నారద మహా పురాణము
లక్ష్మణాచల మాహాత్మ్యము
మోహిని పలికెను: ఓ మహానుభావా! పాప వినాశనమగు గోకర్ణ మాహాత్మ్యమును వింటిని. ఇక ఇపుడు లక్ష్మణాచల మాహాత్మ్యమును తెలుపుము.
వసువు పలికెను: ఓ మోహినీ! లక్ష్మణ మాహాత్మ్యమును చెప్పెదను. ఈ లక్ష్మణుని దర్శించిన వాడు సర్వపాతక వినిర్ముక్తుడగును. చతుర్వ్యూహావతారములలో సంకర్షణ దేవుడు స్వయముగా సహస్ర శిరస్సులతో ఒక శిరసుపైన ఈ భూమండలము అంతటిని ధరించు చుండును. ఈ సంకర్షుణుడే లక్ష్మణునిగా అవతరించెను. సాక్షాన్నారాయణ దేవుడు బ్రహ్మాది వందితుడు రామునిగా అవతరించెను. ప్రద్యుమ్నుడు భరతునిగా అనిరుద్ధుడు శత్రుఘ్నునిగా అవతరించెను. బ్రహ్మాదులచే ప్రార్థించబడిన శ్రీమన్నారాయణుడు దశరధమహారాజు వలన రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల రూపమున నలుగురిగా అవతరించెను కొంత కాలమునకు విశ్వామిత్ర మహర్షి యజ్ఞ రక్షణ కొరకు రామ లక్ష్మణులను యాచించెను. అంతట దశరధమహారాజు మునిశాపభయముచే ప్రాణములకంటే మిన్న అయిన రామలక్ష్మణులను విశ్వామిత్రునికి ఇచ్చెను. తాటకను చంపి, సుబాహువుని చంపి మారీచుని దూరముగా పడవేసి రామలక్ష్మణులు విశ్వామిత్రుని యజ్ఞమును కాపాడిరి. విశ్వామిత్రుని ప్రీతుని చేసిరి. అట్లు ప్రీతుడగు విశ్వామిత్రుని వలన అస్త్రసమూహమును పొందిన రాముడు లక్ష్మణునితో కలసి అచటనే కొంత కాలము ఉండెను. తరువాత విశ్వామిత్ర మహర్షి రామలక్ష్మణులను మిధిలా నగరమునకు తీసుకొనిపోయెను. అంతట జనక మహారాజు విశ్వామిత్ర మహర్షిని సత్కరించి బాలకులు ఇద్దరు ఎవరి పుత్రులు? ఎచటివారు అని అడిగెను. అపుడు విశ్వామిత్ర మహర్షి వారు దశరధుని పుత్రులు రామ లక్ష్మణులు అని తెలిపెను. అంతట జనక మహారాజు రామలక్ష్మణులను చూచి ప్రీతుడై సీతను ఊర్మిళను రామ లక్ష్మణులకు భర్తలుగా మనసున కల్పించుకొనెను. త్రికాలజ్ఞుడగు విశ్వామిత్ర మహర్షి జనక మహారాజు మనోగతమును తెలుసుకొని సంతోషించి సీతాస్వయంవరమునకు మహేశ్వరుడు న్యాసముగా ఉంచిన ధనువును చూపుమని పలికెను. విశ్వామిత్రుని మాటను వినిన జనక మహారాజు త్వరగా మూడు వందల మంది భృత్యులచే సాదరముగా శివధనువును తెప్పించెను. శ్రీరామచంద్రుడు ఆ శివధనువును ఎడమ చేతితో క్షణములో లేపెను. వారి తాడునులాగి సులభముగా ఏనుగు చెరుకుగడను విరిచినట్లు విరిచెను. అంతట మిథిలాధిపతి సంతోషించి రామలక్ష్మణులను సత్కరించి తన కన్యలను రామ లక్ష్మణులకు సమర్పించెను. విశ్వామిత్రుని వలన దశరధునికి మరో ఇద్దరుపుత్రులు కలరని తెలిసి వారితోపాటు దశరధుని కూడా ఆహ్వానించి తమ్ముని పుత్రికలను వారికి అర్పించెను. ఇట్లు వివాహము చేసుకొనిన నలుగురు పుత్రులతో జనకమహారాజు దారిలో భార్గవరాముని గర్వమును శ్రీరాముడు హరించెను. తల్లి దండ్రులతో సోదరులతో అయోధ్యలో చాలాకాలము ఆనందముగా గడిపెను. లీలా మానుషత్వమును విడంబించుచున్న రామచంద్రుడు వసిష్ఠాది పండితులందరు బోధించగా తన మహిమను బ్రహ్మ స్వరూపముగా తెలుసుకొనెను. అంతట దశరథమహారాజు సర్వజ్ఞుడగు శ్రీరామచంద్రుని చూచి ప్రీతి చెంది యౌవరాజ్య పట్టాభిషేకమును చేయ ఉద్యుక్తుడాయెను. ఈ విషయమును దశరధునికి అత్యంత ఇష్టురాలగు కైకయీదేవి రామ పట్టాభిషేకమును వారించి తన పుత్రుడగు భరతునికి పట్టాభిషేకమును కోరెను. అంతట రామచంద్రుడు కైకసంతోషము కొరకు తండ్రి అనుమతితో లక్ష్మణునితో సీతాదేవితో చిత్రకూటమునకు వెళ్ళెను. ముని వేషమును ధరించి అచటనే కొంత కాలము నివసించెను. అంతట తాత ఇంటిలో ఉన్న భరతుడు తండ్రి మరణమును విని వచ్చి, రాముని తలచుచు, మరణించిన తండ్రిని గురించి తెలుసుకొని కైకను ధిక్కరించి రాముని అయోధ్యకు మరలించుటకు వెళ్ళెను. రామచంద్రుడు తన పాదుకలను భరతునకిచ్చి పంపి అత్రి, అగస్త్య, సుతీక్షమహర్షుల ఆశ్రమములకు వెళ్ళెను. రామచంద్రుడు ఋషుల ఆశ్రమములలో పన్నెండు సంవత్స రములు గడిపి భార్యతో తమ్మునితో పంచవటికి వెళ్ళెను. అచటికి వచ్చిన శూర్పణఖను వికృతురాలను చేయగా ఆమె పంపిన ఖరదూషణాది రాక్షసులను పదునాలుగు వేల మందిని తీక్ష్ణనారాచములచే యమలోకమునకు పంపెను. ఈ విషయమును వినిన రాక్షసరాజగు రావణుడు మారీచుని బంగారు లేడిగా పంపి రామ లక్ష్మణులను దూరముగా పంపి సీతాదేవిని హరించి అడ్డగించిన జటాయువును సంహరించి లంకకు గొని పోయెను. అంతట రామ లక్ష్మణులు ఆశ్రమమును చేరి హరించిన సీతను వెదకుచు మరణించిన జటాయువును చూచి దహన సంస్కారము గావించి కంబంధుని సంహరించి శబరిని సందర్శించి ఋష్యమూక పర్వతమును చేరిరి. హనుమంతుని వాక్యములచే సుగ్రీవుని మిత్రుని చేసుకొని అతని శత్రువగు వాలిని సంహరించి సుగ్రీవుని రాజుగా చేసెను. సుగ్రీవుని ఆజ్ఞచే హనుమదాది వానరేంద్రులు సీతను అన్వేషించుచు దక్షిణ సాగరమును చేరిరి. సంపాతి వాక్యమువలన సీతాదేవి లంకలో ఉన్నదని నిశ్చయించుకొనిరి. అంతట ఒక హనుమంతుడు మాత్రమే సముద్రము అవతలి ఒడ్డున ఉన్న లంకను చేరి సీతను చూచెను.
సీతిదేవికి శ్రీరామాంగుళీయకమును ఇచ్చి నమ్మకము కలిగించి రామలక్ష్మణుల కుశలమును వినిపించి, ఆమెనుండి చూడామణిని పొంది, అశోకవనమును భంగపరిచి సైన్యముతో పాటు అక్షకుమారుని చంపి, ఇంద్రజిత్ బ్రహ్మాస్త్రముచే బంధింపబడి, రావణునిచేరి, అతనితో మాటలాడి, లంకాపురమును మొత్తము దహించి, మరల సీతాదేవిని చూచి అనుజ్జను పొంది సాగరమును లంఘించి రాముని చేరి సీతా వృత్తాంతమును వినిపించెను. రావణనివాసమున సీత కలదని వినిన రాముడు కపిసైన్యముతో సముద్రమును చేరెను. సముద్రుని అంగీకారముచే సాగరమున సేతువును నిర్మించి అవతలి తీరమును చేరి సైన్యమును నిలిపెను. అంతట విభీషణుడు సీతాదేవిని రాముని కర్పించమని బోధించిననూ రావణుడు అంగీకరించక పోయెను. రావణుడు పాదముతో తన్నగా విభీషణుడు రాముని చేరి శరణు జొచ్చెను. అంతట రామచంద్రుడు లంకను ముట్టడించెను. అపుడు రావణాసురుని మంత్రులు, అమాత్యులు, పుత్రులు, భృత్యులు రావణాజ్ఞచే యుద్ధముచేసి రామలక్ష్మణులతో వానరేశులతో నాశము నొందిరి. లక్ష్మణుడు ఇంద్రజిత్తును నిశిత శరముచే అంతముగావించెను. రామచంద్రుడు కుంభకర్ణుని రావణుని సంహరించెను. విభీషణునిచే రావణునికి అంత్య క్రియలను జరిపించి తన ప్రియురాలగు సీతాదేవిని అగ్నిలో శోధించి విభీషణునకు రాక్షసాధిపత్యము నొసంగి, కల్పాంతము వరకు ఆయుష్యము నొసంగి, వ్రతమును ముగించుకొని అయోధ్యానగరమునకు పుష్పక విమానముచే చేరి, నందిగ్రామమున ఉన్న భరతుని అయోధ్యకు చేర్చి వారితో కలిసెను. తల్లులందరికి నమస్కరించెను. సోదరులందరూ వసిష్ఠాజ్ఞను పొంది రామునికి రాజ్యాభిషేకమును గావించిరి. అప్పటినుండి శ్రీరామచంద్రుడు ప్రజలను కన్నబిడ్డలవలె పరిపాలించుచు లోకాపవాదమునకు భయపడి ధర్మజ్ఞుడు కావున సీతాదేవిని పరిత్యజించెను. సీతాదేవి వాల్మీకి ఆశ్రమమును చేరి సుఖముగా నివసించెను. కుశలవులు అను పుత్రులను కనెను. వాల్మీకి ఆ బిడ్డలకు జాతక కర్మాదులను యధావిధిగా ఆచరించెను. వాల్మీకి మహర్షి శ్రీమద్రామాయణమును రచించి కుశలవులకు బోధించెను. కుశలవులు మహర్షులతో రామాయణమును గానము చేయుచు ప్రసిద్ధిని గాంచిరి. శ్రీరామచంద్రుడు ఆచరించు అశ్వమేధయాగమునకు వచ్చిరి. అచట శ్రీరామచంద్రుడు కుశలవులచే గానము చేయబడిన తన చరిత్రను విని ప్రసన్న మనస్కుడై సీతాదేవితో వాల్మీకి మహర్షిని పిలిపించెను. జగన్మాత అగు సీతాదేవి కుశలవులను శ్రీరామచంద్రునకు అర్పించి భూ వివరమున జొచ్చెను. అది అత్యద్భుతమాయెను. తరువాత శ్రీరామచంద్రుడు బ్రహ్మచర్యమును అవలంబించి యజ్ఞముల ఆచరించుచు పదమూడు వేల సంవత్సరములు రాజ్యపాలన గావించుచు భూలోకమున నివసించెను. అంతట యథా సమయమున యమధర్మరాజు రామచంద్రుని చేరి బ్రహ్మసందేశమును వైకుంఠమును చేరమని చెప్పుటకుముందు మనిద్దరము మాటలాడు చుండగా ఎవ్వరూ రారాదు. వచ్చినవారు వధించబడవలెను అని పలికెను. శ్రీరామచంద్రుడు అట్లే ప్రతిజ్ఞ గావించెను. లక్ష్మణుని పిలిచి ఇచట ద్వారమున నిలువుము. ఇచటికి వచ్చినవారు వధార్హులు అగుదురు అని తెలిపెను. లక్ష్మణుడు అటులనే యని రామాజ్ఞను పరిపాలించుచుండెను. ఎవరినీ లోపల ప్రవేశించనీయలేదు. ఇట్లు ఏకాంతమున శ్రీరామచంద్రుడు యమధర్మరాజుతో సంభాషించు చుండెనని తెలిసి దుర్వాస మహర్షి అటకొచ్చెను. అట్లు వచ్చిన దుర్వాస మహర్షికి లక్ష్మణుడు నమస్కరించి రామచంద్రుడు రహస్య సమాలోచనలో నుండెను. ఒక ముహూర్త కాలము నిలువుడని పలికెను. దుర్వాస మహర్షి ఆ మాటలనువిని కాలమునకు కావలసిన దానిని చేయువాడు కావున కోపించి నన్నులోనికి ప్రవేశించనిమ్ము. లేనిచో నిన్ను భస్మము గావించెదనని పలికెను. దుర్వాస మహర్షి వాక్యమును వినిన లక్ష్మణుడు తత్తరపాటుతో మునికి భయపడి రామచంద్రునికి తెలుపుటకు లోనికి వెళ్ళెను. యమధర్మరాజు వచ్చిన లక్ష్మణుని చూచి మాటలాడుట ముగించి ప్రతిజ్ఞను నెరవేర్చుమని పలికి రామాజ్ఞతో వెడలెను. అంతట శ్రీరామచంద్రుడు ధర్మ భృచ్ఛ్రేష్టుడు బయటికి వచ్చి దుర్వాస మహర్షిని సత్కరించి భుజింపచేసెను. తరువాత నమస్కరించి అతనిని సాగనంపి లక్ష్మణునితో ఇట్లు పలికెను. లక్ష్మణా ధర్మ కారణమున సంకటము ప్రాప్తించినది. నీవు వధ్యుడ వయితివి. దైవము బలీయము. కావున నేను విడిచితిని. యధేచ్ఛముగా వెడలుము. అని అంతట లక్ష్మణుడు సత్య ధర్మములలో నిలిచిన శ్రీరామచంద్రునికి నమస్కరించి దక్షిణ దిశగా వెళ్ళి పర్వతముపై తపమును ఆచరించెను. అంతట శ్రీరామచంద్రుడు కూడా బ్రహ్మదేవునిచే సాకేతపురములో కోసల రాజ్యముతో పాటు స్వధామమును చేరెను. కోసలవాసులు కూడా దివ్యదేహులై యోగి దుర్లభమగు రామధామమును చేరిరి. గోప్రతారమును సరయూ నదిలో రాముని ధ్యానించి స్నాన మాడిన వారు దివ్యదేహులై యోగి దుర్లభమగు రామ ధామమును చేరిరి. లక్ష్మణుడు కూడా కొంతకాలము తపోయోగబలముకలవాడై రామాను గమమును స్వధామమును చేరెను. లక్ష్మణుడు నివసించి తపమాచరించిన ఆ పర్వతము ఉత్తమ క్షేత్రమాయెను. లక్ష్మణాచలమున లక్ష్మణుని సందర్శించినవారు కృతార్థులై నిస్సందేహముగా శ్రీహరి మందిరము చేరెదరు. ఈ క్షేత్రమున స్వర్ణ గోభూ అశ్వాది దానములు ప్రశస్తములు. ఇచట లక్ష్మణుని దర్శనము దుర్లభము. అగస్త్య మహర్షిఆజ్ఞచే లక్ష్మణ దర్శనమును పొందినచో మోక్షము తప్పక లభించును. ఇది లక్ష్మణాఖ్యాన సహితమగు రామచరిత్రము. ఈ చరితమును వినిన వారు, వినిపించినవారు రామచంద్రునికి ప్రీతిపాత్రులు అగుదురు. (II/75)