విష్ణు మాహాత్మ్యము

సనకమహర్షి పలికెను: ఓ బ్రాహ్మణోత్తమా! మానవులకు భుక్తిని ముక్తిని ప్రసాదించునది, సర్వ పాపహరము అయిన శ్రీమహావిష్ణువు మాహాత్మ్యమును ఇంకను వినుము. ఈ లోకమున హరికథ వినువారికి చదువువారికి పాపములను నశింపచేయును. పుణ్యమును ప్రసాదించును. హరి భక్తులకు 7హరిభక్త భక్తులను సేవించవలయును. గోవిందుని దర్శించినను, స్మరించిననూ, పూజించిననూ, ధ్యానించి నను, నమస్కరించిననూ దాటరాని సంసారసాగరమును దాటగలరు. నిదురించుచు, భుజించుచు, నడచుచు, నిలిచి, కూర్చొని మాటలాడుచు హరినామమును చింతించువారికి నిత్యము నా నమస్కారములు. విష్ణుభక్తియందు ఆసక్తికలవారి భాగ్యమే భాగ్యము. యోగులకు కూడా దుర్లభమగు ముక్తి వారికి కరస్థమై యుండును. ఈ విషయమును చెప్పువారికి, వినువారికి సర్వపాపప్రణాశకమగు ఒక ఇతిహాసమును చెప్పెదరు.

పూర్వకాలమున సోమవంశమున పుట్టిన జయధ్వజుడను మహారాజు, నారాయణ పరాయణుడు ఉండెను. జయధ్వజ మహారాజు ప్రతినిత్యము విష్ణ్వాలయమున సమ్మార్జనము చేయుచుండెడివాడు. దీపారాధన చేయువాడు. విశేషించి విష్ణు భక్తులగు వారికి ప్రీతిపాత్రుడుగాను ఉండెను. సర్వప్రాణుల యందు దయచూపువాడు. ఆ మహారాజు ఒకప్పుడు సుందరమైన రేవానదీ తీరమున పలువిధములైన పుష్పరాసులతో కూడిన విష్ణ్వాలయమును నిర్మించెను. ఆ ఆలయమున నిత్యము సమ్మార్జనము చేయుచు దీపదానపరుడుగా ఉండెను. నిత్యము హరినామపరుడు, హరిసంసక్తమానసుడు, హరిప్రణామ నిరతుడు, హరిభక్త జనప్రియుడుగా ఉండెను. జయధ్వజ మహారాజునకు వీతి హోత్రుడను పురోహితుడు ఉండెను. వీతిహోత్రుడు జయధ్వజుని చరితమును చూచి ఆశ్చర్యమును పొందెను. ఒకప్పుడు విష్ణుతత్పరుడగు జయధ్వజుడు కూర్చొని యుండగా వేదవేదాంగపారగుడుగు వీతిహోత్రుడు ఇట్లడిగెను.

వీతిహోత్రుడు పలికెను: “పరమధర్మములను తెలిసిన మహారాజా! హరిభక్త పరాయణా! భరత వంశ శ్రేష్ఠా! హరిభక్తి కలవారిలో ఉత్తముడా! ప్రతిదినము విష్ణు మందిరమున సమ్మార్జనమును చేయుచున్నావు. దీపదానమును చేయుచున్నావు. ఓ మహానుభావా! ఇట్లు చేయుటకు నీకు తెలిసిన ఫలమేమిటో తెలుపుము. వత్తులను చేయుచు తైలమును మార్చి దీపదానము చేయుచు, సమ్మార్జనమును చేయుచుందువు. శ్రీ మహావిష్ణువునకు ప్రీతిని కలిగించు పనులు ఇతరములు చాలా కలవు కదా! అయిననూ నీవు ఈ రెండు పనులనే ఎందుకు చేయుచున్నావు? అన్ని విధములుగా ఈ రెండు కార్యములు మహాపుణ్య తమములు అని నీకు తెలిసియే యుండును. నీకు నాయందు ప్రీతి కలదేని ఆ రహస్యమును నాకు తెలుపుము” అని ఇట్లు పలికిన పురోహితుని మాటలను విని జయధ్వజుడు చిరునవ్వుతో చేతులు జోడించి వినయావనతుడై ఇట్లు పలికెను.

జయధ్వజమహారాజు పలికెను: ఓ బ్రాహ్మణోత్తమా! నేను పూర్వజన్మమున ఆచరించిన దానిని పూర్వజన్మ జ్ఞానము కలదు కావున చెప్పుచున్నాను. వినువారలకు ఆశ్చర్యమును గొలుపు ఆ వృత్తాంతమును వినుడు. పూర్వ కాలమున కృతయుగమున స్వారోచిష మన్వంతరమున వేదవేదాంగ పారగుడగు రైవతుడను బ్రాహ్మణుడు ఉండెను. యాగము చేయుటకు అయోగ్యులైనవారిచే యాగమును చేయించెడివాడు. గ్రామయాజ్ఞికమును చేయుచుండెడి వాడు. లోభిత్వముకలవాడు, కఠినుడు, అమ్మకూడని వాటిని అమ్ముచుండెడివాడు. నిషిద్ధ కర్మముల నాచరించుటవలన బంధువులు వెలివేసిరి. దరిద్రుడై దుఃఖముతో జీర్ణ శరీరము కలవాడై వ్యాధిగ్రస్తుడు అయ్యెను. ఆ రైవతుడు ధనమును సంపాదించుటకు పర్యటించుచు నర్మదాతీరమున శ్వాసరోదముతో (ఉబ్బసము వ్యాధిచే) మరణించెను. అతని భార్య బంధుమతి భర్త మరణించిన తరువాత కామచారిణిగా మారుటచే బంధువులచే పరిత్యజించబడెను. ఆ బంధుమతియందు చండాలుని వలన నేను పుట్టితిని. నా పేరు దండకేతువు. నేను కూడా నిత్యము మహాపాపములను చేయుటలో ఆసక్తి కలవాడినై బ్రాహ్మణులను ద్వేషించుచు, పరదారలను పరద్రవ్యములను అపహరించుచు, జంతువులను హింసించుచుంటిని. నేను చాలామంది బ్రాహ్మణులను చాలా గోవులను చంపితిని. వేలకొలది మృగములను పక్షులను వధించితిని. లెక్కలేనంత సువర్ణాది ద్రవ్యమును అపహరించితిని. మద్యపానముతో మత్తుడనై దారికాచి దొంగతనమును చేయుచుంటిని. ఒకప్పుడు కామార్తుడనై రత్యర్థినై యువతిని వెంటతీసుకొని నగరమున శూన్యముగానున్న విష్ణుమందిరమును చూచి లోనికి ప్రవేశించితిని. రాత్రిపూట కామోపభోగము కొఱకు ఆ రాత్రి అక్కడ శయనించదలచి నా మీది వస్త్రముతో దేవాలయ ప్రాంతమున ధూళిని దూరముగా ఊడ్చితిని. సంభోగము కొఱకు అచట దీపమును వెలిగించితిని. నా వస్త్రముతో ఎన్ని ధూళికణములను ఊడ్చితినో అన్ని జన్మల పాపములు నశించినవి. దీపము వెలిగించుటచే మిగిలిన పాపములు తొలగినవి. ఇంతలో నగరపాలకులు విష్ణుమందిరమునకు వచ్చిరి. నన్ను జారునిగా ఆ యువతిని జారిణినిగా తెలిసి బలాత్కారముతో కొట్టి వధించిరి. తరువాత పురపాలకులు వెళ్ళిపోయిరి. మేము మరణించిన వెంటనే మా సమీపమునకు చతుర్భుజులు, కిరీట కుండలధారులు, వనమాలా విభూషితులు అగు విష్ణుదూతలు విమానమును తీసుకొని వచ్చిరి. పావనులైన విష్ణుదూతలచే పంపబడిన విమానము నధిరోహించి, దివ్యదేహ ధారులమై విష్ణులోకమును చేరితిమి. ఓ బ్రాహ్మణోత్తమా! విష్ణు లోకమున నూరు బ్రహ్మకల్పములు నివసించితిని. తరువాత అంతకాలము సర్వభోగ సమన్వితమైన స్వర్గమున నివసించితిమి. తరువాత భూలోకమున క్రమముగా భోగములను అనుభవించితిని. ఆ పుణ్య ప్రభావముచే యదువంశమున పుట్టితిని. ఆ పుణ్యము వలననే తరగని సంపద కలిగినది. కేవలము అవసరార్థము చేసిన కర్మవలననే ఇంతటిమేలు పొందితిని. భక్తిచే చేసిన వారికెంత పుణ్యము కలుగునో నేను తెలియజాలను. కావున నాకు పూర్వజన్మ జ్ఞానముండుటచే ప్రతినిత్యము భక్తితో దేవాలయ సమ్మార్జనమును, దేవాలయమున దీపమును వెలిగించుటను చేయుచున్నాను. ఒంటరిగా నిస్పృహుడైన జగన్నాథుని పూజించినచో సర్వపాపముల నుండి విముక్తుడై పరమపదమును పొందును. నేను నావశములో లేకనే కామాసక్తుడనై చేసిన కర్మవలననే ఇంతటి భోగమును పొందితిని. ప్రశాంతులై భక్తిగలవారు చక్కగా పూజించినచో ఎంత పుణ్యము లభించునో చెప్పవలయునా? ఇట్లు జయధ్వజ మహారాజు చెప్పిన మాటలను వినిన వీతిహోత్రుడు అఖండానందమును పొంది విష్ణు పూజాపరుడాయెను.

ఓ బ్రాహ్మణోత్తమా! కావున అవ్యయుడైన శ్రీమన్నారాయణ దేవుని తెలిసి కాని తెలియక కాని పూజించినచో ముక్తినొసంగును. బంధువులు నిత్యులుకారు. సంపదలు శాశ్వతములు కావు. నిత్యము మృత్యువు సన్నిహితముగా ఉండును. కావున ధర్మమును సంపాదించుకొనుము. అజ్ఞానముతో నున్న లోకము ఉద్ధతులై గర్వమును ప్రసాదించును. ఎపుడూ అపాయము దగ్గరలో ఉండునది. శరీరము. ధనాదులు నశ్వరములని ఏమి చెప్పవలయును? వేయి కోట్ల జన్మలచే సంపాదించిన పుణ్యము వలన దేవదేవుడగు జనార్దనుని యందు నిర్మలమగు భక్తి కలుగును. గంగాస్నానము అతిథి పూజ అన్ని యజ్ఞములు సులభములే. కానీ విష్ణుభక్తి మాత్రము దుర్లభము, తులసిని సేవించుట సత్సంగము దుర్లభము. సర్వ భూతదయ ఏ ఒక్కరికో సులభము. బహుదుర్లభమగు మానవత్వమును పొంది వ్యర్థముగా కాలమును గడుపరాదు. జగన్నాథుని అర్చించుటయే మానవ జన్మకు సారము. తరింపశక్యము కాని సంసారమును తరించగోరువారు హరిభక్తి పరులు కావలయును. హరిభక్తియే దివ్యౌషధము. సోదరా! గోవిందుని ఆశ్రయించుము. మిత్రమా! అలసించకుము. యమనగరము సమీపములోనే కనబడుచున్నది. ముక్తిని అభిలషించినచో జగత్కారణుడు. సర్వధారుడు, సర్వకారణుడు, సర్వాంతర్యామి, సర్వజగన్నాథుడు అగు శ్రీమన్నారాయణుని శరణు కోరినవారు కృతార్ధులు అగుదురు. ఇందు సంశయించ పనిలేదు. ప్రణతుల ఆర్తిని నశింపచేయు శ్రీమహావిష్ణువును పూజించు మహానుభావులు సమస్కరించదగినవారు పూజించదగినవారు. విశేషించి వంద్యులు. నిష్కాములైన విష్ణుభక్తులు పరమాత్మను పూజించినవారు ఇరువది యొక్కటి తరముల వారితో కలసి హరిమందిరమును చేరెదరు. నిష్కాముడు మహాత్ముడు అగు విష్ణుభక్తునకు జలమును కాని ఫలమును కాని దానము చేసినవారు భగవత్ర్పియులు. విష్ణుభక్తిపరులను సేవించువారు విష్ణులోకమును చేరి ప్రళయకాలము వరకు నివసింతురు. నిస్పృహులై హరిభక్తులను శ్రీహరిని సేవించినవారు తమ పాదరజముచే ఈ ప్రపంచమునే పావనము చేతురు. శ్రీహరిని పూజించువారు నివసించు గృహమున సర్వదేవతలు శ్రీహరి నివసించును. పూజించబడు తులసి ఉన్న గృహమున ప్రతిదినము శ్రేయః పరంపరాభివృద్ధి జరుగును. శాలగ్రామ శిలారూపియగు శ్రీహరి నివసించు ప్రాంతమున భూతభేతాళ గ్రహములు బాధించజాలవు. శాలగ్రామశిల నివసించు ప్రాంతము పుణ్యతీర్థము తపోవనము. భగవానుడు అచటనే నివసించును కదా! శాలగ్రామ శిలార్చనములేని గృహము శుభవర్జితమైన శ్మశాన తుల్యమేయగును. వేదవేదాంగములు పురాణములు, న్యాయ మీమాంసా ధర్మ శాస్త్రములు శ్రీమహావిష్ణు ప్రతిరూపములుగా తెలియుము. భక్తితో శ్రీమహావిష్ణువునకు నాలుగు ప్రదక్షిణములను చేయువారు సర్వకర్మ వినాశకమగు పరమపదమును పొందెదరు. (1/39)