నారద మహా పురాణము
పంచ ప్రకృతి మంత్రాది నిరూపణము
శ్రీ శౌనక మహర్షి పలికెను: ఓ మహానుభావా? సూతమహర్షీ! జగదుద్ధారకారక! సనత్కుమార మహర్షిచే చెప్పబడిన మహా తంత్ర విధానమును నాకు చెప్పితిరి. ఈ మహా తంత్ర విధానము తంత్రములందు పురాణములందు కూడా లభించదు. మీరు అతి దయాపరులు కావున మాకు చెప్పితిరి. లోకోద్ధరణ తత్పరుడగు నారదుడు సనత్కుమారుని మరల ఏమడిగెను.
సూత మహర్షి పలికెను: ఓ బ్రాహ్మణోత్తములారా? రాధా కృష్ణ సహస్రనామమును వినిన నారద మహర్షి జ్ఞానులలో శ్రేష్ఠుడగు సనత్కుమారునికి నమస్కరించి ఇట్లు పలికెను.
నారదమహర్షి: ఓ బ్రాహ్మణోత్తమా? మీరు తంత్రప్రోక్తములగు విధులను చెప్పితిరి. అట్లే కృష్ణమంత్ర వైభవమును చెప్పితిరి. ఆ చోట రాధాదేవి సర్వాద్య అని చెప్పితిరి. ఆ రాధాదేవి యొక్క అంశావతార చరిత్రను మంత్రపూర్వకముగా తంత్రమున చెప్పబడియున్న దానిని సర్వజ్ఞుడవగు నీవు చెప్పుము. నేను నిన్ను శరణు వేడితిని. శివోక్తములగు అనేక శక్తి తంత్రములను సంపూర్ణముగా సారమును ఉద్ధరించి మాకు చెప్పుము. అని ఇట్లు అడిగిన మహానుభావుడగు నారదుని మాటలను విని సనత్కుమార మహర్షి రాధా పదాంబుజములను ధ్యానించి చెప్పసాగెను.
సనత్కుమార మహర్షి పలికెను: ఓ నారదా? రాధాంశముల పుట్టుకను చెప్పెదను వినుము. మంత్ర సాధన పూర్వకముగా ఆయా శక్తుల ఆయాశ్చర్యకర ప్రభావమును చెప్పెదను. కృష్ణుని అర్థ దేహమున పుట్టిన రాధాదేవి గోలోకమున నివసించును. నిత్యము కృష్ణ సహాయినిగా ఉండును. తేజోమండల మధ్యస్థిత దృశ్యా దృశ్య స్వరూపిణి. ఒకప్పుడు రాధాదేవితో శ్రీకృష్ణ భగవానుడుండగా శ్రీకృష్ణ భగవానుని వామభాగము నుండి నారాయణుడు పుట్టెను. రాధాదేవి వామ భాగము నుండి మహాలక్ష్మి పుట్టెను. అంతట శ్రీకృష్ణుడు నారాయణునకు లక్ష్మినిచ్చి పాలన కర్మలో నియోగించి వైకుంఠమున ఉంచెను. తరువాత గోలోకనాధుడగు శ్రీకృష్ణుని రోమ వివరముల నుండి అసంఖ్యాకులగు గోపాలకులు తేజో వయస్సులతో సములుగా పుట్టిరి. వారందరు శ్రీకృష్ణునకు ప్రాణతుల్య ప్రియులు. పార్షదులుగా ఉండిరి. రాధా శరీర రోమకూపముల నుండి గోపకన్యలు పుట్టిరి. వీరందరు రాధాతుల్యులుగా నుండి రాధా దాసీ జనమాయెను. ఇంతలో హఠాత్తుగా శ్రీకృష్ణుని దేహము నుండి సనాతనయగు విష్ణు మాయా రూపిణి దుర్గాదేవి పుట్టెను. ఈ దుర్గయే సర్వదేవీ లోకమునకు బీజ రూప, మూల ప్రకృతి, ఈశ్వరి, పరిపూర్ణతమా, తేజ స్స్వరూపా, త్రిగుణాత్మికా, సహస్ర భుజ సంయుక్తా, నానాశస్త్రా త్రిలోచన. ఈ దుర్గయే సంసార వృక్షమునకు సనాతన బీజరూపము. రాధికాపతి ఆ దుర్గను రత్న సింహాసనము ఒసంగెను. ఇంతలో అచట పత్నీ సమితుడగు చతుర్ముఖుడు, జ్ఞాని శ్రేష్ఠుడు ఆది పురుషుడు ఓంకారమును ఉచ్చరించుచు, కమండలమును ధరించి శ్రీహరి నాభినుండి పుట్టెను. ఆ చతుర్ముఖుడు భార్యా సహితుడై శ్రీకృష్ణుని స్తుతించి, అనుమతిని పొంది శ్రీహరి ముందు ఆసనమున కూర్చొనెను. అంతట శ్రీకృష్ణుడు చతుర్ముఖునితో సత్యలోకమున నుండి, ఎప్పుడూ నన్ను స్మరించుచు సృష్టిని చేయుము అని పలికెను. ఇట్లు శ్రీహరి పలుకగా చతుర్ముఖుడు జగత్పతికి నమస్కరించి భార్యతో వెడలి సృష్టిని చేయ అరంభించెను. ఆ చతుర్ముఖుడే మా తండ్రి. మానసమగు దేహమును సృజించెను. తరువాత శ్రీకృష్ణ భగవానుడు పంచ వక్త్రునితో ఇట్లు పలికెను. నీవు దుర్గను గ్రహించి శివలోకమున తపస్సును ఆచరింపుము. సృష్ట్యంతమున లోకములను సంహరింపుము. అపుడు పంచవక్త్రుడు శ్రీకృష్ణునికి నమస్కరించి శివలోకమునకు వెళ్ళెను. తరువాత కొంతకాలమునకు శ్రీకృష్ణపరమాత్మ వక్త్రము నుండి వీణా పుస్తక ధారిణియగు సరస్వతి పుట్టెను. అంతట జగన్నాథుడు ఆమెను వైకుంఠమునకు వెళ్ళి లక్ష్మీ సమీపమున ఉండుమని ఆజ్ఞాపించెను. సరస్వతీదేవి కూడా శ్రీకృష్ణునికి నమస్కరించి నారాయణుని సమీపమునకు వెళ్ళెను. ఇట్లు ఆ రాధాపంచ విధములుగా మారి సృష్టి కారణమాయెను. ఇట్లు ఈ పూర్ణ స్వరూపములగు పంచ ప్రకృతుల మంత్రధానార్చ నాదికమును చెప్పెదను వినుము. వీటిని తెలిసినచో సిద్ధి కలుగును.
మొదట క్రియాయుక్ అగు తారము ప్రీత్యాఢ్య ప్రతిష్ఠ, తరువాత క్షుధాయుక్తమగు జ్ఞానామృత. స్వాహాంతము ఈ మంత్రము. ఈ మంత్రమునకు సుతపా మహర్షి గాయత్రీ ఛందస్సు. రాధికా దేవత. ప్రణవము బీజము. స్వాహాశక్తి. బంధు విభూషితములగు షడక్షరములచే షడంగన్యాసమును చేయవలెను. తరువాత తన హృదయమున కృష్ణ భామిని, శ్వేత చంపక వర్ణాభ, కోటి చంద్ర సమప్రభ, శరత్పార్వణ చంద్రాస్య, నీలేందీ వరలోచన, సుశ్రోణి, సునితంబ, పక్వబింబాధర, రక్తాంబర, ముత్యముల వంటి, మల్లెల వంటి పలువరస గలది, వహ్ని శుద్ధాంశుక, రత్నకేయూర వలయహార కుండల శోభిత గోపికలచే చెలులచే సేవించబడునది. రాసమండల మధ్యస్థ రత్న సింహాసన స్థితయగు రాధికను ధ్యానించి, పుష్పాంజలి సమర్పించి ఉపచారములచే పూజించవలెను. ఆరు లక్షల మంత్రమును జపించవలెను. దశాంశమును నేయి కలిపిన నువ్వులచే హోమమును చేయవలెను. మాతృకా పీఠమున ఆవరణములచే పూజించవలెను. షట్కోణములందు షడంగములును, బాహ్యములందు అష్టదళమున పూజించవలెను.
మాలావతిని, మాధవిని, రత్నమాలను, సుశీలికను, శశికలను, పారిజాతను, పద్మావతిని, సుందరిని క్రమముగా ప్రాచ్యాది దిక్కులందు, విదిక్కులందు పూజించవలెను. తరువాత వెలుపల సాయుధులగు ఇంద్రాదులను పూజించి వినియోగములను సాధించవలెను. రాధా, కృష్ణ ప్రియ, రానేశ్వరి, గోపీ గణాధిప, నిర్గుణా కృష్ణపూజ్య, మూల ప్రకృతి, ఈశ్వరి, సర్వేశ్వరి, సర్వపూజ్య, వైరాజ జననీ, వీరందరు పూర్వాది దిక్కులందు అన్ని వైపులా అన్ని వేళలా నన్ను కాపాడుగావుత. ఓ దేవీ! నీవు జగన్మాతవు, సనాతన విష్ణు మాయవు, కృష్ణమాయవు, ఆదిదేవివి, కృష్ణ ప్రాణాధికవు, శుభకరురాలవు, కృష్ణ భక్తి ప్రదురాలవు, మంగళప్రదురాలవు. అట్టి నీకు నమస్కారము. అని ఇట్లు ప్రార్థించి, సర్వేశ్వరురాలను స్తుతించి హృదయమున విసర్జన గావించవలెను. ఇట్లు సర్వాద్య, సర్వమంగళ యగు రాధాదేవిని సేవించువాడు ఇహమున అన్ని భోగములను అనుభవించి అంతమున గోలోకమును పొందును.
ఓ నారదా? ఇప్పుడు నీకు మహాలక్ష్మీ పూజా విధానమును చెప్పెదను. ఈ లక్ష్మీ పూజ వలన సాధకుడు భుక్తి ముక్తులను పొందును. “ఓం కమల వాసిన్మై మహాలక్ష్మ్యై స్వాహా”అనుమంత్రము సకలాభీష్టప్రదము. ఈ మంత్రమునకు నారాయణ ఋషి. జగతీ ఛన్దస్సు. మహాలక్ష్మీ దేవత. ద్వి ద్వి వర్ణములచే షడంగ కల్పన చేయవలయును. శ్వేత చంపక వర్ణాభ రత్న భూషణ భూషిత, ఈషద్ధాస్య ప్రసన్నాస్య, భక్తానుగ్రహకాతర, రత్నమాలాధారిణి, కోటి చంద్రసమప్రభయగు లక్ష్మీదేవిని ధ్యానించి పన్నెండు లక్షలు జపించి దశాంశమును పాయసముచే ప్రజ్వలితాగ్నియందు హోమమును చేయవలయును. బిల్వకాష్ఠముచే పూజించవలయును. నవశక్తి యుతమగు పీఠమున అంగములచే అవరణములచే పూజించవలెను. విభూతి, ఉన్నతి, కాంతి, సృష్టి, కీర్తి, సన్నతి, వ్యష్టి, ఉత్కృష్టి, బుద్ధి అనునవి నవ శక్తులు. ఇచల మూల మంత్రముచే మూర్తిని సంకల్పించి, షట్కోణములందు షడంగములను, దక్షిణ దిగ్భాగమున గజాననుని, వామ భాగమున మన్మధుని, అష్టదళమున ఉమను, శ్రీని, భారతిని, దుర్గను, ధరణిని, గాయత్రిని, ఉషాదేవిని పూర్వాది దిక్కులందు విదిక్కులందు క్రమముగా పూజించవలెను. పాద ప్రక్షాళ నోద్యతములగు గంగా యమునలను పూజించవలెను. చామరములను ధరించి శంఖ పద్మనిధులను పూజించవలెను. పశ్చిమ దిగ్భాగమున ఆతపత్రమును ధరించిన వరుణుని పూజించవలెను. చుట్టు రాశులను పూజించి యధాస్థానమున నవ గ్రహములను పూజించి, దిగ్వి దిక్కులందు చతుర్దంతములుగల ఐరావతాదులను పూజించవలెను. ఆ వెలుపల లోకపాలులను, వారి వెలుపల వారి అస్త్రములను పూజించి అజ్యయుక్తములగు దూర్వలచే ఆయుష్యము కొఱకు హోమమును గావించవలెను. అజ్యసిక్తమగు గుడూచిని ప్రతి నిత్యము అష్టోత్తర సహస్రమును ఏడు వారములు హోమము గావించినచో నూరు సంవత్సరములు జీవించును. ఘృత మిశ్రితములగు తిలలచే హోమమును గావించినచో దీర్ఘాయుష్యమును పొందును. శరీరారోగ్య సిద్ది కొరకు ఆదివారమున ప్రారంభించి పదిదినములు నేతిలో తడిపిన జిల్లేడు సమిధలచే హోమమును గావించవలెను. వరిధాన్యముచే ప్రతినిత్యము అష్టోత్తర సహస్రమును హోమము గావించినచో త్వరలో గొప్ప సంపద కలుగును. జపా జాజి నారికేల రజస్సులచే నేయి కలిపిన వాటిచే అష్టోత్తర సహస్రమును హోమమును చేయుచు పాయసమును తినుచున్నచో ఒక మండల మున కుబేరుడంతటి వాడగును. గుడ మిశ్రమగు హవిస్సుచే హోమమును గావించినచో అన్నము కలవాడగును. అష్టోత్తర సహస్రము తాంబూల రస సమ్మిశ్రితముగా జపా పుష్పములచే హోమమును గావించి ఆ భస్మమును తిలకముగా ధరించినచో నాలుగు వర్ణముల వారిని మోహింపచేయును. ఓ మునీశ్వరా? ఇట్లు లక్ష్మీ దేవిని సేవించువానికి సర్వ సంపదలు కలుగును. మహాలక్ష్మి ప్రసన్నురాలగును. దేహాంతమున విష్ణు ధామమును చేరును.
శివలోకమునకు వెళ్ళిన దుర్గాదేవి శివుని ఆజ్ఞను పొంది అచట దివ్యలోకమును నిర్మించెను. ఈ లోకము దేవీలోకమని ప్రసిద్ధి చెంది సర్వలోక విలక్షణముగా విలసిల్లెను. ఈ జగన్మాత ఆ లోకమున నుండి తపోనియమము అశ్రయించెను. దుర్గ పలువిధములైన స్వావతారములను చేయుచున్నది. “ఓం హ్రీం మహాదేవ్యై శ్రీ దుర్గాయై స్వాహా” అనునది దుర్గామంత్రము. వామదేవుడు ఋషి, గాయత్రీ ఛందస్సు. దుర్గతినాశిని ఆదిదేవి అగు దుర్గా దేవత ఓం కారము నుండి ఒక్కొక్క వర్ణముచే హృదయాదిత్రయ న్యాసము ఆచరించవలెను. మూడింటిచే కవచమును, రెండింటిచే నేత్రము, అన్నింటిచే అస్త్రమును కల్పించవలెను. మహా మరకత ప్రఖ్య, సహస్ర భుజమండిత, నానా శస్త్ర ధారిణి, త్రినేత్ర, చన్ద్రశేఖర, కంకణాంగహార నూపురాద్యాభరణ భూషిత, కిరీట కుండల ధారిణి యగు దుర్గాదేవిని ధ్యానించవలెను. మంత్రమును ఎనిమిది లక్షలు జపించవలెను. మధుర మిశ్రితములగు నువ్వులచేకాని, పాలచేకాని, అన్నముచే కాని దశాంశమును హోమమును గావించ వలెను. నవ పద్మాత్మక దళమున శక్తులను పూజించవలెను. ప్రభా, మాయా, జయా, సూక్ష్మ, విశుద్ధా, నందినీ, సుప్రభా, విజయా సర్వసిద్ధిదా, అనునవి పీఠశక్తులు, హ్రస్వత్రయ క్లీబరహితములగు జలముచే ఈ శక్తులను పూజించవలెను. “ఓం వజ్రనఖదంష్ట్రాయుధాయ మహాసింహాయ హుంఫట్ నమః” అనునది సింహ మంత్రము. ఈ మంత్రముచే ఆసనమును సమర్పించవలెను. మూల మంత్రముచే మూర్తిని కల్పించవలెను. మొదట అంగావరణలను పూజించి పత్రములందు శక్తులను పూజించవలెను. జయ, విజయ, కీర్తి, ప్రీతి, ప్రభ, శ్రద్దా, మేధా, శ్రుతి అనునవి స్వనామాద్యక్షరాదికలు. ఈ ఎనిమిదింటిని పత్రాగ్రములందు అర్పించవలెను. తరువాత క్రమముగా ఆయుధములను పూజించవలెను. శంఖ చక్ర గదా ఖడ్గ పాశాంకుశ శర ధనువులను పూజించవలెను. ఆ వెలుపల లోకేశ్వరులను ఆ వెలుపల వారి ఆయుధములను పూజించవలెను. ఇట్లు జపాదులచే మంత్రము సిద్ధించిన తరువాత తాను కోరిన ప్రయోగములను చేయవచ్చును. రత్న హోమాది సంయుక్తములు నవఘటములలో నున్న నవకలశములను స్థాపించి మధ్య కలశమున దుర్గాదేవిని, ఇతర కలశములందు జయాదికలను పూజించవలెను. ఇట్లు గంధ పుష్పాదికములచే పూజంచి రాజునకు ఆ జలముచే అభిషేకము చేయవలెను. అట్లు చేసినచో రాజు శత్రువులను జయించి విజయలక్ష్మిని పొందును. రోగ రహితుడై, దీర్ఘాయుష్మంతుడై సర్వవ్యాధి వర్జితుడగును. గొడ్రాలు అభిషేకించినచో ఉత్తమ పుత్రుని పొందును. ఈ మంత్రముచే అభిమంత్రించిన నేయి క్షుద్ర గ్రహములను తొలగించును. అభిమంత్రించిన భస్మము గర్భిణీ స్త్రీలను ధరింపచేసినచో విశేషఫల ప్రదము. శ్రీకృష్ణుడు ఆవలించినప్పుడు వెలువడిన గాలి రాధికా ముఖమున ప్రవేశించినపుడు వీణా పుస్తక ధారిణియై పుట్టిన దేవియొక్క మంత్ర విధానమును సర్వలోకోపకారకమును చెప్పెదను వినుము.
“ఓం శ్రీమహా దేవ్యై సరస్వత్యై స్వాహా” అనునది ద్వాదశాక్షర మంత్రము. నారాయణ ఋషి, విరాట్ ఛందస్సు. మహా సరస్వతీ దేవతా వాగ్భవముచే షడంగ న్యాసము చేసి వర్ణన్యాసమును చేయవలెను. బ్రహ్మ రంధ్రమున ఓంకారమును, భ్రూమధ్యమున శ్రీనిముఖనాసాది వర్ణగుణములందు మొదలగు వర్ణములను న్యాసము చేయవలెను. తరువాత వీణాపుస్తకధారిణి, కర్పూర కుంద ధవళ, పూర్ణ చంద్రోజ్జ్వలానన, హంసాధిరూఢ, ఫాలేన్దు దివ్యాలంకార శోభిత యగు వాగ్దేవిని ధ్యానము చేయవలయును. పది లక్షలు జపించవలెను. దశాంశము తెల్లని పద్మములచే కాని నాగచంపక పుష్పములచే కాని హోమమును చేయవలెను. మాతృకాపీఠమున చెప్పబోవు విధముగా పూజించ వలయును. వర్ణాబ్జముచే ఆసనమును సమర్పించవలెను. మూల మంత్రముచే మూర్తిని సంకల్పించి దేవియొక్క దక్షిణ భాగమున శుభకరమగు సంస్కృత వాగ్దేవిని పూజించవలెను. వామ భాగమున ప్రాకృత వాగ్దేవిని పూజించవలెను. షట్కోణములందు మొదట అంగపూజ గావించి, వెలుపల ప్రజ్ఞాదులను పూజించవలెను. మరల లోక పాలకులను వారి ఆయుధములను బయట పూజించవలెను. ఇట్లు వాగ్దేవిని పూజించినచో సాక్షాత్తుగా వాక్పతియగును. బ్రహ్మచర్య వ్రతము నవలంబించి, పరిశుద్ధుడై, పరిశుద్ధములైన దంత నఖాదులు కలవాడై స్త్రీల నందరిని దేవతా బుద్ధితో భావించుచు ఒక సంవత్సరము పూజించినచో కవిత్వమును పొందును. వేయిమార్లు మంత్రించిన జలమును ప్రతిదినము త్రాగుచు ఒక సంవత్సరము పూజించినచో మహాకవి అగును. ప్రతిదినము ఉరోమాత్ర జలమున నిలిచి మార్తాండమండలమున ఉన్న దేవిని ధ్యానించుచు మూడు వేలు జపించినచో నలుబది రోజులలో సిద్ధిని పొంది అసమాన వాగ్వైభవమును పొందును. మధుర మిశ్రితములగు పాలాశ బిల్వ పుష్పములచే కాని సమిధలచే కాని హోమమును గావించినచో అతులమగు కవిత్వమును పొందును.
బ్రహ్మకు ప్రియమైన సావిత్రీ మంత్రమును నీకు చెప్పెదను. ఈ మంత్రమును ఉపాసించియే బ్రహ్మ చరాచరలోకములను సృజించెను. “శ్రీ మహా సావిత్ర్యై స్వాహా” అనునది అష్టాక్షర మంత్రము. బ్రహ్మ ఋషి. గాయత్రీ ఛందస్సు. సర్వదేవతా సావిత్రియగు సావిత్రి దేవత. బ్రహ్మణే నమః, రుద్రాయ నమః, విష్ణవే నమః, ఈశ్వరాయ నమః, సదాశివాయ నమః, అనువాటిచే అంగకల్పన చేయవలెను. తప్త కాంచన వర్ణాభ, బ్రహ్మ తేజస్సుచే జ్వలించుచున్నది. గ్రీష్మ మధ్యాహ్న మార్తాండ సహస్ర సమవిగ్రహ, ఈ షద్ధాస్య ప్రసన్నాస్య, రత్న భూషణ భూషిత, వహ్ని శుద్ధాంశుకధారిణి, భక్తానుగ్రహకాతర, సుఖప్రద, ముక్తిదాయిని, సర్వసంపత్ర్పద, శుభకరి, వేదబీజ స్వరూప, వేదప్రసూ అయిన సావిత్రిని ధ్యానించ వలెను. త్రికోణోజ్జ్వల కర్ణికా మండలమున ఇట్లు ధ్యానించి, సౌర పీఠమున దీప్తాది నవశక్తులచే దేవిని పూజించవలెను. మూల మంత్రముచే సంకల్పించిన మూర్తి యందు దేవిని పూజించవలెను. మూడు కోణములందు బ్రాహ్మి మొదలగు శక్తులను పూజించవలెను. తరువాత ఆ బయట ఉషాది సహితులగు ఆదిత్యాదులను పూజించవలెను. తరువాత కేసరములందు యథావిధిగా షడంగ పూజను గావించి ప్రహ్లాదినిని, ప్రభను, నిత్యను, విశ్వంభరను, విలాసినీ ప్రభావతులను, జయను శాంతను, కాంతిని, దుర్గా సరస్వతులను, విద్యారూపను, విశాలను, ఈశను, వ్యాపినిని, విమలను, తమోపహారిణిని, సూక్ష్మను, విశ్వయోనిని, జయావహను, పద్మాలయను, పరమ, శోభను, బ్రహ్మరూపను అర్చించవలెను. బాహ్యావరణమున బ్రాహ్మి మొదలగు వారిని సలక్షణల అర్చించవలెను. ఆ బాహ్యావరణమున సాయుధులగు ఇంద్రాదుల అర్చించవలెను. ఇట్లు దశావరణలలో దేవులను పూజించవలెను. ఎనిమిది లక్షల మంత్రమును జపించవలెను. ఎనిమిది వేలు నువ్వులచే హోమమును చేయవలెను. ఇట్లు చేసినచో సర్వపాప వినిర్ముక్తుడై దీర్ఘాయుష్యమును ఆరునెలలలో మహాసంపదను పొందును. బ్రహ్మవృక్ష పుష్పములచే హోమము గావించినచో కోరిన కోర్కెలు అన్నియూ తీరును. ఇంకనూ ఏమి చెప్పవలెను. విధి విధానముగా ఉపాసించబడిన సావిత్రి సర్వాభీష్ట వర్షిణి అగును.
ఇక ఇపుడు నీకు పరమాద్భుతము రహస్యము నరులకు సర్వరక్షాకరమగు సావిత్రీ పంజరమను దానిని చెప్పెదను. వ్యోమకేశాలకాసక్త, సుకిరీట విరాజిత మేఘ భ్రుకటిలాక్రాంత బ్రహ్మ విష్ణు శివాననా, గురు శుక్ర కర్ణాంత, సోమసూర్యాగ్ని లోచన, ఇడా పింగళికా సూక్ష్మ వాయు నాసా పుటాన్విత, సంధ్యాద్విజోష్ఠ పుటితా, లసద్వాగుర జిహ్విక, సంధ్యా సూర్యమణి గ్రీవా, మరుద్బాహు సమన్విత, పర్జన్య హృదయాసక్త, వస్వాఖ్య ప్రతిమండల, ఆకాశోదర విభ్రాంత, నాభ్యవాంతర వీధిక, ప్రజాపత్య జఘన, కటీంద్రాణీ సమాశ్రిత, మలయ మేరూరువులతో శోభించునది, సరిద్వరా, జాహ్నవీ కాశికీ జాను, వైశ్వదేవ సంజ్ఞిక, పాదాంఘ్రి నఖలోమాఖ్య భూనాగ ద్రుమలక్షిత, గ్రహరాశి నక్షత్ర యోగాది మూర్తావయక సంజ్ఞిక, తిధిమాస ఋతు పక్షాది సంకేత నిమిషాత్మిక, మాయా కల్పితవైచిత్ర్య సంధ్యాఖ్య ఛదనావృత, జ్వలత్కలానలప్రఖ్య, తటిత్కోటి సమప్రభ, కోటి సూర్య, ప్రతీకాశ, శశికోటి సుశీతల, సుధామండల మధ్యస్థ, సాంప్రదానందా మృతాత్మిక, వాగతీత, మనోఽగమ్యా, వరద, వేదమాత, చరాచరమయి, నిత్య బ్రహ్మక్షర సమన్విత అగు సావిత్రిని స్వాత్మాది విభేదముచే ధ్యానించి సావిత్రీ పంజర న్యాసమును గావించవలెను. ఈ పంజరమునకు నేను (సనత్కుమార మహర్షి) ఋషిని, వికృతి ఛందస్సు. పరమహంస పరబ్రహ్మ రూపమగు ఆది దేవత దేవత. ధర్మార్థ కామమోక్ష ప్రాప్తికి వినియోగించవలెను. షడంగదేవతామంత్రములచే అంగ న్యాసమును ఆచరించవలెను. త్రిధామూలముచే వ్యాపకమును ఆచరించవలెను. సావార గుణ సంయుత యగు పూర్వోక్త దేవతను ధ్యానించవలెను. త్రిపదా, హరిజా, పూర్వముఖి, బ్రహ్మస్త్ర సంజ్ఞిక, చతుర్వింశతి తత్త్వాఢ్యయగు సావిత్రి పూర్వ దిక్కును కాపాడుగాక. చతుష్టద బ్రహ్మదండ, బ్రహ్మాణి, దక్షిణముఖీ షడ్వింశత్తత్త్వ సంయుక్తా, దక్షిణ దిక్కును కాపాడుగాక. పశ్చిమముఖి, పంచపదీ, పంచాశతత్తత్త్వ రూపిణి, బ్రహ్మ శిరోంకితా పశ్చిమ దిక్కును కాపాడుగాక. సౌమ్యాస్య బ్రహ్మతుర్యాఢ్య అధర్వాంగి రసాత్మక, షట్పదా, షష్టితత్త్వ కలాత్మిక ఉత్తర దిక్కును కాపాడుగావుత. పంచాశద్వర్ణ రచిత, నవపాద, శతాక్షరి, వ్యోమా, వేదాంత సంస్థిత, ఊర్థ్వమును కాపాడుగాత. విద్యున్నిభ, బ్రహ్మ సంధ్య, మృగారూఢ, చతుర్భుజ, చాపేషు చర్మాసిధరా, ఆగ్నేయ దిక్కును కాపాడుగాక. బ్రాహ్మి, కుమారి, రక్తాంగీ, హంస వాహిని కమండలమును జపమాలను, సుక్స్రువములను ధరించు గాయత్రి నైఋత దిక్కును కాపాడుగావుత. శుక్లవర్ణ, యువతి, వృషవాహిని, కపాల శూల కాక్ష స్రగ్థారిణి యగు సావిత్రి వాయవ్య దిక్కును కాపాడు గావుత. శ్యామా, వృద్ధ వైష్ణవి, గరుడాసన, శంఖ చక్రాభయకర యగు సరస్వతి ఈశాన్య దిక్కును కాపాడు గావుత. చతుర్భుజ, దేవతమాత, గౌరాంగి, సింహవాహన, వరాభయ ఖడ్గ చర్మభుజ అధర దిక్కును కాపాడు గావుత. ఆయా పార్శములనున్న వారు స్వస్వవాహనాయుధ భూషణధారిణులు గ్రహ శక్త్యంగ సంయుతలై కాపాడుగావుత. మంత్రాధి దేవతారూపలు ముద్రాధిష్టాతృ దేవతలు ఆపాద తలమస్తకమును వ్యాపకముగా కాపాడుగావుత. ఇట్లు నీకు సావిత్రీ పంజరమును చెప్పితిని. ప్రతిదినము ఉభయ సంధ్యలలో, విశేషించి జపకాలమున భక్తిచే పఠించువారికి భుక్తిముక్తులు లభించును.
భూతిదా, భువనా, వాణి, మహావసుమతి, మహీ, హిరణ్య, జనని, నందా, సవిసర్గా, తపస్విని, యశస్విని, సతీ, సత్యా, వేదివిత్, చిన్మయి, శుభ, విశ్వా, తుర్యా, వరేణ్య, నిసృణీ, యమునా, భువా, మోదా, దేవీ, వరిష్ఠా, ఢీ, శాంతి, మతి, మహి, ధిషణ, యోగిని, యుక్త, నదీ, ప్రజ్ఞా, ప్రచోదిని, దయా, యామిని, పద్మా, రోహిణి, రమణి, జయ, సేనాముఖి, సామమయి, జగలా, దోష వర్ణిత, మాయా, ప్రజ్ఞా, పరా, దోగ్ద్రీ, మానినీ, పోషిణి, క్రియా, జ్యోత్స్నా, తీర్థమయీ, రమ్యా, సౌమ్యా, అమృతమయి, బ్రాహ్మీ, హైమీ, భుజంగి, వశినీ, సుందరీ, వనీ, ఓంకార హాసినీ, సర్వా, సుధా, షడ్గుణవతీ, మాయా, స్వధా, రమా, తన్వీ, రిపుఘ్నీ, రక్షణీ, సతీ, హైమీ, తారా, విధుగతి, విషఘ్నీ, వరాననా, అమరా, తీర్థదా, దీక్షా, దుర్ధర్షా, రోగ హారిణి, నానా పాప నృశంసఘ్నీ, షట్పదీ, వజ్రిణీ, రజీ, యోగిని, విమలా, సత్యా, ఆబాలా, బలదా, జయ, గోమతీ, జాహ్నవీ, రజ్వీ, తపనీ, జాతవేదసా, అచిరా, వృష్టిదా, జ్ఞేయా, ఋతతంత్రా ఋతాత్మికా సర్వ కామదుఘా, సౌమ్యా, భవాహంకార వర్జితా, ద్విపదా, త్రిపదా, చతుష్పదా, షట్పదా, అష్టాపదీ, నవపదీ, సహస్రాక్షా క్షరాత్మిక, ఇవి సావిత్రీ దేవియొక్క అష్టోత్తర శత నామములు. ఈ అష్టోత్తర శతనామములను ప్రతి దినమున భక్తిచే పఠించువారు దీర్ఘాయుష్మంతులు, సుఖముగలవారు, పుత్రవంతులు, విజయముగలవారు, వినయముగలవారు అగుదురు. ఇట్లు నీకు పంచ ప్రకృతి లక్షణమును చెప్పితిని. సమస్త కామప్రదమగు మంత్రమును ఆరాధనా సహితముగా చెప్పితిని. (3/83)