ప్రయాగరాజ మాహాత్మ్యేతీర్థ విధి

వసిష్ఠ మహర్షి పలికెను: ఓ రాజా! బ్రహ్మపుత్రయగు మోహిని భక్తిముక్తి ప్రదాయకమగు పురుషోత్తమ మాహాత్మ్యమును విని తన పురోహితుడుగు వసువును మరల ఇట్లడిగెను.

మోహిని పలికెను: ఓ బ్రాహ్మణోత్తమా! అత్యద్భుతమగు పురుషోత్తమ మాహాత్మ్యమును వింటిని. ఇక ఇపుడు ప్రయాగ మాహాత్మ్యమును చెప్పుము. సామాన్య విశేష తీర్థయాత్రలకు వెళ్ళినపుడు నరులు ఆచరించవలసిన విధానమును తెలుపుము. ఇట్లు పలికిన మోహిని మాటలను వినిన ఆ బ్రాహ్మణోత్తముడగు వసువు సామాన్య విధి పూర్వకముగా ప్రయాగ మాహాత్మ్యమును ఇట్లు చెప్పసాగెను.

వసువు పలికెను: భద్రపరులారా! తీర్థయాత్రాగమన విధానమును తెలిపెదను వినుము. ఈ విధానమును అనుసరించినవారు యథోక్త ఫలమును పొందగలుగుదురు. పవిత్రమగు తీర్థయాత్రా గమనము యజ్ఞములను ఆచరించుటకన్నా విశేష ఫలప్రదము. దశమి ఏకాదశి ద్వాదశి రాత్రులందు ఉపవసించక, తీర్థయాత్రలకు వెళ్ళక, స్వర్ణదానమును, గోదానమును చేయక మానవుడు దరిద్రుడగును. తీర్థయాత్రల వలన పొందు ఫలమును విపులదక్షిణలను ఇచ్చు అగ్నిష్టోమాది యాగముల వలన కూడా పొందజాలడు. అజ్ఞానముచే తీర్థయాత్రలు చేసినవాడు కూడా సర్వకామ సమృద్ధుడే స్వర్గమును పొందును. ధనదాన్య సమాకులమగు స్థానమును పొందును. ఐశ్వర్యపూర్ణుడు జ్ఞానపూర్ణుడు అగును. సర్వకాలములందు భోగయుతుడు అగును. అతని పితరులు పితామహులు నరకమునుండి తరించబడుదురు. హస్తములు పాదములు మనస్సు నియమబద్ధముగా ఉండువానికి విద్య తపస్సు కీర్తి నియమబద్ధముగా నున్నవానికి తీర్థయాత్రా ఫలములు లభించును. ఎవరి నుండి దేనిని గ్రహించక, లభించిన దానితో సంతృప్తి చెందువాడు, అహంకార విముక్తుడు తీర్థయాత్రా ఫలమును పొంద కలుగును. కల్పనలు లేనివాడు, ప్రయత్నశూన్యుడు, తగినంత ఆహారమును పొందువాడు, ఇంద్రియనిగ్రహము కలవాడు, సర్వసంగవినిర్ముక్తుడు తీర్థయాత్రా ఫలమును పొందును. శ్రద్ధతో, ఏకాగ్రమనస్కుడై, ధీరుడై తీర్థయాత్ర ననుసరించుచు పాపములను చేయువాడు కూడా శుద్ధి పొందును. ఇక పరిశుద్ధుని మాటేల ? శ్రద్ధలేనివాడు, పాపార్తుడు, నాస్తికుడు, సంశయములు తొలగనివాడు, హేతువాది ఈ అయిదుగురు తీర్థయాత్రా ఫలమును పొందజాలరు. పాపములను చేయువారి పాపములు తీర్థయాత్రలతో నశించును. పరిశుద్ధాత్ములకు తీర్థయాత్రలు యధోక్త ఫలము లభించును. కామక్రోధలోభములను జయించి తీర్థయాత్రలు చేయువారు పొంద జాలని ఫలము ఉండదు. యధోక్త విధిచే తీర్థయాత్రలను చేయువారు సుఖదుఃఖాది సకలద్వంద్వ విధిచే సకల ద్వంద్వము లను సహించగలవారు స్వర్గమును పొందెదరు. గంగాది పుణ్యతీర్థములందు చాలా చేపలు నివసించుచుండును. దేవాలయములందు పక్షిగణములు ఉండును. అయిననూ వారందరికి ఫలము కలుగుటలేదు. తీర్థమునందు కాని దేవాలయములందు కాని వాసము ముఖ్యము కాదు. భావము ప్రధానము, భావహీనులు ఫలమును పొందజాలరు. కావున హృదయమున భక్తి భావమును ప్రతిష్ఠించుకొని ఏకాగ్రమనస్కుడై పుణ్యతీర్థములను సేవించవలెను. మునీంద్రులు చెప్పిన విధించిన అమోదించిన తీర్థయాత్రను గురువులచే నియమించబడిన బ్రహ్మచారులు యధావిధిగా నాచరింతురు. సర్వస్వము నశించిననూ అల్పబలము కలవాడైననూ బ్రాహ్మణులను ముందు నిడుకొని, యజ్ఞాధికారము ఉన్ననూ తొలగిననూ బ్రాహ్మణులు తీర్థములను పర్యటించవలెను. పరిశుద్ధ మనస్సుకల మునీంద్రులు పవిత్ర తీర్థములలో యజ్ఞఫలము లభించునని చెప్పి ఉన్నారు. యజ్ఞములందు అధికారము కలవారు మాత్రము ఇల్లు, గృహస్థధర్మములే ముఖ్యము. గృహస్థాశ్రమమును యథావిధిగా ఆచరించు వారికి తీర్థయాత్రలు నిషేధించబడినవి. సర్వతీర్థములు అగ్నిహోత్రతుల్యములు కాజాలవని కొందరు చెప్పెదరు. మొదట గృహస్థాశ్రమమున చక్కగా ఆచరిం చువాడు అప్రమత్తుడై గృహమున ఉండువాడు తీర్థయాత్రలకు వెళ్ళదలచినచో సావధానుడై మొదట గణేశుని పూజించవలెను. దేవతలను పితరులను బ్రాహ్మణులను సాధువులను విత్తానుసారముగా ప్రయత్నముతో పూజించవలెను. తీర్థయాత్రల నుండి తిరిగి గృహమునకు వచ్చిన తరువాత ఇట్లే దేవ పితృ బ్రాహ్మణ సాధువులను పూజించవలెను. ఇట్లు యధావిధిగా తీర్ధయాత్రలను చేయువారికి యధోక్త ఫలము నిశ్చయముగా లభించును. దేశాంతరమునకు వెళ్ళుచు నేతితో శ్రాద్ధమును ఆచరించవలెను. ఇది యాత్రార్థము చెప్పబడినది. మరల ఇల్లు చేరిన వెంటనే చేయవలెను. ప్రయాగ తీర్థమున యాత్రకు వచ్చినవారు పితృమాతృ వియుక్తులైనచో కేశములను వపనము చేయవలెను. నిష్కారణముగా వపనము చేయరాదు. గయను వెళ్ళుటకు సిద్దపడినవాడు యధావిధిగా శ్రాద్ధమును ఆచరించి కార్పటీ వేషమును ధరించి గ్రామ ప్రదక్షిణము ఆచరించి గ్రామాంతరమునకు వెళ్ళి శ్రాద్ధ శేషమును భుజించవలెను. తరువాత విఘ్నము లేకుండా ప్రతి దినము వెళ్ళవలెను. గయాక్షేత్రమునకు వెళ్ళువానికి ప్రతిపదమున అశ్వమేధ ఫలము లభించును. వృషభమును అధిరోహించి తీర్థయాత్రలకు వెళ్ళువాడు నరకమున నివసించును. గోవుల క్రోధము పరమ దారుణము కదా. అతనిచ్ఛు తర్పణమును పితృ దేవతలు గ్రహించరు. ఐశ్వర్యము వలననో లోభము వలననో వాహనముతో చేసిన యాత్ర నిష్పలమగును. కావున వాహనమును విసర్జించ వలెను. గోవాహనమున వెళ్ళినచో గోవధ పాతకము లభించును. హయయానమున వెళ్ళినచో నిష్ఫలమగును. నరవాహనమున వెళ్ళినచో అర్ధఫలము లభించును. నడిచి వెళ్ళినచో నాలుగురెట్లు ఫలము కలుగును. వర్షతపాది బాధలున్నచో ఛత్రమును ధరించవలయును. గులకరాళ్లున్నచో దండమును ధరించవలెను. శరీరమును కాపాడుకొనుటకు పాదరక్షలను ధరించి యుండవలెను. పుణ్యతీర్థమును చేరి అచట స్నానమును అప్రాధాన్యముగా చేసినచో స్నాన ఫలమును పొందును కాని తీర్థఫలమును పొందజాలడు. ఇతరుల ధనముతో వెళ్ళినవారికి పదునారవ భాగము ఫలము లభించును. అనుకోకుండా ప్రసంగవశమున వెళ్ళినవారికి సగము ఫలము మాత్రమే లభించును. పుణ్యతీర్థములందు బ్రాహ్మణులను పరీక్షించరాదు. పుణ్యతీర్థములలో యాచనకు వచ్చిన వారికి భోజనము పెట్టవలెనని మనువు చెప్పియున్నాడు. తీర్థములలో సత్తు పిండితో కాని యవలతోకాని, పాయసముతో కాని, రేగి పండ్లతోకాని, ఉసిరకతో కాని, పిండితోకాని పిండదానమును చేయవలెను. తీర్థములలో అర్చావాహన వర్ణితముగా శ్రాద్ధము ఆచరించవలెను. శునక కాక గృహప్రాపుల దృష్టి హతముకాని దానిని చేయవలెను. తీర్థములలో ఆచరించు శ్రాద్ధము పితరులకు తృప్తిని కలిగించును. సకాలములో కాని, అకాలమున కాని తీర్థమున లభించినవారితోనే లభించిన పదార్థముల తోనే పితృతర్పణమును చేయవలెను. ఆలస్యము చేయరాదు. విఘ్నమును ఆచరించ రాదు. కుశమయి ప్రకృతిని తీర్థజలమున విసర్జించవలెను. ఎవరిని ఉద్దేశించి విసర్జన చేసిన అతనికి అష్టమాంశ ఫలము లభించును. నీవు కుశస్వరూపుడివి. కుశపుత్రుడవు. పూర్వము బ్రహ్మచే నిర్మించబడితివి. నీవు స్నానముచేసినచో ఈ గ్రంథి బంధన ఉద్దేశ్యభూతుడు కూడా స్నానముచేసిన వాడగును. ముండనము ఉపవాసము అన్ని తీర్థములలో విధి విశాల, విరజ, గయ కురుక్షేత్రములలో మాత్రము ఈ విధి వర్తించదు. భూమండలగత తీర్థములు పుణ్య ప్రదములగుటకు కారణమును వినుము. శరీరమున కొన్ని అవయవములు ప్రధానములు అగునట్లు భూప్రభావము వలన, అద్భు తమువలన, జలమువలన, అగ్నివలన, మునులు పరిగ్రహించుట వలన తీర్థములు పుణ్యప్రదములు అగుచున్నవి. గంగాతీర్థమును చేరి ముండనమును చేయించుకొనినది వానిక్రియలన్నియూ వ్యర్థముల గును. అతను తీర్థద్రోహి అగును. గంగాతీర్థమున భాస్కర క్షేత్రమున ముండనము చేయించు కొనినవాడు కోటి కులములతో కల్పాన్తము వరకు రౌరవ నరకమును చేరును. ఉత్తమనదియగు గంగను చేరి కల్పాంతము వరకు ఉండు పాపరాశులన్నియూ కేశముల నాశ్రయించి ఉండును గాన కేశములను విడువవలెను. గంగాజలమున ఎన్ని నఖకేశములు పడునో అన్ని వేల వర్షములు స్వర్గములో నివసించును. ప్రయాగ వ్యతిరిక్త గంగలో ముండనము చేయించు కొనరాదు. ఇందుకు భిన్నముగా వ్యవహరించిన వాడు మహారౌరవనరకమును పొందును. తండ్రి బ్రతికియుండగా తీర్థమును చేరినవాడు యధావిధిగా క్షౌరమును ఆచరించవలెను కాని మీసములను ఖండించు కొనరాదు. మునులెల్లరూ క్షౌరమును నిషేధించి యుండలేరు. మీసములను కేశములను వపనము చేసిననే ముండన మందురు. మీసములను వదిలి కేశములను మాత్రము తీసినచో క్షారమందురు. కావున వేదవిదులు క్షౌరము ముండనము వేరువేరని చెప్పియుండిరి. (II/62)