నారద మహా పురాణము
మాతృ సన్మానము
రాజు పలికెను: ఓ భయశీలా? నేను రాజరికమును గ్రహించుటకు ప్రయత్నము చేయుటలేదు. శ్రమచే అలసిన నాకు ఆనందమును కలిగించు నిద్ర వచ్చినది. మోహినిని సర్వరత్న విభూషితము, తగినంతగాలి వెలుతురు కల, అన్ని ఋతువుల అనుభూతిని కలిగించు నీ మందిరమునకు తోడ్కొని పొమ్ము. ఈమె నాకు అత్యంత ప్రియమగు భార్య. కావున యథావిధిగా పూజించుము. అని పుత్రుని ఆదేశించి నేను శయ్యను చేరి దరిద్రుడు ధనమును పొందినట్లుగా, ఏ ప్రయత్నము లేకనే నిద్రను పొందితిని. మెలకువ రాగానే నీ వద్దకు వచ్చుచున్నాను. నీవెట్లు చెప్పిన అట్లే చేసెదను అని పలికెను.
మోహిని పలికెను: ఓ రాజేంద్రా! నన్ను వివాహ మాడినందువలన దుఃఖితులై కామభోగములందు నిరాశలైన నీ భార్యలను మొదట ఓదార్చుము. ఓ రాజా రూపవతులగు పెద్ద భార్యల శిరమున చిన్న భార్య అనెడు మొల(మేకు) ను నాటిన వాడు సద్గతిని పొందజాలడు. ఆనందమును పొందజాలడు. పతివ్రతల కన్నీటితో దహించబడు నాకు శాంతి ఎట్లు కలుగును? పతివ్రతా స్త్రీలు నన్ను పుట్టించిన బ్రహ్మను కూడా భస్మము చేయగలరు. ఇక సామాన్యులైన మన విషయమున ఏమి చెప్పవలయును. ఓ రాజా? సంధ్యావళి వంటి స్త్రీ ఈ మూడు లోకములలో లేదు. నీ మీది ప్రేమతో నన్ను షడ్రసములతో భుజింపచేసెను. నీ మీది గౌరవముతో నాతో ప్రియముగా మితముగా మాటలాడుచున్నది. ఇటువంటి పతివ్రతలు వందల మంది నీ ఇంటిలో కలరు. నేను వారి కాలి దుమ్ముతో సరికాజాలను. అంతట రుక్మాంగద మహారాజు మోహిని మాటలను విని బిడియపడెను. పుత్రునితో నున్న పెద్ద భార్యయగు సంధ్యావలిని చూచి మరి కొంత సంకోచించెను. అంతట ఇంగితమును ఎరిగిన ధర్మాంగదుడు తండ్రి దశావస్థలను పొందుట, కామసంతప్తుడగుట, మోహిని యందు మోహము కలిగి ఉండుటను తెలిసి సంధ్యావళి మొదలగు తల్లులందరిని పిలిచి, చేతులు జోడించి ఇట్లు పలికెను. తల్లులారా? నా తల్లియగు మోహిని కొత్తగా పెళ్ళి ఆడినది. బ్రహ్మపుత్రిక. ఆమె తనతో క్రీడించుటకు రాజును రహస్యముగా ఉండవలయునని కోరుచున్నది. కావున మీరు సంతోషముతో ఆమోదించుడు.
తల్లులు పలికిరి: ఓ పుత్రా! తనను సంపూర్ణముగా భక్షించుటకు ఎవరు అంగీకరింతురు? తన దేహమున తామే అగ్నిని ఎవరు వెలిగింతురు? ఘోరమగు విషము ఎవరు భక్షించెదరు? తన శిరమును తానుగా ఎవరు ఖండించుకొందురు. మెడకు పెద్ద శిలను కట్టుకొని ఎవరు సముద్రమును దాటగలరు? పులినోటిలోనికి ఎవరు ప్రవేశించెదరు. సింహము కేశములను ఎవ్వరు లాగెదరు? ఆకాశమున ప్రకాశించు ఖడ్గము అంచుపై ఎవరు కూర్చుందురు? అట్లే తమ భర్త సవతితో క్రీడించుటకు ఏ స్త్రీ అమోదించును? అన్నిటిని ఈయవచ్చును కాని భర్తను ఈయజాలము. ? దీనికన్నా ఖడ్గముతో శిరము ఛేదించుకొనుట మేలు. మరొక స్త్రీచే ఆదరించబడిన ప్రియుడగు భర్తను ఏ యువతి ప్రేమతో చూడజాలదు. తన ప్రాణనముడు అగు భర్త అన్యస్త్రీ కుచపీడనమును చేయుటకు ఏ స్త్రీ అంగీకరించ జాలదు. ఈ విషయమును వినియే సహించజాలదు. ఇక కంటితో ఎట్లు చూడగలదు? తన భర్త పరస్త్రీ అందు ఆసక్తుడగుటను తన కంటితో చూచుటయే అన్ని దుఃఖములలో గొప్ప దుఃఖము. ఈ దుఃఖమున కంటే నీ తల్లులందరూ ఒకేసారి చనిపోవుట మేలు. అంతేకాని మా భర్త మోహినితో కలిసి ఉండగా చూడజాలము.
ధర్మాంగదుడు పలికెను: ఓ తల్లులారా? మీరు నా తండ్రికి సౌఖ్యమును కలిగించనిచో విషమును బాగా కలిపి త్రాగగలను. నేను మరణించిన తరువాత మీరు ఆనందించుడు. నా తండ్రికి కర్మచే కాని, మనసుచే కాని, వాక్కుచే కాని దుఃఖమును కలిగించువారు సంధ్యావళీ దేవి అయిననూ నాకు వధించదగిన శత్రువే అగును. మీ అందరిలో నా తండ్రికి మోహిని ఎక్కువగా ప్రియమైనది. చిన్న వయసులో ఉన్నది. నా తండ్రితో క్రీడించుటకు మందర పర్వత శిఖరము నుండి వచ్చియున్నది. ఇట్లు పలికిన ధర్మాంగదుని మాటలు వినిన తల్లులందరూ భయముచే కంపించుచు తనయుని హితమును కోరి డగ్గుత్తికతో ఇట్లు పలికిరి. పుత్రా! నీ మాట న్యాయ సమ్మతము కావున తప్పక పాటించవలయును. కాని మాకు తగిన విధముగా సంపదలనిచ్చి నీ తండ్రి మోహినితో క్రీడించ వచ్చును. భర్త ఒక భార్య ఉండగా రెండవ దానిని పెళ్ళి అడినచో పెద్ద భార్య రెండు రెట్లు సంపదలను ఈయవలెను. లేనిచో ఋణగ్రస్తుడగును. పెద్ద భార్య అనుమతిని పొంది మరొక యువతిని వివాహమాడినచో పెద్ద భార్య కోరినదానిని ఈయవలయునని పెద్దలు చెప్పెదురు. ఇష్టా పూర్తములను మాత్రము పెద్ద భార్యతో కలిసి ఆచరించవలయును. ఇది ధర్మము. అట్లు చేయనిచో అన్యాయము ధర్మసంక్షయము జరుగును. ఇట్లు చెప్పిన తల్లుల మాటలను విని సంతోషము నిండిన మనసుతో ఒక్కొక్క తల్లికి కోటి కోటి సువర్ణములను సహస్ర నగరములను, గ్రామములను ప్రదానము చేసెను. నాలుగు అశ్వములతో కూర్చిన ఎనిమిది రథములను కాంచనమాలలు కలవాటిని ఇచ్చెను. శతాధిక మూల్యముగల పదివేల వస్త్రములను ఇచ్చెను. పరిశుద్ధము, మేరుపర్వత సంజాతము, అక్షయము అగు లక్ష బంగారు ముద్రలను ఒక్కొక్క తల్లికి ఇచ్చెను. నూరుమంది దాసులను, నూరుమంది దాసీ జనమును అర్పించెను. కుంభము నిండ పాలు ఇచ్చెడు పదివేల ఆవులను ఒక్కొక్కరికి ఇచ్చెను. వేయి యుగంధర గజములను ఒక్కొక్కరికి ఇచ్చెను. పది విధములగు ధాన్యములను ఇచ్చెను. లక్ష వాజులను, నూనె కుండలను, నేతికుండలను ఇచ్చెను. సంఖ్యలేని మేకల నిచ్చెను. వేల కొలది స్వర్ణ భూషణములను ఇచ్చెను. వజ్రములు పొదిగిన భూషణములను దానము చేసెను. ప్రకాశవంతములు అగు ధాత్రీ ప్రమాణములైన హారములను, అయిదు ఏడు చొప్పున కంకణములను ఇచ్చెను. చంద్రునివలె ప్రకాశవంతములైన రెండు వందల యాభై ముత్యములు కల రెండు హారములను ఒక్కొక్కరికి ఇచ్చెను. ప్రస్థ సంఖ్యతో కుంకుమను, చందనమును, కస్తూరిని ఎక్కువగా ఇచ్చెను. తండ్రి సుఖమును కోరి తల్లులందరికి భేద దృష్టిని విడిచి భోజన పాత్రలను, జలపాత్రలను, వేలకొలది ఘృతక్షీరపాత్రలను, వివిధ పాన పాత్రలను పదునాలుగు వందలను ఇచ్చెను. కాంచన స్థాలులను కుంభములతో ఎనిమిది వందలు ఇచ్చెను. బాగుగా బలిష్టములు అగు ఇరువది ఇరువది ఆడ ఏనుగులను ఇచ్చెను. వంద ఆడ ఒంటెలను ఇచ్చెను. బలిష్ఠులగు పురుషులచే మోయబడు పల్లకులను చాలా ఇచ్చెను. చాలా వేగముగల పదిఏడు అశ్వములను ఇచ్చెను. ఇట్లు ధర్మాంగదుడు తల్లులందరికి చాలా ధనములనిచ్చి ధన పతిసముడుగా ఖ్యాతి పొంది, ధన్యతనంది వారికి ప్రదక్షిణలను ఆచరించెను. చేతులు జోడించి ఇట్లు పలికెను. నేను శిరసు వంచి ప్రణామమును ఆచరించి ప్రార్థించితిని కావున మీరందరూ కలిసి మా తండ్రి గారితో యధేచ్ఛముగా మోహినిని అనుభవించుడు అని పలుకుడు. మా విషయమున మీరే మాత్రము సంకోచించవలదు. మాకు ఈర్ష్య కొంచెము కూడా లేదు. సుశీల, బ్రహ్మసుత అగు మోహినిని రహస్యముగా చాలా కాలము ఆనందముగా రమించుము అని చెప్పుడు. అని అట్లు ధర్మాంగదుని మాటలను విని తల్లులందరు ఆనందముతో పులకించి భర్తతో సీతాదేవితో రామ చంద్రునివలె బ్రహ్మ పుత్రికతో చాలా కాలము రమించుము అని పలికిరి. నీ సంగమమును పొందు మోహిని మాకు ప్రతికూల కాదు. పుత్రుని తేజస్సుచే మా దుఃఖము తొలగి ఇట్లు చెప్పు చున్నాము అని పలికిరి. (II/18)