నక్షత్ర వేద సంహితాది కల్ప నిరూపణము

ఓ మునీశ్వరా! ఇక ఇపుడు కల్పగ్రంథమును చెప్పెదను. కల్పమును తెలుసుకొనిన మానవుడు కర్మకుశలుడు కాగలడు. నక్షత్ర కల్పము, వేదకల్పము, సంహితా కల్పము, అంగిరస కల్పము, శాంతి కల్పము అని అయిదు కల్పములు కలవు. నక్షత్రాధీశ్వరులను నక్షత్ర కల్పమున విస్తరముగా వివరించిరి. ఇట్లు నక్షత్ర కల్పమును కూడా విస్తరముగా తెలియవలయును. వేదకల్పమున ధర్మార్ధకామ మోక్షములు సిద్ధికొఱకు ఋగాది చతుర్వేదముల విస్తారముగా చెప్పబడినవి. సంహితా కల్పమున మంత్రములు ఋషులు, ఛందస్సులు, దేవతలు తత్త్వము తెలిసిన మునులచే చెప్పబడినవి. అట్లే అంగిరస కల్పములో బ్రహ్మ అభిచారవిధానముచే షట్కర్మలను విస్తరముగా వివరించెను. శాంతి కల్పమున దివ్యభౌమ అంతరిక్షముల ఉత్పాతముల శాంతులు వివరించబడినవి. ఇది సంక్షేపముగా కల్ప లక్షణము. శాఖాంతరములలో విడిగా ఈ కల్పముల లక్షణములు విస్తరముగా చెప్పబడినవి. గృహ్యకల్పమున అందరి ఉపయోగము కొఱకు చెప్పబడిన వాటిని ఇప్పుడు విస్తరముగా చెప్పెదను. సావధానముగా వినుము. పూర్వము బ్రహ్మకంఠమును భేదించు కొని ‘ఓంకారము’, ‘అథ’అను శబ్దములు వెలువడినవి. కావున ఈ రెండు శబ్దములు శుభకరములు. ఇట్లు చెప్పబడిన కర్మలను ప్రారభించు మానవుడు మొదట ‘అథశబ్దమును ప్రయోగించినచో అనంత ఫలము కలుగును. దర్భలు పరిసమూహము కొఱకు విడివిడి శాఖలుగా చెప్పబడినవి. తక్కువైనను, అధికమైనను అభిమత ఫలమును ఈయజాలవు. భూమి మీద కృమికీటపక్ష్యాదులు భ్రమించుచుండును కావున వాటి నుండి, వాటిని రక్షించుట కొఱకు పరిసమాహము చెప్పబడినది. మూడు రేఖలు చెప్పబడినవి. ఆ రేఖలు సమముగా ఉంచవలయును. ఎక్కువగా చేయరాదు. ఈ భూమి మధుకైట భులను రాక్షసులు మేదస్సుతో నిండియున్నది. కావున భూమిని గోమయముతో అలుకవలయును, గొడ్రాలు, దుష్టురాలు, దీనాంగి, పుత్రులు చనిపోయిన స్త్రీ యజ్ఞము కొఱకు గోమయమును తేరాదు. ఆకాశమున తిరుగు భయంకరములగు పక్ష్యాదుల ప్రహరణము కొఱకు ప్రోద్ధరణము చెప్పబడినది. స్రువముతోకాని దర్భతోకాని భూమిని ఉల్లేఖనము చేయవలయును. అట్లు చేసినచో అస్ధి కంటకాదుల శుద్ధి కలుగునని బ్రహ్మ చెప్పియుండెను. జలమే అన్ని దేవగణములు పితృ గణములు. కావుననే విధిని తెలిసిన మునులు జలముచే ప్రోక్షణమును చేయవలయునని చెప్పిరి. సౌభాగ్యవతులగు స్త్రీలు మాత్రమే యజ్ఞాగ్నిని తేవలయును. పవిత్రమైన మృణ్మయ పాత్రను నీటితో శుద్ధిచేసి పాత్రలో అగ్నినుంచి తేవలయును. బ్రహ్మాదులగు దేవతలందరు అమృత క్షయమును చూచి దర్భలలోని అగ్నిని యజ్ఞవేదిలో ఉంచిరి. యజ్ఞమునకు దక్షిణ దిక్కున దానవాదులుందురు. వారి నుండి రక్షణ కొఱకు బ్రహ్మను దక్షిణ దిక్కున ఉంచవలయును. ప్రణీత మొదలగు పాత్రలను ఉత్తరమున ఉంచవలయును. పశ్చిమమున యజమాని ఉండవలయును మిగిలిన బ్రాహ్మణులందరు తూర్పుదిక్కున నుండవలయును. ద్యూతములో, వ్యవహారములో యజ్ఞకర్మలోను కర్త ఉదాసీన చిత్తుడైనచో ఆ కర్మనశించును. బ్రహ్మ ఆచార్యులు యజ్ఞకర్మలో యజమాని శాఖ గలవారే ఉండవలయును. ఋత్విజుల విషయమున నియమము లేదు. లభించిన విధముగా ఏ శాఖవారి నైనను నియమించవచ్చును. మూడు అంగుళముల పరిమాణముగల రెండు పవిత్రములు కావలయును. ప్రోక్షణి నాలుగు అంగుళములు ఉండవలయును. ఆజ్యపాత్ర మూడు అంగుళములు, చరుపాత్ర ఆరు అంగుళములు కలదిగా ఉండవలయును. ఉపయమనము రెండంగుళములు కలది, సమ్మార్జనము ఏకాంగుళము ఉండ వలయును, స్రువము ఆరంగుళములు కలది, స్రుచము మూడున్నర అంగుళములు కలది సమిధలు ప్రాదేశమాత్రములుగా ఉండవలయును. పూర్ణపాత్రము ఆరంగుళములు కలది కావలయును. ప్రోక్షణి పాత్రకు ఉత్తర భాగమున ఎనిమిది అంగుళములు గల ప్రణీతి పాత్రను ఉంచవలయును. భూమండలమున ఉన్న సమస్త నదులు సముద్రములు ప్రణీతిలో చేరి ఉండును. కావున ప్రణీతి పాత్రను నీటిచే నింపవలయును. వస్త్ర హీనమగు వేదిక నగ్న మనబడును. కావున దర్భలనుపరిచి వస్త్రమును పరచవలయును. ఇంద్ర వజ్రము, విష్ణుచక్రము, శివత్రిశూలము అను వాటిని దర్భలతో చేయవలయును. ఈ మూటినే పవిత్రఛేదనములు అందురు. ప్రణీతజలముతో కూడిన ప్రోక్షణి చేయవలయును. అట్లు చేసినచో మహాపుణ్యమును ప్రసాదించును. కావుననే దానిని పవిత్రమందురు. పలమాత్ర ప్రమాణము కలదానిని అజ్యపాత్ర నేర్పరచవలయును. కులాల చక్రముతో నిర్మించబడిన మృణ్మయ పాత్రను అసురము అందురు. ఆ పాత్రయే హస్తమున ధరించినచో దైవికర్మకు యోగ్యమగు స్ధాల్యాదులుగామారును. స్రువమున శుభకర్మలన్నియూ ఉండును. కావుననే పవిత్రత కొఱకు స్రువమును అగ్నిచేతప్తము చేయవలయును. స్రువమును అగ్రభాగమున ధరించినచో వైధవ్యము, మధ్య భాగమున సంతాన క్షయము, మూలమున హోతృ మరణము సంభవించును. కావున చక్కగా విచారించి ధరించవలయును. అగ్ని, సూర్యుడు, యముడు, చంద్రుడు, బ్రహ్మ, వాయువు అను ఈ షడ్దేవతలు స్రువమున ప్రతి అంగుళమున ఉందురు. అగ్ని భోగార్దనాశమును, సూర్యుడు వ్యాధిని, సోముడు ఫలరాహిత్యమును కలిగించును. బ్రహ్మ సర్వ కామములను ఇచ్చును. వాయువు వృద్ధిని కలిగించును. యముడు మృత్యువునిచ్చును. సంమార్జన ఉపయమనములుగా రెండు దర్భలను ఏర్పరచవలయును. శ్రీపర్ణము, శమీ, ఖదిరము, వికంకము పలాశము అయిదు శాఖలను స్రువమున, స్రుచమున ఉంచవలయును. స్రువము హస్తపరిమితము, స్రుచము ముప్పది అంగుళముల పరిమాణము ఉండవలయును. ఈ పరిమాణము బ్రాహ్మణులకు విధించబడినది. ఇతరులకు ఒక అంగుళము తక్కువగా ఉండవలయును. శూద్ర పతిత ఖరాది దృష్టిదోష నివారణమునకు పాత్రలను ప్రోక్షించవలయును. పూర్ణపాత్రను ఏర్పరచనిచో యజ్ఞచ్ఛిద్రము కలుగును. పూర్ణపాత్రను ఉంచినచో యజ్ఞము పూర్తి జరుగును. అష్టముష్టి పరిమితములు నాలుగైనచో పుష్కలము అనబడును. నాలుగు పుష్కలములను పూర్ణపాత్ర అందురు. హోమకాలమున ఎవరికి ఆసనము ఈయరాదు. అట్లిచ్చినచో అగ్ని అసంతృప్తుడై దారుణ శాపమును ఇచ్చును. ఆధార పాత్రలను నాసికలందురు. ఆజ్య భాగములను చక్షువులు అందురు. ప్రాజాపత్యమును ముఖమని వ్యాహృతులను కటియని అందురు. పంచవారుణములను శీర్షము హస్తములు పాదములు అందురు. స్షిష్టకృతము పూర్ణాహుతి శ్రోత్రములందురు. రెండు ముఖములు, ఒక హృదయములు, నాలుగు శ్రోత్రములు, రెండు నాసికలు, రెండు తలలు, ఆరు నేత్రములు, పింగళ వర్ణము, ఏడు జిహ్వలు, వామ భాగమున మూడు హస్తములు, దక్షిణ భాగమున నాలుగు హస్తములు, స్రుక్ర్సువములు, జపమాల, శక్తి దక్షిణ కరమునందు, మూడు మేఖణలలు, మూడు పాదములు, ఘృత పాత్రము, రెండు చామరములు కలిగి ఉండును. మేష వాహనము, నాలుగు శృంగములు, బాలసూర్య కాంతి కలిగి ఉండును. ఉపవీతముతో కూడి ఉండును. జటాకుండల మండితుడుగా ఉండును. ఇట్లు అగ్ని దేహమును తెలుసుకొని హోమ కర్మను ఆరంభించవలయును.

            పాలు పెరుగు నెయ్యి నూనెతో వండినదానిని చేతితో హోమమును చేసిన బ్రాహ్మణుడు బ్రహ్మహత్యా పాపమును పొందును. మానవుడు తాను భుజించు ఆహారమునే తన దేవతలకు  సమర్పించవలయును, సర్వకామ సమృద్ధికి తిలాధిక్యములు కల హవిస్సును సమర్పించవలయును. హోమమున మృగీ, హంసీ, సూకరీ అని మూడు ముద్రలుండును. అభిచార హోమమున మాత్రము సూకరీముద్రను ఉపయోగించవలయును. శుభకర యాగములో హంసీ, మృగీముద్రలను ఉప యోగించవలయును. చేతిఅన్నివేళ్ళను కలిపినచో సూకరీముద్ర అగును. కనిష్ఠకనుకను వదలినచో హంసీ ముద్ర అగును, అనామికను వదలినచో మృగీ ముద్ర అగును. మొదట చెప్పిన ప్రమాణమును అనుసరించి పంచాంగుళములతో హవిస్సును దధిమధు ఆజ్యయుక్తముగా స్వీకరించి, తిలలతో కలిపి ఋత్విక్కులు హోమమును చేయవలయును. శుభకర్మలలో దర్భలను అనామికాంగుళులతో ధరించ వలయును. వినాయకుడు కర్మముల విఘ్నసిద్ధికి నియమించబడి ఉండెను. అట్లే గణాధి పత్యమునకూడా బ్రహ్మరుద్రులు వినాయకుని నియమించిరి. అట్టి వినాయకుడు స్పృశించిన వాని లక్షణములను తెలుపుచున్నాను వినుము. తన నీటిలోనే తాను మునుగును. కేశ ఖండనము చేయబడిన ముండులను చూచును. కామార్తుడై వస్త్రాభిలాషియై రాక్షసులను ఆవేశించును. అంత్య జులతో రాసభములతో ఒంటెలతో కలిసి ఒకే చోట నివసించును. దారిలో నడుచుచు తన నెవరో వెంబడించుచున్నారని తలంచును. ఎప్పుడూ వేదనచే నిండిన మనసు కలవాడై ఉండును. ప్రారం భించిన ప్రతిపని విఫలమగును. కారణము లేకనే కలతచెందును. వినాయకునిచే స్పృశించబడిన రాజపుత్రులు రాజ్యమును పొందజాలరు. కన్య భర్తను పొందలేదు. వివాహిత స్త్రీ సంతానమును పొందజాలదు. శ్రోత్రియుడు ఆచార్యత్వమును, శిష్యుడు అధ్యయనమును పొందజాలడు. వైశ్యుడు తన వ్యాపారమున లాభమును పొందజాలడు. రైతు పంటను పొందజాలడు. కావున వినాయ కోపసృష్టుడైన వానికి శుభదినమున విధి పూర్వకముగా స్నపనమును చేయవలయును. పచ్చని ఆవాలచే బ్రాహ్మణులు స్వస్తివాచనమును చేయవలయును. అశ్వశాలనుండి, గజశాలనుండి, పుట్టనుండి, నదీసంగమము నుండి, సరస్సునుండి మట్టిని, రోచనమును, గంధమును, గుగ్గులనుతెచ్చి నిక్షిప్తము చేయవలయును. ఒకేరంగుకల నాలుగు కలశములతో యోగ్యమగు హ్రదమునుండి జలమును తేవలయును. ఎఱ్ఱని వృషభ చర్మమున భద్రాసనమును స్థాపించవలయును. వజ్రాయుధమును ధరించిన ఇంద్రుని ఋషులు పావనము చేసిన జలముచే నిన్ను అభిషేకించెదను. పవమాన దేవతలు నిన్ను పవిత్రునిచేయుదురు గాక! వరుణుడు, సూర్యుడు, బృహస్పతి, ఇంద్రుడు, వాయువు, సప్తర్షులు నీకు ఐశ్వర్యమును ప్రసాదింతురు గావుత! నీకేశములలో, పాపిటలో, శిరస్సులో, లలాటమున, చెవులలో, నేత్రములలో ఉన్న దౌర్భాగ్యమును జలము తొలగించుగావుత! స్నానము మేడిస్రువము ద్వారా ఆవనూనెతో శిరస్సున సవ్యముగా దర్భలను గ్రహించి ఉంచవలయును. నాలుగు దారుల కూడలిలో దర్భలను పరిచి అంతటా మితసంమిత శాలకంటకములను గుమ్మడి కాయను రాజపుత్ర అను పదము అంతమందు కల మంత్రములతో, నమస్కారములతో ఈయవలయును. ఉడికి ఉడకని బియ్యమును, మాంసమును అన్నమును, వండిన మత్స్యములను, వండని వాటిని సమర్పించవలయును. పలువిధములగు పుష్పములను, గంధమును, మూడు విధములగు సురను అర్పించవలయును. మూలములను పూర్ణాపూపము లను, పూలమాలలను, పెరుగన్నమును, పాయసమును, బెల్లముతో కలిపిన పిండిని తగిన నీటితో కలిపి, వీటినన్నింటిని ఒకచోట చేర్చి, భూమియందుంచి నమస్కరించి, వినాయకుని తల్లియగు పార్వతిని ప్రార్ధించ వలయును. గరక ఆవాలపూలచే పూర్ణాంజలిచే అర్ఘ్యమును ఈయవలయును. రూపమును, కీర్తిని, ఐశ్వర్యమును ప్రసాదించుము. పుత్రులను, ధనమును అన్ని కోరికలను ఈయుము. అని శివుని పత్నియగు పార్వతిని పూజించి తరువాత శివుని ధూపదీప గంధమాల్యాదులచే నైవేద్యములచే పూజించ వలయును. తరువాత తెల్లని వస్త్రములను, తెల్లని పుష్పమాలలను ధరించి బ్రాహ్మణులకు అన్నదానమును చేయవలయును. గురువుగారికి రెండు వస్త్రములను కూడా దానము చేయ వలయును. ఇట్లు వినాయకుని పూజించి పిదప గ్రహములనుకూడా పూజించవలయును. సంపదను, శాంతిని, పుష్టి బుద్ధి ఆయుష్యములను కోరువారు గ్రహములను పూజించవలయును. సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, బృహస్పతి, శుక్రుడు, శని, రాహువు, కేతువు అను ఈ నవగ్రహ ములను క్రమముగా స్థాపించవలయును. ఈ గ్రహములను రాగితో, వెండితో రక్తచందనముతో బంగారముతో, ఉక్కుతో, సీసముతో కాని శుభము కొఱకు చేయవలయును లేదా వస్త్రములందు వారివారి వర్ణములతో లిఖించవలయును. మండలములలో కూడా లిఖించవచ్చును. ఆయా గ్రహ ములకు నియమించబడిన వర్ణములుగల వస్త్రములను పూవులను సమర్పించవలయును. గంధము లను బలులను గుగ్గులు ధూపమును సమర్పించవలయును. మంత్రములతో చరువును సిద్ధము చేయ వలయును. “ఆకృష్ణేన” అను మంత్రముతో సూర్యుని, ‘ఇమం దేవా’ అను మంత్రముతో చంద్రుని, “అగ్నిర్మూరా” అను మంత్రముతో కుజుని, “ఉద్భుధ్యస్వ” అను మంత్రముచే బుధుని, “యదర్య” అను మంత్రముచే గురువును, “అన్నాత్పరిస్రుతః” అను మంత్రముచే శుక్రుని, “శంనో దేవీ” అను మంత్రముచే శనిని, “కాండాత్” అను మంత్రముచే రాహువును, “కేతుం కృణ్వన్న కేతవ” అను మంత్రముచే కేతువును. ధ్యానించవలయును. జిల్లేడు, మోదుగు, జువ్వి ఉత్తరేణి, రాగి, మేడి, జమ్మి, గరక, దర్భలు, సమిధలు యథాక్రమముగా ఒక్కొక్క గ్రహమునకు 108, కాని 28 సార్లు కాని హోమమును చేయవలయును. అట్లే తేనెతో, నేయితో, పెరుగుతో, పాలతో కాని హోమము చేయవలయును. బెల్లముకలిపిన అన్నమును, పాయసమును, హవిస్సును, క్షీరములను, దధ్యోదనమును, హవిశ్చూర్ణమును మాంసమును, చిత్రాన్నమును యథాక్రమముగా ఆయా గ్రహములకు అర్పించవలయును. తరువాత బ్రాహ్మణులను భుజింప చేయవలయును. శక్తినను సరించి యథావకాశముగా శాస్త్రమును అనుసరించి బ్రాహ్మణులను సత్కరించి, ధేనువును, శంఖ మును, వృషభమును, తెల్లని వస్త్రములను, గుఱ్ఱమును, కపిలగోవును, ఇనుము, మేక వీటిని యథాక్రమముగా దక్షిణగా సమర్పించవలయును. ఏ గ్రహమునకు ఏ ద్రవ్యము, ఫలము నిర్ణయిం చబడినదో ఆ ద్రవ్యాదులచే పూజించవలయును. ఇట్లు పూజించినవారిని గ్రహములు అనుగ్రహిం చునని శాస్త్రము చెప్పుచున్నది. మానవులు ధన, జాతి అభివృద్ధులు గ్రహాధీనములే. జగత్తు స్థితినాశములు కూడా గ్రహాధీనములే కావున ఆయాగ్రహములను పూజించవలయును. ఎప్పుడూ సూర్యుని పూజించి, స్వామియైన మహాగణపతికి తిలకము నుంచిన వారు సిద్ధిని పొందెదరు. అన్ని కర్మలు ఫలించును. సాటిలేని సంపదలను పొందును. మాతృదేవతల పూజ చేయక గ్రహ పూజచేసినచో మాతృదేవతలు కోపింతురు. ‘వసోః పవిత్రం’ అను మంత్రముచే వసుధారను కల్పించి గౌరీమొదలగు మాతృదేవతలను శుభకర్మలయందు శ్రేయోభిలాషులు పూజించవలయును. గౌరీ, పద్మా, శచీ, మేధా, సావిత్రీ, విజయా, జయ, దేవసేనా, స్వధా, స్వాహా, వైదృతి, ధృతి, పుష్టి, హృష్టి, తుష్టి, ఆత్మదేవతయను పదునారు మాతృదేవతలు, గణేశునితో షోడశ మాతృకలను శుభకర్మల యందు వృద్ధికొఱకు పూజించవలయును. అవాహనము పాద్యము, అర్ఘ్యము, స్నానము, చందనము, అక్షతలు, పుష్పములు, ధూపము, దీపము, పండ్లు, నైవేద్యము, ఆచమనీయము, తాంబూలము, పోకలు, నీరాజనము, దక్షిణలను మాతృదేవతల సంతోషము కొఱకు క్రమముగా ఈయవలయును.

సంపదలను, సంతానమును వృద్ధిగావించు పితృకల్పమును ఇప్పుడు చెప్పెదను. ఉత్తరాయణ పుణ్యకాలమున దక్షిణాయన పుణ్యకాలమున, అమావాసా తిథియందు, అష్టకములలో, తిథివృద్ధిలో ఉన్నపుడు, ద్రవ్యము లభించినపుడు, సద్బ్రాహ్మణులు వచ్చినపుడు, విషువత్కాలమందు, సూర్యసంక్ర మణమున, వ్యతీపాద్యోగమునందు, గజ చ్ఛాయలో, సూర్య చంద్రగ్రహణ కాలమున శ్రాద్ధమును చేయవలయునని ప్రీతి కలిగిన కాలమున శ్రాద్ధమును ఆచరించవలయును. ఈ సమయములు శ్రాద్ధకాలములుగా పెద్దలచే పేర్కొనబడినవి. ఉత్తమవంశసంజాతుడు, సర్వవేదములను అధ్యయ నము చేసినవాడు, శ్రోత్రియుడు, బ్రహ్మజ్ఞానము కలవాడు, యువకుడు, వేదార్ధజ్ఞుడు, సామవేదమును చదివినవాడు, త్రిమధువు, త్రిసుపర్ణుడు, చెల్లెలు కొడుకు, ఋత్విజుడు, అల్లుడు, యాగము చేయు వాడు, మామ, మేనమామ, త్రికాలములలో సంధ్యావందనమును ఆచరించువాడు, పుత్రికా పుత్రుడు, శిష్యుని సంబంధులు, బంధువులు, కర్మనిష్ఠులు, తపోనిష్ఠులు, పంచాగ్ని పరాయణులు, బ్రహ్మ చారులు, పితృమాతృభక్తి గలవారు అగు బ్రాహ్మణులు శ్రాద్ధమున నియోగించుటకు యోగ్యులు. రోగముకలవాడు, అంగవికలురు, అంగాధిక్యులు, గ్రుడ్డివారు, కవలలో తరువాత పుట్టినవాడు, దీనుడు, విధవాపుత్రుడు, వ్యభిచారిణీ పుత్రుడు, గోళ్ళను పెంచుకొనినవాడు, దంతధావనమును చేయనివాడు, వేతనము తీసుకొని విద్యను బోధించువాడు, నపుంసకుడు, కన్యను దూషించువాడు, పలువురిచే నిందించబడువాడు, మిత్రద్రోహి, లోభి, సోమరసమును అమ్మువాడు, అన్నకంటే ముందు వివాహము చేసుకొనిన వాడు. తల్లిని, తండ్రిని, గురువును త్యజించినవాడు, అయోగ్యుల భోజనము చేయువాడు, శూద్రునివలన పుట్టినవాడు, స్త్రీకి రెండవ భర్తగా ఉన్నవాడు, చోరుడు, కర్మభ్రష్టులు శ్రాద్ధమున నిమంత్రణము నకు అయోగ్యులు. శ్రాద్ధము చేయువాడు మనోనిగ్రహము కలవాడై, పవిత్రుడై మొదటి దినముననే బ్రాహ్మణులను నియంత్రణ చేయవలయును. అట్లు నిమంత్రణ చేయబడిన బ్రాహ్మణులు కూడా కాయిక వాచిక మానసిక నిగ్రహము కలిగి ఉండ వలయును. శ్రాద్ధదినమున వచ్చిన బ్రాహ్మణులకు స్వాగతము పలికి అపరాహ్ణ కాలమున పూజించ వలయును. పవిత్రమును ధరించి బ్రాహ్మణులకు ఆచమనమునిచ్చి ఆసనముల యందు కూర్చోబెట్ట వలయును. విశ్వేదేవతల స్థానమున శక్తి ననుసరించి, పితృస్థానమున బేసి సంఖ్యతో అనగా మూడు, అయిదు, మొదలగు సంఖ్యతో బ్రాహ్మణులను ఉంచవలయును. చక్కగా శుద్ధి చేయబడిన ప్రదేశమున దక్షిణాభిముఖముగా ఉండి విశ్వ దేవతలను ఇద్దరినీ ప్రాఙ్ముఖులుగా, పితృ స్థానమున నియోగించిన ముగ్గురుని ఉత్తరాభిముఖముగా ఒక్కొక్కరిని కూర్చుండబెట్టవలయును. మాతామహులు విషయమునకూడా ఇట్లే ఆచరించ వలయును. హస్త ప్రక్షాళనము ఆచరించి ఆసనమునకు దర్భలను ఉంచవలయును. బ్రాహ్మణుల అనుజ్ఞను పొంది “విశ్వేదేవాస” అను ఋక్కుచే ఆవాహనము చేయవలయును. పవిత్రముతో కూడిన పాత్రయందు యవలను చల్లి “శం నో దేవీ” అను మంత్ర ముచే నీరునుంచి, “యవోసి” అను మంత్రముచే యవలనుంచి, “యా దివ్యా” అను మంత్రముచే హస్తమున పాద్యమును అర్పించవలయును. తరువాత ఉదకమునిచ్చి, గంధమాల్యములను అర్పించి దీపమునుంచి, అన్నప్రదానము గావించవలయును. తరువాత అపసవ్యము చేసుకొని పితృస్థానమున నియోగించినవారికి ప్రదక్షిణముచేసి, రెట్టింపు దర్భలనిచ్చి, “ఉశంతః” అను మంత్రముచే అనుమతిని పొంది ఆవాహనము చేయవలయును. తరువాత పితృమంత్రమును జపించవలయును. పితృ దేవతలకు యవలకు బదులుగా నువ్వులను వాడవలయును. అర్ఘ్యాదులను పూర్వమువలె నాచరించ వలయును. యవలతో అర్ఘ్యమునిచ్చి పాత్రలో యవలను విధానముగా నుంచి “పితృభ్యః స్థానమసి” అను మంత్రముచే కొద్దిగా వేడిచేసిన పాత్రను తలక్రిందులుగా చేయవలయును. అన్నమును హోమము చేయునపుడు అనుమతిని పొంది నేతితో కలిపిన అన్నమును హోమము గావించ వలయును. హోమము చేయగా మిగిలిన అన్నమును పాత్రలలో ఉంచవలయును. లభించిన విధ ముగా పాత్రలను ఉంచవలయును. బంగారు పాత్రలు శ్రేష్ఠములు. అట్లు పాత్రలలో అన్నమునుంచి “పృథివీ తే పాత్రం” అను మంత్రముచే పాత్రలను అభిమంత్రించవలయును. “ఇదం విష్ణుః “ అను మంత్రముచే అన్నమున బ్రాహ్మణ అంగుష్ఠమును ఉంచవలయును. వ్యాహృతులచే కూడిన గాయత్రీ మంత్రమును, “మధువాతా” అను మంత్రమును జపించి ‘యథాసుఖం’ అని చెప్ప వలయును. బ్రాహ్మణులు కూడా మౌనముగా భుజించవలయును. కోపమును, త్వరను విడిచి ఇష్టమగు అన్నమును, హోమము చేసిన హవిస్సును ఈయవలయును. తృప్తిచెందువరకు వడ్డించ వలయును. వారు భోజనము చేయుచుండగా పూర్వమువలె గాయత్రీ జపమును చేయుచుండ వలయును. అన్నమును తీసుకొని తృప్తినిచెందితిరా అని అడిగి, శేషాన్నమును అనుమతిని పొంది భూమి మీద చల్లవలయును. ఒక్కొక్క మారు జలమును ఈయవలయును. మొత్తము అన్నమును నువ్వులతో తీసుకొని దక్షిణాభిముఖుడై బ్రాహ్మణులు భోజనముచేసిన ప్రదేశమునకు సమీపమున పితృయజ్ఞమునందువలె పిండ ప్రదానమును గావించ వలయును. మాతామహాదులకు కూడా ఇట్లే చేయవలయును. తరువాత ఆచమనమునకు జలమును ఈయవలయును. తరువాత స్వస్తి వాచనము గావించి, అక్షయోగకమును ఈయవలయును. శక్తి ననుసరించి దక్షిణలనిచ్చి స్వధా కారమును చేయవలయును. వాచ్యతాం అని అనుమతిని పొంది, స్వధాకారమును చేయుడు అని పలికి బ్రాహ్మణులు స్వధా అని పలుకగా జలమును భూమిపై చల్లవలయును. విశ్వదేవతలు తృప్తి చెందుదురు గాక అని విప్రులు పలుకగా బ్రాహ్మణులు ఇట్లు జపించవలయును. “దాతారో నోఽభి వర్ధన్తాం వేదాస్సంతతిరేవ చ, శ్రద్ధా చ నో మావ్యగమద్బహు దేయం చ నోస్తు” అని అనగా మాకు దానము చేసినవారు, వేదములు, సంతతివృద్ధి చెందుగాక! మాలో శ్రద్ధ లోపించ కుండుగాక! మాకు చాలా ఇవ్వగల సంపదలు దాతలకు కలుగుగాక! అని అర్థము. ఇట్లు బ్రాహ్మణులు ప్రియ వచనములను పలుకగా నమస్కరించి పంపించవలయును. “వాజే వాజే” అను మంత్రములచే ప్రీతిపూర్వకముగా మొదట పితృదేవతలను పంపవలయును. మొదట యవాదుల ఉంచిన అర్ఘ్య పాత్రను (తలక్రిందులుగా ఉంచిన దానిని యథా ప్రకారముగా చక్కగా నుంచి తరువాత పంప వలయును. బ్రాహ్మణులకు ప్రదక్షిణము చేసి పంపిన తరువాత పితృభుక్త శేషమును తాము భుజించవలయును. ఆ రాత్రి శ్రాద్ధకర్తలు భోక్తలగు బ్రాహ్మణులు బ్రహ్మచర్యమును పాటించ వలయును. ఇట్లు వృద్ధికార్యమున నాందీముఖ్యులగు పితృ దేవతలను దధి కర్మంధు మిశ్రితములగు, యవలచే చేయబడిన పిండములచే పూజించవలయును. ఏకోద్దిష్టమున మాత్రము దేవస్థాన రహితముగా ఏకార్ఘ్యపాత్రముతో, అవాహనాగ్నికార్య రహితముగా నాచరించవలయును. అపసవ్యముతో చేయవలయును. స్థానోపవేశన సమయమున “ఉపతిష్ఠతాం” అని, విప్ర విసర్జనలో ‘అభిరమ్యతాం’ అని పలుకవలయును. బ్రాహ్మణులు “అభిరతాస్స్మ” అని పలుకవలయును. నువ్వు లతో కలిపిన గంధోదకముతో నాలుగు పాత్రలను ఉంచవలయును. పితృపాత్రల యందలి జలముతో అర్ఘ్యము కొఱకు ప్రీతిపాత్రను తడుపవలయును. “యే సమానా” అను మంత్రములతో రెండు పాత్రలతో తడుపవలయును. మిగిలినదంతయు పూర్వమువలె ఆచరించవలయును. ఈ సపిండీకరణము ఏకోద్దిష్టము స్త్రీ విషయమున కూడా ఆచరించవలయును. ఇట్లు సంవత్సరము వరకు తరువాత సపిండీకరణమును చేయవలయును. సంవత్సరము తరువాత మరణించినట్లు తెలిసిననూ తరువాత ఒక సంవత్సరము ఉదకుంభముతో అన్నదానమును బ్రాహ్మణునకు చేయ వలయును. ఒక సంవత్సరము వరకు ప్రతిమాసమున చనిపోయిన దినమున శ్రాద్ధమును చేయ వలయును. సంవత్సరము తరువాత ప్రతి సంవత్సరము చనిపోయినదినమున శ్రాద్ధమును ఆచరించ వలయును. పిండములను గోవులకు కాని, మేకలకు కాని, బ్రాహ్మణులకు కాని ఈయవలయును. లేదా అగ్నిలో కాని జలమున కాని విసర్జించవలయును. సద్ర్బాహ్మణులకే దానము ఈయవలయును. బ్రాహ్మణులు తినగా మిగిలిన దానిని ఊడ్వరాదు. హవిస్సుకు యోగ్యమగు అన్నమును ఒకనెల హోమము చేయవలయును. పాయసముతో సంవత్సరము హోమమును చేయవలయును. చేపల, లేళ్ళ, పావురముల, ఇతర పక్షుల, మేకల, దుప్పుల, జింకలు, ఏదులు, వరాహములు కుందేళ్ళ మాంసములతో యథాక్రమముగా ఒక్కొక్కనెలలో పితరుల అర్పించినచో పితృదేవతలు తృప్తిచెందెదరు. పితామహులు తృప్తిచెందెదరు. ఖడ్గమృగమాంసముతో చేయు పితృయజ్ఞము మహాకల్పనమనబడును. తేనెచే మునులు ఆహారముచే కూడా శ్రాద్ధము చేయవచ్చును. డేగమాంసము మహాశాకము కోడిమాంసమును అర్పించవచ్చును. గయాక్షేత్రమున పైన చెప్పబడిన వాటిచే శ్రాద్ధమును చేసినచో ఉత్తమ ఫలములను పొందును. ఇట్లే వర్షర్తువులోని త్రయోదశితిథిన మఘలలో చేసినచో విశేష ఫలమును పొందెదరు. ఇట్లు శాస్త్రోక్తముగా శ్రాద్ధమును ఆచరించిన వారికి కన్యలు, పశువులు, సత్పుత్రులు కలిగెదరు. ద్యూతమున, వ్యవసాయమున, వ్యాపారమున లాభములను పొందెదరు. రెండు గిట్టలుకల పశువులను, ఒకగిట్టగల పశువులను, బ్రహ్మతేజస్సుగల పుత్రులను, బంగారు, వెండి నాణెములను ఉత్తమ జ్ఞాతులను, సర్వ కామములను పొందెదరు. ప్రతిపత్తు మొదలగు తిథులలో ఒక్క చతుర్దశిని వదిలి మిగిలిన తిథులలో, శస్త్ర హతులైన వారికి శ్రాద్ధమును ఆచరించవలయును. ఇట్లు శ్రాద్ధము ఆచరించిన వారు, స్వర్గమును, సత్సంతానమును, తేజస్సును, బలమును, శౌర్యమును, భూమిని, ఉత్తమ పుత్రులను, సౌభాగ్యమును, సమృద్ధిని, కీర్తిని, శుభమును, మంచినడవడిని, రాజ్యమును వ్యాపారాదులలో లాభమును, ఆరోగ్యమును, కీర్తిని, దుఃఖ రాహిత్యమును, ఉత్తమగతిని, ధనమును, విద్యను, మంచివైద్యుని, గోమహిష్యాది పశు సంపదను అశ్వములను పొందెదరు. కృత్తికాది భరణ్యంత నక్షత్రములలో శ్రాద్ధమును ఆచరించినవారు అన్ని కామనలను పొందగలరు. భగవంతునియందు విశ్వాసము కలవాడై, శ్రద్ధ కలవాడై, మద మత్సరములను విడిచి వసురుద్రాదిత్యులను, పితరులను, శ్రాద్ధదేవతలను తృప్తి పరచినచో, అట్లు ప్రీతిచెందిన శ్రాద్ధదేవతలు ఆయువును సంతానమును, ధనమును, విద్యను, సుఖములను, మోక్షమును ప్రసాదిం తురు. ప్రీతిని చెందిన పితామహులు నరులకు రాజ్యమును ప్రసాదింతురు. ఇట్లు విశేషమగు కల్పాధ్యా యమును కొంచెముచెప్పితిని, వైదిక తంత్రమున, ఇతర పురాణములనుండి విస్తరముగా తెలియ వలయును. ఇట్లు చదువువారు, కర్మలలో కుశలులై ఇహపర లోకములలో సద్గతిని పొందెదరు. దైవకార్యము లందు పితృకార్యములందు ఈ కల్పాధ్యాయమును వినువారు కల్పాధ్యాయమున చెప్పబడిన దేవ పితృ కార్యముల ఆచరించిన ఫలమును పొందెదరు. ధనమును, విద్యను, ఉత్తమ కీర్తిని, పుత్రులను, పర లోకమున సద్గతిని పొందెదరు. ఇక ఇప్పుడు వేదమునకు ముఖము అనబడు వ్యాకరణమును సంగ్రహముగా తెలిపెదను సావధానముగా వినుము. (2/51)