందురు. ఒక్కొక్క మూల వర్ణమును సచంద్రముగా తార సంపుటముగా న్యాసము చేయవలెను. లేదా నమోంతముగా చేయవలయునని మరికొందరు చెప్పిరి. తరువాత విష్ణుభావసిద్ధి కొఱకు తత్త్వన్యాసమును చేయవలెను. అష్టాక్షర మంత్రము అష్టప్రకృతి స్వరూపమని పూర్వ సూరులు చెప్పుచున్నారు. పృథివ్యాది పంచ భూతములు, అహంకారములు, మహతత్త్వము, ప్రకృతి అను ఈ ఎనిమిది ప్రకృతులు. వాదమునందు, లింగమునందు, హృదయమునందు, ముఖమునందు, శిరస్సునందు వక్ష స్థలమున, హృత్థ్సలమున సర్వాంగములందు న్యాసము చేయవలయును. ఒకదానిచే వ్యాపకము ఆచరించవలెను. మంత్రాక్షర హృత్పరమునకు మొదటిది, ఆత్మకు హృదయాంతిమముగా ఆయా నామములను ఉచ్చరించి ఆయా స్థలములందు న్యాసమును చేయవలయును. ఇదియే తత్త్వన్యాసము. ఈ వ్యాసము సర్వ న్యాసములలో ఉత్తమ వ్యాసము. ద్వాదశాదిత్య సంయుతులగు ద్వాదశ మూర్తి న్యాసమును చేయవలెను. ద్వాదశ అక్షర మంత్రముయొక్క ద్వాదశ అక్షరములు ద్వాదశ ఆదిత్య సంయుతములు. అష్టాక్షర మంత్రము అష్టప్రకృతి స్వరూపముగా చెప్పబడినది. ఈ అష్టాక్షరములకు ఆత్మచతుష్మయోగముతో ద్వాదశ అక్షర మంత్రమగును. ద్వాదశ మూర్తులను క్రమముగా లలాట, కుక్షి, హృదయ, కంఠ, దక్షిణ పార్శ్వ, భుజ, గల, వామపార్శ్వ భుజ, గల పృష్ట కకుత్ స్థానములందు ఉంచవలెను. ధాతతో కేశవుని, అర్యమునితో నారాయణుని, మిత్రునిచే మాధవుని, వరుణునిచే గోవిందుని, అంశువుచే వామనుని, పూషచే శ్రీధరుని, పర్జన్యునిచే హృషీకేశుని, త్వష్టచే పద్మనాభుని, విష్ణువుచే దామోదరుని, వ్యాసముచేసి, ద్వాదశాక్షరమంత్రమును నమస్త శిరమున వ్యాసము చేయవలెను. తరువాత కిరీట మంత్రముచే వ్యాపకన్యాసమును చేయవలెను. కిరీటకేయుర హోరాంతమున ధ్రువము మకరమని, కుండాలాంతమున, చక్ర శంఖ గదాంతమున భోజహస్తమున, పీతాంబరాంతమున శ్రీ వత్సాంకిత వక్షస్థ్సలము అని శ్రీభూమి సహిత స్వాత్మ జ్యోతి ద్వయమును దీపకరాయ. తరువాత సహస్రాదిత్య తేజమునకు బాణ షడ్వర్ణములతో నమోంతము కిరీట మంత్రముగా చెప్పబడినది. ఇట్లు వ్యాస విధిని ఆచరించి ప్రభువగు నారాయణుని ధ్యానము చేయవలెను. ఉదయించుచున్న కోటి సూర్యనముడు, శంఖ చక్ర గదా పద్మములను ధరించినవాడు రెండు పార్శ్వములలో శ్రీభూదేవులు కలవాడు, శ్రీవత్సవక్షుడు, కౌస్తుభ మణిచే ప్రకాశించువాడు, ముత్యాలహారములు కంఠమున గలవాడు, హారకేయూర వలయాంగద భూషితుడు, పీతాంబరుడు, అగు నారాయణుని స్మరించవలెను. విధిననుసరించి ఇంద్రియ నిగ్రహము కలవాడై అక్షర లక్ష జపమును చేయవలెను. మొదటి లక్షచే ఆత్మశుద్ధి, రెండవలక్షచే మంత్రశుద్ధి, మూడవ లక్షచే స్వర్గము, నాలుగవ లక్షచే విష్ణు సామీప్యము, అయిదవ లక్షచే పరిశుద్ధ జ్ఞానము, ఆరవ లక్షచే విష్ణువునందు స్థిరబుద్ధి, ఏడవ లక్షచే విష్ణు సారూప్యము, ఎనిమిదవ లక్షచే నిర్యాణమును పొందును. ఇట్లు ఎనిమిది లక్షలు జపించిన తరువాత దశాంశమును పద్మములచే తేనెను కలిపి సంస్కరించిన అగ్నిహోత్రమున హోమమును చేయవలెను. పీఠమున మండూకమునుండి పరతత్త్వము వరకు పూజించి, విమల, ఉత్కర్షిణి, జ్ఞాన, క్రియ, యోగా, ప్రహ్యీ, సత్యా, ఈశాన, అనుగ్రహా అని తొమ్మిది శక్తులు. “ఓం నమో భగవతే విష్ణవే సర్వ భూతాత్మనే, వాసుదేవాయ సర్వాత్మా” అను మంత్రమును ఉచ్చరించవలెను. సంయోగ యోగ పద్మాంతమున పీఠమున హృదయాంతిమము షడ్వింశాక్షరము అగు పీఠ మంత్రము. ఈ పీఠ మంత్రముచే ఆసనము అర్పించవలెను. మూర్తిని సంకల్పించి మూలమంత్రముచే ఆవాహనచేసి పూజించవలెను. మొదట అంగములను పూజించి మంత్ర కేశరములందు ప్రాగాదిదిగ్దలములందు వాసుదేవుని, సంకర్షణుని, ప్రద్యుమ్నుని, అనిరుద్ధుని, కోణములందు శక్తుల అర్చించవలెను. శాంతిని, శ్రీని, సరస్వతిని, రతిని, క్రమముగా పూజించవలెను. హేమ, పీత, తమాల, ఇంద్రనీల కాంతులు గలవారు. పీతాంబరులు, చతుర్భుజులు, శంఖ చక్ర గదా పద్మ ధరులు మొదటి నలుగురు. సీతకాంచన గోదుగ్ధ దూర్వావర్ణులు శక్తులు. దలాగ్రములందు చక్ర శంఖ గదా పద్మ కౌస్తుభములను ముసలమును, ఖడ్గమును, వనమాలను క్రమముగా పూజించవలెను. రక్తాజపీత కనక శ్యామ కృష్ణాసితార్జున వర్ణులను, కుంకుమ వర్ణముగల పక్షిణజును బహిరగ్ర భాగమున చక్కగా పూజించవలెను. రెండు ప్రక్కల ముక్తామాణిక్య సంకాశములగు శంఖ పద్మ నిధులను క్రమముగా పూజించవలెను. పశ్చిమ భాగమున ధ్వజమును పూజించవలెను. ఆగ్నేయమున రక్త వర్ణుడగు విఘ్నేశుని, నైఋతి కోణమున శ్యాముడగు అర్యుని, వాయవ్యమున శ్యామయగు దుర్గను, ఈశాన కోణమున పీతవర్ణుడగు సేనానిని పూజించి, బాహ్యభాగమున ఆయుధములతో కూడియున్న లోకపాలకులను పూజించవలెను. ఇట్లు ఆవరణలచే కూడియున్న అవ్యయుడగు విష్ణువును పూజించినవాడు ఇహమున సకల భోగములను అనుభవించి అంతమున విష్ణు పదమును పొందును.
క్షేత్రధాన్య సువర్ణముల ప్రాప్తి కొఱకు మూర్వాదలశ్యామ, శాలి మంజరులను ధరించియున్న ధరణిని స్మరించ వలెను. దేవదేవుని దక్షిణ భాగమున ఉన్న పూర్ణచంద్రుని భావన క్షీరసాగరతరంగ పీనభానిభవస్త్రధారిణి, వీణా పుస్తక ధారిణి అగు భారతీదేవిని ధ్యానించవలయును. భారతీదేవితో కూడియున్న పరాత్పరుని ధ్యానించినవాడు వేదవేదార్థ తత్త్వజ్ఞుడు సర్వ విత్తముడు అగును. అతి భయంకరుడగు నారసింహుని ధ్యానముచేసి, మంత్రముచే శస్త్రమును మంత్రించి యుద్ధమునకు వెళ్ళినచో శత్రువులను వధించి తిరిగి వచ్చును. సాధకుడు నారసింహ బీజముచే మంత్రమును సంయోజన గావించి, అష్టోత్తరమును జపించి మంత్రించబడిన జలమును వామహస్తముచే మాటి మాటికి ప్రోక్షణ చేసినచో సర్పదష్టుడు కూడా బ్రతుకును. గారుడ మంత్రముతో సంయోజనము చేసి పంచాక్షరితో జపించవలెయును. విషమును తొలగించుటకు గరుడవాహనుడగు విష్ణువును ధ్యానించవలెను. అశోఖ ఫలమున గరుడుని లిఖించి అశోక పుష్పములతో పూజించి మూడు పుటాల ఏడుమార్లు ఆ పుష్పములను హోమము చేయవలెను. పక్షి ప్రత్యక్షమై ఇష్టమగు వరములను ఇచ్చును. గాణపత్యముచే సంయోజనముచేసి క్షీరవ్రతమును స్వీకరించి లక్ష జపము చేసినచో మహాగణపతిదేవుని ప్రత్యక్షముగా చూడగలడు. వాణీ బీజ యుక్తముగా ఆరు మాసములు యోజనచేసినచో మహాకవివరుడై సకలజగత్తును మోహింప చేయును. అర్థాంగుల మితములగు గుడూచీ శకలములను దధిమధ్యాజ్య యుక్తముగా హోమముగావించినచో మృత్యువును జయించును. శనివారమున రాగి చెట్టును చేతితో తాకి అష్టశతమును జపము గావించినచో యుద్ధమున అపమృత్యువును జయించును. ప్రతి నిత్యము ప్రాతః కాలము ఇరువది అయిదు మార్లు జపించి జలపానము చేయవలెను. సర్వ పాప వినిర్ముక్తుడై జ్ఞానవంతుడై రోగవర్జితుడు అగును. కుంభమును స్థాపించి శుద్ధ జలమును విధిననుసరించి పానము చేసిన అన్ని రోగములు నశించును. సూర్య చంద్ర గ్రహణములలో ఉపవసించి ఎనిమిది వేలు బ్రాహ్మీఘృతమును జపించి పానము చేయవలెను. మేధను కవిత్వమును వాక్సిద్ధిని పొందగలడు. బిల్వపత్రములచే పదివేలు హోమము చేయవలెను. మహాధనపతి యగును. ఇది నారాయణమంత్రము సర్వమంత్రోత్తమము. సర్వసిద్ధులకు ఆలయమైన దీనిని నీకు చెప్పితిని. “నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్” అనునది విష్ణు గాయత్రి. ఇది సర్వ పాపములను నశింపచేయును. “ఓం నమో భగవతే వాసుదేవాయ” అనునది మహా మంత్రము. ఇది ద్వాదశాక్షరి. భుక్తి ముక్తి ప్రదాయకము. స్త్రీ శూద్రులకు ప్రణవ రహితముగా బ్రాహ్మణులకు ప్రణవ సహితముగా చెప్పబడినది. ఈ మంత్రమునకు ప్రజాపతిముని. గాయత్రీ ఛందస్సు. దేవత వాసుదేవుడు శక్తి బీజము హృదయము ధ్రువము. చంద్రాక్షి వేద పంచాక్షరములతో అంగ కల్పనము చేయవలెను. శిరస్సున ఫాలభాగమున నేత్రములందు, ముఖమున, కంఠమున, హృదయమున, కుక్షియందు, నాభియందు, ధ్వజమునందు, జాను ద్వయమున, పాద ద్వయమున, క్రమముగా మంత్రవర్ణ న్యాసము చేయవలెను. దీనిని సృష్టి న్యాస మందురు. హృదయమునుండి మస్తకము వరకు చేయు వ్యాసము స్థితి వ్యాసమందురు. పాదముల నుండి మస్తకము వరకు సంహార న్యాసమందురు. సర్వతంత్రములందు గుప్తముగా చెప్పబడిన తత్త్వ న్యాసమును తరువాత చేయవలెను. జీవము, ప్రాణము, చిత్తము, హృత్పద్మము, సూర్య మండలము, చంద్రాగ్ని మండలములు, వాసుదేవుడు, సంకర్షణుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు, నారాయణుడు, చక్రము అనునవి ద్వాదశ తత్త్వములు. మూలాక్షర హృత్పరము క్రమముగా న్యాసమును గావించవలెను. ఇచట కూడ పూర్వోక్త ధ్యానమునే గావించవలయును. మంత్రమును పన్నెండు లక్షలు జపించవలెను. దశాంశమును నేతితో కలిపిన నువ్వులతో హోమమును చేయవలెను. పూర్వోక్త పీఠమునందు మూలమంత్రముచే మూర్తిని సంకల్పించి, ఆ మూర్తియందు దేవేశుని ఆవహించి వాసుదేవుని పూజించవలెను. మొదట అంగములను పూజించి తరువాత వాసుదేవాదికమును, శాంత్యాది శక్తులను దిక్కులందు, విదిక్కులందు పూజించవలెను. తృతీయావరణము నందు చెప్పబడిన ద్వాదశ మూర్తులను పూజించవలెను. ధరణీ గృహమునందు ఆయుధ యుక్తులగు ఇంద్రాదులను పూజించవలెను. ఇట్లు పంచావరణలచే అవ్యయుడగు విష్ణువును పూజించి సకలాభీష్టములను పొంది అంతమున విష్ణుపదమును చేరును.
పురుషోత్తముడను పేరుగల విష్ణువుయందు నాలుగు భేదములు గలవు. వారిలో మొదటి వాడు త్రైలోక్య మోహనుడు. రెండవవాడు శ్రీకరుడు. హృషీకేశుడు కృష్ణుడు అను వారు మూడవ నాలుగవ భేదములు. ఈ మంత్రమున ఓంకారము కామము. తరువాత రమాపదమును. చతుర్థ్యంత పురుషోత్తమ పదమును చెప్పవలయును. “ఓం రమాపురుషోత్తమాయ” అనునది మంత్రము. వర్మ అస్త్రములు అగ్ని ప్రియాంతము వహ్నీందు వర్ణములు గల మంత్రమిది. ఈ మంత్రమునకు బ్రహ్మముని. గాయత్రీ ఛందస్సు. పురుషోత్తముడు దేవత. స్మరబీజము, ఇందిర శక్తి, భూచంద్రైకరసాక్షి అక్షిమంత్ర వర్ణములచే విభాగముతో అంగముల నేర్పరచిన తరువాత విధిననుసరించి పురుషోత్తముని ధ్యానించవలెను. ఉదయించు సూర్యసన్నిభుడు, శంఖచక్రగదాపద్మములచే శోభించు హస్తములు కలవాడు, పీతాంబరుడు అగు పురుషోత్తముని స్మరించవలెను. మహా రత్న సమూహములచే చెక్కబడిన, శోభించు మండపమున, ముత్యముల సమూహము శమదమ విరాజిత వితానమున, నర్తించు దేవాంగనా బృందముల ధ్వనించు కింకిణులు గల నూపురములు గల, ప్రకాశించు మాణిక్య వేదిక అందు, ప్రకాశించు సూర్య తేజస్సుగల, బృందారక వ్రాత కిరీటాగ్ర రత్నాభిచర్చితమగు మండలమున నవలక్ష పర్యాయములు మంత్రమును జపించవలెను. దశాంశమును పూర్వోక్త వైష్ణవ పీఠమున వికసించిన కమలములచే హోమమును చేసి అర్చించవలెను. ఇట్లు దేవేశుని పూజించి గొప్ప సంపదను పొందును. పుత్రులను పౌత్రులను, కీర్తిని, కాంతిని, భుక్తిని, ముక్తిని పొందును. తరువాత శ్రీకారాగ్ని ప్రియాంతిమమగు ‘ఉత్తిష్ట’ అను పదమును ఉచ్చరించవలెను. ఈ మంత్రము అష్టాక్షరములు కలది. ముని వ్యాస మహర్షి, పంక్తి ఛందస్సు. శ్రీకరనాముడను శ్రీహరి దేవత భీషయద్వితయము హృదయము. ‘త్రాసయ త్రాసయ’ అనునది శిరము. ‘ప్రమర్దయ ప్రమర్దహు’ అనునది శిఖ, ‘ప్రధంసయ ప్రధ్వంసము’ అనునది కవచము. ‘రక్షరక్ష’ అనునది. అస్త్రము. ఇవి అన్నియు హుం అనునది అంతమునందు కలవి. మస్తకమున, నేత్రములలో, కంఠమున, హృదయమున, నాభియందు, ఊరు జంఘపాద ద్వయములందు క్రమముగా మంత్ర వర్ణ వ్యాసమును చేయవలెను. తరువాత పురుష సూక్త మంత్రములచే వ్యాసము నాచరించవలెను. “బ్రాహ్మణోఽస్య ముఖమాసీత్” అను మంత్రమును ముఖమున, బాహూరాజన్య అను మంత్రమును బాహుద్వయమున, ఊరూ తదస్య యద్వైశ్వ అను మంత్రమును ఊరుద్వయమున, పద్భ్యాం శూద్రో అజాయత అను మంత్రమును పాదద్వయమున న్యాసమును చేయవలెను. చక్ర శంఖ గదా పద్మములను కరాగ్రములందు న్యాసమును చేయవలెను. ఇట్లు న్యాసవిధిని పూర్తిచేసి పూర్వోక్తమండపమున ధ్యానమును చేయవలెను. అరుణాబ్జాననమున ఉన్న గరుడుని మీదున్న పూర్వోక్తరూపుడగు, లోకమోహనుడగు శ్రీకరుని ధ్యానముచేసి పూజించి ఎనిమిది లక్షలు జపమును చేయవలెను. పాలన్నముచే నేతితో వేరువేరుగా హోమమును గావించవలెను. రాగి, మేడి, జువ్వి, మఱ్ఱి వృక్షములు క్షీరి ద్రుమములనబడును. వైష్ణవ పీఠమున మూలమంత్రముచే మూర్తిని సంకల్పించి, అంగావరం దిక్పాలా యుధములచే కూడిన విభువును పూజించవలెను. ఇట్లు మంత్రము సిద్ధించిన తరువాత పూర్వమువలె ప్రయోగములను ఆచరించవలెను. “ఓమ్ నమో భగవతే వరాహరూపాయ భూర్భువస్స్వః” అనునది మంత్రము. నాకు భూపతిత్వమును ఇమ్ము అని ప్రార్ధించవలెను. ఈ మంత్రమునకు భార్గవ ఋషి. అనుష్టుప్ఛందస్సు, ఆదివరాహము దేవత. ఏకదంష్ట్రునకు హృదయము వ్యోమోలునను శిరము, తేజోఽధిపతికి శిఖ, విశ్వరూపునకు కవచము, మహాదంష్ట్రునకు అస్త్రము అని పంచాంగములను కల్పించవలెను. తరువాత అనేక సూర్యసన్నిభుడగు ఆదివరాహుని ధ్యానము చేయవలెను. స్వర్ణ విభుని జానువులలో, సిత ప్రభుని నాభి అధోభాగమున, ఇష్ట భయగదా శంఖచక్రశక్తిఖడ్గఖేటములను హస్తములలో ధరించి ఉన్న, దంష్ట్రాగ్రములందు శోభించు ధరణి కలవాడు అయిన వరాహమును స్మరించవలెను. ఇట్లు ధ్యానము చేసి, దశాంశమును పద్మములను నేతితో కలిపి హోమమును చేయవలెను. వైష్ణవ పీఠమున పూజించవలెను. మూల మంత్రముచే మూర్తిని సంకల్పించి ఆ మూర్తియందు ప్రభువును పూజించవలెను. అంగావరణ దిక్పాలహోతి యంత్ర ప్రసిద్ధి కొఱకు జపము చేయగనే ధన ధాన్య భూ సంపదలను దానము చేయవలెను. సూర్యుడు సింహరాశిలో ఉన్నపుడు శుక్లపక్షమున అష్టమి తిథియందు పంచ గవ్యములందు శుద్ధమగు శిలనుంచి, ఆ శిలను స్పృశించి పదివేల జపమును చేయవలెను. తరువాత మంత్రసిద్దిని పొందినవాడు ఉత్తరాభిముఖుడై ఆ శిలను భూమియందు నిక్షిప్తము చేయవలెను. ఇట్లు చేసినచో భూత ప్రేత సర్పచోరాది బాధలు తొలగును. శుక్రవారమున ప్రాతః కాలమున సాధ్యమగు భూమినుండి మట్టిని తేవలెను. ఆ మట్టిని మూల మంత్రముచే మంత్రించి మూడుగా విభజించవలెను. ఒక భాగమును పొయ్యి మీద అలికి, మరొక భాగమును పాక పాత్రను పూసి, ఆవుపాలతో చక్కగా ఆలోడనము చేసి శుద్ధి పరిచిన తండులములను ఉంచవలెను. చక్కగా శుద్ధి చేయబడిన పాఠశాలలో మంత్రమును జపించుచు చరువును వండలెను. ఆ చరువును పొయ్యి మీదినుండిదింపి అగ్నిలో యథావిధిగా హోమమును చేయవలెను. ధూపదీపాదులతో చక్కగా పూజించి నేయికలిపిన చరువును సంస్కరించబడిన అగ్నిలో నూట ఎనిమిదిమార్లు హోమమును చేయవలయును. ఇట్లు మంత్రమును పొందినవాడు ఏడు శుక్ర వారములలో హోమమును గావించవలెను. స్వక్షేత్రమునగల విరోధము నశించును. శత్రు చోరాదులవలన కలుగు ఉపద్రవములు నశించును. ఇట్లే మంగళవారమున సూర్యోదయ కాలమున సాధ్యక్షేత్రము నుండి మట్టిని స్వీకరించి పూర్వ విధిగా హవిస్సును సిద్ధముచేసి నూట ఎనిమిది మార్లు సంస్కృతాగ్నిలో హోమమును గావించవలెను. పాయసముతో కూడిన గవ్యములలో లక్షసంఖ్యగా హోమమును గావించవలెను. ఇట్లు గావించినచో తాను కోరిన భూమికి అధిపత్యము లభించును. బాహువులలో పరిఘను ధరించి, తెల్లని దంష్ట్రాగ్రమును భూమిని ధరించి, స్వర్ణసన్నిభుడగు వరాహ స్వామిని పీత పార్థివ మండలమున సావధాన మనస్కుడై ధ్యానము చేసినచో, వరాహస్వామి అనుగ్రహముచే చక్కని భూమిని పొందగలడు. వారుణ మండలమున హిమసన్నిభుడగు ఆదివరాహుని ధ్యానమును చేయవలయును. ఇట్లు చేసినచో సాధకునికి మహోప ద్రవములు శాంతించును. సకలవశ్యత కొఱకు వహ్ని మండలమున వహ్ని సన్నిభుడగు వరాహస్వామిని ధ్యానించవలెను. శత్రువులను పారద్రోలుటకు వాయు మండలమున కృష్ణ వర్ణుడగు వరాహస్వామిని ధ్యానించవలెను. ద్యుమండలమున నున్న స్వచ్ఛుడు సర్వసిద్ధి ప్రదుడగు వరాహస్వామిని శత్రు గ్రహ క్ష్వేడా, అమయ పీడాది శాంతికొఱకు వ్యోమ బిందు భూషితమస్తకుని ధ్యానించవలెను.
వరాహస్వామి యొక్క ఏకాక్షర మంత్రము మరియొక కల్ప వృక్షము. ఈ మంత్రమునకు కూడా అర్ఘ్యాది పూజలు పూర్వము వలెనే ఆచరించవలెను. ఓంకారము ఆదియందుకల ఈ మంత్రము అష్టాక్షరి, సర్వ్వైశ్వర్యప్రదము. ఈ మంత్రమునకు ముని బ్రహ్మ గాయత్రీ ఛందస్సు. వరాహస్వామి దేవత ధ్యాన పూజా ప్రయోగాదులను మొదటి వలెనే ఆచరించవలెను. ఈ మంత్రము ప్రణవాదికము. చతుర్థంతము తరువాత భగవతి అను పదము, దాని తరువాత రెండు మార్లు ధరణి అని, హరి అని ఉచ్ఛరించవలెను. అనగా ‘ఓమ్ నమో భగవతి ధరణి ధరణి హరే హరే’ అని చెప్పి తరువాత చతుర్ధ్యంత ‘వరాహాయ’ అని పలుకవలెను. ఈ మంత్రము ఇరువది ఒక అక్షరములు గలది. ఈ మంత్రమునకు వరాహస్వామి ముని, గాయత్రీ ఛందస్సు. ధరణి దేవతా తారము బీజము వసుప్రియా శక్తి రామవేదాగ్ని బాణాక్షుల వర్ణములతో అంగ న్యాసమును కావించవలయును. శ్యామ వర్ణముగలది, చిత, విభూషణ, శోభిత, పద్మాసనస్థ, తుంగస్తని, నీలాంబుజద్వయమును, శాలిమంజరిని, చిలుకను చేతితో ధరించునది, చిత్ర వస్త్రధారిణి అగు భూదేవిని స్మరించవలెను. ఇట్లు ధ్యానమును చేసి లక్ష జపమును చేయవలెను. దశాంశమును నేతితో కలిపిన పాయసముతో హోమమును గావించవలెను. విష్ణుపీఠమున పూజించవలెను. మూలమంత్రముతో మూర్తిని సంకల్పించి, ఆ మూర్తిలో భూదేవిని పూజించవలెను. మొదట అంగములను ఆరాధించి భూవహ్ని జలమారుతములను దిక్పాత్రములందు పూజించి, కోణ పత్రములందు ఆకులను నివృత్తి, ప్రతిష్ఠ మొదలగు విద్యాకలలను, ఇంద్రాదులను వజ్రాదులను పూజించవలెను. ఇట్లు మంత్ర సిద్ధిని పొందినతరువాత స్వేష్టమును సాధించుకొనవలెను. పశు రత్నాంబరాది కములచే భూదేవిని ఇట్లు సేవించువాడు. ధరణీ వల్లభుడగును. నూరు సంవత్సరములు సుఖముగా జీవించును. ఇక ఇపుడు జగన్నాథుని త్రైలోక్యమోహన మంత్రమును చెప్పెదను. కాముడు తార, రమాబీజము హృదంతమున పురుషోత్తముడు ఉండవలెను.
“శ్రీకంఠ ప్రతిరూప లక్ష్మీనివాస సకల జగతోభణ సర్వస్త్రీ హృదయవిదారణ! త్రిభువనమనోన్మాదకర! సురాసుర మనుజ సుందరీ జన మనంపి తాపయ!
తాపయ! దీపయ! దీపయ! శోషయ! మారయ మారయ! స్తంభయ
స్తంభయ! మోహాయ! మోహాయ! ద్రావయ! ద్రావయ! ఆకర్షయ! ఆకర్షయ
సమస్త పరమసుభగ! సర్వసౌభాగ్యకర! సర్వకామప్రద! అముం బ్రాహ్మ
సేందు, హనుమాను చక్రేణ గదయా ఖడ్గేన సర్వబాణైః భేది భేది! పాశీన
కట! కట! ఆయసేన తాడయ తాడయ! కురు! కురు! తావద్యావత్సమా
హితం! మే సిద్ధి రాభాస్య:” అనునది మంత్రము. దీని చివర భాగమని పలుకవలయును. ఫట్ అనునది కవచము. ఈ మహాయంత్రము హృదంతము.
రెండు వందల అక్షరములు కలది. ఈ మంత్రమునకు మహర్షి జైమిని. అమితమను ఛందస్సు. జగన్మోహనమునకు జగన్నాథుడు దేవత. కామ బీజము రమాశక్తి అఖిలాసక్తి వినియోగము. పురుషోత్తమ! త్రిభువనోన్మాదక అనునది అగ్నికవచము. జగతోభణ శబ్దము హృదయము. లక్ష్మీదయిత అనునది శిరము. మన్మథోత్తమ అనునది శిఖ. మన్మధోత్తమ మంగజే కామదాయ హుం అని వర్మ న్యాసము చేయవలెను. పరమ భృగు కర్ణాభ్యాం సర్వ సౌభాగ్యకర అనునది కవచము. సురాసుర మనుజ సుందరీ హృదయ విత్! రణ సర్వ ప్రహరణ ధర! సర్వకాముక! హన! హన! “అనునది హృదయము. తరువాత బంధనములను చెప్పవలెను. ఆకర్షయ! ఆకర్షయ! మహాబల!” అనునది కవచము అస్త్రము. తరువాత నేత్రము త్రిభువనకవచ సర్వజన మనాంసి హర హర దారయ దారయ, వశమానయ” అనునది నేత్ర మంత్రము. తారాదులు, ఫట్ నమోంతములు షడంగ మంత్రములుగా చెప్పబడినవి. “త్రైలోక్యమోహన! హృషీకేశ! ప్రతిరూపమన్మథ! సర్వస్త్రీణాం హృదకర్షణ” అను మంత్రముచే వ్యాపకమును ఆచరించి జగన్నాథుని స్మరించవలెను. క్షీరాబ్థితీరమున సురవృక్ష శోభితము, ఉద్యద్భాస్కర ప్రభాప్రకాశిత దిఙ్ముఖము, పుష్పముల సుగంధములచేమదించిన తుమ్మెదలు చేయు ఝంకారములు కలది, దివ్యవాయువుచే పైకి లేచిన పద్మ పరాగముచే నిండిన ఆకాశ భాగముకలది, దేవతాస్త్రీ గాన మాధుర్యముచే సుందరమగు వనమును ధ్యానించవలెను. ఆ వనములోపల మణులకాంతులచే ప్రకాశించు తోరణ మండపమునందు, శోభించు ముత్యాల మాలలచే ప్రకాశించు వితానముకలది, మణి వేద్యాది వియత్కిరీ టాగ్రములచే పూజింపబడిన దివ్య సింహాసనము నందు విప్రులతో కలిసి కూర్చొనియున్న స్వామిని స్మరించవలెను. శంఖపాశబాణ ధనుర్ముసలనందక గదాంకుశములను చేతులలో ధరించి ఉన్నను, వక్షస్థలమున లక్ష్మి శోభించుచున్న, అంకమున ఉన్న పద్మరాగ శోభితమగు లక్ష్మీ దేవియొక్క అనురాగదృక్కులచే చూడబడుచున్న స్వామిని ధ్యానముచేసి నాలుగు లక్షల మంత్ర జపమును చేయవలెను. దానిలో దశాంశమును అర్థచంద్రా కారమున నున్న కుండమున పద్మములతో కాని జాతి పుష్పములతో కాని హోమమును చేయవలెను. శ్రీహరి స్వరూపమగు యాగభూమిని యాగోప కరణములను జగన్నాథుని పూజింపదలచినవారు గాయత్రీ మంత్రముచే ప్రోక్షించవలెను.
“త్రైలోక్యమోహనాయ విద్మహే స్మరాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్” అనునది గాయత్రీ. ఈ గాయత్రీ సర్వోత్తమము సర్వ శుద్ధికరము. పూర్వోక్తమగు వైష్ణవ పీఠమున ఆసనమును కల్పించవలయును. “పక్షిరాజాయఠ ద్వంద్వం” అనునది పీఠ మంత్రము. మూల మంత్రముచే మూర్తిని సంకల్పించి, ఆ మూర్తిలో అవాహన కావించవలెను. “కౌస్తుభాయనమః” అని వక్షస్థస్థ్సలమున కౌస్తుభమును పూజించవలెను. “వనమాలాయై నమః” అని కంఠమున వనమాలను పూజించవలెను. తరువాత కర్ణికయందు యథావిధిగా అంగదేవతలను పూజించ వలెను. తరువాత దళములందు చామరావృతలు, బంధూక కుసుమాభాసలు, ముక్తా హారములచే శోభించు కుచములు గలవారు, వికసించిన పద్మములవంటి నేత్రములు కలవారు. మదవిభ్రమ మంధరలు అగు లక్ష్మి, సరస్వతి, ధృతి, ప్రీతి, కాంతి, శాంతి, తుష్టి, పుష్టి మొదలగువారిని పూజించవలయును. భృగు భద్రాంశ సంద్రాఢ్యము దేవీ బీజము, హ్రస్వత్రయయుతము, క్లీబస్వరరహితము, స్వరసంయుతము దేవీ బీజక్రమమున వీరికి ఆదియును వినియోగమును చేయవలెను. దశాగ్రములందు శంఖమును, శార్ఙమును, చక్రమును, ఖడ్గమును, గదను, అంకుశమును, ముసలమును, పాశమును, స్వస్యముద్రచే మంత్రములచే పూజించవలయును. ‘మహా జలచరాయ’ అనునది కవచము. వహ్ని వల్లభ అస్త్రము. పాంచజన్యాయ నమః అనుదానిచే శంఖమును పూజించవలయును. శార్ఙయ నమః అనునది శార్ఞపూజలో మంత్రము. “సుదర్శన! మహాచక్రరాజ! హయ హయ సర్వ దుష్ట భయాన్తం కురు కురు, భిన్ది భిన్ది, విదారయ విదారయ, పరమంత్రాన్ గ్రస! గ్రస! భక్షయ! భక్షయ! భూతాని త్రాసయ! త్రాసయ! ఫట్” అనునది మంత్రము. ఇది చక్రార్చనా మంత్రము. “మహాఖడ్గ తీక్ష్ణచ్ఛలి ముక్త! హుం ఫట్ స్వాహా ఖడ్గాయ నమః” అనునది ఖడ్గార్చనా మంత్రము. “మహాకౌమోదకీ! మహాబలే! సర్వాసురాంతకే ప్రసీద ప్రసీద” అనునది కౌమోదకీ అర్చనా మంత్రము. మహాంకుశ కుట్ట కుట్ట హుంఫట్ అంకుశాయ నమః” అనునది అంకుశార్చన మంత్రము” “మహాపాశ! ఆహ్లాదయ! ఆహ్లాదయ! ఆకర్షయ! ఆకర్షయ! హుంఫట్ స్వాహా! పాశాయ నమః” అనునది పాశార్చన మంత్రము. ఈ మంత్రములు అన్నియు తారాదికములే. తరువాత ఇంద్రాదులను పూజించవలెను. వజ్రాదులనుకూడా పూజించి సర్వ సిద్ధీశ్వరుడు అగును. ఒకనెల హయారిజ పుష్పములచే పూజించి, కలువలతో వెయ్యి ఎనిమిది మార్లు హోమమును గావించవలెను. ఒక మాసములో రాజులందరు వశులగుదురు. ఎవరి నామమును కలిపి పదివేలు జపము చేతురో వారు ఈ మంత్ర ప్రభావము వలన వెంటనే దాసులు అగుదురు. ఇంకను ఏమి చెప్పవలయును? ఈ మంత్రముచే సాధకుడు సకల కామములను సాధించుకొనగలడు. విష్ణువంతటి వాడగును. సంశయముతో పనిలేదు. (3/70)